తెలంగాణలో ఆవులను పీడిస్తున్న వైరస్... ‘ఇది సెకండ్ వేవ్’

- రచయిత, దీప్తీ బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో పశువులపై దాడి చేస్తున్న ఓ వైరస్.. స్థానిక పాడి రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆవులు, ఎద్దుల్లో ఈ వైరస్ ఉనికి కనిపిస్తోందని, దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటోందని పశు వైద్యులు, పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యాధి సోకిన పశువుల్లో చర్మంపై చిన్న గడ్డలు ఏర్పడి అవి రంధ్రాలుగా మారి, వాటి నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని... లక్షణాలు బయట పడేందుకు ఐదు నుంచి ఏడు రోజులు సమయం పడుతుందని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి గురించి పశువైద్య, పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ సభావత్ రామచందర్ బీబీసీతో మాట్లాడారు. ఆవులు, ఎద్దుల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధిని 'లంపీ స్కిన్ వ్యాధి' అంటారని, క్యాప్రీపోక్స్ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని తెలిపారు.
"ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ వ్యాధి కొన్ని జిల్లాల్లో ప్రబలడాన్ని మేం గమనించాం. అయితే, గత నెల రోజులుగా ఈ వ్యాధి సెకండ్ వేవ్ మొదలైంది. ఇది పాత వ్యాధే అయినప్పటికీ, ఈసారి దీని వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశమంతటా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. ఒడిశా రాష్ట్రంలోనూ ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంది. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇది కనిపిస్తోంది" అని సభావత్ రామ చందర్ చెప్పారు.
ఈ రోగం వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ పశువుల మరణాలు తక్కువగానే ఉన్నాయని అధికారులు అంటున్నారు. "సాధారణంగా ఈ వ్యాధి వల్ల కలిగే మరణాల సంఖ్య ఒకటి నుంచి ఐదు శాతం ఉంటుంది. కానీ, తెలంగాణలో మరణాల రేటు 0.3 శాతంగానే ఉంది. రోగ వ్యాప్తి మాత్రం 2.4 శాతంగా ఉంది" అని సభావత్ రామాచందర్ తెలిపారు.

ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎలాంటి మందూ లేదు. కేవలం సెకండరీ లక్షణాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు పశు వైద్యులు. వ్యాధి సోకిన పశువులు కోలుకోవడానికి పది నుంచి పన్నెండు రోజులు పడుతోందని వారు చెబుతున్నారు.
అయితే వ్యాధి వ్యాప్తి నివారణ కోసం ముందస్తు చర్యగా వ్యాధి సోకిన పశువులు ఉన్న ప్రాంతంలోని మిగతా పశువులకు 'గోట్ పాక్స్' అనే టీకాలు వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఎద్దులు కలిపి 42,32,539 ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి దాకా సుమారు 92,657 పశువులకు ఈ వ్యాధి సోకింది. అందులో 2,282 పశువులు ఇంకా కోలుకుంటున్నాయి. అయితే మరణించిన పశువుల్లో దూడల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇప్పటి వరకు 733 పశువులు మరణించగా, వాటిలో దూడల సంఖ్య 501గా ఉందని అధికారులు బీబీసీతో చెప్పారు. అధికారిక సమాచారం ప్రకారం, హైదరాబాద్, మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యాధి ప్రభావం ఉంది. నారాయణపేట్, మహబూబాబాద్, వరంగల్ (గ్రామీణ), వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జనగామ జిల్లాలలో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది.
‘‘ఈ మాయదారి వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎన్నడూ లేనంతగా పశువులను ఛిన్నాభిన్నం చేస్తోంది’’ అంటూ రైతులు వాపోతున్నారు.
సంగారెడ్డికి చెందిన ఓ రైతు ఈ విషయం గురించి బీబీసీతో మాట్లాడారు. తన పేరును బయటకు వెల్లడించవద్దని ఆయన కోరారు. తమ ఐదు ఆవుల్లో రెండింటికి పది రోజల క్రితం ఈ వ్యాధి సోకిందని ఆయన తెలిపారు.

"వైరస్ సోకిన పశువులను వేరుగా ఉంచాలని పశు వైద్యులు సూచిస్తున్నారు. అయితే, దానికి మా దగ్గర ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఈ వ్యాధికి ప్రస్తుతానికి మందులు లేవు. యాంటీబయాటిక్‌తో సరిపెడుతున్నారు. అవి కూడా ప్రభుత్వ వైద్యశాలలో లేవు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనాల్సి వస్తోంది. ఒక్క పశువుకి వెయ్యి రూపాయలు ఖర్చు ఆవుతోంది. ఒక దాని నుంచి మరొక దానికి సులువుగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉండడంతో ఆవులను విడివిడిగా ఎలా ఉంచాలో, ఎలా మేపాలో తెలియడం లేదు. చర్మంపై పడ్డ రంధ్రాలు మీద పురుగులు రావడం, ఈగలు వాలడంతో అది వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక్కో పశువు దగ్గర ఒక్కో మనిషి కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కాకులు పుండ్లను పొడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.
అయితే, ఇప్పుడు ఆ వ్యాధి తీవ్రత తగ్గుతోందని ఆయన అంటున్నారు.
కొన్ని జిల్లాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మందులకు కొరత ఉన్నది వాస్తవమేనని ఓ జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి బీబీసీతో అన్నారు.
"సాధారణంగా మందులు స్టాక్‌లో ఉండాలి. కానీ, ఈసారి కొరత ఏర్పడింది. రాష్ట్ర అధికారులు కొరత గుర్తించి నిధులు విడుదల చేశారు. అయినా, కొన్ని జిల్లాల్లో కొరత కొనసాగుతోంది. ఈ వ్యాధి ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. అక్కడి నుంచి ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు వ్యాపించి, ఇప్పుడు దక్షిణ జిల్లాకు వ్యాపిస్తోంది. అయితే ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేకపోవడం కాస్త సంతోషించదగ్గ విషయం" అని ఆ అధికారి తెలిపారు.
దాదాపు అన్ని జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి చికిత్సకు, ముందు జాగ్రత్తగా వేస్తున్న టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు ఇప్పటికే విడుదల చేసిందని పశువైద్య, పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ సభావత్ రామాచందర్ వెల్లడించారు.
అయితే, పశువైద్య, పశుసంవర్థక శాఖలోని జిల్లా కేంద్రాలకు నిధుల కేటాయింపులను మరింత పెంచింతే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- కోవిడ్ వేళ బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా పెరిగాయా?
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- భారత్‌కు కరోనావైరస్ వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








