ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: బీజేపీలో తిరుగుబాటు రగులుతోందా?

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో తిరుగుబాటు రగులుతోందా?

యూపీలో ముగ్గురు మంత్రులు సహా పది మంది శాసనసభ్యులు బీజేపీ నావ నుంచి దూకేశారు. వారిలో చాలా మంది రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అటువంటివారిలో.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్వామి ప్రసాద్ మౌర్య ఒకరు. తాను పార్టీని వీడటం బీజేపీలో ‘భూకంపం’ పుట్టిస్తుందని ఆయన నమ్ముతున్నారు.

కానీ, రాజకీయ ఫిరాయింపులు – ముఖ్యంగా ప్రాంతీయ ఎన్నికలకు ముందు పార్టీలు మారటం భారతదేశంలో అరుదేమీ కాదు. తమ పార్టీ తమకు టికెట్ ఇవ్వక పోతే ఎదుటి పార్టీలో చేరే రాజకీయాలు పెరుగుతున్నాయి.

చాలా ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల శాసనసభలు కొత్త సభ్యులతో నిండిపోతున్నాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన అభ్యర్థులు తక్కువైపోవటంతో ఇది మామూలుగా మారిపోయింది.

స్వామి ప్రసాద్ మౌర్య (ఎడమ), అఖిలేశ్ యాదవ్ (కుడి) సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, స్వామి ప్రసాద్ మౌర్య (ఎడమ), అఖిలేశ్ యాదవ్ (కుడి) సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు

‘‘అధికారమంతా ముఖ్యమంత్రుల చేతుల్లో కేంద్రీకృతం చేసే రాజకీయ సంస్కృతి బలపడటం వల్ల శాసనసభ్యుల అధికారం తరిగిపోగుతుండటం కూడా ఇందుకు ఒక కారణం’’ అంటారు అశోకా యూనివర్సిటీకి చెందిన పొలిటకల్ ప్రొఫెసర్ గైల్స్ వెర్నీర్స్.

అలాగే బీజేపీ వంటి పార్టీలు తమ అభ్యర్థులకు ప్రజల్లో చెడ్డ పేరుందేమో తెలుసుకోవటానికి ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ జరపుతుంటాయి. ప్రజాదరణ కనిపించని అభ్యర్థులకు సాధారణంగా టికెట్లు నిరాకరిస్తుంటాయి.

‘‘బీజేపీ కేవలం గెలవడం కోసమే కాదు.. ప్రతిపక్షాన్ని మట్టికరిపించటానికి కూడా పోటీ చేస్తుంది. స్వల్ప మెజారిటీతో అధికారంలోకి రావటం ఆ పార్టీకి సంతృప్తికరంగా ఉండదు’’ అంటారు దిల్లీలోని మేధోబృందం సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి డైరెక్టర్ సంజయ్ కుమార్.

2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 సీట్లలో 312 సీట్లు, దాదాపు 40 శాతం ఓట్లను గెలుచుకున్న బీజేపీ స్వీప్ చేసింది.

అలా గెలిచిన 312 మంది శాసనసభ్యుల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచిన వారు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారని టీసీపీడీ గణాంకాలు చెప్తున్నాయి. ఈ 19 మందిలో తొమ్మిది మంది ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే.

తాజా ఫిరాయింపులు రాజకీయంగా వాగ్యుద్ధానికి దారితీశాయి. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. దేశ రాజధాని దిల్లీకి పక్కనే ఉంది. భారతదేశంలో అత్యధిక జనాభా (20 కోట్ల మంది) గల రాష్ట్రం. పార్లమెంటుకు అత్యధిక సంఖ్యలో ఎంపీలు కూడా ఈ రాష్ట్రం నుంచే వస్తారు. యూపీలోని 80 మంది ఎంపీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఒకరు.

ఉత్తరప్రదేశ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్

అయితే.. బీజేపీ వంటి అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు జరగటం.. ప్రధానంగా స్వింగ్ ఓటర్లలో ఆ పార్టీ ఎదురుగాలిని ఎదుర్కొంటోందనే అభిప్రాయం కలిగిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం– యూపీలో సమాజ్‌వాది పార్టీ – అధికార బీజేపీతో హోరాహోరీగా తలపడుతోందని ఈ ఓటర్లు భావిస్తారు. ‘‘కానీ అభిప్రాయాలు, వాస్తవాలు పూర్తిగా వేర్వేరుగా ఉండొచ్చు’’ అంటారు డాక్టర్ కుమార్.

భారతదేశపు గందరగోళ ప్రజాస్వామ్యంలో.. వాస్తవాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ‘‘ఈ ఫిరాయింపులను జనం ఇంతగా పట్టించుకోవటానికి ఒక కారణం.. ఉత్తరప్రదేశ్‌లోని విస్తృత రాజకీయ పరిస్థితి’’ అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన పొలిటకల్ సైన్స్ ప్రొఫెసర్ సుధా పాయ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహిస్తున్నారు. పార్టీ లోపలా, వెలుపలా వర్గాలుగా విడగొట్టే నాయకుడిగా ఆయనకు పేరుంది. యోగి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన కాషాయం ధరించే ఈ 49 ఏళ్ల నాయకుడు.. భారీ సంఖ్యలో ఉన్న హిందూ ఓట్లు లక్ష్యంగా బాహాటంగా ముస్లింలకు వ్యతిరేకంగా తీవ్రపదజాలంతో మాట్లాడుతుంటారు.

ఆదిత్యనాథ్ తనను అభివృద్ధికి ప్రతీకగా కూడా ప్రదర్శించుకున్నారు. దేశంలోని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన యూపీలో తాను భారీ అభివృద్ధిని తీసుకువస్తున్నట్లు మీడియా ప్రకటనల ద్వారా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే స్వతంత్రంగా తనిఖీ చేసినపుడు ఈ గొప్పల్లో చాలా వరకూ నిలబడవు.

వీడియో క్యాప్షన్, మోదీ, అమిత్ షాలకు యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యామ్నాయమనే ప్రచారం ఎందుకు జరుగుతోంది?

రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఉన్న పశ్చిమ ప్రాంతంలో చాలా కాలంగా రైతుల తిరుగుబాటు రగులుతూ ఉంది. సంప్రదాయంగా రాజకీయ మార్పు తెచ్చే ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరుంది. (ఏడాది పాటు నిరసన చేపట్టిన భారత రైతులు.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌లో ఉపసంహరించినపుడు ఆందోళన విరమించారు.)

అసలే నెమ్మదిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బ కొట్టిన కరోనా మహమ్మారి.. నగరాల్లో పనిచేసే రాష్ట్రానికి చెందిన కోట్లాది మంది వలస కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. వారు తిరిగి తమ స్వస్థలాలకు, అతి తక్కువ కూలీలతో పొలాల్లో పనిచేయటానికి తిరిగి వెళ్లేలా చేసింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆదిత్యనాథ్ అధికారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తారని, జనానికి దగ్గరయ్యే నాయకుడు కాదని ఆయన విమర్శకులు అంటారు.

అభివృద్ధి ఎంత ముఖ్యమో కుల రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు అంతే కీలకమైన ఈ రాష్ట్రంలో.. విపక్షాలకు కన్నుకుట్టేలా బీజేపీ విజయం సాధించటానికి కారణం.. విస్తృతమైన హిందూ కుల సంకీర్ణాన్ని నిర్మించటమేనని చెప్తారు. ఇందులో.. ఇతర వెనుకబడిన కులాలు – ఓబీసీలుగా చాలా ఉన్నాయి.

ఓబీసీల్లో సుమారు 20 శాతం మంది యాదవులు కాగా.. వారు సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా ఉంటారు. 2017 ఎన్నికల్లో యాదవేతర ఓబీసీల్లో 61 శాతం మంది – అంటే రాష్ట్రంలోని ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు – బీజేపీకి ఓటు వేశారు.

వీడియో క్యాప్షన్, యూపీ డిప్యూటీ సీఎం: ఇంటర్వ్యూ మధ్యలో మైక్ తీసేశారు.. రికార్డింగ్ ఆపేయమన్నారు..

ఈ కుల సంకీర్ణానికి బీటలు వారుతున్నాయని ఈ వారంలో జరిగిన ఫిరాయింపులు సూచిస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపుదారుల్లో చాలా మంది ఓబీసీలే.

కానీ అలా భావించటం తొందరపాటు అవుతుంది. ఈ సంకీర్ణాన్ని నిర్మించటం ద్వారా బీజీపీ ‘‘వృద్ధి చెందుతున్న దిగువ మధ్యతరగతి’’ని బీజేపీ ఒడిసిపట్టుకోగలిగిందని ప్రొఫెసర్ పాయ్ అంటారు.

ఒకప్పుడు ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న బీజేపీ.. వెనుకబడిన కులాల హిందువులను తన ఒడిలోకి ఆకర్షించింది. వారికి సంక్షేమ ప్రయోజనాలను అందించింది. ‘‘అభివృద్ధిని, సాంస్కృతిక సమ్మిశ్రమాన్ని బీజేపీ విజయవంతంగా కలగలిపింది’’ అన్నారామె. ఇది ‘‘భారత మితవాదుల కొత్త సంక్షేమవాదం’’ అని కొందరు ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ఫిబ్రవరి 10న ఎన్నికలు మొదలుకానున్నాయి. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు 15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయాల్లో ఒక వారం అనేది సుదీర్ఘ కాలం. దేశంలోని అత్యధిక జనాభా గల ఈ రాష్ట్రంలో రాజకీయ సరళిని ఓ పిడికెడు ఫిరాయింపులు.. అమాంతంగా మార్చే అవకాశం ఉండదు.

‘‘ఇప్పటికైతే.. పోటీ హోరాహారీగా ఉండవచ్చుననే దానికి ఇది ఒక సంకేతం మాత్రమే’’ అంటారు డాక్టర్ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)