ఒమిక్రాన్-కోవిడ్ వ్యాక్సీన్: ‘చాలామందిలో టీకా ‘సైడ్ ఎఫెక్టు’లకు అసలు కారణం వ్యాక్సీన్ కాదు’

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత తలనొప్పి, ఒంటి నొప్పి, అలసట ఉంటున్నాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు.
కానీ, వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కనిపించే ఈ చిన్న చిన్న సమస్యలు వ్యాక్సీన్ తీసుకోవడం వల్లే ఏర్పడుతున్నాయా? లేదా ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని ముందే ఊహించుకోవడం వల్ల తలెత్తుతున్నాయా?
మూడొంతుల సమస్యలు 'నోస్‌బో ఎఫెక్ట్' వల్లనేనని బోస్టన్‌లో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో అనుబంధం ఉన్న బిఐడిఎంసి సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది.
చికిత్స కారణంగా ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయేమోనని రోగి ఊహించుకోవడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను నోస్‌బో ఎఫెక్ట్ అని అంటారు. ఈ సమస్యలు నిజానికి వ్యాక్సీన్ వల్ల కాదని ఈ అధ్యయనం చెబుతోంది.
నిజానికి ఎటువంటి మందు తీసుకోకపోయినా సెకండరీ లక్షణాలు కనిపించటం, వ్యాధి తీవ్రత ముదరడం లాంటివి వస్తాయని ఊహించుకోవడాన్ని ప్లేస్ బో ఎఫెక్ట్ అని అంటారు. నోస్ బో ఎఫెక్ట్ దీనికి మరొక కోణం.
వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలొస్తాయని ముందుగా తెలియడం వల్లే కొంత మంది రోగులు కొన్ని లక్షణాలతో సతమతమవుతారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని సార్లు ఈ ప్రతికూల లక్షణాలు పూర్తిగా ఊహించుకోవడం వల్ల మాత్రమే తలెత్తవు. కానీ, మరొకరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్న విషయాలను తెలియకుండానే వారికి అన్వయిస్తాం" అని జర్మనీలో క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ ఓన్ నెస్టోరియక్ చెప్పారు.
అయితే, ఈ ప్రతికూల ప్రభావాలకు, తీసుకున్న ఔషధాలకు సంబంధం లేకపోయినప్పటికీ, ఒక్కొక్కసారి ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిసే అవకాశముంది.
"కొన్ని రకాల ఔషధాలు తీసుకోవడం వల్ల కొత్త రకమైన లేదా ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు. లేదా ప్రతికూల ప్రభావాలు ముదిరే అవకాశం కూడా ఉంది" అని అన్నారు.
వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల వాపు, లేదా వ్యాక్సీన్ తీసుకున్న చోట చర్మం ఎరుపెక్కడం లాంటివి కూడా ఒక్కొక్కసారి వాటి గురించి ముందుగానే ఊహించుకోవడం వల్ల జరగవచ్చు. లేదా గతంలో తలెత్తిన ప్రతికూల ప్రభావాల వల్ల కూడా ఏర్పడవచ్చు అని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో అధ్యయనకర్త చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తిడి, ప్రతికూల అంచనాలు
వ్యాక్సీన్ తొలి డోసు తీసుకున్న తర్వాత 76% ప్రతికూల ప్రభావాలు, రెండవ డోసు తర్వాత 52% ప్రతికూల ప్రభావాలు నోస్ బో ఎఫెక్ట్ వల్లే కలుగుతాయని కోవిడ్‌పై జరిగిన 12 క్లినికల్ ట్రయల్స్‌లో సేకరించిన సమాచార విశ్లేషణ ఆధారంగా అధ్యయనకర్తలు తేల్చారు. ఈ ట్రయల్స్‌లో సుమారు 22,000 మంది పాల్గొన్నారు.
ఈ అధ్యయనం చిన్న పాటి ప్రతికూల ప్రభావాలపైనే దృష్టి పెట్టిందని గమనించాలి. రక్తం గడ్డకట్టడం, గుండె వాపు లాంటి పెద్ద సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదు.
అయితే, ఈ నోస్ బో ఎఫెక్ట్ గురించి తెలిసిన విషయాలు తక్కువే అయినప్పటికీ, వ్యాక్సీన్ పట్ల నెలకొన్న భయం, ఒత్తిడి చాలా రకాల సమస్యలకు కారణం అని అంటున్నారు.
"దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. కానీ, వ్యాక్సీన్ గురించి ప్రతికూల అంచనాలు పెట్టుకుని ఒత్తిడికి గురైతే, దాని వల్ల మరింత ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు" అని బెత్ ఇజ్రాయెల్ డీకొనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జూలియా హాస్ చెప్పారు. ఈమె కూడా ఈ అధ్యయన సహరచయత.

ఫొటో సోర్స్, Getty Images
తప్పించుకోవడం ఎలా?
కొన్ని రకాల సమస్యలు మనం ఊహించుకోవడం వల్ల వచ్చినవా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వాటి గురించి క్లినికల్ ట్రయల్స్‌కు వెలుపల తెలుసుకునే వీలు లేదు.
అయితే, వాటి వల్ల తలెత్తే లక్షణాలకు తగిన చికిత్స చేయవలసిన అవసరం కూడా ఉంది. అలసట వస్తే విశ్రాంతి తీసుకోవడం, తలనొప్పి, కీళ్లనొప్పులు వస్తే, దానికి తగిన మందులు తీసుకోవడం లాంటివి చేయాలి.
"ప్రతికూల లక్షణాలకు చికిత్స తీసుకోవడం అవసరం" అని హార్వర్డ్ యూనివర్సిటీలో నిపుణుడు, అధ్యయనానికి నేతృత్వం వహించిన టెడ్ కాప్ చుక్ చెప్పారు.
కొన్ని ప్రతికూల ప్రభావాలు పూర్తిగా వ్యాక్సీన్ వల్లేనని చెప్పలేం. అలాంటప్పుడు వాటికి చికిత్స వేరే విధంగా చేయాల్సి ఉంటుంది. వాటికి ఆందోళన చెందాల్సిన పని లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మనం చేయగలిగింది ఇంకేమైనా ఉందా?
ప్రతికూల సమాచారం గురించి ఆరోగ్య నిపుణులు తక్కువ సమాచారం ఇవ్వాలని చాలా మంది భావిస్తారు. అందువల్ల రోగి ఎక్కువగా ఏదో జరుగుతుందని ఊహించుకోవడం తగ్గుతుందని అంటారు.
కానీ, కాప్ చుక్, హాస్ కూడా ఈ అభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో ఏదైనా ఔషధం ప్రతికూల ప్రభావాల గురించి ముందుగానే తెలియచేయడం తప్పనిసరి. ప్రతికూల ప్రభావాల గురించి చెప్పడం కంటే, వారి నమ్మకాన్ని తగ్గించడం మరింత దారుణమైన విషయం" అని కాప్ ఛుక్ చెప్పారు.
నోస్ బో ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రతికూల ప్రభావం కూడా తగ్గే అవకాశముందని ఆయన అంటారు.
‘‘వైద్యులు ఎప్పుడూ సరైన సమాచారాన్ని నిజాయితీతో అందించాలి. ప్రజలకు పూర్తి సమాచారం తెలియచేయడం వల్ల ఒత్తిడిని, వ్యాక్సీన్ పట్ల ఉన్న ఆందోళనను తగ్గించవచ్చు" అని హాస్ అంటారు.
వ్యాక్సీన్ ప్రతికూల ప్రభావాల గురించి తెలియచేసే బ్రోచర్ పైనే నోస్ బో ఎఫెక్ట్ గురించి కూడా పొందుపరచాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













