బీజింగ్ వింటర్ ఒలింపిక్స్: ఎందుకు వివాదాస్పదంగా మారాయి?

ఫిబ్రవరిలో బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఫిబ్రవరిలో బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.

ఫిబ్రవరిలో బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ జరుగనున్నాయి.

కానీ ఈ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు చాలా దేశాలు దౌత్యపరమైన నిషేధాలను విధించాయి. చైనాకున్న మానవ హక్కుల ఉల్లంఘన రికార్డుల వల్ల పలు దేశాలు తమ దేశ అత్యున్నత అధికారులను ఈ ఒలింపిక్స్ కు పంపకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నాయి.

ఈ క్రీడలెప్పుడు? ఇవి ఎంత భారీ స్థాయిలో జరుగుతాయి?

ఈ ఏడాది ఫిబ్రవరి 04 నుంచి 20 వరకు బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. ఇందులో సుమారు 3000 మంది అథ్లెట్లు 109 వేర్వేరు విభాగాల్లో పోటీ పడతారు.

మార్చి 04 నుంచి 13 వరకు వింటర్ పారాలింపిక్స్ జరుగుతాయి. ఇందులో ఉండే 78 విభాగాల్లో మొత్తం 736 మంది పాల్గొంటారు.

కర్లింగ్ లాంటి కొన్ని ఈవెంట్ లు ప్రారంభ కార్యక్రమానికి ముందే ఫిబ్రవరి 04న మొదలవుతాయి.

ఈ క్రీడల కోసం చైనా ప్రభుత్వం, వ్యాపార సంస్థలు 3.9 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నాయి. ఈ క్రీడలు బీజింగ్‌తో పాటు, పరిసర ప్రాంతాల్లోకూడా జరుగుతాయి.

ఇండోర్ ఐస్ క్రీడలు బీజింగ్‌లో ఉన్న స్టేడియంలలో జరుగుతాయి.

బీజింగ్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాన్ కింగ్ లో ఆల్ పైన్ స్కయింగ్ , బాబ్ స్లెడ్, లూగే లాంటి పోటీలు జరుగుతాయి.

బీజింగ్‌కు180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాన్గ్ జియాకౌలో స్కయింగ్, స్నోబోర్డింగ్ పోటీలు జరుగుతాయి.

ఈ పోటీ ప్రదేశాల్లో నిర్వాహకులు సుమారు 1.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల కృత్రిమ మంచును స్ప్రే చేస్తారు.

ఈ ప్రక్రియ వల్ల చోటు చేసుకునే వాతావరణ ప్రభావం గురించి చాలా దేశాలు చైనాను విమర్శించాయి

కోవిడ్ కారణంగా, పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులను సురక్షితమైన బబుల్స్ లో ఉంచుతారు. ప్రజలు ఈ క్రీడలను చూసేందుకు టికెట్లను అమ్మరు.

ఫిబ్రవరిలో బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఏయే దేశాలు ఈ ఒలింపిక్స్ బహిష్కరించాయి?

యూఎస్, యూకే, కెనడా దౌత్యపరమైన బహిష్కరణను ప్రకటించాయి. ఆస్ట్రేలియా, లిథువేనియా, కొసోవో కూడా ఇదే కోవలోకి చేరాయి.

అయితే, ఈ దేశాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను పంపినప్పటికీ, మంత్రులు, ఇతర అధికారులు మాత్రం హాజరవ్వరు.

చైనాలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన, షిన్‌జియాంగ్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న దారుణమైన సంఘటనల వల్ల ఈ బహిష్కరణ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

"చైనా ప్రభుత్వం వీగర్, టిబెట్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనను పారిశ్రామిక స్థాయిలో చేస్తోంది. తైవాన్ ఎయిర్ స్పేస్ లో దాదాపు ప్రతి రోజూ సైన్యాన్ని చొరబాటు చేయిస్తుంది" అని చైనాలో ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ ప్రతినిధి, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు డంకన్ స్మిత్ చెప్పారు.

"చైనా నియంతృత్వ పాలనకు చట్టబద్ధత ఉందని మేము గుర్తించలేం" అని అన్నారు.

ఈ క్రీడలకు తమ దేశం నుంచి కూడా మంత్రులను పంపించటం లేదని జపాన్ ప్రకటించింది. అయితే, జపాన్ మాత్రం దీనిని దౌత్యపరమైన బహిష్కరణగా పేర్కొనలేదు. కానీ, జపాన్ తీసుకున్న ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే అవకాశముంది.

ఒక పరస్పర దౌత్యపరమైన నిర్ణయానికి రావాలని యూరోపియన్ యూనియన్ ప్రయత్నిస్తోంది.

ఫ్రాన్స్ ఇటువంటి బహిష్కరణకు వ్యతిరేకంగా ఉంది.

"ఇటువంటి ప్రాముఖ్యం, సందర్భం లేని అంశాలను రాజకీయం చేయకూడదు " అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు.

ప్రపంచంలో చాలా చోట్ల మానవ హక్కుల ఉద్యమకారులు మాత్రం బీజింగ్‌లో ఒలింపిక్ గేమ్స్ జరగడం పట్ల నిరసనలు చేస్తున్నారు.

చైనాలో వీగర్ నిర్బంధ కాంప్ గా భావిస్తున్న భవనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చైనాలో వీగర్ నిర్బంధ క్యాంపుగా భావిస్తున్న భవనం

చైనా పైనున్న ఆరోపణలేంటి?

షిన్‌జియాంగ్‌లో ఉన్న వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందనే ఆరోపణలున్నాయి.

గత కొన్నేళ్లుగా కొన్ని లక్షల మంది వీగర్ ముస్లింలను నిర్బంధించిందని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి.

వీరిని స్టేట్ రీ-ఎడ్యుకేషన్ శిబిరాల్లోపెట్టి నిర్బంధంలో ఉంచిందని అంటారు. అందులో కొన్ని వేల మందికి జైలు శిక్ష కూడా విధించారని చెబుతారు.

వీగర్ ముస్లింలను వెట్టి చాకిరీ చేసే కార్మికులుగా కూడా ఉపయోగించారనే ఆధారాలున్నట్లు చెబుతున్నారు. మహిళలకు బలవంతంగా గర్భ నిరోధక శస్త్రచికిత్సలు చేశారని అంటారు. ఈ శిబిరాల్లో గతంలో నిర్బంధంలో ఉన్న వారిని దారుణంగా హింసించి, లైంగికంగా వేధించారని ఆరోపించారు.

హాంగ్‌కాంగ్‌లో నిరసనకారులపై చైనా ఉక్కుపాదం మోపింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హాంగ్‌కాంగ్‌లో నిరసనకారులపై చైనా ఉక్కుపాదం మోపింది

హాంగ్ కాంగ్ జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించి హాంగ్ కాంగ్‌లో ప్రజల స్వేచ్చా స్వతంత్రాల పై కూడా చైనా నిర్బంధం విధించినట్లు ఆరోపణలున్నాయి.

"చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండాలని బలవంతం చేయడం దేశ వ్యాప్తంగా నాటుకుపోయిందని హ్యూమన్ రైట్స్ వాచ్ 2021 జాతీయ నివేదికలో పేర్కొంది.

చైనా టెన్నిస్ ఛాంపియన్ పెంగ్ షువే పట్ల ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఈ క్రీడలను బహిస్కహరిస్తున్నట్లు జర్మనీ ప్రభుత్వ మంత్రులు చెప్పారు.

చైనా మాజీ ఉప ప్రధాని ఝాన్గ్ గావ్ లీ ఆమె పై లైంగిక దాడి చేశారనే ఆరోపణల తర్వాత మూడు వారాల వరకూ ఆమె మాట ఎక్కడా వినిపించలేదు.

వారిద్దరికీ ప్రేమ సంబంధం ఉందని, లైంగిక సంబంధాలను ఏర్పర్చుకునేందుకు ఆయన బలవంతపెట్టారని ఆమె ఆరోపించారు.

చైనాలోని సీనియర్ రాజకీయ నాయకుల పై ఇటువంటి ఆరోపణ రావడం ఇదే మొదటిసారి.

వీడియో క్యాప్షన్, చైనాలో వీగర్ ముస్లింలపై రేప్‌లు.. తీవ్రమైన లైంగిక హింస.. బయటపెట్టిన బాధితులు

చైనా ఎలా స్పందించింది?

పెంగ్ చేసిన ఆరోపణలన్నిటినీ చైనా ప్రభుత్వం ఖండించింది.

పశ్చిమ ప్రాంతంలోని షిన్‌జియాంగ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను చైనా ఖండిస్తూ వస్తోంది. హాంగ్ కాంగ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చైనా పై తరచుగా ఆరోపణలు చేస్తున్న అమెరికా, జర్మనీలను కూడా హెచ్చరించింది.

అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ చేయడం పట్ల చైనా తీవ్రంగా స్పందించింది.

అమెరికా ఒలింపిక్ స్పిరిట్ ను ఉల్లఘించిందని అమెరికా చేస్తున్న తప్పుడు చర్యలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, ఈ మూల్యం ఎలా ఉంటుందో స్పష్టం చేయలేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)