కోజో మార్ఫో: ఆవు మాంసం కొట్టే కసాయి ఆర్టిస్టుగా ఎలా మారాడు

ఫొటో సోర్స్, JD MALAT GALLERY
- రచయిత, ఆండీ జోన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక్కప్పుడు మాంసం కొట్టే కసాయి పనిచేసిన కోజో మార్ఫో ఆవుల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆర్టిస్ట్‌గా మారారు.
"ఆవుల నుంచి నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఘనాలో మేము వాటితో పొలాలు దున్నుతాం. రెండు, మూడు ఆవులు ఉన్నవారికి అందమైన భార్య లభిస్తుంది. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఆవును దైవంగా కొలుస్తారు" అని కోజో మార్ఫో అంటారు.
ఘనాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన కోజో తన తల్లి, నానమ్మల దగ్గర పెరిగారు. ఆయనకు చిన్నప్పటి నుంచే ఆవులపై మమకారం ఉండేది.
ఉద్యోగ వేటలో న్యూయార్క్ చేరుకున్నాక ఆ ఇష్టం మరింత పెరిగింది. కానీ, అక్కడ కోజో మాంసం కొట్టే కసాయి పనిలో చేరవలసి వచ్చింది.
"నాకు మాంసం గురించి పెద్దగా తెలీదు. నాకన్నీ తెలుసని మాయ మాటలు చెప్పి ఉద్యోగంలో చేరాను. అక్కడ గోడలపై మాంసాన్ని ఎలా కొట్టాలో తెలియజెప్పే బొమ్మలు ఉండేవి. అవి నాకు గైడులాగ ఉపయోగపడేవి. అయినా సరే నేను మా బాస్‌కి దొరికిపోయేవాడిని. మాంసం కొట్టకుండా కస్టమర్లతో కబుర్లు చెప్తూ కూర్చునేవాడిని" అని 41 ఏళ్ల కోజో వివరించారు.
ఒకప్పుడు కోజో ఆవు మాంసాన్ని కొట్టి అమ్మి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు ఆ ఆవుల బొమ్మలు ఆయన కాన్వాస్‌పై చేరి రావలసినదాని కన్నా మూడు రెట్లు ఎక్కువ సంపాదించి పెడుతున్నాయి.
కోజో పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రశంసలు అందుకున్నాయి. లండన్‌కు చెందిన ఆస్పినల్ బ్రాండ్ తయారుచేసే స్కార్ఫ్‌లు, షాల్స్‌పై కోజో బొమ్మలు కొలువుదీరాయి.

ఫొటో సోర్స్, KOJO MARFO/JD MALAT GALLERY
'మనుషులందరినీ ఒక్కచోటుకు తేవాలి'
ఆవులు కాకుండా కోజో అమితంగా ఇష్టపడేది, గౌరవించేది స్త్రీ శక్తిని. పిల్లలను పెంచడంలో తల్లి పాత్ర కోజోకు బాగా తెలుసు. మాతృప్రేమ కూడా ఆయన పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
కోజో పెయింటింగ్స్‌లో ఆఫ్రికా సంస్కృతి ఉట్టిపడుతుంది. ఆఫ్రికాలో ఆక్రా నుంచి నాలుగు గంటల దూరంలో ఉన్న క్వాహూ కొండ ప్రాంతంలో కోజో పెరిగారు. అక్కడి గ్రామీణ నేపథ్యం ఆయన పెయింటింగ్స్‌లో కనిపిస్తుంటుంది.
కానీ, జాగ్రత్తగా గమనిస్తే, ఆయన వేసే అన్ని చిత్రాల్లోనూ వివిధ ఖండాల సంస్కృతులు మిళితమై ఉంటాయి. బ్రిటన్‌లో పునరుజ్జీవనోద్యమం నాటి కాలర్లు, భారతదేశానికి చెందిన గోమాతలు, ఘనాలో సంతానోత్పత్తి కలిగిస్తాయని నమ్మే బొమ్మలు.. ఇలా ఎన్నో వైవిధ్యమైన అంశాలు కోజో పెయింటింగ్స్‌లో దర్శనమిస్తాయి.
"మనం కరిగిపోతున్న ఓ పెద్ద కుండలో జీవిస్తున్నాం. ఆ కుండకు చాలా పగుళ్లు ఉన్నాయి. కానీ, మనుషులందరినీ ఒక్కచోటుకు తీసుకు రావాలన్నదే నా ఉద్దేశం. అందరూ వారి వారి సంస్కృతులనూ, చిహ్నాలను నా చిత్రాల్లో చూడగలగాలి" అని కోజో అంటారు.

ఫొటో సోర్స్, KOJO MARFO/JD MALAT GALLERY
'నా బొమ్మల ద్వారా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి'
కోజో చిన్నప్పుడు వాళ్ల ఊర్లో ఉన్న లైబ్రరీలో పికాసో చిత్రాలు, ఆక్రా శిల్పులు చెక్కే బొమ్మలు చూస్తూ పెరిగారు. అయితే, ఆయన సృజనాత్మకత వాళ్ల ఊరికి దగ్గరగా ఉన్న నది ఒడ్డు దాటలేదు.
"నేను డాక్టర్ లేదా అకౌంటెంట్ కావాలి అనుకునేవాడిని. కానీ, మా ఊర్లో నది ఒడ్డుకు వెళ్లి బంకమన్ను, చిన్న చిన్న పండ్లు ఏరుకుని వచ్చేవాడిని. వాటిని చిదిమి రంగులుగా మార్చేవాడిని. కాగితం మీద వేసలీన్ రాసి, దాన్ని పత్రికల్లో, బొమ్మల పుస్తకాల్లో ఉండే బొమ్మలపై ఉంచి అచ్చు గుద్దేవాడిని. ఘనా విడిచి వెళ్లిన తరువాతే నేను ఆర్ట్ గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను" అన్నారు కోజో.
కోజో న్యూయార్క్‌లో కొంతకాలం బుచర్(మాంసం కొట్టే వ్యక్తి)గా పని చేశాక బ్రిటన్ వెళిపోయారు. అక్కడ తన అత్త నడిపే సరుకుల దుకాణంలో చేరారు.

ఫొటో సోర్స్, KOJO MARFO/ASPINAL OF LONDON
పెయింటింగ్స్‌పై ఆసక్తి
2000లలో కోజో బొమ్మలు వేయడం దాదాపు మానేశారు. కానీ, ఆ తరువాత మళ్లీ ఆయనకు పెయింటింగ్‌పై ఆసక్తి పెరిగింది.
"తండ్రి లేకుండా, తల్లి దగ్గర మాత్రమే పెరిగిన పిల్లలు ఎంత సానుకూల దృక్పథంతో ఉంటారో చూపించాలనిపించింది. కొండ ప్రాంతాల్లో ఆడవాళ్లు కష్టించి పనిచేస్తారు. నేను ఇద్దరు స్త్రీల దగ్గరే పెరిగాను. అధికారం పురుషుల చేతిలో ఉంటుంది. మహిళలు ఎల్లప్పుడూ బాధితులే అని ఓ స్త్రీ వాది నాతో అన్నారు. కానీ, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అధికారం మహిళల చేతుల్లోనే ఉంటుంది" అని కోజో వెల్లడించారు.
శారీరక అందానికి సంబంధించిన అంశాలపై కూడా కోజో దృక్కోణం వేరుగా ఉంటుంది. ఆయన బొమ్మల్లో మనుషుల ముఖాలపై, శరీరంపై బొల్లి ఉంటుంది.
"అందమైన చిత్రాలు గీయడం నా ఉద్దేశం కాదు. నా బొమ్మల ద్వారా ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడాలి. అదే నా లక్ష్యం" అంటారు కోజో.
అదే విధంగా, కోజోకు మతం, మత చిహ్నాలపై కూడా ఆసక్తి ఉంది.
"యూరోపియన్ల చిత్రాలకు, ఆఫ్రికన్ల చిత్రాలకు వ్యత్యాసం ఉంటుంది. ఇతరులు వాటిని చూసే దృష్టి కోణంలో కూడా తేడా ఉంటుంది. ఆఫ్రికన్లు అందమైన స్త్రీ, పురుషుల చిత్రాలు గీయవచ్చు. ప్రకృతి చిత్రాలు గీయవచ్చు. కానీ, ఆధ్యాత్మికత లేదా వూడూ (ఆఫ్రికా క్షుద్రవిద్యలు) గురించి మాట్లాడితే మాత్రం 'అమ్మో, వీడు ప్రమాదకారి ' అన్నట్లు చూస్తారు. మనకు బాగా సన్నిహితులు కూడా 'ఇలాంటివి ఎలా గీస్తావు? ' అన్నట్లు చూస్తారు" అని కోజో చెప్పారు.

ఫొటో సోర్స్, JD MALAT GALLERY
ప్రపంచ ఖ్యాతి
కోజో మొదట్లో తన చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్మేవారు. ఓసారి 'ఐసొలేషన్ మాస్టర్డ్ ' అనే ఒక పోటీకి తన చిత్రాలను పంపారు. కోజో చిత్రాలు అక్కడి న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకర్షించాయి. బ్రిటన్‌ను చెందిన ప్రముఖులు కొందరు కోజో చిత్రాలు కొనుక్కున్నారు. దాంతో కోజోకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. ఆయన వేసిన చిత్రాలన్నీ అమ్ముడుపోయాయి.
"క్వాహూలో జీవితం అంత సులువు కాదు. మనంతట మనం పూనుకుని ఒక ఉపాధి కల్పించుకోవాలి. ఘనాలో క్వాహూ నుంచి వచ్చినవాళ్లు ఎవరికైనా డబ్బు పిచ్చి ఉంటుంది అంటారు. కానీ, నా జేబులో ఉన్న డబ్బుతో సంతృప్తి పడాలనే సంస్కారం నాకు అలవడింది" అని కోజో చెప్పారు.
అయితే, ఇప్పటికీ కోజోకు కసాయిపని మీద ఆసక్తి పోలేదు.
"మాంసం కొట్టే పని మీద నాకు ఇంకా ఆసక్తి ఉంది. ఎప్పటికైనా ఆ పనిలో నేర్పు సంపాదించాలి" అంటారు కోజో మార్ఫో.
ఇవి కూడా చదవండి:
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, భయంతో భవనం మీంచి బిడ్డను కిందకు విసిరేసిన తల్లి
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- టిగ్రే రెబెల్స్ మాస్టర్ మైండ్: ఇథియోపియా రాజధానిని ఎలా స్వాధీనం చేసుకున్నారంటే
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- బ్లాక్ రైనో విమానం ఎక్కి 4 వేల మైళ్లు ఎందుకు ప్రయాణిస్తోందో తెలుసా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








