సుభాష్ చంద్రబోస్ జయంతి: బ్రిటిష్ చక్రవర్తి జార్జ్-5 విగ్రహాన్ని తొలగించిన చోటే నేతాజీ విగ్రహ ఏర్పాటు

ఇండియా గేట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వివేక్ శుక్లా
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ హిందీ కోసం

దిల్లీలోని తన ఫ్లాట్‌లో కూర్చున్న రైల్వే బోర్డు మాజీ సభ్యుడు, డాక్టర్ రవీంద్ర కుమార్ శుక్రవారం ఒక ఛానల్‌లో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణకు సంబంధించిన వార్తలు విన్నారు. ఇండియా గేట్ వద్ద ఒకప్పుడు బ్రిటిష్ చక్రవర్తి జార్జ్-5 విగ్రహం ఉన్న స్థానంలోనే తాజాగా నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుసుకున్న ఆయన ఒకసారి తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు.

ఇండియా గేట్ పక్కనే ఎరుపు మార్బుల్ కనోపీ (ఛత్రం) కింద చక్రవర్తి జార్జ్-5 భారీ విగ్రహం ఉన్న రోజులు ఇంకా ఆయనకు గుర్తున్నాయి. రాత్రివేళల్లో విగ్రహంపై వెలుగు కోసం 45 వాట్ల పసుపు రంగు బల్బ్‌ను వెలిగించేవారు.

ఆ కాలంలో డాక్టర్ రవీంద్ర కుమార్, 15 జనపథ్ ప్రాంతంలో నివసించేవారు. తన తండ్రితో పాటు, డాక్టర్ అంబేడ్కర్ సహోద్యోగి హోతీలాల్‌తో కలిసి ఆయన వాకింగ్ కోసం తరచుగా ఇండియా గేట్‌కు వెళ్తుండేవారు.

బ్రిటీష్ చక్రవర్తి జార్జ్-5 విగ్రహం, 1968 వరకు ఇండియా గేట్ వద్దే ఉంది. అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్ధాల తర్వాత కూడా ఆ విగ్రహం అక్కడే ఉండేది.

1938లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం 21 సంవత్సరాల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత 1968లో ఇండియా గేట్ నుంచి ఆ విగ్రహాన్ని తొలిగించి, వాయువ్య దిల్లీలోని బురారీ సమీపంలో ఉన్న కరోనేషన్ పార్క్‌కు తరలించారు. బ్రిటిష్ పాలన కాలంనాటి పలువురి విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

అర్ధ శతాబ్ధానికి పైగా ఖాళీగా ఉన్న ఈ ఛత్రం, ఇప్పుడు మరోసారి ప్రజలను ఆకర్షించనుంది. ఇక్కడే 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పున్న గ్రానైట్‌తో చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, @NARENDRAMODI

అయితే ప్రస్తుతం నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశంలోనే మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపైనా ఏళ్లపాటు చర్చలు జరిగాయి. కానీ ఇది అమలుకు నోచుకోలేదు.

ఇండియా గేట్ కాంప్లెక్స్‌లో కేవలం జార్జ్-5 చక్రవర్తి విగ్రహాన్ని మాత్రమే ఎందుకు ప్రతిష్టించారని మీరు ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, జార్జ్-5 చక్రవర్తికి దిల్లీతో ప్రత్యేక అనుబంధం ఉంది. భారతదేశ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చాలని 11 డిసెంబర్ 1911న జరిగిన దర్బారులో ఆయన ప్రకటించారు.

దీన్నిబట్టి దిల్లీ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది.

''చక్రవర్తి జార్జ్-5, క్వీన్ మేరీ ప్రత్యేక రైలులో 1911 డిసెంబర్ 7వ తేదీ ఉదయం దిల్లీకి చేరుకున్నారు. ఎర్రకోట వెనక సలీమ్‌గఢ్ దగ్గర వారి రైలు ఆగేందుకు ప్రత్యేక స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. బురారీ గ్రామ సమీపంలోని బహిరంగ మైదానంలో 11వ తేదీన జరిగిన మూడో ఢిల్లీ దర్బారులో చక్రవర్తి, క్వీన్ స్వయంగా పాల్గొన్నారు. అంతకుముందెప్పుడూ ఈ రాజదంపతులు దర్బారుకు రాలేదు'' అని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) మాజీ డైరెక్టర్ మదన్ తపలియాల్ తన పుస్తకం 'రాజధాని- ఎ సెంచరీ ఆఫ్ ట్రావెల్'లో పేర్కొన్నారు.

ఇండియా గేట్

ఫొటో సోర్స్, ARCHIVE PHOTOS

125వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇండియా గేట్ దగ్గర ప్రతిష్టిస్తామని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత గణతంత్ర వేడుకలు జనవరి 23న ప్రారంభించి, గాంధీ హత్యకు గురైన 30వ తేదీతో ముగిస్తామని అంతకుముందే ప్రభుత్వం స్పష్టం చేసింది.

వీటితోపాటు అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేస్తామని ప్రకటించింది. అనుకున్నట్లుగా విలీనం చేసింది. దశాబ్ధాలుగా ఇండియా గేట్ వద్ద నిరంతరంగా వెలుగిన అమర జవాను జ్యోతిని విలీనం చేయడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ నిర్ణయం పలువురిని నిరాశకు గురి చేసింది. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద ఈ జ్యోతిని ఏర్పాటు చేశారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ జ్యోతి ప్రజ్వలన చేశారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, @NARENDRAMODI

నేతాజీ విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తారు?

ఇండియా గేట్ వద్ద ప్రతిష్టించబోయే నేతాజీ విగ్రహాన్ని ఏ శిల్పకారుడు తయారు చేస్తారో చూడాలి. ఈ విగ్రహాన్ని తయారుచేసే శిల్పి పేరును త్వరలోనే ఖరారు చేయడం మాత్రం ఖాయం. ఈ బాధ్యతను దిగ్గజ శిల్పకారుడు రామ్ సుతార్ లేదా అతని కుమారుడు అనిల్ సుతార్‌లకు అప్పగించే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతానికి వీరిద్దరూ సరయు నది ఒడ్డున నెలకొల్పనున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రాముని విగ్రహాన్ని నిర్మించే పనిలో తలమునకలై ఉన్నారు. ఈ రామ విగ్రహం ఎత్తు 251 అడుగులు ఉండనుంది. 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'గా పేరు పొందిన ప్రముఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా రామ్ సుతార్ రూపొందించారు.

మహారాష్ట్రకు చెందిన ఈ శిల్పకారులు వేగంతో పాటు ఉద్వేగాలు ఉట్టిపడేలా విగ్రహాలను రూపొందించడంలో సిద్ధహస్తులు. పార్లమెంట్‌లో ప్రతిష్టించిన 18 అడుగుల ఛత్రపతి శివాజీ రాగి విగ్రహాన్ని కూడా రామ్ సుతార్ అందంగా తయారు చేశారు. దీని కంటే ముందు, దీని తర్వాత కూడా ఆయన తయారుచేసిన అనేక విగ్రహాలు పార్లమెంట్‌లో కొలువుదీరాయి. మహాత్మా గాంధీ, మహారాజ రంజీత్ సింగ్, జ్యోతిరావ్ పూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, పండిత్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సర్దార్ పటేల్, జయ ప్రకాశ్ నారాయణ్ తదితర విగ్రహాలన్నీ ఆయన రూపొందించినవే.

పార్లమెంట్ భవన్‌లో ప్రతీచోటా ఆయన కళ కనిపిస్తుంది. ఆధునిక భారతీయ శిల్ప కళలో ప్రముఖులుగా పేరుగాంచిన వారిలో నిస్సందేహంగా రామ్ సుతార్ పేరు ఉంటుంది.

lనేతాజీ

ఎడ్వర్డ్స్ పార్క్‌లో తొలి విగ్రహం

ఏదేమైనప్పటికీ, భారతదేశపు అతిపెద్ద చిహ్నాలలో ఒకటైన ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఉంచడం, కచ్చితంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

దేశ రాజధాని దిల్లీలో తొలిసారిగా నేతాజీ విగ్రహాన్ని 1975 జనవరి 23న ఎడ్వర్డ్ పార్క్‌లో ఏర్పాటు చేశారు. భారతదేశ రాజధానిలో స్థాపించిన తొలి నేతాజీ విగ్రహం ఇదే.

ఎడ్వర్డ్ బ్రిటన్ చక్రవర్తి. క్వీన్ విక్టోరియా స్థానంలో 1901లో ఆయన పాలించారు. అక్కడ నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎడ్వర్డ్ పార్క్‌కు సుభాష్ పార్క్ అని పేరు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ చక్రవర్తి విగ్రహాన్ని కూడా కరోనేషన్ పార్కులో ఉంచారు.

సుభాష్ పార్కులో నెలకొల్పిన విగ్రహంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సహచరులు కూడా ఉన్నారు. దీన్ని అప్పటి ఉపరాష్ట్రపతి బి.డి. జట్టి ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి కనీసం పది రోజుల సమయం పట్టింది. విగ్రహాన్నిఏర్పాటు చేసిన చాలా రోజుల తర్వాత కూడా ఢిల్లీలో నివసించే ప్రజలు, దాని ముందు చేతులు జోడించి నిలబడేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)