ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆదాయం పెరిగిందా? సామాజిక, ఆర్థిక సర్వే ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ 2019-20ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో ప్రధానాంశాలను ప్రభుత్వం వెల్లడించింది.
అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాలను, పథకాలను ఈ సర్వే నివేదికలో వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నవరత్నాలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించింది.
కాగా ప్రభుత్వం ప్రకటించిన ఈ గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సంక్షేమ లెక్కలు ఎలా ఉన్న అభివృద్ధి కనిపించలేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AP govt
ఇంతకీ నివేదికలో ఏముందంటే..
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్‌డీపీ రూ .9,72,782గా అంచనా వేశారు. 2018-19లో ఇది రూ .8,62,957 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది 12.73% వృద్ధి సాధించినట్టు నివేదికలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధి 8.16 శాతంగా ఉందని, అది దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉందని ప్రకటించారు.
అనుకూలమైన వాతావరణ పరిస్థితుల మూలంగా వ్యవసాయరంగంలో జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 18.96 శాతం పెరిగినట్లు ప్రకటించుకున్నారు. హార్టీకల్చర్ లో 11.67% పశుసంవర్థక శాఖలో 4.53% వృద్ధి చూపించారు.
2019-20లో సేవల రంగం 9.11% వృద్ధి రేటును సూచిస్తుంది.
తలసరి ఆదాయం పెరిగింది
2018-19లో ఏపీలో తలసరి ఆదాయం రూ .1,51,173గా ఉండగా ప్రస్తుతం అది రూ.1,69,519కి పెరిగినట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు.
జాతీయ తలసరి ఆదాయం రూ .1,34,432 కంటే ఏపీలో ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
నవరత్నాల పథకాల అమలును ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యారంగం: భారతదేశ సగటు అక్షరాస్యత శాతం 72.98 శాతం కంటే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా ఉంది. ఏపీలో అక్షరాస్యత శాతం 67.35% గా ఉంది. రాష్ట్రంలో అర్హత కలిగిన 42.33 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ. 15,000 చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు పేర్కొన్నారు. 'జగనన్న అమ్మ ఒడి' పథకంలో రూ. 6336.45 కోట్లు వ్యయం చేసినట్టు పేర్కొన్నారు.
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సర్వే నివేదికలో పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్: 'జగన్నన్న విద్యా దీవెన' పథకంలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులు మొత్తం 13.26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు మైనారిటీల ఫీజును తిరిగి చెల్లించారు. దానికోసం రూ .3329.49 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.
'జగన్న వసతి దీవెన' కింద 8.08 లక్షల అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనారిటీ విద్యార్థులకు రూ .2087 కోట్లు అందించారు.
జగన్నన్న గోరుముద్ద పథకం కింద రాష్ట్రంలో పాఠశాల పిల్లలకు నాణ్యమైన పోషకమైన భోజనం అందించడానికి 1,105 కోట్లు ఖర్చు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్య, ఆరోగ్యరంగం: వార్షికాదాయం రూ. 5లక్షల లోపు ఉన్న వారందరికీ ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. 144 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని నివేదికలో వెల్లడించారు. 2019-20లో 2.70 లక్షల మంది రోగులు ఈ సేవలను ఉపయోగించుకున్నట్లు నివేదిక పేర్కొంది.
పింఛన్లు: పెన్షన్ అర్హత వయస్సు 65 నుండి 60 సంవత్సరాలకు తగ్గించారు. జనవరి 2020లో 6.14 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. ప్రతి నెలా 54.68 లక్షల మంది పెన్షనర్లకు రూ.1320.76 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్లకు రూ. 2019-20లో 15,635 కోట్లు కేటాయించగా దానిని 2020-21లో 18,000 కోట్లకు పెంచారు.
రైతులకు: 'వైయస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్' కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 (పీఎం కిసాన్ యోజన నుంచి రూ .6000తో కలిపి) పెట్టుబడి మద్ధతు అందిస్తున్నాట్లు తెలిపారు. ఈ పథకంలో 46.69 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 6534 కోట్లు రైతులకు పంపిణీ చేశారు.
ఉద్యానవన పంటలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని... ఆయిల్ పామ్, బొప్పాయి, లైమ్, కోకో, టొమాటో మరియు మిరపకాయల ఉత్పాదకతలో మొదటి స్థానం, మామిడి, స్వీట్ ఆరెంజ్ & పసుపు వంటి పంటలలో రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.
జలయజ్ఞం: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన 54 ఇరిగేషన్ ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయని నివేదిక వెల్లడించింది.
హౌసింగ్, మద్య నియంత్రణలో ప్రగతి.. మత్సకార భరోసా, వైయస్ఆర్ చేయూత, ఆసరా పథకాల తీరునూ నివేదిక వెల్లడించింది.
నామినేటెడ్ పోస్టులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, దిశ బిల్లు, 3 రాజధానుల బిల్లు, పాలన వికేంద్రీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను ఈ నివేదిక ప్రస్తావించింది.

'సామాజిక ఆర్థిక సర్వేలో సమగ్ర దృష్టి లోపించింది'
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే ప్రధానాంశాలను పరిశీలిస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా కనిపించడం లేదని ఆర్థికరంగ నిపుణుడు పి.సతీష్ అభిప్రాయపడ్డారు.
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
''సంక్షేమం కోసం నవరత్నాలు అమలు చేస్తున్నారు. పథకాల అమలు మీద అభ్యంతరాలు లేవు. కానీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెడుతున్నట్టు కనిపించడం లేదు. పోలవరం గురించి ప్రస్తావన లేదు. 30వేల కోట్ల పునరావాసం అందించాలి. వారి మాట కూడా కనిపించడం లేదు'' అన్నారు.
''పాలన వికేంద్రీకరణ అంటున్నారు గానీ అమరావతి అభివృద్ధి మాటేమిటన్నది కూడా చెప్పలేదు. మూడు రాజధానులు సమానంగా అభివృద్ధి చేయాలంటే 50వేల ఎకరాల భూమి ఉన్న అమరావతిలో ప్రాజెక్టుల సంగతేమిటన్నది స్పష్టత లేదు'' అన్నారు.
'కరోనా సంక్షోభ పర్యవసానంగా వచ్చిన ఆర్థిక సమస్యలకు సమాధానమేదీ?'
''ఇక కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలకు సమాధానంగా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుందా అన్నది సందేహమే. వివిధ రూపాల్లో ప్రజలకు నగదు బదిలీ ద్వారా లబ్ది చేకూర్చి మార్కెట్ ని పునరుత్తేజం చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ అభివృద్ధి మీద తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంద''ని సతీశ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








