ఉత్తర్‌ప్రదేశ్: ఇక్కడ అనాథ పశువులు కూడా ఓట్లు రాలుస్తాయా?

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఘటన. ఓ సాయంత్రం వేళ 55 ఏళ్ల రామ్‌రాజ్ అనే వ్యక్తి పొలం దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా పక్కనే ఉన్న చెరుకు తోట నుంచి ఓ ఎద్దు రంకెలు వేసుకుంటూ వచ్చి ఆయనపై దాడి చేసింది. నేరుగా వీపు మీద పొడవడంతో రామ్‌రాజ్ కూలబడ్డారు. ఆ తర్వాత అది ఆయన కడుపు మీద తొక్కింది.
''ఆయన పళ్లన్నీ విరిగిపోయాయి. కడుపులో, ఛాతీ మీద గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకుపోయాం. కానీ బతికించుకోలేకపోయాం'' అని రామ్‌రాజ్ కోడలు వెల్లడించారు.
భర్త చనిపోయన బాధలో ఉన్న రామ్‌రాజ్ భార్య అన్నం, నీరు ముట్టడం లేదు. ఈ బాధలో ఆమెకు కూడా ఏమైనా అవుతుందేమోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఈ తరహాలో ఇదే మొదటిది కాదు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలోనూ పశువులు అనాథ పశువులు (వదిలేసిన ఆవులు) విచ్చలవిడిగా తిరుగుతూ రైతులను ముఖ్యంగా చిన్నకారు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి.
యూపీలోని చిరోంధాపూర్ నివాసి 37 ఏళ్ల భూపేంద్ర దూబే దిల్లీలో పని చేస్తుంటారు. కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ సమయంలో ఆయన సొంతూరు తిరిగి వచ్చారు. 2020 జూన్‌లో ఓ సాయంత్రం ఆయన మార్కెట్‌కు వెళుతుండగా, ఒక ఎద్దు ఆయనపై దాడి చేసింది. ఆ సంఘటనను గుర్తు చేస్తేనే ఆయన భార్య పూనమ్ వణికిపోతారు.
''ఇంట్లోకి కొన్ని సరకులు కావాలని చెప్పాను. తొమ్మిదింటికి కాల్ చేసాను, ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉంటానన్నారు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదు'' అంటూ పూనమ్ ఏడ్చారు.
చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తోందని నేను ఆమెను అడిగాను. ''మా నాన్న ఉన్నారు. ఆయనే మాకు అన్నీ చూస్తున్నారు'' అన్నారామె.

సమస్య ఎక్కడ మొదలైంది?
ఈ రెండు కథలను అర్ధం చేసుకోవడానికి మనం 2017 సంవత్సరంలో వెళ్లాలి. 15 ఏళ్ల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన ప్రభుత్వం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్రంలోని వేలాది అక్రమ కబేళాలను మూసివేయడం ఇందులో ముఖ్యమైంది.
''రాష్ట్రంలో అక్రమ కబేళాలను మూసేయించిన ప్రభుత్వం ఇదే. గోవుల అక్రమ రవాణాను కూడా అరికట్టాం. ఆవు పట్ల ఎవరైనా క్రూరంగా వ్యవహరిస్తే వారు జైలులో కూర్చోవాల్సి ఉంటుంది'' అంటూ ఓ సభలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.
అక్రమ కబేళాల మూసివేత, గొడ్డు మాంసం తినడం, ఆవుల స్మగ్లింగ్ పేరుతో అనేక హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. ముజఫర్ నగర్, అలీగఢ్, బలరాంపూర్, బారాబంకి, హమీర్‌పూర్ వంటి అనేక ఇతర జిల్లాల పోలీస్ స్టేషన్లలో ఆవుల స్మగ్లింగ్, గోహత్య కేసులు పెరిగాయి.
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 2018లో గోహత్య ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్‌ను ఆగ్రహంతో ఉన్న ఓ గుంపు కాల్చి చంపింది.
మరోవైపు రాష్ట్రంలోని రోడ్లపై సంచరించే పశువుల సంఖ్య పెరుగుతోంది. వాటి ఆకలి కూడా పెరిగి పోయింది.
రాజధాని లఖ్‌నవూకు కొన్ని గంటల ప్రయాణం పట్టే మిల్కిపూర్ ప్రాంతంలోని సింధౌర మౌజా అనే గ్రామానికి చెందిన శివ పూజన్ అనే వ్యక్తి మాకు తారసపడ్డారు. ఆయన అప్పడే బస్సు దిగి వస్తున్నారు. చేతికి కట్టు, దాని మీద రక్తం మరకలు కనిపించాయి.
''నాలుగు రోజుల కిందట నా పొలంలో పశువులు మేస్తున్నాయని తెలిసి అక్కడికి వెళ్లాను. అవి నా వెంటపడ్డాయి. నేను పరుగెత్తాను. అక్కడే ఉన్న ఫెన్సింగ్ తగిలి కింద పడిపోయాను. నా చెయ్యి విరిగింది. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను'' అని శివ పూజన్ వివరించారు.

రాజకీయాలు-అనాథ పశువులు
దేశంలో దాదాపు 20 కోట్ల పశువులు ఉన్నట్లు అంచనా. అందులో అత్యధికం ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇక అనాథ పశువులు దేశమంతటా 50 లక్షలకు పైగా ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటి సంఖ్య 15 శాతానికి పైగా పెరిగిందని ప్రభుత్వ గణాంకాలలో తేలింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆవు రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ '' ఆవు కొందరికి ఆహారం కావచ్చు. కానీ, మనకు ఆవు తల్లి. పూజించదగ్గది. ఆవును, గేదెను హేళన చేసేవాళ్లు ఒక విషయం మర్చి పోతున్నారు. పశువుల ద్వారా ఎనిమిది కోట్ల కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతోంది'' అని అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. '' రాష్ట్రంలో బీజీపీ విధానాల వల్ల లక్షలాది పశువులు రైతుల ఆశలను అడియాశలు చేశాయి'' అన్నారు.
గత నాలుగన్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కష్టాలను పెంచింది తప్ప ఏమీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.

రైతుల బాధలు
యూపీలో పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. వారు అనాథ పశువుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
''పశువుల వల్లనే మా పంటలు దెబ్బతిన్నాయి. పాలివ్వని ఆవులు పెరగడంతో సమస్య మరింత పెరిగింది. వాటి బారి నుంచి పంటలను రక్షించుకునే శక్తి రైతులకు లేదు'' అని సుల్తాన్‌పూర్-అయోధ్య జిల్లాల సరిహద్దుల్లో నివసించే దీనానాథ్ యాదవ్ అనే రైతు అన్నారు.
ఇంతకు ముందు ఏదైనా ఆపద వస్తే ఆవును అమ్మి డబ్బులు తెచ్చుకునే వారని, కానీ, ఇప్పుడు వాటిని కొనేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు.
పశువులు విపరీతంగా పెరిగిపోవడంతో పగటి పూటే కాదు, రాత్రి పూట కూడా పంటను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రిళ్లు కాపలా కోసం రైతులు ఐదు నుండి ఎనిమిది అడుగుల ఎత్తులో మంచెను నిర్మించుకుని వాటి మీద నుంచి పొలాలను గమనిస్తుండటాన్ని నేను స్వయంగా చూశాను.
ఓ రెండు గ్రామాలలోని రైతులతో కలిసి అర్ధరాత్రి పొలాల దగ్గరకు కూడా మేం వెళ్లాం. కరెంటు సరిగా లేకపోవడంతో పాము కాటుకు గురైన సంఘటనలు సర్వసాధారణంగా మారాయని రైతులు చెప్పారు.
అందుకే రాత్రిపూట రైతులు బృందాలుగా ఏర్పడి చేతిలో టార్చ్‌లు పట్టుకుని గస్తీకి వెళ్తుంటారు. సుమారు నాలుగు గంటల తరువాత, వారి గ్రామం నుంచి మరో గస్తీ బృందం వస్తుంది. తర్వాత వీరు ఇంటికి వెళ్లి కొన్ని గంటలు నిద్రపోతారు.
''మాకు వేరే మార్గం లేదు, పంటలు తినడానికి రాత్రిపూట పశువులు వస్తుంటాయి. వాటికి పొలంలో ఎక్కడి నుంచి ప్రవేశించాలో, ఎటు నుంచి పారిపోవాలో కూడా తెలుసు" అని 64 ఏళ్ల బిమలా కుమారి చెప్పారు. ఆమె కూడా రాత్రి పూట గస్తీకి వెళుతుంటారు.
పెద్ద పెద్ద నగరాల నుంచి, చిన్న గ్రామాల వరకు యూపీలో ఎక్కడ చూసినా పశువులే కనిపిస్తున్నాయి. మామూలుగా పెంచుకునే పశువులు కూడా వీధుల్లోకి రాగానే జనంపై దాడి చేస్తున్నాయి.
గోహత్యను నిషేధిస్తూ యూపీ ప్రభుత్వం ఏడాదిన్నర కిందట చట్టం చేసింది. దీన్ని ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

గోసంరక్షణ కేంద్రాలు
రాష్ట్రంలో 5,300లకు పైగా గోసంరక్షణ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో లక్షలాది పశువులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. వీటిలో చాలా పశువులు వీధుల్లో తిరుగుతున్నాయి. అయితే, బీజేపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సమీర్ సింగ్ మాత్రం దీనితో ఏకీభవించడం లేదు.
''మీరు వాటిని అనాథ పశువులు అనొద్దు. నిన్నటి వరకు అవి పాలిచ్చాయి. ఇప్పుడు ఇవ్వడం లేదని వాటిని తరిమికొట్టలేం'' అన్నారాయన. ఈ సమస్యకు పరిష్కారం కోసమే గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అయితే, గ్రౌండ్ లెవెల్లో రైతులు పరిస్థితి భిన్నంగా ఉంది.
మిల్కిపూర్‌కు చెందిన రాజేశ్ కుమార్ చైనీస్ ఫుడ్ అమ్మే బండి నడుపుతుంటారు. అలాగే వ్యవసాయం కూడా చేస్తారు. ''వారం, పదిరోజులకు ఒకసారి షాప్ మూసేసి పొలం దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. పశువులు రాకుండా పొలం చుట్టూ తాళ్లు కట్టాలి. ఇలా వారాకోసారి షాప్ మూసేయాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. కానీ ఏమీ చేయలేం'' అన్నారు.
ఆరు బయట తిరిగే పశువులన్నింటిని గోసంరక్షణ కేంద్రాలకు తరలించాలని, గోశాలల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ అది చెప్పినంత సులభం కాదు.
సాధారణ గోశాలలు, ప్రభుత్వ గోశాలలను అర్థం చేసుకోవడానికి, మేం అయోధ్యలోని షహాబాద్ గ్రామంలో నిర్మించిన 'వృద్ధ గో సంరక్షణ కేంద్రం'కు చేరుకున్నాము. మధ్యాహ్నం మూడు గంటల సమయం. ఈ భారీ గోశాల గేటుకు తాళం వేసి ఉంది.

అక్కడ పని చేసే వ్యక్తి భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. తర్వాత గ్రామ పెద్ద శతృఘ్న తివారీ వచ్చారు. ఈ గోశాల ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది.
''ఈ ప్రాంతంలో ఉన్న గోశాలలు సరిపోతాయి. మా దగ్గర రెండు వందల పశువులున్నాయి. కానీ, బయట ఇంకా ఏడొందల నుంచి వెయ్యి వరకు అనాథ పశువులు ఉన్నాయి'' అని శతృఘ్న తివారీ అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ అనాథ పశువుల వ్యవహారం ఎలక్షన్లలో ఎవరికి ఓటు బ్యాంకుగా మారుతుందన్నది ఫలితాలతోనే తేలే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం లభించక నిస్సహాయ స్థితిలో ఉన్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి.
80 ఏళ్ల రామ్ కలి మిశ్రా గత రెండేళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయన కూడా ఎద్దు దాడి బాధితుడే. ఈ మధ్య కాలంలో తన కొడుకు కరోనా వైరస్‌కు బలైన విషయం ఆయనకు తెలియదు.
ఇలాంటి కుటుంబాలకు ఎన్నికల మీద ఆసక్తి ఎప్పుడో పోయింది.
ఇవి కూడా చదవండి:
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డజన్ల కొద్దీ నిరసనకారులు
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












