పేర్ని నాని: ‘చిరంజీవి వచ్చింది భోజనానికే, సినిమా టికెట్ల సమస్యపై చర్చించడానికి కాదు’- ప్రెస్‌రివ్యూ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో చిరు

ఫొటో సోర్స్, @CHIRUFANCLUB

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో భోజనం చేసేందుకు మాత్రమే చిరంజీవి వచ్చారు, సినిమా టికెట్ల అంశం గురించి మాట్లాడటానికి అదేమైనా సచివాలయమా అంటూ మెగాస్టార్ చిరంజీవిని చులకనగా చేస్తూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక వార్తలో తెలిపింది.

''శుక్రవారం కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంతో చిరంజీవి భేటీ గురించి ప్రస్తావించినప్పుడు.. ''జగన్‌ నివాసానికి చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సినిమా టికెట్లపై సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయికానీ, ఇంట్లో జరుగుతాయా? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వమా?'' అని పేర్ని ప్రశ్నించారు.

వెరసి... చిరంజీవి పర్యటనకు ప్రాధాన్యం లేదని, భోజనం చేసేందుకే వచ్చారని తేల్చేశారు.

ఈనెల 13న జగన్‌ను కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ''టికెట్ల ధరల సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో నన్ను రమ్మని సీఎం ఆహ్వానించారు. పండగ పూట ఈ సమావేశం సంతృప్తిగా సాగింది. నన్ను ఒక సోదరుడిలా ఆహ్వానించారు.

సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. నేను చెప్పిన అన్ని సమస్యలను జగన్‌ సానుకూలంగా విన్నారు. రాసుకున్నారు. ఒకరి పక్షాన గాక అందరి వైపు ఉంటానని, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.

టికెట్‌ ధరల జీవోపై పునరాలోచన చేస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు వివరించాను. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చింది. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతాభావానికి లోనుకావద్దు. రెండు, మూడు వారాల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుంది.

నిర్ణయం తీసుకునేలోగా మరోసారి కలసి మాట్లాడుదామని జగన్‌ చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసేముందు మళ్లీ ఆహ్వానిస్తానన్నారు'' అని చిరంజీవి చెప్పారు.

కానీ ప్రస్తుతం పేర్ని నాని మాత్రం, ఆ భేటీలో సినిమా టికెట్లపై చర్చ జరగనే లేదని, చిరంజీవి భోజనం చేసి... కుశల ప్రశ్నలు వేసుకుని వెళ్లిపోయారని అంటున్నారని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

పండ్లు

ఫొటో సోర్స్, Getty Images

‘పండ్లను మాగబెట్టడానికి ఈథెఫోన్‌ వాడొచ్చు’

పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఈథెఫోన్‌, ఎన్‌రైప్‌ను వినియోగించడాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సమర్థించినట్లు 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

''ఈథెఫోన్‌ను గ్యాస్‌ రూపంలో వినియోగించడం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి నిబంధనల ప్రకారం సరైనదేనని తీర్పుచెప్పింది.

కాలుష్య నియంత్రణ మండలి 2018లో ఇచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని స్పష్టంచేసింది. ఈథెఫోన్‌, ఎన్‌రైప్‌ వినియోగాన్ని అనుమతిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహితవ్యాజ్యాలను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

నిపుణుల అధ్యయనం తర్వాతే ప్రభుత్వం ఈథెఫోన్‌కు అనుమతి ఇచ్చిందని హైకోర్టు పేర్కొన్నట్లు'' నమస్తే తెలంగాణ వార్తలో తెలిపింది.

అసదుద్దీన్‌ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

మేం గెలిస్తే ఇద్దరు సీఎంలు..యూపీలో ఒవైసీ హామీ

యూపీ ఎన్నికల్లో తమ కూటమిని గెలిపిస్తే 5 సంవత్సరాల కాలంలో ఇద్దరిని ముఖ్యమంత్రులుగా చేస్తామని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ హామీ ఇచ్చినట్లు 'ఈనాడు' కథనంలో తెలిపింది.

''ఎన్నికల వేళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కొత్త కూటమి ప్రకటించారు.

జన్‌ అధికార్‌ పార్టీ, బీఏఎంసీఈఎఫ్‌లతో కలిసి 'భాగీదారీ పరివర్తన్‌ మోర్చా'ను ఏర్పాటు చేస్తునట్లు శనివారం తెలిపారు.

తమ కూటమిని గెలిపిస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు, దళితుల నుంచి ఒకరు ముఖ్యమంత్రులుగా ఉంటారని పేర్కొన్నారు.

అలాగే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, అందులో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు.

కూటమికి జన్‌ అధికార్‌ పార్టీ అధ్యక్షుడు బాబు సింగ్‌ కుశ్వాహా నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. బాబు సింగ్‌ గతంలో మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని'' ఈనాడు పేర్కొంది.

మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

ఫొటో సోర్స్, koppula eshwar/face book

118 నియోజకవర్గాల్లోనూ 'దళితబంధు'

తెలంగాణ రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపినట్లు 'సాక్షి' కథనంలో పేర్కొంది.

''ప్రతి నియోజకవర్గంలో కుటుంబమే యూనిట్‌గా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి నెలాఖరు కల్లా నూరుశాతం యూనిట్లు గ్రౌండింగ్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేశామన్నారు. దళితబంధుపై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుకూ ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను ఈ పథకం కింద ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

లబ్ధిదారు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1,200 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విడతలవారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు.

విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కార్పొరేషన్‌ ఎం.డి.కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నట్లు'' సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)