స్మార్ట్‌ఫోన్లను వాడకూడదని వీళ్లు ఎందుకు అనుకుంటున్నారు

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుజానే బీర్న్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల నుంచి 'డుల్సీ కౌలింగ్‌' బయటపడ్డారు.

36 ఏళ్ల డుల్సీ కౌలింగ్‌ గత ఏడాది చివర్లో తన హ్యాండ్‌సెట్‌ను వదిలించుకోవటం వల్ల తన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. క్రిస్మస్ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేవలం కాల్స్, టెక్స్ట్ సందేశాలు మాత్రమే వచ్చే పాత నోకియా ఫోన్‌కి మారుతున్నట్లు వివరించారు.

తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే.. తన ఇద్దరు పిల్లలతో ఒక రోజు పార్క్‌కు వెళ్ళడమే అంటూ ఆ క్షణాలను ఆమె గుర్తుచేసుకున్నారు.

'ప్లేగ్రౌండ్‌లో పిల్లలను వదిలేసి మొబైల్‌లో నేను మునిగిపోయాను. కాసేపటి తర్వాత పిల్లల గురించి ఆలోచించగానే ఆందోళనగా అనిపించింది. అక్కడ నేను మాత్రమే కాదు 20 మంది వరకు తల్లిదండ్రులు ఉన్నారు. వా‌రందరూ తమ పిల్లలను పట్టించుకోకుండా దూరంగా ఫోన్‌లకు అతుక్కుపోయి ఉన్నారు'' అని ఆమె వివరించారు.

డుల్సీ కౌలింగ్‌

ఫొటో సోర్స్, Dulcie Cowling

ఫొటో క్యాప్షన్, డుల్సీ కౌలింగ్‌

లండన్‌కు చెందిన 'అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ''హెల్ యే''లో క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఎంఎస్ కౌలింగ్‌కు.. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తన స్మార్ట్‌ఫోన్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన వచ్చింది.

'ఫోన్‌ వల్ల నేను జీవితంలో ఎంత సమయం వృథా చేశాను? ఇంకా నేను ఏమేం చేయగలను? అనే దాని గురించి ఆలోచించాను. ప్రతి విషయంలోనూ మనం ఫోన్‌తో కనెక్ట్ కావడం వల్ల చాలా వరకు ఏదైనా ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాం. మెదడు కూడా ఏదైనా అంశాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటోంది 'అని ఆమె వివరించారు.

ఆమె తన స్మార్ట్‌ఫోన్‌ను విడిచిపెట్టడం ద్వారా లభించిన సమయాన్ని చదవడానికి , ఎక్కువగా నిద్ర పోవడానికి ఉపయోగించాలని యోచిస్తున్నారు.

బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో 9 మంది దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ఈ సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ఇలానే ఉండవచ్చు. ఇటీవల ఒక అధ్యయనంలో సగటు వ్యక్తి రోజుకు 4.8 గంటల పాటు మొబైల్‌ చూస్తున్నారని వెల్లడైంది.

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

అలెక్స్ డనెడిన్ రెండేళ్ల క్రితం నుండి తన స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా పెట్టారు.

'మనం ఈ పరికరాలకు బానిసలుగా మారిపోయాం. అవి మన జ్ఞానాన్ని మందగించేలా చేస్తున్నాయి. మనకు తట్టే ఎన్నో ఆలోచనలను అవి అడ్డుకుంటున్నాయి'' అని పరిశోధకుడు, సాంకేతిక నిపుణుడైన అలెక్స్ వివరించారు.

స్కాట్లాండ్‌‌కు చెందిన అలెక్స్, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మరొక కారణం కూడా ఉంది. మొబైల్స్ పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తాయని అని చెప్పారు.

''మనం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తూ చాలా మొత్తంలో శక్తిని వృథా చేస్తున్నాము' అని ఆయన చెప్పారు.

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం మానేసినప్పటి నుండి నేను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం అలెక్స్ దగ్గర పాత మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్‌లైన్ కూడా లేదు. వీటికి బదులుగా అతను తన ఇంటి కంప్యూటర్‌లో ఈమెయిల్‌ ద్వారా మాత్రమే ఇతరులను కాంటాక్ట్ అవుతున్నారు.

''నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నాను. మొబైల్‌తో అనుసంధానమైన నా ఆలోచనల నుండి విముక్తి పొందాను. ఈ టెక్నాలజీలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి మన జీవితాలను నాశనం చేస్తున్నాయి''అని ఆయన వివరించారు.

బర్మింగ్‌హామ్‌కు చెందిన 53 ఏళ్ల ఉపాధ్యాయురాలు, రచయిత 'లిన్నే వోయిస్' భిన్నమైన దారిలో వెళ్తున్నారు. ఆమె ఆరు సంవత్సరాల విరామం తరువాత గత ఆగస్టు నుండి మళ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ప్రారంభించారు.

కరోనా మహమ్మారి కారణంగా రెస్టారెంట్‌లలో క్యూఆర్ కోడ్‌లు ఉపయోగించాల్సిన అవసరం ఉండటం, దానితో పాటు ప్యారిస్‌లో నివసించే తన కుమార్తెలలో ఒకరితో మాట్లాడేందుకు అయిష్టంగానే మళ్లీ స్మార్ట్‌ఫోన్‌ను కొనవలసి వచ్చిందని ఆమె చెప్పారు.

వీలైతే స్మార్ట్‌ఫోన్‌ను మళ్లీ పక్కన పెట్టేయాలని ఆమె యోచిస్తున్నారు. 'మహమ్మారి తర్వాత ఎల్లా [ఆమె పెద్ద కుమార్తె] విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను మళ్లీ దానిని పక్కన పెట్టేస్తా. ఇది వ్యసనంలా అనిపిస్తుంది, కదా?'' అని ఆమె అన్నారు.

లిన్నె వోక్ 2016లో మొదటిసారిగా తన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం మానేసినప్పటి నుండి ఆమె మొబైల్ తక్కువగా వినియోగించేలా తన కుమార్తెలను కూడా ప్రోత్సహిస్తున్నారు.

''వారు ఫోన్లకు అతుక్కుపోయేవారు. వారి ఫోన్ వాడకాన్ని నియంత్రించడం కోసం నేను ఫోన్‌ను వదిలించుకోవడమే ఏకైక మార్గం అని అనుకున్నాను. నా ఆలోచన వల్ల మా పిల్లల ప్రవర్తనలో ఎన్నో మార్పులను చూశాను'' అని ఆమె చెప్పారు.

లిన్నె వోక్

ఫొటో సోర్స్, Lynne Voyce

ఫొటో క్యాప్షన్, లిన్నె వోక్

అనేక సమస్యలు..

నిద్ర సరిగా పట్టక పోవడం, ప్రశాంతంగా లేకపోవడం, ఏకాగ్రత ఉండకపోవడానికి సాంకేతిక పరికరాల వినియోగంతో బలమైన సంబంధం ఉందని 'ది ఫోన్ అడిక్షన్ వర్క్‌బుక్ సైకోథెరపిస్ట్, రచయిత అయిన హిల్డా బుర్క్' చెప్పారు.

''చాలా మంది వారి ఫోన్‌లలో వచ్చే ప్రతి సమాచారాన్నీ చదవడంతోపాటు మరో నలుగురికి దాన్ని తెలియజేయాలనే అత్యుత్సాహం కలిగి ఉంటారు.''

' ఫోన్లకు వారు సరిహద్దులను నిర్దేశించలేకపోతున్నారు. ఫలితంగా వారు తమ ఇమెయిల్‌ను, సందేశాలను రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం నిద్రలేవగానే మొదటి పనిగా చెక్ చేయవలసి వస్తోంది' అన్నారు.

స్మార్ట్‌ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

ఉపాయాలూ ఉన్నాయి

స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని మీరు ఆందోళన చెందుతుంటే, మీ వినియోగాన్ని తగ్గించడానికి ఉపాయాలు కూడా ఉన్నాయి.

మొబైల్ స్క్రోలింగ్‌ను తగ్గించడానికి కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి.

ఉదాహరణకు ' ఫ్రీడమ్' యాప్‌తో కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్‌లను తాత్కాలికంగా బ్లాక్ చేయొచ్చు. 'ఆఫ్ ది గ్రిడ్' యాప్ కూడా ఇలానే పనిచేస్తుంది.

మొదట స్మార్ట్‌ఫోన్‌లో ఎంత సమయం గడుపుతున్నారో పర్యవేక్షించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని 'బుర్క్' చెప్పారు.

'మీరు ఫోన్‌లో ప్రతిరోజూ ఎంత సమయం వెచ్చిస్తున్నారో తెలుసుకోవడం ప్రారంభిస్తే అది గొప్ప మార్పుకు దారి తీస్తుంది.'

'మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, లేదా ఇంట్లో వదిలేసి వెళ్లడం, ఫోన్‌ను మళ్లీ ఉపయోగించాలనుకునే టైంను క్రమ క్రమంగా తగ్గించుకుంటూ పోవడం లాంటి పనులు చేయాలి' అని ఆమె సలహా ఇచ్చారు.

చివరగా మీకు ఎక్కువ సమయం ఉంటే.. ఏం చేయాలనుకుంటున్నారో, మీ లక్ష్యాని సూచించే చిత్రం లేదా పదాన్ని మీ ఫోన్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకోవాలని ఆమె సిఫార్సు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)