Dolo-650 ఎలా పుట్టింది? 30 ఏళ్ల నుంచి ఉన్నా ఇప్పుడే ఎందుకింత పాపులర్ అయింది?

డోలో 650

ఫొటో సోర్స్, Getty Images

కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల నేపథ్యంలో డోలో-650 మీద మీమ్స్ పెరిగిపోయాయ్.

సోషల్ మీడియాలో ఇంతగా సందడి చేస్తున్న డోలో, కరోనా క్రైసిస్‌లో దాన్ని తయారు చేసే కంపెనీకి బాగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది.

ఈ క్రేజ్‌ను తాము కూడా ఊహించలేదని అంటోంది ఆ కంపెనీ.

డోలో-650 ఎలా పుట్టింది?

డోలో-650 అనేది పారాసిటమల్ ట్యాబ్లెట్ అనే విషయం తెలిసిందే. కాకపోతే అందులో ఉండే మెడిసిన్ పవర్ 650ఎంజీ ఉంటుంది.

డోలో అనేది మెడిసిన్ పేరు కాదు బ్రాండ్ పేరు. అందులో ఉండే మెడిసిన్ పారాసిటమల్. మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. 1993లో డోలో-650 అమ్మకాలు మొదలయ్యాయ్.

పారాసిటమల్ 500 ఎంజీ విభాగంలో బాగా పోటీ ఉండటంతో కొత్తగా ఏమైనా చేయాలని భావించింది కంపెనీ. ఇందుకు మార్కెట్‌ను స్టడీ చేయడంతోపాటు అనేక మంది డాక్టర్లతో మాట్లాడామని 'మనీ కంట్రోల్'తో మాట్లాడుతూ అన్నారు మైక్రో ల్యాబ్స్ ఎండీ దిలీప్ సురానా.

జ్వరం, నొప్పిని తగ్గించడంలో పారాసిటమల్-500 ఎంజీ, ఎఫెక్టివ్‌గా పని చేయడంలేదని గుర్తించింది మైక్రో ల్యాబ్స్. దీనికి సమాధానంగా డోస్ పెంచి పారాసిటమల్-650ఎంజీని తయారు చేయడం మొదలు పెట్టింది.

దానికి పెట్టిన బ్రాండ్ నేమ్ డోలో-650. ట్యాబ్లెట్ పవర్ 500 నుంచి 650 ఎంజీకి పెరిగింది కాబట్టి దాని సైజు కూడా పెరుగుతుంది. అందువల్ల మింగేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ట్యాబ్లెట్‌ను ఓవల్ షేప్ అంటే కోడి గుడ్డు ఆకారంలో తయారు చేయడం ప్రారంభించింది.

వీడియో క్యాప్షన్, పాముపై అమెరికా యుద్ధం... ఆయుధం పారాసిటమల్

కరోనా ఆగమనం... ద రైజ్ ఆఫ్ డోలో-650

30 ఏళ్ల నుంచి మార్కెట్‌లో ఉన్న డోలో-650... ఇప్పుడు ఇంతగా పాపులర్ కావడానికి కారణం కరోనా క్రైసిస్. కరోనా కాలంలో వినియోగం పెరగడంతో గత రెండేళ్లలో దీని సేల్స్ భారీగా పెరిగాయ్.

హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ ఐక్యూవియా రిపోర్ట్ ప్రకారం మార్చి 2020 తరువాత 350 కోట్ల డోలో-650 పిల్స్ అమ్ముడు పోయాయి. 2021లో డోలో అమ్మకాల విలువ రూ.307 కోట్లకు పెరిగింది.

2019లో అంటే కరోనాకి ముందు అమ్ముడు పోయిన డోలో-650 మాత్రల సంఖ్య సుమారు 110 కోట్లు మాత్రమే. ఇదే కాదు, జీఎస్‌కేకు చెందిన పారాసిటమల్ బ్రాండ్ కాల్పాల్ కూడా రూ.310 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది.

కరోనా క్రైసిస్‌లో పారాసిటమల్‌ ఎంతగా వాడారో ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తుంది.

వీడియో క్యాప్షన్, గుడ్డు వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

ఎందుకు ఇంత పాపులర్?

కాల్పాల్-650, పారాసిప్-650, పాసిమోల్-650 వంటి అనేక బ్రాండ్స్ ఉండగా డోలో-650 మాత్రమే ఎందుకు పాపులర్ అయిందనేదే అసలు ప్రశ్న?

కరోనా సోకిన పేషెంట్లలో జ్వరం, ఒళ్లు నొప్పులు కామన్‌గా కనిపించే లక్షణాలు. దాంతో కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా పేషెంట్లకు డోలోను ప్రిస్ర్కైబ్ చేశారని నిపుణులు అంటున్నారు.

ఇక పేషెంట్లలోనూ మౌత్ పబ్లిసిటీ పెరగడం కూడా డోలో పాపులర్ కావడానికి కలిసొచ్చిందని వారు చెబుతున్నారు.

గతంలో కరోనా సోకినప్పుడు వాడాల్సిన మందులంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో చాలా మందులు వైరల్ అయ్యేవి. వాటిలో ప్రధానంగా ఉండేది డోలో-650. అది కూడా తమకు కలిసొచ్చిందని చెబుతోంది మైక్రో ల్యాబ్స్. దీంతో మెడికల్ షాపుకు వెళ్లి డోలో-650 ఇవ్వమని అడగడం పెరిగింది.

వ్యాక్సీన్ సెంటర్ల దగ్గర ఆరోగ్య నిపుణులకు డోలో-650తోపాటు శానిటైజర్లు, మాస్కులు ఉండే కిట్స్ ఇవ్వడం, మెడికల్ షాపుల్లో సరిపడా స్టాక్ ఉండేలా చూడటం వంటి చర్యలు తీసుకున్నామని కంపెనీ చెబుతోంది.

వ్యాక్సీన్ వేయించుకున్న తరువాత జ్వరం, నొప్పి వస్తే వేసుకోవడానికి డాక్టర్లు డోలోనే ప్రిస్క్రైబ్ చేశారని అది అంటోంది.

పారాసెటమాల్

ఫొటో సోర్స్, Getty Images

పారాసిటమల్ హబ్‌గా భారత్

నేడు మనం తరచూ వాడే పారాసిటమల్ ఉనికిలోకి వచ్చింది 1893లో. తొలిసారి పేషెంట్ల మీద వాడింది కూడా అప్పుడే. కానీ 1950 వరకు పారాసిటమల్‌ను కమర్షియల్‌గా ఉత్పత్తి చేయలేదు.

1950లో అమెరికాలో, 1956లో ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో దాని వాణిజ్య ఉత్పత్తి మొదలైంది. 1980ల నాటికి ప్రపంచవ్యాప్తంగా పారాసిటమల్ బాగా పాపులర్ అయింది.

1990ల నాటికి భారత్‌లోనూ పారాసిటమల్ తయారీ ప్రారంభమైంది. నేడు పారాసిటమల్ తయారీ హబ్‌గా మారింది భారత్. చైనా తరువాత పారాసిటమల్ ఏపీఐను భారీగా ఎగుమతి చేస్తున్న రెండో దేశం ఇండియానే.

అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది పారాసిటమల్. నెలకు 5,600 మెట్రిక్ టన్నుల పారాసిటమల్‌ను తయారీ చేస్తోంది ఇండియా. ఇందులో దేశీయంగా వాడేది 200 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా స్టాకంతా అమెరికా, బ్రిటన్, కెనడా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.

వీడియో క్యాప్షన్, మీకు షుగర్ ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)