ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు: యోగి ఆదిత్యనాథ్ వర్గాన్ని వీడిపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. బీజేపీ ఈ నష్టాన్ని పూడ్చుకోగలదా?

అఖిలేశ్‌తో స్వామి ప్రసాద్ మౌర్య

ఫొటో సోర్స్, @yadavakhilesh

ఫొటో క్యాప్షన్, అఖిలేశ్‌తో స్వామి ప్రసాద్ మౌర్య
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతనిధి

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు, పెద్ద నేతల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం నాడు బీజేపీ మంత్రి ధర్మ్ సింగ్ సైనీ రాజీనామా చేశారు.

పార్టీని వీడుతున్న వారిలో ఎక్కువమంది చూపుతున్న కారణం రైతులు, వెనకబడిన వర్గాల వారిని యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నది. స్వామి ప్రసాద్ మౌర్య, ధర్మ్ సింగ్ సైనీలతో మొదలు పెట్టి, దారాసింగ్ చౌహాన్, ముకేశ్ వర్మ తదితరులు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు.

వీరే కాకుండా బీజేపీని వీడుతున్న లేదా వీడేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా అంటూ సోషల్ మీడియాలో అనేక పేర్లు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు సోషల్ మీడియాకు, జర్నలిస్టులకు లీకులు ఇస్తున్నారు.

‘‘బీజేపీని వీడాలనుకునే చాలా మంది నేతలు సమాజ్‌వాదీ పార్టీతో టచ్‌లో ఉన్నారు. వారందరినీ స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లో అనేకమంది అధికార పార్టీ నేతలు మాతో కలుస్తారు’’ అని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గాంధీ అన్నారు.

అఖిలేశ్‌తో ధర్మ్ సింగ్ సైనీ

ఫొటో సోర్స్, @yadavakhilesh

ఫొటో క్యాప్షన్, అఖిలేశ్‌తో ధర్మ్ సింగ్ సైనీ

మరి నిజంగానే, బీజేపీ నుంచి వలస ప్రక్రియ మరింత ఊపందుకుంటుందా? దీనిపై బీజేపీ ఏమనుకుంటోంది?

బీజేపీకి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. 2017 ఎన్నికలకు ముందు బీఎస్పీని వీడి బీజేపీలో చేరి మంత్రి అయ్యారు. యాదవేతర ఓబీసీ ఓట్లను రాబట్టగల నేతగా ఆయనకు పేరుంది.

మౌర్య బీజేపీలోకి రావడంతోపాటు చాలామంది నేతలను కూడా వెంట తెచ్చుకున్నారు. ఇప్పుడు పార్టీ వీడే సమయంలో కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు.

మౌర్యతోపాటు మరికొందరు నేతలు బీజేపీని వీడడం వల్లే పార్టీలో వెనుకబడిన వర్గాల నేతలు తమకు ప్రాధాన్యం లేదన్న భావనలో పడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మోదీ, అమిత్ షాలకు యోగీ ఆదిత్యనాథ్ ప్రత్యామ్నాయమనే ప్రచారం ఎందుకు జరుగుతోంది?

బీజేపీలో ఘర్షణ ఉందా?

‘‘బీజేపీ అగ్రవర్ణ పార్టీగా మారిందని ఈ నేతలు గుర్తించినట్లు మౌర్య, మరికొందరు నాయకులు రాజీనామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గడిచిన ఐదు సంవత్సరాలలో అనుసరించిన విధానాలలో ఠాకూర్ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు, ఓబీసీ నేతలు పార్టీని వీడుతున్న తీరు బీజేపీ- యోగి ఆదిత్యనాథ్‌లతో వారి ఘర్షణకు అద్దంపడుతోంది. బీజేపీ మత విధానం ఫెయిల్ అవుతోంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.

అయితే, పార్టీలో ఎలాంటి ఘర్షణ వాతావరణమూ లేదని బీజేపీ చెబుతోంది. అంతేకాదు గతంతో పోలిస్తే, ఇప్పుడు పార్టీ మరింత బలపడిందని వివరిస్తోంది.

‘‘పార్టీలో ఎలాంటి ఘర్షణ వాతావరణమూ లేదు. బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేశ్ సైనీ, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే హరిఓం యాదవ్ కూడా బీజేపీకి వచ్చారు. ఎస్పీకి కంచుకోటగా మారిన చాలా మంది నాయకులు బీజేపీలోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఘర్షణ వాతావరణం ఉందని ఎలా చెబుతారు?’’అని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి వ్యాఖ్యానించారు.

బీజేపీ

ఫొటో సోర్స్, BJP

యూపీ ఎన్నికల్లో యాదవేతర ఓబీసీ ఓట్లు ఎందుకు ముఖ్యం?

పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారితో పోలిస్తే, లోపలకు వచ్చే వారే ఎక్కువని రాకేశ్ త్రిపాఠి అన్నారు.

‘‘మంచి ప్రజాదరణ ఉన్న నాయకులు చాలా మంది గత నెల రోజుల్లోనే కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీల నుంచి బీజేపీకి వచ్చారు. మరికొంత మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు మా పార్టీ కమిటీ పరిశీలిస్తోంది. ప్రజాదరణ కలిగిన నాయకులు మా పార్టీలో చేరుతూనే ఉన్నారు.’’

బీజేపీ నుంచి బయటకువచ్చిన వారు ఎక్కువగా ఎస్పీలో చేరుతున్నారు. అలా వచ్చేవారికి ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు.

‘‘సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఎలాంటి నాయకులకైనా మా పార్టీ ఆశ్రయం కల్పిస్తుంది. బీజేపీ విషయంలో కోపంతో ఉన్న నాయకులు మా పార్టీలోకి హాయిగా రావొచ్చు. సామాజిక న్యాయం కోసం మేం చేసే పోరాటానికి వారి వల్ల మరింత బలం చేకూరుతుంది’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గాంధీ చెప్పారు.

2014 సార్వత్రిక ఎన్నికలు, 2017 యూపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ దక్కడంలో ఓబీసీలు భారీగా ఓట్లు వేయడమే కారణమని చాలా సర్వేలు తేల్చాయి.

అయితే, స్వామి ప్రసాద్ మౌర్య లాంటి ఓబీసీ నాయకులు బీజేపీని వీడిపోవడంతో పార్టీకి కొంతవరకు నష్టం చేకూరే అవకాశముంది. మరోవైపు ఓబీసీ ఓట్లు కూడగట్టడానికి బీజేపీలో ఎవరైనా బలమైన నాయకుడు ఉన్నారా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

‘‘బీజేపీలో ప్రజాదరణ కలిగిన నాయకుడు ఒకే ఒక్కరు. ఆయనే ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో ఆయనే ఓబీసీలను బీజేపీవైపు నడిపించారు. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వ వైఖరితో కొంతమంది ఓబీసీ నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం యూపీ ఎన్నికలకు ముందు ఈ అసమ్మతిని తగ్గించేందుకు బీజేపీకి ఎక్కువ సమయం కూడా లేదు’’అని శరత్ ప్రధాన్ అన్నారు.

రాకేశ్ త్రిపాఠి

ఫొటో సోర్స్, BJP

ఫొటో క్యాప్షన్, రాకేశ్ త్రిపాఠి

మరోవైపు ఓబీసీలను తమవైపు తీసుకురావడానికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య లాంటి పెద్ద నాయకులు తమ పార్టీలో ఉన్నారని పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి వివరించారు.

‘‘యూపీలో కులం, ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడో ముగిసిపోయాయి. ఎన్నికల్లో అభివృద్ధిని ప్రధాన అంశంగా బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. నేడు ఓ కులానికి ఒక ప్రతినిధి అంటూ ఎవరూ లేరు. మౌర్య, శాక్య, సైని, కుశ్వాహా వర్గాల నుంచి సరిపడా ప్రతినిధులు మా పార్టీలో ఉన్నారు. వెనుకబడిన వర్గాల నాయకుల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అతిపెద్దవారు. మేం వెనుకబడిన వర్గాలను చిన్నచూపు చూస్తున్నామని చెప్పడం సరికాదు’’అని రాకేశ్ వివరించారు.

పార్టీలో అసమ్మతి ఉందనే వార్తలను కూడా రాకేశ్ ఖండించారు. పార్టీలో తమ భవిష్యత్ లేదని భావించిన వారే పార్టీని వదిలివెళ్తున్నారని ఆయన అన్నారు.

‘‘తమ పనితీరుపై సమీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికి పార్టీలో భవిష్యత్ ఉండదనే ఆందోళన ఉంటుంది. అందుకే వారు పార్టీని వదిలివెళ్తున్నారు. అలా వెళ్లినవారికి ఏ పార్టీలో చేరినా భవిష్యత్ ఉండదు’’ అన్నారు.

అయితే, తాను ఒక్కడినే పార్టీని వీడిపోవడం లేదని, తనతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకు వెళ్తానని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

‘‘స్వామి ప్రసాద్ మౌర్య, ఆయన సన్నిహితుడు అనిల్ మౌర్య ఒకేసారి బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు బీజేపీని వీడిపోవడం లేదని అనిల్ స్పష్టం చేశారు. దీనిబట్టి స్వామి ప్రసాద్ మౌర్య పట్టు సడలిపోతుందని అర్థం చేసుకోవచ్చు’’ అని రాకేశ్ అన్నారు.

బీజేపీలో చేరినప్పుడు స్వామి ప్రసాద్ మౌర్య

ఫొటో సోర్స్, SwamiPMaurya

ఫొటో క్యాప్షన్, బీజేపీలో చేరినప్పుడు స్వామి ప్రసాద్ మౌర్య

బీజేపీ పటిష్ఠంగా ఉంటే ఎందుకీ వలసలు?

2014 తర్వాత వలసలను పరిశీలిస్తే, బీజేపీ నుంచి బయటకు వెళ్లినవారితో పోలిస్తే, పార్టీలో చేరినవారే ఎక్కువ. బీజేపీ ఓటు బ్యాంకు కూడా పెరిగింది. రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ అధికారం పార్టీదే. సభ్యుల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. మునుపెన్నడూ లేనంత స్థాయిలో బీజేపీ పటిష్ఠంగా ఉంది. యూపీ ఎన్నికల విషయంలోనూ ఆ పట్టు కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పార్టీ నిర్మాణం, వనరులను పరిశీలిస్తే, బీజేపీ పటిష్ఠమైన పార్టీగా కనిపిస్తుంది. అయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా పార్టీని వదిలి వెళ్తున్నప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలైందని ఎందుకు పార్టీ గ్రహించడం లేదు?

‘‘2017 తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. అప్పుడు 1.87 కోట్ల మంది బీజేపీలో ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 3.80 కోట్లకు పెరిగింది. 2017లోనే మాకు 325 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుంది’’అని రాకేశ్ అన్నారు.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, yadavakhilesh

టికెట్‌పై నమ్మకం లేకే..?

తమకు పార్టీ టికెట్ వస్తుందో లేదో అని నమ్మకం లేనివారే పార్టీని వీడిపోతున్నారని బీజేపీ చెబుతోంది.

‘‘టికెట్ల విషయంలో బీజేపీలో ప్రజాస్వామ్య బద్ధమైన వ్యవస్థ ఉంది. ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే టికెట్లను ఇస్తాం. దీని కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ ఒక సర్వే చేపడుతుంది. పార్టీ గతంలో గెలవలేని చోట్ల మంచి నాయకుల కోసం కూడా సర్వే జరుగుతుంది.

తమకు టికెట్ రాదని భయపడేవారు పార్టీని వదిలివెళ్లిపోవడం సాధారణమే. ప్రజలకు మేలు చేయలేని నాయకులు బీజేపీలో ఉన్న లేదా వేరే ఇతర పార్టీలో ఉన్నా ఒకటే’’అని రాకేశ్ అన్నారు.

యోగీ

ఫొటో సోర్స్, ANI

యోగి నాయకత్వంపై ప్రశ్నలు

గత ఐదేళ్లలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనేకంటే యోగి ప్రభుత్వమనే ఎక్కువ పిలుస్తారు.

దీంతో ప్రస్తుతం పార్టీని వీడుతున్న నాయకులంతా యోగిపై కోపంతోనే వెళ్తున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

‘‘యోగి ఆదిత్యనాథ్‌పై అసమ్మతి ఉందనే విషయంలో సందేహం లేదు. గత ఐదేళ్లలో యోగి ఆదిత్యనాథ్ శక్తిమంతమైన నాయకుడిగా తనను తాను చూపించుకున్నారు. యూపీలో అన్నీ తానేనని సంకేతాలను ఇస్తూ వచ్చారు. తమ పార్టీ నాయకులను కూడా యోగి అంత తేలికగా కలవరని చర్చలు కూడా జరుగుతుంటాయి. యోగిని కలవడం అంత తేలికకాదని కొంత మంది మంత్రులు కూడా అనధికారికంగా వ్యాఖ్యలు చేశారు’’అని శరత్ వివరించారు.

అయితే, యోగి ఇమేజ్ ప్రభావం ఎన్నికలపై కనిపిస్తుందా?

‘‘యోగి తనకు తాను శక్తిమంతమైన నాయకుడిగా చూపించుకుంటున్నారు. అయితే, ఆయన ముఖ్యమంత్రి అయ్యింది బీజేపీ వల్లే. పార్టీ కంటే ఆయనే గొప్పవారని అనుకుంటే, అది సంకుచిత మనస్తత్వమే అవుతుంది. యోగి వల్లే నాయకులు బయటకు వెళ్లిపోతే, దీని వల్ల బీజేపీకి నష్టం తప్పదు’’అని శరత్ అన్నారు.

స్వామి ప్రసాద్ మౌర్యతోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలో యూపీతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీజేపీ నష్ట నివారణ చర్యల్లో తల మునకలైనట్లు కనిపిస్తోంది.

మరోవైపు పరిస్థితులను తమకు అవకాశంగా మలుచుకోవడానికి ఎస్పీ ప్రయత్నిస్తోంది. తెరవెనుక చాలా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

‘‘గత రెండు రోజుల పరిణామాలతో యూపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలతో బీజేపీ బలం తగ్గుతుందనే సంకేతాలు వస్తున్నాయి.

అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఈ నష్టాన్ని పూడ్చుకోగలదా? అనేదే అశలు ప్రశ్న. దీనికి జవాబు ఎన్నికల ఫలితాల రోజే తెలుస్తుంది’’ అని శరత్ ప్రధాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)