ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు: కోర్టు ఆదేశాలతో మార్చక తప్పని పరిస్థితి... ఖర్చు ఎంత? నిధులు ఎక్కడివి?

- రచయిత, వి. శకంర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడం వివాదాస్పదంగా మారింది. చివరకు కోర్టులకు చేరింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో మరోసారి రంగులు మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది.
పంచాయతీరాజ్ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని రంగుల కోసం మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్‌ని ఆదేశించింది. పది రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది.
దాంతో అధికారంలో ఉన్న పార్టీల రంగులను ప్రభుత్వ భవనాలకు వేయడం వల్ల.. ఇప్పుడు వాటిని మార్చాల్సి వస్తోందని.. ఫలితంగా ప్రజాధానం వృధా అవుతోందని ప్రతిపక్షాలతో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
వివాదానికి కారణం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో గత సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 17,367 గ్రామాలుండగా, 12,918 గ్రామపంచాయతీలు ఉన్నాయి. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కలిపి మరో 195 ఉన్నాయి. వాటిని ప్రతి 2,000 జనాభాకు ఒకటి చొప్పున విభజించి 11,114 గ్రామ సచివాలయాలు, 3,775 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు, గ్రామ సచివాలయాల కోసం వివిధ ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో కూడా ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీ కార్యాలయాలతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలన్నింటికీ మూడు రంగులను వేయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2019 ఆగస్టు 11న మెమో రూపంలో ఉత్తర్వులు ఇచ్చారు.
అవి కూడా అధికార పార్టీ రంగులు కావడంతో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో కూడా నాటి అధికార పార్టీ టీడీపీ జెండా రంగులను అనేక చోట్ల ప్రభుత్వ భవనాలకు వేయించారు. అన్న క్యాంటీన్ల వంటివి స్పష్టంగా కనిపించాయి.

అనేక ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు...
రాష్ట్రంలో అధికార పార్టీ మారిన అనంతరం అనేక చోట్ల ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చారు. అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల కావడంతో రాష్ట్రమంతా అమలయ్యింది. పంచాయతీ సచివాలయాలతో పాటుగా వాటర్ ట్యాంకులు, అక్కడక్కడా కరెంట్ స్తంభాలు, చివరకు స్మశానాలకు కూడా అధికార పార్టీ రంగులు ప్రత్యక్షమయ్యాయి.
ఇటీవల ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు కూడా అవే రంగులు అద్దడం విశేషం. చివరకు విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గాంధీ విగ్రహానికి కూడా వైసీపీ రంగులు వేశారంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది.
అనంతపురం జిల్లాలో తమిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జాతీయ జెండా రంగులు తొలగించి, వైసీపీ రంగులు వేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ పరిస్థితిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించారు.
గుంటూరు జిల్లా పల్లపాడుకి చెందిన ఎం.వెంకటేశ్వర రావు తమ పంచాయతీ కార్యాలయానికి పార్టీ రంగులు వేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసే ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశిస్తూ జనవరి 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయినప్పటికీ ఆ ఉత్తర్వులను తోసిపుచ్చి తమ పంచాయతీలో రంగులు వేశారంటూ విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం తలాది గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు.

రంగులు మార్చడానికి ఖర్చు ఎంత?
పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ నిర్మాణాలకు రంగులు మార్చేందుకు అయిన ఖర్చుకి సంబంధించి సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారం సాగుతోంది. ఏకంగా రూ. 1,300 కోట్ల వ్యయం అవుతుందని కథనాలు కూడా వచ్చాయి.
ఈ విషయంపై మొత్తం ఖర్చు వివరాలు కోరగా.. ఆ లెక్కలు తమ వద్ద లేవని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. పంచాయతీల నుంచే వ్యయం భరించినందున ఒక్కో చోట ఒక్కో రీతిలో ఖర్చు జరిగే అవకాశం ఉందన్నారు.
ప్రైవేటు అంచనాల ప్రకారం.. ఒక్కో వార్డు లేదా గ్రామ సచివాలయానికి రంగులు మార్చేందుకు సగటున రూ. 50,000 చొప్పున వ్యయంగా లెక్కిస్తే సుమారు రూ. 75 కోట్ల వ్యయం అవుతుందని కొందరు చెప్తున్నారు.
ఇప్పుడు మరోసారి రంగులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నందున అదనంగా మరో రూ. 75 కోట్ల వరకూ ఖర్చు తప్పదనిపిస్తోంది. వాటితో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు సహా అన్నింటికీ రంగులు మార్చాల్సిన అవసరం ఏర్పడడంతో ఈ వ్యయం రూ. 300 కోట్లకు చేరవచ్చని సామాజికవేత్త పి.వేణుగోపాల్ అంచనా వేశారు.

హైకోర్టు ఏం చెప్పింది?
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీల రంగులను తక్షణం తొలగించాలని చీఫ్ జస్టిస్ జె.కె.మహేశ్వరి, ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల రంగులు వేసే అవకాశం లేదని తేల్చిన హైకోర్టు.. తొలగింపు ప్రక్రియను 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ భవనాలకు వేయాల్సిన రంగులపై మార్గదర్శకాలను రూపొందించాలని సీఎస్‌ని ఆదేశించింది. పంచాయతీ భవనాలకు కూడా జాతీయ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుందని చెప్పింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని సూచించింది.
ప్రజాధనం వృధా చేయడానికి బాధ్యులెవరు?
ప్రభుత్వ భవంతుల రంగుల విషయంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం సహించరానిదని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''పార్టీ రంగులు వేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియదు. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన సమయంలో వాటిని మార్చాల్సి ఉంటుందని అందరికీ తెలుసు. అయినా ముందుజాగ్రత్త లేకుండా ఇలాంటి ప్రయత్నం చేశారు. చివరకు జనవరిలో కోర్టు విచారణ సందర్భంగా చెప్పినప్పటికీ వాటిని పక్కన పెట్టి కొన్ని చోట్ల రంగులు వేశారు. దానివల్ల రూ. 100 కోట్ల వరకూ డబ్బులు బూడిదలో పోసినట్టుగా అయిపోయాయి'' అని చెప్పారు.
''గత ప్రభుత్వం కొన్ని చోట్ల ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, ఈ ప్రభుత్వం రాగానే అదో పెద్ద కార్యక్రమం మాదిరిగా నిర్వహించారు. దానికి అధికారికంగా మెమోలు కూడా జారీ చేశారు. ఇలాంటివి తగదు. ఇంత ఖర్చుకి కారణమైన వారిపై చర్యలుండాలి. ఇప్పటికైనా కోర్టు ఆదేశాల ప్రకారం పార్టీలతో ప్రమేయం లేని రంగులు వేస్తే ఎవరికీ నష్టం ఉండదు. పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు'' అని వివరించారు.

ఏకరీతిగా ఉండడం కోసమే అలాంటి ఏర్పాటు: డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ భవంతులన్నీ ఒకే రంగులో ఉండడం ద్వారా ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేశామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ''రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు అనువుగా ఉంటుందనే అలాంటి ప్రయత్నం చేశాం. మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినది కాదు. గతంలో ఉన్న పద్ధతినే కొనసాగించాం. చంద్రబాబు పాలనలో అన్ని చోట్లా వారి పార్టీ రంగులు వేశారు. వాటిని తొలగించడమే జరిగింది తప్ప మేం వచ్చి చేసిందేమీ లేదు. అయినా అభ్యంతరాలు వచ్చాయి. ప్రభుత్వ విధానం కోర్టుకి వెల్లడించాం. కోర్టు ఆదేశాలను పాటిస్తాం. దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి'' అని చెప్పారు.
ప్రజాధనం దుర్వినియోగం కావడానికి ప్రభుత్వానిదే బాధ్యత: చంద్రబాబు
రాష్ట్రంలో ఎంత దుర్మార్గ పాలన జరుగుతోందో చెప్పడానికి ప్రభుత్వ భవంతులకు వేసిన రంగుల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఉదాహరణ అవుతుందని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటున్నారు.
''పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు తొలగించాలి, మళ్లీ 10 రోజుల్లోపల ఆ రంగులు తొలగించి, ఏ పార్టీకీ సంబంధం లేని రంగులు వేయాలి. ఈసీ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇలా రంగులు వేయడానికి రూ. 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్లీ రంగులు తీయడానికి, వేరే రంగు మళ్లీ వేయడానికి అంతే ఖర్చు అవుతుంది. అంటే రూ. 3,000 కోట్లు ఖర్చు చేయాలి. ఎవరి డబ్బులు ఇవి? దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి'' అని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?
- కరోనావైరస్: బ్రిటన్ ఆరోగ్య మంత్రి నదీన్ డోరిస్‌కు కోవిడ్-19 నిర్థరణ
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై వారానికి 5 రోజులే పని.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









