రష్యా, యుక్రెయిన్ ఉద్రిక్తతలు: యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత?

యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యన్ యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, RUSSIAN DEFENCE MINISTRY

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యన్ యుద్ధ ట్యాంకులు

దాడి చేస్తుందన్న అనుమానాలు, అనిశ్చితి మధ్య రష్యా తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయోనని యుక్రెయిన్ వేచి చూస్తోంది.

రష్యా తన పొరుగు దేశమైన యుక్రెయిన్‌పై దాడి చేస్తుందని అనేక పాశ్చాత్య నిఘా సంస్థలు పదే పదే హెచ్చరించాయి.

వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారని తాను భావిస్తున్నానని, అయితే, యుద్ధాన్ని నివారించాలని తాను కోరుకుంటున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రకటించారు.

యుక్రెయిన్‌లో రష్యా సైనిక జోక్యంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కి గురువారం నాడు స్పందించారు.

‘‘మా వైపున ఎలాంటి ప్రాణనష్టం లేదు. కాబట్టి ఇక్కడ రష్యా జోక్యం కనిపించడం లేదు’’ అని ప్రకటించారు.

మరోవైపు, కొన్ని వారాల నుంచి యుక్రెయిన్ సరిహద్దులో లక్ష మందికి పైగా సైనికులను మోహరించింది రష్యా. అయితే, యుక్రెయిన్‌ పై దాడి ప్రణాళికలను మొదటి నుంచి రష్యా ఖండిస్తూ వస్తోంది.

రష్యా, యుక్రెయిన్

పాశ్చాత్య దేశాలకు రష్యా డిమాండ్లు

యుక్రెయిన్‌‌కు నాటోలో సభ్యత్వం పొందేందుకు ఎప్పటికీ అనుమతించవద్దన్నది రష్యా ప్రధానమైన డిమాండ్. తూర్పు ఐరోపాలో నాటో కూటమి తన సైనిక కార్యకలాపాలన్నింటినీ వదులుకోవాలని ఆయన ఆ దేశాలను కోరారు.

ఇటు ఉద్రిక్తతల కొనసాగుతుండగా, యుక్రెయిన్‌కు సహాయం చేయడానికి అనేక దేశాలు తమ ఆయుధాలను అక్కడికి పంపడానికి అమెరికా గురువారం అనుమతించింది.

‘‘యుక్రెయిన్‌లో రష్యా చొరబడితే, అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి వేగవంతమైన, బలమైన ప్రతిస్పందన ఉంటుంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.

మరోవైపు, అంతకు ముందు చేసిన ప్రకటనపై జో బైడెన్ వెనక్కి తగ్గారు. యుక్రెయిన్‌లో రష్యా చొరబాటును దాడిగా పరిగణిస్తామని అన్నారు.

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో యూరప్‌లోని ప్రధాన దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమైన ఆంటోనీ బ్లింకెన్ యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎదుర్కోవటానికి యూరోపియన్ దేశాల మధ్య సమన్వయం గురించి చర్చించారు.

యుక్రెయిన్‌లో రష్యా జోక్యం ఏ స్థాయిలో ఉన్నా అది ప్రపంచానికి ప్రమాదకరమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

రష్యన్ దళాల విస్తరణ

ఆగస్టు 2021లో, రష్యా క్రిమియాలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. అది జరిగిన కొన్నాళ్లకే తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతం దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలను మోహరించింది.

అయితే, కొన్ని వారాల తర్వాత, అక్కడ నుండి తన సైనికులను ఉపసంహరించుకుంది. మళ్లీ ఇప్పుడు అక్కడ రష్యన్ సైనికులు మోహరించారు.

నవంబర్ నుంచి ఈ ప్రాంతంలో రష్యా తన సైనికులను మోహరించడం ప్రారంభించింది. బెలారూస్ వరకు విస్తరింపజేసింది. బెలారూస్‌లో రెండు దేశాల సైనికులు విన్యాసాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

నాటో

రష్యాకు ఏం కావాలి?

తూర్పు ప్రాంతంలో నాటో విస్తరించదని 1990లలో అమెరికా వాగ్దానం చేసిందని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.

‘‘వాళ్లు మమ్మల్ని నిరాశపరిచారు’’ అని గత నెలలో జరిగిన ఓ సమావేశంలో పుతిన్ చెప్పారు. అయితే, అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచెవ్‌కు ఇచ్చిన హామీపై ఇరుపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయి.

ఇప్పటికే, మాజీ సోవియట్ యూనియన్‌లో సభ్యులుగా ఉన్న, లేదా దాని ప్రభావంలో ఉన్న తూర్పు, మధ్య ఐరోపా దేశాలు నాటోలో భాగమయ్యాయి. వాటిలో పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియాలు రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్నాయి.

నాటో విస్తరణ, దాని సైనిక, ఆయుధాల విస్తరణ తన భద్రతకు ముప్పని రష్యా వాదిస్తోంది.

తనకు చారిత్రకంగా హక్కులున్నాయంటూ 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.

నాటో విస్తరణపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, నాటో విస్తరణపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నారు

1991లో సోవియట్ యూనియన్ పతనాన్ని ‘‘చారిత్రక విచ్ఛిన్నం’’ గా గుర్తు చేసుకుంటారు పుతిన్. గత సంవత్సరం ఒక సుదీర్ఘ వ్యాసంలో, రష్యన్లు, యుక్రేనియన్లు ‘ఒకే జాతీయత’ కలిగి ఉన్నారని పుతిన్ అన్నారు.

ఇది పుతిన్ ఆలోచనను వెల్లడిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

ఆ కథనంలో, యుక్రెయిన్ ప్రస్తుత నాయకుడు ‘రష్యా వ్యతిరేక ప్రాజెక్టు’ను నడుపుతున్నారని కూడా పుతిన్ విమర్శించారు.

మరోవైపు, యుక్రెయిన్ తూర్పున రష్యాతో, పశ్చిమాన యూరోపియన్ యూనియన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది.

అయితే, మాజీ సోవియట్ యూనియన్‌లో సభ్యదేశం కావడంతో, రష్యాతో లోతైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంది. ఆ దేశంలో రష్యన్ మాట్లాడే వారి సంఖ్య దాదాపు 17 శాతం ఉంటుంది.

యుక్రెయిన్ 2014లో రష్యా అనుకూల అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించింది. దీంతో ఆగ్రహించిన రష్యా దక్షిణ యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించింది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌‌‌ను రష్యా ఏం చేయబోతోంది

తూర్పు యుక్రెయిన్‌లోని పెద్ద భూభాగాలను ఆక్రమించిన వేర్పాటువాదులకు రష్యా అక్కడ తన మద్దతును అందించింది.

అప్పటి నుండి రష్యా అనుకూల తిరుగుబాటుదారులు, యుక్రేనియన్ దళాల మధ్య జరిగిన పోరులో 14,000 మందికి పైగా మరణించారు.

తిరుగుబాటుదారులు, యుక్రెయిన్ సైన్యం మధ్య ఘర్షణ నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)