ఘనా: కంప్యూటరే లేని బడులలో కంప్యూటర్ విద్య ఎలా నేర్పిస్తున్నారు?

వీడియో క్యాప్షన్, ఘానా దేశంలో పేద విద్యార్దుల పాఠశాలలో ఉన్న ఇబ్బందులు

టీచర్లు ఎప్పుడూ సృజనాత్మకంగా పాఠాలు బోధించాలని ఆశిస్తాం. ఘనా లోని ఒక ఉపాధ్యాయుడు ఈ విషయంలో పరిమితుల్ని తిరగ రాశారు.

ఆయన బ్లాక్ బోర్డ్ మీద కంప్యూటర్ స్క్రీన్ బొమ్మలు వేస్తే.. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వ్యాపించాయి. ఘనా విద్యా రంగానికి అదొక నిదర్శనం అనుకోవచ్చా?

ఘనా లోని ఒక పేద విద్యార్దుల పాఠశాలలో చెప్తున్న కంప్యూటర్ పాఠం ఇది. అక్కడ కంప్యూటర్లు లేవు. అందుకే, టీచర్ ఏదో కొత్తగా చేయక తప్పలేదు.

రిచర్డ్ అకోటో, ఈ స్కూల్లో గత ఆరేళ్లుగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని బోదిస్తున్నారు.

ఆ పాఠాలు బోధించడానికి బ్లాక్ బోర్డ్, చిత్రకళా నైపుణ్యం మీద ఆధార పడాల్సి వస్తోంది.

"పిల్లలు, కంప్యూటర్ పరికరాలను గుర్తించేందుకు సాయపడుతుందని నేనలా బొమ్మలు వెస్తూ పాఠం చెప్తున్నాను. అది కొన్ని సార్లు పెద్ద సవాల్ గా ఉంటుంది. ఎందుకంటే, మనం అలా బొమ్మలు గీసి, పిల్లలు కూడా అలానే గీయాలని అనుకుంటాం. కానీ వారి దగ్గరకి వెళ్లి గమనిస్తే, వారు మరోలా చేస్తూ ఉంటారు. దానికి కారణం వారికి ఆ పరికరాలు నిజంగా ఎలా ఉంటాయో తెలియకపోవడమే."

"ఈ పిల్లలందరూ కంప్యూటర్స్‌లో తమ అంతిమ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. అప్పుడే వారు తరువాతి తరగతిలోకి అడుగు పెట్టగలరు. ఇదే అసలైన సవాలు."

"మా టీచర్లు ఇవి చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. మేము కూడా వీటిని నేర్చుకోవడానికి కష్టపడుతున్నాం. ఎందుకంటే మా దగ్గర కంప్యూటర్లు, టెక్స్ట్ బుక్స్ లేవు."

ఘనా విద్యార్థులకు ఎన్నో ఆశలున్నాయి. అక్కడ 1995 నుంచి, ప్రాథమిక విద్య ఉచితం. అలాగే సెకండరీ విద్యను గత ఏడాది నుంచి ఉచితంగా అందిస్తున్నారు. అది ఎక్కువ అడ్మిషన్లు నమోదవడానికి సాయపడుతుంది. కానీ ఇప్పుడు ఆ విద్యలో నాణ్యతను ఎలా పెంచాలన్నది మరో సమస్య.

"ఘనా ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. టెలివిక్ అనే సంస్థ, దాదాపు 240 సీనియర్ హై స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ను నిర్మిస్తున్నారు. మాకు ఈ-ట్రాన్స్ ఫార్మ్ ప్రోగ్రాం కూడా ఉంది. దాంతో మరో 240 స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తారు. వీటితో మాకు ఈ అంశాల్లో మెరుగయ్యే అవకాశం లభిస్తుంది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది."

అయితే, ఇలాంటి కార్యక్రమాలు, ఘనాలోని మారుమూల గ్రామాలకు చేరే వరకు, అకోటో వంటి టీచర్లు ఇలానే వివిధ వినూత్న మార్గాల్లో పిల్లలకు పాఠాలు చెప్తూనే ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)