‘ఆవు పేడ చిప్‌’ను ఫోన్‌కు అతికిస్తే, రేడియేషన్ రాదా?

ఆవు పేడ

ఫొటో సోర్స్, Getty Images

ఆవు పేడకు మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను నిరోధించే లక్షణాలు ఉన్నాయని, దానితో తయారుచేసిన చిప్‌ను మొబైల్ ఫోన్లకు అతికించి వాడుకోవాలని జాతీయ ఆవుల కమిషన్ ఛైర్మన్ వల్లభాయ్ కటారియా ప్రజలకు సూచించారు.

ఈ ఆవు పేడ చిప్‌లు వాడితే, రాబోయే రోజుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కటారియా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాగానే చర్చ జరిగింది.

ఆవు పేడ ఇలా మొబైల్ రేడియేషన్‌ను నిరోధిస్తుందన్నదానికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతూ చాలా మంది ఆయన్ను ఎద్దేవా చేశారు. ఇంకొందరు ఆయన చెప్పింది నిజమేనని వెనకేసుకువచ్చారు.

ఇంతకీ ఏంటీ ఆవు పేడ చిప్?

గుజరాత్‌లో గో సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ సంస్థ ఈ 'చిప్‌'ను తయారుచేసింది. దీన్ని ఫోన్ వెనుకవైపు పెట్టుకుంటే, రేడియేషన్ నుంచి రక్షణ లభిస్తుందని ఆ సంస్థ చెబుతోంది.

50 నుంచి 100 రూపాయల ధరకు వీటిని విక్రయిస్తున్నారు.

దేశవ్యాప్తంగా మరో 500 గో సంరక్షణ కేంద్రాలు కూడా ఈ రేడియేషన్ నిరోధక చిప్‌లను తయారుచేస్తున్నాయని కటారియా చెప్పారు.

ఏడాది కాలంగా తాము ఈ చిప్‌లు తయారు చేస్తున్నామని గుజరాత్‌కు చెందిన సదరు సంస్థ బీబీసీతో చెప్పింది. అయితే, చిప్ పనితీరుపై తాము శాస్త్రీయంగా పరీక్షలు గానీ, ప్రయోగాలు గానీ నిర్వహించలేదని తెలిపింది.

''ఆవు పేడకు మరికొన్ని పదార్థాలను కలిపితే రేడియేషన్ నుంచి రక్షణ కల్పించవచ్చని ఆయుర్వేదంలో ఉంది. అయితే, మేం దీనిపై ప్రయోగాలు, పరీక్షలు చేయలేదు'' అని గో సంరక్షణ కేంద్రం నడుపుతున్న దాస్ పాయ్ అన్నారు.

నిజంగా ఆ గుణాలున్నాయా?

ఆవు పేడకు రేడియేషన్‌ను నిరోధించే లక్షణాలు లేవు. ఇలాంటి ప్రచారం జరగడం ఇదేమీ మొదటిసారి కాదు.

2016లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)‌కు అనుబంధంగా నడుస్తున్న ఓ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న శంకర్ లాల్ ఆవు పేడ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఆల్ఫా, బీటా, గామా... ఇలా మూడు రకాల రేడియేషన్లను గ్రహించే శక్తి ఆవు పేడకు ఉందని కూడా ప్రచారం జరిగింది.

ఆవు పేడకు ఇలాంటి అద్భుత లక్షణాలుండటం వల్లే గ్రామాల్లో ఇళ్ల గోడలకు ఆవు పేడ పూస్తారని, వాటితో ఇళ్లు అలుకుతారని ఈ వాదనను సమర్థించేవారు చెప్పుకొచ్చారు.

శాస్త్రవేత్తలు, పరిశోధకులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ఆవు పేడకు రేడియేషన్‌ను నిరోధించే లక్షణం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

''ఆవు పేడలో ఏమేం పదార్థాలు ఉంటాయో మనకు తెలుసు. వాటికి రేడియేషన్‌ను గ్రహించే గుణమేదీ లేదు'' అని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫిజిసిస్ట్ గౌతమ్ మేనన్ బీబీసీతో చెప్పారు.

రేడియేషన్‌ను నిరోధించేందుకు ఎక్కువగా లెడ్ (సీసం)ను వాడుతుంటారు. వైద్య పరమైన స్కానర్లు, రేడియేషన్ చికిత్సలు, అణు విద్యుత్ రంగంలో, పరిశ్రమల్లో దీన్ని వినియోగిస్తుంటారు.

''గోడలకు ఆవు పేడను పూస్తే, వేడి ప్రసారం కాకుండా ఉంటుంది. ఆవు పేడ విరివిగా అందుబాటులో ఉండేది కాబట్టి దాన్ని వాడేవారు. రేడియేషన్‌తో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు'' అని గౌతమ్ మేనన్ అన్నారు.

ఆవు పేడ

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఫోన్ల నుంచి రేడియేషన్‌ వస్తుందా?

మొబైల్ ఫోన్లు ఎక్కువ సేపు వాడితే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయని... క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని కొన్నేళ్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.

అయితే, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం మొబైల్ ఫోన్ల రేడియేషన్ వల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.

''సెల్‌ఫోన్లను వాడుతున్నప్పుడు చాలా స్వల్ప స్థాయిలో నాన్-అయానైజింగ్ రేడియేషన్ వెలువడుతుంది. దాని వల్ల వేడెక్కడం తప్పితే, శరీరంపై ఏ ఇతర ప్రభావమూ కనిపించడం లేదు. మొబైల్ నుంచి వచ్చే శక్తి చాలా తక్కువ. మనుషులకు దాని నుంచి ముప్పు ఉందన్నదానికి ఆధారాలు లేవు'' అని బ్రిటన్‌కు చెందిన మెడికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మాల్కోమ్ స్పెరిన్ చెప్పారు.

Banner
Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)