విజయనగర సామ్రాజ్యం: దక్షిణ భారతంలో చిట్టచివరి హిందూ సామ్రాజ్యం ఎలా పతనమైంది? తళ్లికోట యుద్ధంలో నలుగురు సుల్తానులు ఏకమై ఎలా ఓడించారు

తళ్లికోట యుద్ధంలో ఉపయోగించిన కంచు ఫిరంగి. ప్రపంచంలో ఇదే అతి పెద్ద కంచు ఫిరంగి అని చెబుతారు

ఫొటో సోర్స్, Wikipedia

ఫొటో క్యాప్షన్, తళ్లికోట యుద్ధంలో ఉపయోగించిన కంచు ఫిరంగి. ప్రపంచంలో ఇదే అతి పెద్ద కంచు ఫిరంగి అని చెబుతారు
    • రచయిత, పృథ్విరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''యుద్ధ రంగంలో రామరాయలను ఆయన కొలువులోనే ఉన్న ముస్లిం సర్దార్ వెనుకనుంచి బల్లెంతో పొడిచి చంపాడు.''

''రామరాయలు ఏనుగు దిగి, గుర్రం ఎక్కబోతుండగా, నిజాం సైనికులకు చిక్కాడు. హుస్సేన్ నిజాంషా రామరాయల తల నరికి బల్లెంతో గుచ్చి పైకెత్తి చూపించాడు. విజయనగర సైన్యం చెల్లాచెదురైంది.''

''హుస్సేన్ నిజాంషా సైనికులు కాల్చిన ఫిరంగి గుండు తగిలి రామరాయల తల పగిలిపోయింది. అది చూసి విజయనగర సైన్యం పారిపోయింది. సుల్తాన్ సైన్యం వారిని చుట్టుముట్టి చంపింది''

కృష్ణదేవరాయలు పాలకుడిగా మనకు బాగా తెలిసిన మహోజ్వల విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తల్లికోట యుద్ధం చివరి ఘట్టం గురించి చరిత్రకారులు చెబుతున్న భిన్న కథనాలివి.

ఆ యుద్ధంలో రామరాయలును ఎలా చంపినా.. విజయనగర సామ్రాజ్యం శాశ్వతంగా ఓడిపోయింది. మూడు వందల ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఒక మహాసామ్రాజ్యం పతనమైపోయింది. చుట్టూ ఉన్న నలుగురు మహ్మద్ సుల్తానులు ఏకమై చేసిన ఆ యుద్ధంలో.. దక్షిణ భారతదేశంలో చిట్టచివరి హిందూ సామ్రాజ్యం అంతమైపోయింది.

తళ్లికోట యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం అని చరిత్రకారులు చెప్పే ఆ పోరులో చివరి ఘట్టం. 1565 జనవరి 23 తేదీన జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 26వ తేదీన జరిగినట్లూ ప్రచారంలో ఉంది. అంటే ఇప్పటికి 457 ఏళ్లు గడిచింది.

కృష్ణదేవరాయల గురించి, విజయనగర వైభవం గురించి, హంపీ సొగసుల గురించి గొప్పగా చెప్పుకుంటాం. రాయల పాలనలో రాచవీధుల్లో రతనాలు కుప్పలు పోసి అమ్మేవారట అని అబ్బురపడుతుంటాం. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల గురించి కథలు కథలుగా వింటూ ఉంటాం.

దక్షిణాన సింహళం నుంచి ఉత్తరాన కళింగ వరకూ.. తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకూ భారత ద్వీపకల్పం దక్షిణ ప్రాంతమంతటా విస్తరించిన సువిశాలమైన, సుసంపన్నమైన మహాసామ్రాజ్యం ఒక్క యుద్ధంతో ఎందుకు అంతర్థానమైపోయింది? ఆ యుద్ధానికి నేపథ్యమేంటి? ఆ యుద్ధంలో ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? అసలు విజయనగర సామ్రాజ్యం ఎలా పుట్టింది? ఎలా పెరిగింది? ఎలా అంతరించింది? ఆ ఉథ్థాన, పతనాల గురించి తెలుసుకుందాం.

యుద్ధ విన్యాసాలు

ఫొటో సోర్స్, Getty Images

విజయనగర పాలకులు తెలుగు వారా? కన్నడిగులా?

దక్షిణ భారత ద్వీపకల్పంలో పద్నాలుగో శతాబ్ది మూడో దశకం నుంచి మూడు శతాబ్దాల పాటు విలసిల్లిన మహా సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. తొలి చారిత్రక యుగం నాటి గుప్తవంశం లాగానే విజయనగర సామ్రాజ్యం కూడా ఒక మహత్తర యుగం అని ముక్కామల రాధాకృష్ణ శర్మ అభివర్ణించారు. 20వ శతాబ్దపు మద్రాసు ప్రెసిడెన్సీ అంతటి భూభాగం.. అంటే 1,40,000 చదరపు మైళ్ల భూభాగం విజయనగర సామ్రాజ్యం కింద ఉండింది.

ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగు వంశాల వారు - సంగమ లేక యాదవ (1336 - 1485), సాళువ (1485 - 1505), తుళువ (1505 - 1575), అరవీటి (1570-1678) వంశాల వారు - విభిన్న భాషలకు, ప్రాంతాలకు చెందిన వారు.

విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించగా, వారికి విద్యారణ్యస్వామి స్ఫూర్తినిచ్చారని ఒక కథ ప్రచారంలో ఉంది. హరిహరరాయలు, బుక్కరాయలు మొదట్లో కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానంలో కోశాధికారులుగా ఉండగా, క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యం చిన్నాభిన్నం కావటంతో, కాకతీయ రాజ్యం వదిలి కంపిలరాయుని ఆస్థానానికి వచ్చారని ఒక కథ చెప్తుంది. కాకతీయ రాజ్య ఓటమితో తుగ్లక్ సైన్యం చేతికి బందీగా పట్టుబడ్డారని మరోకథ చెప్తుంది.

'విస్మృత విజయనగర సామ్రాజ్యం' గ్రంథ రచయిత రాబర్ట్ సీవెల్.. ఏడు రకాల కథలను విశ్లేషించి ఈ అభిప్రాయం వెలిబుచ్చారు: ''కురుబ తెగకు చెందిన హరిహర, బుక్కరాయ సోదరులు ఓరుగల్లు ప్రతాపరుద్రుని కోశాగార ఉద్యోగులు. క్రీ.శ. 1323లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించడంతో అనెగొంది రాజును ఆశ్రయించి కీలక పదవుల్లో చేరారు. అయితే 1334లో అనెగొందిని సుల్తాన్ ఆక్రమించి అక్కడ తన ప్రతినిధిగా మాలిక్‌ను నియమించాడు. కానీ మాలిక్ అక్కడి ప్రజలను అదుపు చేయలేకపోవటంతో సుల్తాన్ పాత కొలువులోని అధికారులనే ఒకరిని రాజుగా, మరొకరిని మంత్రిగా నియమించారు. వారే హరిహర, బుక్కరాయ సోదరులు''.

కానీ ఫాదర్ హిరాస్ ఈ అభిప్రాయానికి భిన్నంగా.. విజయనగర రాజ్య నిర్మాత హోయసల మూడవ వీరభల్లాలుడు అని చెప్పారు. దీన్ని నమ్మిన టాయిరైస్, హెచ్.కృష్ణశాస్త్రిలు హరిహర, బుక్కరాయ సోదరులు హోయసల సాముంతులై ఉంటారన్నారు. ఎస్.కృష్ణస్వామి అయ్యంగార్, సత్యనాథ అయ్యర్, పి.బి.దేశాయ్, ఎం.హెచ్.రామశర్మ, ఆర్.నరసింహాచారి, బి.ఎ.శాలటోర్‌లు విజయనగర స్థాపకులు కన్నడిగులు అని అంటూనే పరోక్షంగా హోయసల వీరభల్లాలుడే అని అన్నారు.

అయితే విజయనగర స్థాపకులైన హరిహర బుక్కరాయ సోదరులు తెలుగు జాతికి, తెలుగు భాషకు చెందిన వారని ఆధారాల సహాయంతో కె.ఎ.నీలకంఠశాస్త్రి, నేలటూరు వెంకట రమణయ్యలు వివరించారు. పి.రామశర్మ విజయనగర పాలకులైన సాళువ వంశం వారు కర్ణాటకకు చెందినవారే కాని, వారు ఆంధ్రదేశానికి వలస వచ్చి ఆంధ్రులైనారని అభిప్రాయపడుతూ.. వారు కన్నడిగులు, ఆంధ్రులు అని చెప్పారు. కుందూర ఈశ్వరదత్తు పై అన్ని వాదాలను సమన్వయం చేస్తూ కన్నడిగులు, ఆంధ్రులు అన్న తేడా లేకుండా ఇద్దరూ కలసి నిర్మించిన రాజ్యమే విజయనగరమన్నాడు.

వేయిస్తంభాల గుడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు పాలించారు

విజయనగర సామ్రాజ్యానికి ముందు దక్షిణ భారతం...

విజయనగర సామ్రాజ్య విశిష్టత తెలియాలంటే.. ఈ రాజ్య స్థాపనకు ముందు దక్షిణ భారత రాజకీయ పరిస్థితిని క్లుప్తంగానైనా తెలుసుకోవాలి. తొలి మధ్యయుగంలో భారత ఉపఖండం దక్షిణ ప్రాంతంలో.. దేవగిరి రాజధానిగా యాదవ వంశస్థులు, ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు, ద్వారసముద్రం రాజధానిగా హోయసలులు, మధుర రాజధానిగా పాండ్యులు పరిపాలించేవారు. ఈ పెద్ద రాజ్యాలతో పాటు అనేక చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉండేవి.

ఉత్తర భారతంలో మహ్మదీయులు రాజకీయ అధికారం సంపాదించి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని, తమ రాజకీయ అధికార విస్తరణకు దక్షిణ భారతంపై దృష్టి సారించటం.. కొత్త రాజకీయ పరిణామాలకు నాంది పలికింది. క్రీ.శ. 1294లో అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర దక్షిణ భారత భవిష్యత్తును మార్చిందనటం అతిశయోక్తి కాదు.

ఈ దండయాత్ర పరిణామాల ఫలితంగా క్రీ.శ.1311 నాటికి దక్షిణ భారత రాజ్యాలైన యాదవ, కాకతీయ, హోయస, పాండ్యులు.. ఖిల్జీల సామంతులయ్యారు. క్రీ.శ.1325 నాటికి దక్షిణ భారతదేశం యావత్తు తుగ్లక్ ఆక్రమణలోకి వచ్చింది.

తుగ్లక్ పాలనలో ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యారు. ఆ పాలన నుండి ప్రజానీకాన్ని రక్షించటానికి, తాము కోల్పోయిన స్వాతంత్ర్యాన్ని, రాజ్యాధికారాన్ని సంపాదించుకోవటానికి పాలకులు తిరుగుబాట్లు ఆరంభించారు. ఇవి విజయవంతమై క్రీ.శ.1326 నాటికి ఆంధ్రదేశం తుగ్లక్ ఆక్రమణ నుండి స్వతంత్రం పొందింది.

అప్పటి బళ్లారి, కర్నూలు, రాయచూర్ జిల్లాల్లో మాలిక్ నాయబ్ అహ్మద్ మీద అరవీటి సోమరాజు విజయం సాధించగా, హోయసల వీరభల్లాలుడు కర్ణాటకలో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. ఈ తిరుగుబాటుని అణచివేయటంలో కంపిలి పాలకుడైన మాలిక్ నాయబ్ విఫలమవటంతో.. తుగ్లక్ ఈ ప్రాంతం వారినే ఇక్కడకు పంపితే తప్ప తన అధికారాన్ని నిలబెట్టుకోలేనని భావించాడు.

వీడియో క్యాప్షన్, తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?

అప్పుడు తన వద్ద బందీలుగా ఉన్న హరిహర, బుక్కరాయ సోదరులకు ఇస్లాం మతం ఇప్పించి, తన సామంతులుగా కంపిలికి పంపించాడని.. రాజకాల నిర్ణయం, విద్యారణ్య వృత్తాంతం, విద్యారణ్య కాలజ్ఞానం అనే గ్రంథాలు చెప్తున్నాయి. ఇదే విషయాన్ని సమకాలీన మహ్మదీయ చరిత్రకారుడైన బిలాని, విదేశీ యాత్రికుడైన న్యూనిజ్‌లు కూడా రాశారు.

అలా వెళ్లిన హరిహర బుక్కరాయలు తిరుగుబాటు నాయకుల చేతిలో ఓడిపోయి, తుంగభద్రా తీరంలో పంపాక్షేత్రంలో తపస్సు చేసుకుంటున్న విద్యారణ్యస్వామి ఆశ్రయం కోరారని.. ఆయన వీరిద్దరినీ మళ్లీ హిందూ మతంలోకి మార్చి తన ఆశీస్సులతో పంపా విరూపాక్షుని సన్నిధిలో క్రీ.శ. 1336 ఏప్రిల్ 18వ తేదీన పట్టాభిషేకం జరిపించారని నేలటూరి వెంకట రమణయ్య అభిప్రాయపడ్డారు.

విజయనగర రాజ్యస్థాపకుడైన హరిహరరాయలు, సంగమరాజ, కూనాంబికల కుమారుడు. ఇతనికి కంపరాయలు, బుక్కరాయలు, మారప, ముద్దప అనే నలుగురు సోదరులున్నారు. హరిహరరాయలు సంగముని కుమారుడు కావటం వల్ల, వంశస్థాపకుడవటం వల్ల ఈ వంశాన్ని సంగమ వంశమన్నారు. ఇతడు యదువంశ క్షత్రియుడు కావటం వల్ల వీరిని యాదవులు అని కూడా పిలిచారు.

ఓ పదేళ్ల పాటు కుంజరకోన లేదా ఆనెగొంది రాజధానిగా హరిహరరాయలు పాలించాడు. ఆ తర్వాత క్రీ.శ. 1347లో భారత ఉపఖండానికి మధ్యలోనున్న తుంగభద్రానది ఒడ్డున కొత్త రాజధాని నగరం విజయనగరం నిర్మించారు. అదే నేటి హంపీ నగరం. 1500 సంవత్సరం నాటికి ఈ నగరం విస్తీర్ణం 10 చదరపు మైళ్లుగా ఉండేది.

హంపి

ఫొటో సోర్స్, Getty Images

పదేళ్లలోనే సామ్రాజ్యంగా విస్తరణ...

రాజ్యస్థాపన చేసేనాటికి వియజనగర రాజ్యం చాలా చిన్నది. ఆనాటి కర్ణాటకంలోని బళ్లారి, చిత్రదుర్గ, కూడూరు, శివమొగ్గ, ధర్వాడ్ జిల్లాలు, ఆంధ్రదేశంలోని రాయచూర్, కర్నూలు, అనంతపురం, కడప, కోలార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఎక్కువ భాగం హరిహరరాయల రాజ్యాధికారానికి లోబడ్డాయి. అయితే.. వీటన్నిటిని హరిహరరాయలు జయించినట్లు సరైన ఆధారాలు లేవు.

రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే హరిహరరాయలు ఉదయగిరి ఆక్రమణతో రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. ఆ తర్వాత పెనుగొండను, కొన్నేళ్లకు ద్వారసముద్రాన్ని జయించాడు. దీంతో హోయసల రాజ్యం విజయనగర రాజ్యంలో కలిసిపోయింది. ఆ తర్వాత బుక్కరాయలు కొడుకు కుమార కంపణ్ణ.. మధుర సుల్తాన్ మీద దండయాత్ర చేసి ఓడించాడు. అలా ఆ రాజ్యం కూడా విజయనగర రాజ్యంలో కలిసింది.

ఇదే సమయంలో బహమనీ రాజ్యపాలకుడు హసన్ గంగూ తన రాజ్యవిస్తరణ కోసం విజయనగర సామ్రాజ్యం మీద కన్నేశాడు. ముబారఖ్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని హరిహరరాయలు మీద దండయాత్రకు పంపించాడు. బహమనీ సుల్తాన్ సైన్యాలు రాయచూర్ వరకూ గల ప్రాంతాన్ని జయించాయి.

ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో.. రాయచూర్ దుర్గానికి పశ్చిమ దిశలో బాదామి వరకూ గల ప్రాంతాన్ని హరిహరరాయలు పోగొట్టుకున్నాడు. ఆ నాటి నుంచి విజయనగర రాజులు బహమనీ సుల్తానుల మధ్య కృష్ణా - తుంగభద్రతల నడుమ ప్రదేశం కేంద్రంగా ఘర్షణ రగులుతూనే ఉండింది.

ఆ తర్వాత కొంత కాలానికి హరిహరరాయలు చనిపోగా, అతడి సోదరుడు బుక్కరాయలు రాజ్యం చేపట్టాడు. కొంతకాలానికే అతడు తొండమండలం మీద దండెత్తి శంభూవరాయలను ఓడించాడు. శంభూవరాయలును బుక్కరాయలు కొడుకు కుమార కంపణ్ణ వధించాడు. అనంతరం బహమనీ పాలకుడైన మొదటి మహ్మద్‌షాకు, బుక్కరాయలకు మధ్య యుద్ధం జరిగింది.

ఆ యుద్ధంలో బుక్కరాయలు ఓడిపోయాడని కొందరు రాస్తే.. అది నిజం కాదని మరికొందరు రాశారు. ఏది ఏమైనా 1356లో ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత రెడ్డి రాజ్యం మీద దండెత్తిన బుక్కరాయలు ఆనపోతారెడ్డిని ఓడించి అహోబిళం, పెనుకొండ ప్రాంతాలను విజయనగర రాజ్యంలో కలిపాడు.

బుక్కరాయల కాలం నాటి దండయాత్రలలో చివరిది మధుర సుల్తాన్ మీద దండయాత్ర. దీనికి నాయకుడు కుమార కంపణ. మధుర విజయ విశేషాలను కుమార కంపణ భార్య గంగాంబ తను రాసిన 'మధురా విజయము' అనే కావ్యంలో వివరించింది. ఈ మధురా దండయాత్ర లక్ష్యం రాజ్య విస్తరణ కాదని, ధర్మ సంసరక్షణమని వెంకట రమణయ్య అభిప్రాయం. ఈ దండయాత్రతో విజయనగర రాజ్యంలో మధుర కలిసిపోయింది.

బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించి దక్షిణ భారతం మొత్తానికీ పాలకుడయ్యాడు. ఆయన సామ్రాజ్యంలో ఉదయగిరి, పెనుగొండ, మైసూర్ మళువాయిరాజ్యం, అరగమలినాడు రాజ్యం, తులువ లేదా ఒరకూరు, మంగళూరు రాజ్యం, రాజగంభీర రాజ్యాలు చేరాయి.

బుక్కరాయల మరణానంతరం ఆయన కొడుకు రెండో హరిహరరాయలు 1377లో రాజయ్యాడు. అతడి హయాంలో ఉదయగిరి, తుండీర, చోళ, పాండ్య ప్రభువులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అన్నదమ్ముల పిల్లలతోనూ వారసత్వ ఘర్షణలు తలెత్తాయి. రెండో హరిహరరాయలు తన కుమారుల సాయంతో ఆ తిరుగుబాట్లను అణచివేశాడు.

ఈ గొడవలను చూసిన బహమనీ సుల్తాను ముజహిద్ షా.. తుంగభద్ర - కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని తనకు ఇవ్వాలని రాయబారం పంపాడు. రెండో హరిహరరాయలు దానికి తిరస్కరించాడు. దీంతో ఇరు రాజ్యాల మధ్య మళ్లీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుల్తాన్ ఓడిపోయాడు. తిరిగివెళుతున్న ముజహిద్ షా దారిలోనే హతమవటంతో బహమనీ రాజ్యంలో అనిశ్చిత పరిస్థుతులు తలెత్తాయి. దీంతో ఉత్తర కర్ణాటక, కొంకణ ప్రాంతాలను హరిహరరాయలు జయించాడు.

ఆ తర్వాత రెడ్డి రాజ్యంలో ఆనవేమారెడ్డి చనిపోయిన తరవాత అంతఃకలహాలు తలెత్తగా.. ఆ రాజ్యంపైనా దండెత్తాడు. దీంతో పద్మనాయక ప్రభువు బహమని సుల్తాన్‌ సాయం తీసుకుని రాయలను ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో ఓడిపోయిన రెండో హరిహరరాయలు మళ్లీ కొన్నాళ్లకు ఆలంపురం మీద దండెత్తాడు. బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా ఈ దాడిని ప్రతిఘటించాడు. మరోవైపు రాచకొండ వెలమలు బహమని సైన్యంతో కలిసి ఉదయగిరి మీద దండెత్తారు. వారిని రెండో హరిహరరాయలు మనుమడు ఒడించి తరమివేశాడు.

రెండో హరిహరరాయలు 28 ఏళ్లు పరిపాలించి 1404లో చనిపోయిన తర్వాత.. రాజ కుటుంబంలో వారసత్వ పోరు మొదలైంది. మొదటి విరూపాక్షుడు ఒక సంవత్సరం, రెండో బుక్కరాయలు కొంత కాలం రాజ్యం చేశాక మొదటి దేవరాయలు రాజ్యానికి వచ్చాడు. ఏడాదిలోనే బహమని సుల్తాన్ ఫిరోజ్‌షాహు దండెత్తి వచ్చాడు. దీనికి మత, రాజకీయ కారణాలున్నాయని చరిత్రకారుల అభిప్రాయం.

దేవరాయలు.. బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ముద్గల్‌లోని ఒక అందమైన స్త్రీ మీద మరులుగొని, ఆమెను తీసుకు రావటానికి సైన్యాన్ని పంపగా.. ఫిరోజ్‌షాహు ఆగ్రహించి విజయనగరం పైకి దండెత్తి వచ్చాడని తబకాత్-ఇ-అక్బర్ గ్రంథకర్త నిజాముద్దీన్ అమ్మద్ రాశాడు. ఈ దండయాత్రలో ఫిరోజ్‌షాహు విజయం సాధించగా.. ఓడిపోయిన దేవరాయలు తన కుమార్తెను ఫిరోజ్‌షాహుకిచ్చి పెళ్లి చేశాడని ఫెరిస్టా రాశాడు. ఈ అంశాన్ని మిగిలిన మహమ్మదీయ రచయితలు పేర్కొనలేదు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సీటిలో 2,663 తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏముంది?

అలాగే రెడ్డి రాజ్యం అంతఃకలహాల్లో కాటయ వేమారెడ్డి పక్షంలో మొదటి దేవరాయలు పోరాడగా, పెదకోమటి వేమారెడ్డికి సహాయంగా బహమనీలు, రేచర్ల వెలమ పాలకులు దండెత్తి వచ్చారు. ఈ పోరులో విజయనగర సైన్యాలు ఓడిపోయాయి. కాటయ వేముడు చనిపోయిన తర్వాత రాజమహేంద్రవరంలో అధికారం సంపాదించిన అల్లాడరెడ్డి పెదకోమటిని ఫిరోజ్‌షాహు ఓడించాడు.

ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలోని పానుగల్లు మీదా ఫిరోజ్‌షాహు దండెత్తాడు. ఈసారి రేచర్ల వెలమలు దేవరాయల పక్షం చేరారు. విజయనగర, రేచర్ల సైన్యాలు భీకరంగా యుద్ధం చేసి ఫిరోజ్‌షాహును ఓడించి పానుగల్లు, నల్గొండ దుర్గాలను స్వాధీనం చేసుకుని, బహమనీ రాజ్యంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారని వెంకటరమయణయ్య అభిప్రాయం. దేవరాయలు రాజమహేంద్రవర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వల్ల, ఆయనకు కళింగ గజపతులతోనూ శత్రుత్వం ఆరంభమైంది.

మొదటి దేవరాయలు 16 ఏళ్లు పాలించాడు. ఆ తర్వాత ఆయన కుమారుల్లో రామచంద్రరాయలు రాజయ్యాడు. కానీ కొద్ది నెలలకే అతడిని తొలగించి విజయరాయలు సింహాసనం అధిష్టించాడు. ఈతని అనంతరం ఇతడి కొడుకు రెండో దేవరాయలు రాజ్యాధికారం చేపట్టాడు. ఇతడి రెండు దశాబ్దాలు పాలన కూడా యుద్ధాలతో నిండి ఉంది. విజయనగర సామ్రాజ్యం కృష్ణానది నుంచి సింహళం వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించింది. సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని సామంత రాజ్యంగా చేసుకున్నాడు. ఇతనికి బహమనీలకు మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో గెలుపెవరిదనే దానిపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు.

రెండో దేవరయాలు కాలంలోనే ఇటలీ యాత్రికుడు నికొలోకాంటి, పర్షియా యాత్రికుడు అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించి విజయనగర రాజ్యం, రాజధాని వైభవం గురించి కీర్తిస్తూ రాశారు. ఈతని ఆస్థాన పండితుడైన డిండిమభట్టును ఓడించిన శ్రీనాథుడ్ని కనకాభిషేకంతో సత్కరించాడు. ఇతని కోశాగారంలో 225 కోట్ల ధనం నిల్వ ఉన్నట్లు తెలుస్తుంది. ఇతని సైన్యంలో 11 లక్షల కాల్బలం ఉంది.

తుంగభద్ర తీర ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

సంగమ వంశం నుంచి సాళువ వంశానికి పాలన...

రెండో దేవరాయలు కుట్ర ఫలితంగా అసహజ మరణం చెందాడు. ఆ తర్వాత మల్లికార్జున రాయలు అధికారంలోకి వచ్చాడు. అతడి కాలంలో గజతులు, బహమనీలు విజయనగరం మీద దండయాత్రలు చేశారు. అయితే కొంత కాలం తర్వాత మల్లికార్జున రాయలును వధించి అతని పినతండ్రి ప్రతాపదేవరాయల కొడుకు రెండో విరూపాక్ష రాయలు రాజ్యం సొంతం చేసుకున్నాడు. అతడు 1465 నుంచి 1485 వరకు రాజ్యం చేశాడు. కానీ పాలనను నిర్లక్ష్యం చేయటంతో గజపతులు, బహమనీలు విజయనగర రాజ్యం మీద దండెత్తి తమకు కావలసిన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు.

రెండో విరూపాక్ష రాయలును సొంత కుమారుడే వధించి తన తమ్ముడైన ప్రౌఢదేవరాయలను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కానీ తన అన్న నుంచి ముప్పు వస్తుందేమోననే భయంతో ప్రౌఢదేవరాయలు అన్నను చంపించాడు. ఈ పరిస్థితుల్లో.. చంద్రగిరి రాజ్యాన్ని సామంత ప్రభువుగా పరిపాలిస్తున్న సాళువ నరసింహరాయలు విజయనగర రాజ్యాన్ని తానే ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సంగమ వంశం పాలన ముగిసింది.

సాళువ వంశం 1485 నుంచి 1505 వరకు పాలించింది. వీరు తాము యదు సంతతి వారమని చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు. సాళువ నరసింహరాయలు ఆరేళ్లు పాలించాడు. తను చనిపోయేముందు.. తన కుమారులైన తిమ్మరాజు, నరసింహరాజులలో అర్హుడికి పట్టాభిషేకం చేయించమని తన సర్వసేనాధిపతి తుళువ నరసనాయకునికి ఆదేశమిచ్చాడు. ఆమేరకు తిమ్మరాజు రాజయ్యాడు. కానీ కొద్ది కాలంలోనే అకాల మరణం చెందాడు. అనంతరం రెండో నరసింహుడు రాజ్యానికి వచ్చాడు. కానీ అతడిని బందీగా చేసి, సర్వసేనాధిపతి తుళువ నరసనాయకుడు సర్వాధికారాలు చలాయించాడన్న అభిప్రాయం ఉంది.

సర్వసేనాని నరసనాయకుని మరణానంతరం అతని కుమారుడు వీర నరసింహరాయలు మహాసేనాధిపతిగా, మహాప్రధానిగా వ్యవహరించి.. మెల్లగా కుట్రపన్ని రెండో నరసింహుడిని చంపి, విజయనగర రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇది విజయనగర చరిత్రలో మరో ముఖ్యమైన ఘటన.

శ్రీకృష్ణదేవరాయల విగ్రహం
ఫొటో క్యాప్షన్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం

తుళువ వంశ పాలన.. కృష్ణదేవరాయలు

విజయనగర సామ్రాజ్యం మీద సాళువ వంశ పాలన పోయి తుళువ వంశ పాలన మొదలైంది. వీరు 1505 నుంచి 1575 వరకూ 70 ఏళ్ల పాటు పాలించారు. వీరు కూడా చంద్రవంశం వారమని, మైసూరులోని తుళువ ప్రాంతానికి చెందినవారమని చెప్పుకున్నారు. వీర నరసింహనాయకుడు సామంతుల తిరుగుబాట్లను సమర్థంగా అణచివేశాడు. అతడి మరణానంతరం కృష్ణదేవరాయలు సింహాసనానికి వచ్చినట్లు రాయవాచకము, శాసనాలు తెలుపుతున్నాయి.

కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకూ ఇరవై ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆంధ్రభోజునిగా, సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా, అష్టదిగ్గజ కవి పోషకుడుగా, సమర్థవంతమైన పాలకుడిగా.. దక్షిణ భారత పాలకుల్లోనే కాక, భారత ప్రసిద్ధ చక్రవర్తులలో ఒకడిగా కీర్తి గడించాడు. ఇతడి పాలనా కాలం విజయనగర చరిత్రలో సువర్ణాధ్యాయంగా చెప్తారు.

విజయనగర రాజ్య ప్రాభవం తగ్గిపోతున్న సమయంలో కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించి పెంపొందింపచేశాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అంతర్గతంగా సవతి సోదరులతో ఘర్షణను.. సామంతులైన ఉమ్మత్తూరు, శివ సముద్రం, శ్రీరంగపట్నం పాలకుల తిరుగుబాట్లను, పొరుగు రాజ్యాలైన గజపతులు, బీజాపూర్ సుల్తాన్, బహమని సుల్తాన్‌ల దండయాత్రలను ఎదుర్కొన్నాడు.

బీజపూర్ పాలకుడు ఆదిల్ షా సమాధి గోల్ గుంబజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజపూర్ పాలకుడు ఆదిల్ షా సమాధి గోల్ గుంబజ్

బహమని సుల్తాన్ మహ్మద్‌షా, బీజపూర్ పాలకుడు యూసఫ్ ఆదిల్‌షాలు సంయుక్తంగా దండెత్తిరాగా కోవెలకొండ దగ్గర జరిగిన యుద్ధంలో కృష్ణదేవరాయలు గెలిచాడు. బీజపూర్ సుల్తాన్ యుద్ధంలో చనిపోయాడు. బీజపూర్ సామ్రాజ్యంలో అంతర్గత ఘర్షణల్లో.. మహ్మద్‌షా కొడుకు ఇస్మాయిల్‌కు సాయంగా వెళ్లిన గుల్బర్గా, బీదర్ పాలకులను కామల్‌ఖాన్ అన్న సర్దారు ఓడించాడు. బీదరును ఆక్రమించి సుల్తాన్ మహ్మద్‌షాను బంధించాడు. బీదర్ ప్రజలు కృష్ణదేవరాయలను దండెత్తి రమ్మని కోరారు. ఆ క్రమంలో జరిగిన పరిణామాల్లో కృష్ణదేవరాయలు దండెత్తి వచ్చి మహమ్మద్‌షాను బందిఖానా నుండి విముక్తుడ్ని చేసి, అతడ్ని తిరిగి బహమని సింహాసనంపై కూర్చుండబెట్టాడు. దాదాపు ఇదే సమయంలో కళింగ పాలకుడైన ప్రతాపరుద్ర గజపతితో కూడా యుద్ధం చేశాడు.

ఆ తర్వాత అంతర్గత తిరుగుబాట్లను అణచివేసి, కళింగ దండయాత్ర మొదలుపెట్టాడు. 1513 నుండి 1519 వరకు ఆరేళ్ల పాటు ఈ దండయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, పొట్నూరు, సింహాచలం కోటలను స్వాధీనం చేసుకున్నాడు.

సింహాచలంలో ప్రతాపరుద్ర గజపతి కుమార్తెను కృష్ణదేవరాయలు పెళ్లి చేసుకుని సింహాచలం నుండి పొట్నూరుకు చేరుకున్నాడని రాయవాచకము, కృష్ణ విజయము రచనలు చెప్తున్నాయి. అయితే ఆయన విజయనగరం తిరిగి వచ్చిన తర్వాతే ఆ వివాహం జరిగిందని న్యూనిజ్ రాశాడు. కృష్ణదేవరాయల 12 మంది రాణులలో కళింగ రాకుమార్తె ఒకరని పేస్ పేర్కొన్నాడు.

కృష్ణదేవరాయల కళింగ దిగ్విజయ యాత్ర బహమని సుల్తానులలో అసూయను మరింతగా పెంచింది. అయితే.. బహమని సుల్తాన్ మహ్మద్ షా మరణానంతరం రాజ్యాధికారం అలిబరీద్‌కు దక్కింది. మహ్మద్‌షా కుమారుడు కాలిమాత్తు బీదర్ విడిచి పారిపోవలసి వచ్చింది. ఈ అంతఃకలహాలతో బహమని సామ్రాజ్యం అంతరించి ఐదు రాజ్యాలు తలెత్తాయి. వీటిలో బీజపూర్ రాజ్యం బలమైనది. కృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో ఉండగా.. బీజపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షా అంతర్వేదిని తిరిగి ఆక్రమించాడు. దీంతో కృష్ణదేవరాయలకు, ఆదిల్‌షాకు మధ్య రాయచూర్ యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో కృష్ణదేవరాయలు గెలవటంతో మిగిలిన సుల్తానుల్లో భయాందోళనలు పెరిగాయి. వారందరూ రాయచూర్‌ను ఇస్మాయిల్ ఆదిల్‌షాకు ఇచ్చివేయమని కృష్ణదేవరాయలకు రాయబారం పంపారు. రాయలు దానికి అంగీకరించలేదు. మిగిలినవారందరూ కలిసివచ్చినా ఎదుర్కొంటానని సమాధానం పంపాడు. కొంతకాలం నాగులాపురంలోను ముద్గల్‌లోను వేచివుండి, ఏ వర్తమానం లేకపోవటంతో బీజపూర్ చేరుకున్నాడు.

బీజపూర్‌లో కృష్ణదేవరాయలు ఉండేందుకు వీలులేకుండా చెరువుల్లోని నీరంతా తోడించి వేశాడు ఇస్మాయిల్ ఆదిల్‌షా. దీంతో ఆగ్రహించిన కృష్ణదేవరాయలు బీజపూర్ మీద దండెత్తి గుల్బర్గా, ఫిరోదాబాద్, హసన్‌బాద్, సాగర్ నగరాలను ధ్వంసం చేశాడు.

బీజపూర్ మీద కృష్ణదేవరాయలు దండెత్తటం వలన మిగిలన సుల్తానుల మధ్య ఐకమత్యం పెరిగింది. అహ్మద్‌నగర్‌కు చెందిన బుర్హాన్ నిజాంషాతోను, బీరారుకు చెందిన అల్లాఉద్దీన్ ఇమాద్‌షాతోను బీజపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షా వివాహ సంబంధాలు ఏర్పాటుచేసుకుని తన బలాన్ని పెంచుకుని, బీదరుకు చెందిన అమర్‌బరీద్‌ను ఓడించి, కృష్ణదేవరాయలపై దండెత్తి వచ్చాడు. రాయచూర్, ముద్గల్ కోటలను తిరిగి సంపాదించాడు. ఈ అపజయం కృష్ణదేవరాయల ప్రతిష్టను దెబ్బతీసింది.

కృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినప్పటి నుండి ఎడతెగకుండా చేసిన యుద్ధాలవల్ల, యవసు పెరిగిపోవటం వల్ల శారీరకంగా అలసిపోయి, విశ్రాంతి కోరుకునే దశకు చేరుకున్నాడు. కృష్ణదేవరాయలకు తిరుమల రాయలు ఒకే కొడుకు ఉన్నాడు. అతడికి ఆరేళ్ల వయసులోనే పట్టాభిషేకం చేయించాడు. కానీ తిరుమల రాయలు 1524లోనే ఆకస్మిక మరణం చెందాడు. చివరికి పెనుగొండలో ఉన్న తన సవతి తల్లి కుమారుడు అచ్యుతరాయలను తన వారసుడిగా ప్రకటించి 1529లో కృష్ణదేవరాయలు చనిపోయాడు.

అచ్యుతరాయలు దూరదృష్టితో కృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయలతో రాజకీయ ఒప్పందం చేసుకున్నాడు. కృష్ణదేవరాయల కుమారుడైన పసిబాలుడు కూడా రాజ్యాధికారంలో భాగస్వామి కావాలని, అతని రక్షకుడిగా రామరాయలు వ్యవహరించాలనేది ఆ ఒప్పందం. అచ్యుతరాయలు పట్టాభిషేకం చేసుకున్న వెంటనే ప్రతాపరుద్ర గజపతి, గోల్కొండ కుతుబ్‌షా విజయనగరం పైకి దండెత్తి వచ్చారు. వారిని కొండవీడు వద్ద ఎదుర్కొని ఓడించాడు అచ్యుతరాయలు. అంతర్గత తిరుగుబాట్లు, ఇస్మాయిల్ ఆదిల్‌షా దండయాత్రలను ఎదుర్కొన్నాడు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు

అయితే.. 1533లో కృష్ణదేవరాయల కుమారుడు అకస్మాత్తుగా చనిపోవటంతో.. అచ్యుతరాయలు, అళియ రామరాయల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అచ్యుతరాయలు బీజపూర్ దండయాత్రకు వెళ్లి విజయం సాధించి వచ్చేటప్పటికి రామరాయలు తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి ప్రయత్నించాడని మహ్మదీయ చరిత్రకారులు రాశారు.

ఫెరిస్టా అభిప్రాయం ప్రకారం.. రామరాయలు పట్టాభిషేకం చేసుకుని పరిపాలించాలని తలంచగా, సామంతులు ప్రతఘటించటంతో అది బెడిసికొట్టింది. దీంతో మరో ఎత్తువేసి.. అచ్యుతరాయల సోదరుడు రంగరాయల కుమారుడు సదాశివరాయలను రాజుగా ప్రకటించి, అచ్యుతరాయలను బంధించి రాజభారం వహించాడు రామరాయలు. ఇందుకు కూడా ఎక్కువమంది సామంత రాజులు ఒప్పుకోకపోవటంతో తిరుగుబాట్లు జరిగాయి. వాటిని అణచివేయటానికి వెళ్లిన రామరాయలు తిరిగి వచ్చేలోగా అచ్యుతరాయలు అధికారం చేపట్టేసరికి నాయకులు అనేకమంది రామరాయలను వదిలి అచ్యుతరాయల పక్షం చేరారు.

తదనంతర రాజకీయ పరిణామాల్లో అచ్యుతరాయలు, రామరాయల మధ్య ఇబ్రహీం ఆదిల్‌షా రాజీ కుదిర్చాడు. రామరాయల కింద ఉన్న ప్రాంతాలను రామరాయలు పరిపాలించుకోవచ్చునని, మిగిలిన రాజ్యానికి అచ్యుతరాయలు పాలకుడని సంధి చేసుకున్నారు. అయితే అచ్యుతరాయలు ఆ తర్వాత పరిపాలనను నిర్లక్ష్యం చేయటంతో పరిస్థితులు దిగజారాయి. ఇంతలో ఆయన చనిపోయాడు.

అచ్యుతరాయల మరణానంతరం అతని కొడుకు వెంకటపతి దేవరాయలు పాలకుడయ్యాడు. అయితే ఇతడు బాలుడు కావటం వల్ల మేనమామ సకలం చిన తిరుమలరాజు రక్షక బాధ్యత వహించాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతడి ద్రోహబుద్ధిని తెలుసుకున్న రాజమాత వరదాదేవి బీజపూర్ సుల్తాన్ ఆదిల్‌షా సాయం కోరింది. కానీ బీజపూర్ సుల్తాన్‌ను ఓడించి తరిమికొట్టిన చిన తిరుమలరాజు.. ఆ వెంటనే వెంకటపతి దేవరాయలను చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.

ఈ పరిస్థితుల్లో చిన తిరుమలరాజును తొలగించేందుకు రామరాయలు మిత్రులను కూడగట్టుకుని విజయనగరంపై దండెత్తటానికి సన్నాహాలు చేశాడు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద ఇరుపక్షాలకు యుద్ధం జరిగింది. అందులో చిన తిరుమలరాజు సైన్యం ఓడిపోయింది. ఆ తర్వాత వీరిరువురి మధ్య జరిగిన పలు యుద్ధాల్లోనూ రామరాజు గెలిచాడు. తన సైన్యాన్ని విజయనగరం వైపు నడిపించాడు.

ఈ పరిస్థితుల్లో చిన తిరుమలరాజు బీజపూర్ సుల్తాన్ సాయం కోరాడని ఫెరిస్టా రాశాడు. బీజపూర్ సుల్తాన్‌ను విజయనగర వజ్రసింహాసనం మీద కూర్చుండబెట్టి వారం రోజులు ఉత్సవం కూడా జరిపించాడు చిన తిరుమలరాజు. దీంతో ప్రజలు హాహాకారాలు చేశారు.

అయితే రామరాయలు యుక్తితో బీజపూర్ సుల్తాన్‌ను చిన తిరుమలరాజుకు దూరం చేశాడు. ఒంటరైన చిన తిరుమలరాజు మీద రామరాయలు దండెత్తివచ్చాడు. మారిన పరిస్థితుల్లో ఇతర నాయకులు రామరాయల పక్షాన చేరటంతో చిన తిరుమలరాజును సులభంగా ఓడించారు. దీంతో చిన తిరుమలరాజు కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఫెరిస్టా రాశాడు. తిరుమలరాజును రామరాయల పక్షం వారు వధించారని సాహిత్య ఆధారాలున్నాయి.

గోల్కొండ కోట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోల్కొండ కోట

సింహాసనం అధిష్టించని సార్వభౌముడు

అళియ రామరాయల సహకారంతో విజయనగర పాలకుడిగా సదాశివరాయలు వ్యవహరించాడు. వాస్తవానికి అతడు నామమాత్రపు పాలకుడే కాగా రామరాయలే రాజ్యభారాన్ని మోసాడు. అందుకుగాను తన సోదరులైన తిరుమల, వెంకటాద్రుల సాయం తీసుకున్నాడు. కృష్ణదేవరాయని సామంతుడుగా కర్నూలు ప్రాంతాన్ని పాలించిన శ్రీరంగరాజు కుమారుడు రామరాయలు. అతడు కృష్ణదేవరాయలకు అల్లుడై, సదాశివరాయల సంరక్షకుడిగా, రాజప్రతినిధిగా విజయనగర చరిత్రను ప్రభావితం చేశాడు.

సింహాసనం చేపట్టకున్నా సర్వాధికారిగా అతడు వేసిన పథకాలు చివరికి ప్రతికూలంగా మారాయి. మహ్మదీయ పాలకుల కలహాల్లో జోక్యం చేసుకుని కొందరితో స్నేహం చేయటం, వారి మధ్య గొడవలు పెంచటం ఆ పథకంలో భాగం. విజయనగరం మీద తరచుగా దండెత్తి వస్తున్న బీజపూర్ సుల్తాన్‌ ఆదిల్‌షాకు బుద్ధిచెప్పటం కోసం.. అహ్మద్‌నగర్ పాలకునితో స్నేహం చేశాడు రామరాయలు.

సదాశివరాయలు సింహాసనం సంపాదించుకోవటంతో.. చిన తిరుమలకు సహాయంగా వచ్చిన ఆదిల్‌షా, కుతుబ్‌షా, నిజాంషా, బరీద్‌షాలతో యుద్ధం చేయటానికి రామరాయలు, వెంకటాద్రి, తిరుమల నాయకత్వంలో సైన్యాలు బయలుదేరాయి. వెంకటాద్రి నాయకత్వంలో విజయనగర సైన్యం ఆదిల్‌షాను తురకచర్ల వద్ద ఓడించింది.

రామరాయల సారథ్యంలోని సైన్యం జంషీద్ కుతుబ్‌షాను వెంటాడి పానుగల్లు వద్ద అతన్ని ఓడించి గోల్కొండ వరకు తరిమికొట్టింది. గోల్కొండను ముట్టడించగా కుతుబ్‌షా సంధికి వచ్చాడు. దీంతో విజయనగరం - గోల్కొండల మధ్య సంధి కుదిరింది. తిరుమల నాయకత్వంలోని సైన్యం నిజాంషాను డించి, కళ్యాణదుర్గాన్ని సంపాదించింది. నిజాంషా వీరి ధాటికి తట్టుకోలేక అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. రామరాయలు వెంటాడి అహ్మద్‌నగర్ కోటను ముట్టడించి ధ్వంసం చేశాడు.

అనంతర రాజకీయ సమీకరణాల్లో బీజపూర్ సుల్తాన్ ఆదిల్‌షాకు వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటైంది. గోల్కొండలో అధికారం చేజిక్కించుకున్న జంషీద్‌కు, అతని సోదరుడైన ఇబ్రహీంకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇబ్రహీం తనకు సాయంగా రావాలని బరీద్‌ను అభ్యర్థించాడు. బరీద్ గోల్కొండపై దండెత్తాడు. అతడు సాయం కోరటంతో నిజాంషా కూడా గోల్కొండపై దండెత్తి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో గోల్కొండ, అహ్మద్‌నగర్, రామరాయలు కూటమిగా ఏర్పడ్డారు. అందరూ కలిసి బీజపూర్ మీద దండెత్తటానికి పథకం వేశారు.

ముగ్గురూ మూడువైపుల నుంచి ముట్టడించటంతో రామరాయలతో ఒప్పందానికి వచ్చాడు బీజపూర్ సుల్తాన్. ఆ తర్వాత గోల్కొండలో కుతుబ్‌షాను శిక్షించటానికి పథకం పన్ని, అతడిని చంపేసి బీజపూర్ వెళ్లిపోయాడు సుల్తాన్. జంషీద్ సోదరుడైన ఇబ్రహీంకు బీదర్ పాలకుడు రక్షణ కల్పించకపోవటంతో అతడు రామరాయల దగ్గరకు పారిపోయి వచ్చి రక్షణ కోరాడు. ఇబ్రహీం గోల్కొండ సుల్తాన్ అయ్యేంతవరకు రామరాయల రక్షణలోనే ఉన్నాడు.

బీజపూర్ సుల్తాన్ ఆదిల్‌షా కూడా రామరాయల సహాయం కోరాడు. ఆమేరకు రామరాయలు.. వెంకటాద్రి నాయకత్వంలో సైన్యాన్ని నిజాంషా సైన్యాధిపతి ఐన్-ఉన్-ముల్క్‌ను ఓడించటానికి పంపించాడు. ఉన్‌-ముల్క్ అతడు అహ్మద్‌నగర్ పారిపోగా అక్కడే హతమయ్యాడు. మరోవైపు రామరాయలు పోర్చుగీసు వారితోనూ యుద్ధంచేసి వారిని ఓడించి, సంధి చేసుకున్నాడు.

గుల్బర్గా కోట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుల్బర్గా కోట

ఆ తర్వాత హుస్సేన్ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షాలు కలిసి బీజపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న గుల్బర్గాను ముట్టడించారు. బీజపూర్ సుల్తాన్ రామరాయల సాయం అర్ధించాడు. దీంతో బీజపూర్ ముట్టడిని విరమించాలని ఇబ్రహీం కుతుబ్‌షాను కోరాడు రామరాయలు. బీజపూర్‌కు సాయం చేయటానికి బయలుదేరాడు. మరోవైపు గోల్కొండ మీద దాడిచేయటానికి తన సోదరుడిని సైన్యంతో పంపించాడు. విషయం తెలుసుకున్న ఇబ్రహీం కుతుబ్‌షా రామరాయలను కలిసి, ఆయన ఆదేశాన్ని అమలుచేశాడు.

అయితే ఆదిల్‌షా ఆ తర్వాత పోర్చుగీసు వారిని తటస్థం చేసి, విజయనగరంపై దాడిచేశాడు. కొన్ని కోటలను ఆక్రమించాడు. ఈ నేపథ్యంలో కళ్యాణ కోటను ముట్టడించాలని నిజాంషాకు చెప్పిన రామరాయలు.. వెంకటాద్రి సాయంతో రాయచూర్, ముద్గల్ కోటలను ఆక్రమించాడు. ఆదిల్‌షాకు బుద్ధిచెప్పి అతను ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి పొందాడు. అలాగే సుల్తాన్‌ల మధ్య కూడా రాజీ కుదిర్చాడు. దీనిని ఏ సుల్తాన్ అయినా ఉల్లంఘించి, మరొక సుల్తాన్ మీద దండెత్తితే.. దండయాత్రకు గురయ్యే సుల్తాన్ పక్షాన ఇతర సుల్తానులు కూడా పాల్గొనవలసినదే అన్నది ఆ ఒప్పందం సారాంశం.

అనంతర పరిణామాల్లో అహ్మద్‌నగర్ రాజ్యంలో బుర్హాన్ నిజాంషా చనిపోగా హుస్సేన్ నిజాంషా పాలకుడయ్యాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు బీజపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్‌షా చనిపోవటంతో అతని కుమారుడు అలి సుల్తాన్ అయ్యాడు. నిజాంషా కళ్యాణ మొదలైన దుర్గాలను ఆక్రమించటంతో.. అలి ఆదిల్‌షా గత్యంతరం లేక రామరాయలను ఆశ్రయించాడు. రామరాయలు నలుగురు సుల్తానులకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. బీజపూర్‌కు సహాయపడటానికి కుతుబ్‌షాను ఆహ్వానించాడు.

కుతుబ్‌షా ఇష్టంలేకపోయినా రామరాయలకు ఎదురుచెప్పలేక ఒప్పుకున్నాడు. ఈ పరిణామాలను గమనించిన నిజాంషా ప్రతిష్ఠానపురం పారిపోయి దాక్కున్నాడు. రామరాయల మిత్రబృదం రెండు భాగాలుగా విడిపోయి.. ఒక భాగం కళ్యాణని ముట్టడించగా, రెండో భాగం అహ్మద్‌నగర్‌ను ముట్టడించింది.

నిజాంషా సైన్యాన్ని సదాశివరాయల సైన్యం ఓడించింది. మరొకపక్క నిజాంషా ప్రాంతాలను రామరాయల తమ్ముడు వెంకటాద్రి ధ్వంసం చేశాడు. నిజాంషా దీనిని తట్టుకోలేక సదాశివరాయలతో సంధి చేసుకుని కళ్యాణదుర్గను బీజపూర్ సుల్తాన్ అలి ఆదిల్‌షాకు తిరిగి ఇచ్చేశాడు. బీజపూర్ సుల్తాన్‌కు చేసిన సహాయానికి ప్రతిఫలంగా యాదగిరి, బాగల్‌కోటలను రామరాయలు పొందాడు.

ప్రస్తుత బిజాపూరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత బిజాపూరు

అయితే.. 1553లో కుతుబ్‌షాహీలు పాలిస్తున్న గోల్కొండ మీద రామరాయలు దండెత్తాడు. దీనికి కారణాలను చరిత్రకారులు వివిధ రకాలుగా చెప్పారు. అహ్మద్‌నగర్ ముట్టడి సమయంలో ఇబ్రహీం కుతుబ్‌షా మాటతప్పి నిజాంకు సహాయపడ్డాడని, ఎందుకు మాటతప్పావని రామరాయలు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా రాత్రికి రాత్రి గోల్కొండకు పారిపోయాడని, అందువల్ల కుతుబ్‌షాను శిక్షించడానికి గోల్కొండ మీద రామరాయలు దండెత్తాడని ఫెరిస్టా రాశాడు.

దీనికిభిన్నంగా.. కుతుబ్‌షా మాట తప్పి నిజాంషా కూతురును పెళ్లి చేసుకోవటానికి కళ్యాణదుర్గంను ఎన్నుకొన్నాడని, అప్పుడు ఆదిల్‌షా రామరాయల సహాయం కోరాడని, అందుకు అంగీకరించి కుతుబ్‌షా మీద దండెత్తి వచ్చారని పేరు తెలియని గోల్కొండ రచయిత పేర్కొన్నాడు. అయితే.. ఇదే ఇబ్రహీం కుతుబ్‌షా రామరాయల సాయంతో గోల్కొండ సింహాసనం అధిష్టించాడన్న విషయం గుర్తుంచుకోవాలి.

రామరాయలు, బీజపూర్ సుల్తాన్ ఆదిల్‌షాలు పథకం ప్రకారం కుతుబ్‌షా మీద దండయాత్రకు దిగారు. వెంకటాద్రి తదితర సేనానులను కుతుబ్‌షా పైకి పంపి.. రామరాయలు, ఆదిల్‌షాలు కళ్యాణదుర్గంకు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుతుబ్‌షా, నిజాంలు కళ్యాణదుర్గం విడిచి తమతమ రాజ్యాలకు వెళ్లిపోయారు. రామరాయలు నిజాంషాను తరుముతూ వెంబడించాడు. విజయనగర సైన్యాలు కుతుబ్‌షా రాజ్యంలో ప్రవేశించి తర్లపల్లి అనే ప్రాంతం వద్ద యుద్ధం చేశాయి. ఈ దండయాత్రలో నిజాంషాపై సదాశివరాయలు విజయం సాధించాడు.

మరోపక్క వెంకటాద్రి సేనలు గోల్కొండ పరిసర ప్రాంతాలను నాశనం చేశాయి. రామరాయల మేనల్లుడు మచిలీపట్నం, కొండపల్లిలను ముట్టడించాడు. ఏలూరు, రాజమహేంద్రవరంలను పట్టుకోవటానికి ఇంకో సైన్యం బయలుదేరి వెళ్లింది. కుతుబ్‌షా కొండవీడు మీద దండెత్తి వచ్చాడు. కానీ వెలుగోటి చిన్నమ్మనాయుడు కొండవీడును కాపాడటమేకాక, కృష్ణానది దాటి కుతుబ్‌షా రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలోని దుర్గాలను ఆక్రమించాడు. అన్నివైపులా ఓటమి పాలవటంతో కుతుబ్‌షా చివరికి.. గణపురం, పానుగల్లు కోటలను రామరాయలకు ఇచ్చి సంధి చేసుకున్నాడు.

అయితే.. ఈ యుద్ధంలో రామరాయల విజయం ఓడిపోయిన దక్కన్ సుల్తానులకు తమ లోపాలను బహిర్గతం చేసింది. రామరాయలపై అసూయాద్వేషాలను పెంచింది. తమలో తాము కలహించుకోవటం మాని, ఐకమత్యంగా ఉండకపోతే తమ భవిష్యత్తు శూన్యమని గ్రహించి తమ విభేదాలను పక్కన పెట్టి ఏకమయ్యారు.

ఇంకా రామరాయలను చూస్తూ ఊరుకుంటే తమ మనుగడకే ముప్పు వస్తుందన్న భయం పెరిగింది. ఆ విధంగా ఐదుగురు సుల్తానులు ఏకమై విజయనగరంతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యారు. ఆ ఫలితమే దక్షిణ భారత చరిత్రలో అతిపెద్ద మలుపైన తల్లికోట యుద్ధం. దీనినే రాక్షసి తంగడి యుద్ధమని, బన్నిహట్టి యుద్ధమని అంటారు. అది 1565లో జరిగింది.

హంపి

ఫొటో సోర్స్, Getty Images

ళ్లికోట యుద్ధానికి కారణాలేమిటి?

ఈ యుద్ధానికి గల కారణాలపై చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. రామరాయలు అహంకారంతో మహ్మదీయులను కించపరిచే విధంగా ప్రవర్తించటంతో ఈ యుద్ధం అనివార్యమైందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే మహ్మదీయులను రామరాయలు కించపరిచినట్లు, హీనంగా చూసినట్లు తగినన్ని ఆధారాలు కనిపించవు. రామరాయల సైన్యంలో తగిన సంఖ్యలో మహ్మదీయులున్నారు. రామరాయలు ఆ సైనికుల మత ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించి, వారికి తగిన ఏర్పాట్లు కావించారు.

రామరాయల వంటి అనుభవజ్ఞుడైన రాజతీనిజ్ఞుడు మత దురహంకారంతో ప్రవర్తించి, బలమైన శత్రు వర్గాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించాడని ఊహించలేం కదా. ఇబ్రహీం కుతుబ్‌షాను రమరాయలు తన ఆస్థానంలో ఉండనిచ్చి గౌరవంతో చూడటం కూడా మనకు తెలిసిందే. కనుక ఫాదర్ హీరాస్ అభిప్రాయం సరైనది కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

రామరాయలు మహ్మదీయ మతాన్ని తక్కువగా చూసి, కించపర్చాడని, అదే బన్నిహట్టి యుద్ధానికి కారణమన్న వాదన కూడా ఉంది. ఈ అభిప్రాయం బలంగా కలగటానికి కారకులు మహ్మదీయ చరిత్రకారులే. దక్కన్‌లోని మహ్మదీయ సుల్తానుల కొలువులో ఉన్న మహ్మదీయ చరిత్రకారులు, తమ పాలకుల మెప్పు పొందేందుకు, రామరాయలపై అబద్ధాలు రాసి ప్రచారం చేశారు.

రామరాయలు దండయాత్రల సమయంలో మహ్మదీయుల ప్రార్థనా స్థలాల పవిత్రతను చెడగొట్టాడని, పవిత్ర ఖురాన్‌ను అవమానపరిచాడని, మహ్మదీయ స్త్రీలను చెరిచాడని ఫెరిస్టా రాయటమే ఈ అభిప్రాయానికి కారణం. రామరాయలు తన రాజధానిలో మహ్మదీయ సైనికుల కోసం మసీదును నిర్మించాడని, తన సింహాసనం పక్కనే ఒక ప్రత్యేక ఆసనం మీద పవిత్ర ఖురాన్‌ను ఉంచాడని కొందరు మహ్మదీయ చరిత్రకారులే రాశారు. చాలాకాలం పాటు రామరాయలు, బహమనీ సుల్తానులు స్నేహపూర్వకంగా మెలిగారు, కాబట్టి రామరాయలు మహ్మదీయ మతాన్ని కించపరచాడన్నది వాస్తవం కాదని చెప్పవచ్చు.

'రామరాజు బకైరు' ప్రకారం బీజపూర్ సుల్తాను మినహాయించి మిగిలిన సుల్తానులు ముందే కలుసుకున్నారని తెలుస్తుంది. కాబట్టి మత విద్వేషమే ఈ యుద్ధానికి కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. సూక్ష్మంగా పరిశీలిస్తే మత విద్వేషమే యుద్ధానికి కారణమన్నది నిజం కాదనిపిస్తుంది.

ఫెరిస్టా లాంటి మతఛాందసుల ఆధారాలను నమ్మి ఫాదర్ హీరాస్, రాధేశ్యాం, ఎమ్.హెచ్.రామశర్మ మొదలైన చరిత్రకారులు రామరాయల దురహంకారం, ఛాందస సాంఘిక దృక్పథం, మత ద్వేషం ఈ యుద్దానికి ముఖ్యకారణమని ప్రచారం చేశారు. కానీ లోతుగా పరిశీలిస్తే రాజకీయ, సైనిక, ఆర్థిక కారణాలే మహ్మదీయ సుల్తానుల ఐకమత్యానికి కారణంగా కనిపిస్తాయి. 'బడే రామరాజు', 'బడే రామప్పయ్య' అని పేరుపడ్డ రామరాయల రాజకీయ ప్రాభవమే, మహ్మదీయులలో కలవరం రేకెత్తించి అసూయ, ద్వేషాలను పెంచి, భయంతో కూడిన ఐకమత్యాన్ని పెంపొందింప చేసి ఉంటుంది.

బహుశా విజయనగర రాజకీయాధిపత్యమే సుల్తానుల ఏకత్వానికి ప్రధాన కారణంగా ఊహించటంలో తప్పులేదు. దక్కన్ సుల్తానుల అంతఃకలహాల వల్లనే రామరాయలు వారికి చెందిన పట్టణాలను, కోటలను ఆక్రిమించుకోవడం జరిగింది. ఆవిధంగాసంపాదించినవే పానుగల్లు, కోవెలకొండ, కొండపల్లి, ఘన్‌పూర్, రాయచూర్, ముద్గల్, యాతగిరి, చాగన్ కోటలు. ఈ ప్రాంతాల్లో విజయనగర ప్రాబల్యం పెరిగింది.

రామరాయల చేతిలో నిజాంషా పొందిన పరాభవం మరువలేక పోవటం, పరాభవాగ్నితో రగిలిపోతున్న నిజాంషా ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైనదని తలచి, మహ్మదీయ పాలకుల్ని రెచ్చగొట్టడం కూడా ఈ యుద్ధానికి తక్షణ కారణం.

ఈ యుద్ధానికి మరొక కారణం- రామరాయలు విజయవంతంగా పోర్చుగీస్ వారితో ఒడంబడిక చేసుకొని, వారి దూకుడును అరికట్టటం. అందువల్ల పోర్చుగీస్ వారితో వర్తకవ్యాపారం విజయనగర పాలకుల గుత్తాధిపత్యం కిందికి వచ్చింది. ఫలితంగా ఇంతకు పూర్వం దక్కను సుల్తానులతో పోర్చుగీస్ వారు చేస్తున్న వర్గక వాణిజ్యాలు ఆగిపోయాయి. ఉత్తమ అశ్వాలు విజయనగరం వారికి దక్కటంతో విజయనగర అశ్వికదళం బాగా బలపడింది. ఈ విధంగా రామరాయల కాలంలో విజయనగరం ఆర్థికంగా సుసంపన్నం కావటం దక్కన్ సుల్తానుల ఈర్ష్యకు, అసూయకు కారణమైంది. ఇవే వారిలో ఐకమత్యానికి దారితీశాయి. బన్నిహట్టి యుద్ధానికి నేపథ్యం తయారైంది.

తళ్లికోటలో ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తళ్లికోటలో ఆలయం

ఈ యుద్ధం ఎక్కడ జరిగింది?

ఈ యుద్ధం జరిగిన ప్రదేశం పేరు ఏమిటి? ఎక్కడ ఉన్నది? అన్న విషయం గురించి చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. విస్మృత విజయనగర చరిత్ర (ఫర్గాటెన్ హిస్టరీ ఆఫ్ విజయనగర్) గ్రంథకర్త రాబర్ట్ సీవెల్ ఈ యుద్ధాన్ని తల్లికోట యుద్ధమన్నారు. తళ్లికోటలో పంచ సుల్తానులు రామరాయలకు వ్యతిరేకంగా ఏకమై ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ అక్కడ యుద్ధం జరుగలేదు. అయినా మహ్మదీయ చరిత్రకారులు, ఎస్.కృష్ణస్వామి అయ్యంగార్, సత్యనాథ అయ్యర్ వంటి వారు కూడా దీనిని తళ్లికోట యుద్ధమన్నారు.

ఇందుకు భిన్నంగా కొందరు దీనిని రాక్షసి తంగడి యుద్ధమన్నారు. అలా అన్నవారిలో ముఖ్యులు కె.ఎ.నీలకంఠ శాస్త్రి, నేలటూరు వెంకటరమణయ్య, పట్వర్థన్ మొదలైనవారు. బసారిన్-ఉన్-సలాతన్, అసర్ వంటివారు గ్రంథాల్లో కృష్ణా తీరంలో యుద్ధం జరిగిందని రాశారు. కానీ హిందూ ఆధారాలు మాత్రమ రక్షసి తంగడి గ్రామాల మధ్య జరిగిందని విశ్వసించి ఆ యుద్ధాన్ని రాక్షసి తంగడి యుద్ధమన్నారు.

ఈ యుద్ధం కృష్ణానది ఒడ్డున 30 మైళ్ల దూరంలో సలత్‌వాడకు ఆరు మైళ్ల దూరంలో జరిగిందని, మహ్మదీయ సైన్యాలు ఎడమవైపునున్న ఇంగలిగ రేవు మీదుగా నదిని దాటాయి అని బీజపూర్ జిల్లా గెజిటీర్‌లో జె.ఏ.కాంప్‌బెల్ తెలిపారు. అంతేగాక కృష్ణ కుడి ఒడ్డున తిండిహాల్ గ్రామం దగ్గర రామరాయలు నిర్మించిన రక్షణ ప్రదేశాలను కనుగొన్నాడు. రాబర్ట్ సీవెల్ కూడా దక్కన్ సుల్తానుల సైన్యాలు ఇంగలిగ రేవు గుండా దాటాయని, బహుశా ఇంగలిగ బాయపురా గ్రామం వద్ద గల మైదానంలో యుద్ధం జరిగి ఉండవచ్చు.

యుద్ధం కృష్ణకు దక్షిణపు ఒడ్డున జరిగిందని, రాక్షసి తంగడి గ్రామాలు ఉత్తర ఒడ్డున ఉన్నాయని, దక్కన్ సుల్తానుల సైన్యాలు ఉత్తర ఒడ్డున ఉన్న ధనూర్ రేవు వరకు వెళ్లి, అక్కడి నుంచి వెనక్కు తిరిగి, ఇంగలిగ రేవును దాటి, మాస్కి, దాని దక్షిణ ఉపనదికి మధ్య ఉన్న బన్నిహట్టి గ్రామానికి చేరాయని, అక్కడికే విజయనగర సైన్యాలు కూడా చేరాయని, కనుక ఈ యుద్ధాన్ని కృష్ణ యుద్ధమని హెచ్.కె.షేర్వాణి అన్నాడు.

హెచ్.కె.షేర్వాణితో రాధేశ్యామ్ కొంతవరకు అంగీకరిస్తూనే, ఈ యుద్ధాన్ని కృష్ణ యుద్ధం అనటం కన్నా బన్నిహట్టి యుద్ధమనడటం సమర్థనీయం అన్నారు. భారతదేశపు సర్వే పటాల్లో యుద్ధం జరిగిన స్థలం ఇస్లాంపూర్‌కు మూడు మైళ్ల దూరంలో గుర్తించడం జరిగింది. కానీ బన్నిహట్టిగా కాదు. షేర్వాణి, రాధేశ్యామ్‌లు కూడా ఇస్లాంపూర్‌ వద్ద యుద్ధం జరిగిందన్న గాథలు ప్రచారంలో ఉన్నాయన్నారు. అయితే వారెందుకు ఈ విషయం మరచిపోయి, కృష్ణ యుద్ధం, బన్నిహట్టి యుద్ధం అన్నారో తెలియదు. బన్నిహట్టి గ్రామం ఆనాడు ఉందో లేదో నిర్ధారణ అయితే తప్ప ఈ విషయం స్పష్టంగా తేలదు. ఇప్పటికీ ఈ యుద్ధాన్ని రాక్షసి తంగడి యుద్ధమని పిలిచేవారు చాలామంది ఉన్నారు.

ఈ యుద్దం ఎక్కడ జరిగినా, ఆ ప్రదేశాన్ని ఏ పేరుతో పిలిచినా యుద్ధం చాలా కాలం జరిగింది. ఆ యుద్ధంలో అనేక ఘట్టాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది రామరాయల మరణం - బహుశా చివరిది అయి ఉండవచ్చు. ఈ ఘట్టం రాక్షసి తంగడిలో జరిగి ఉండవచ్చునని కనుక దానిని రాక్షసి తంగడి యుద్ధం లేదా రక్కసి తంగడి యుద్ధంగా పిలవాలని కొందరి అభిప్రాయం.

ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందన్న విషయంలో కూడా అభిప్రాయబేధాలు ఉన్నాయి. 'రామరాజ బకైర్' రామరాయలు శాలివాహన శకం, రాక్షస నామ సంవత్సరం, వైశాఖ మాసంలో 8వ రోజున.. అనగా క్రీ.శ. 1565లో జరిగిందన్నది. ఇందుకు భిన్నంగా రామరాయలు చనిపోయింది క్రీ.శ.1565 జనవరి 23న అని రాధేశ్యామ్ పేర్కొన్నారు. ఈ యుద్ధం క్రీ.శ. 1565 ఫిబ్రవరిలో జరిగిందని కేళిది నృపవిజయ అనే గ్రంథం పేర్కొంటుంది. ఈ అంశం ఫెరిస్టా, పేరు తెలియని గోల్కొండ రచయిత పేర్కొన్న దానికి దగ్గరగా ఉన్నది. రాబర్ట్ సీవెల్ రామరాయల మరణం 1565 జనవరి 23 అన్నారు. బహుశా రామరాయల మరణానికి కారణమైన యుద్ధంలో ఆఖరి ఘట్టం 1565 జనవరి 23 లేక 26 తేదీలలో జరిగి ఉండవచ్చు.

ఈ యుద్ధంలో ఎంతమంది సుల్తానులు పాల్గొన్నారన్న విషయంలో కూడా వాదోపవాదనలున్నాయి. దక్కన్ సుల్తానులు, అక్బర్ చక్రవర్తి కూడా పాల్గొన్నట్లు గుత్తి కైఫియత్, రామరాజ బకైర్‌లు పేర్కొనగా.. బీజపూర్, బీదర్, దౌలతాబాద్, అహ్మద్‌నగర్ సుల్తానులు పాల్గొన్నట్లు కడప కైఫియత్ తెలుపుతుంది. ఈ విషయాన్ని నిర్ధారణ చేసే ఆధారాల్లో స్పష్టత లేకపోవటమే ఈ సమస్యకు కారణం. ఫెరిస్టా ఈ యుద్ధంలో పాల్గొన్నవారిలో అహ్మద్‌నగర్, గోల్కొండ, బీజపూర్‌ను పేర్కొని, బీదర్ పేర్కొనలేదు. నలుగురు సుల్తానులు పాల్గొన్నట్లు మహ్మదీయ, పోర్చుగీసు ఆధారాలు తెలుపుతున్నాయి.

కాబట్టి రామరాయలకు వ్యతిరేకంగా నిజాం, ఆదిల్‌షా, కుతుబ్‌షా, బరీద్‌షాలు ఏకమై యుద్ధం ప్రకటించారు. కనుకనే పంచ సుల్తానుల కూటమి అనటం కంటే నలుగురు సుల్తానుల కూటమి అనటం సమంజసం. ఈ కూటమి ఏర్పడటానికి ప్రధాన కారకుడు ఎవరు? అన్నది కూడా వివాదాస్పదమే. ప్రతి మహ్మదీయ చరిత్రకారుడు దీనిని తమ తమ పాలకులకు ఆపాదించాలని ప్రయత్నించారు. ఫలితంగా ఈ సమస్య తలెత్తింది. రామరాయల వల్ల ఎక్కువగా నష్టపోయిన, అవమానానికిగురైన అహ్మద్‌నగర్ సుల్తాన్ నిజామ్‌షాయే ఈ కూటమి ఏర్పాటుకు ప్రధాన ప్రోత్సాహకారకుడుగా భావించవచ్చు.

కత్తులు

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధంలో ఎత్తులు, జిత్తులు...

ఈ ఏర్పాట్ల సందర్భంలోనే వారిలో వారు వివాహ సంబంధాలు పెంపొందించుకున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న రామరాయలు ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రయత్నాలు ఆరంభించారు. రామరాయలు యుద్ధప్రయత్నాలు చేస్తున్నప్పుడే, ఆదిల్‌షా తన కోటలను తిరిగి ఇచ్చివేయమని కబురు చేశాడు. రామరాయలు ఆదిల్‌షా కోరికను తిరస్కరించాడు. దక్కన్ సుల్తానులకు కావల్సిందదే. దీన్ని అదనుగా తీసుకొని రామరాయలపై యుద్ధం ప్రకటించారు.

యుద్ధం ఆరు నెలలు జరిగిందని స్థానిక చరిత్రలు తెలుపుతున్నాయి. యుద్ధానికి ఇరుపక్షాలు సిద్ధమై, సుల్తానుల సైన్యాలు కృష్ణానది ఉత్తర ఒడ్డుకు చేరగా, రామరాయల సైన్యం కృష్ణకు దక్షిణ ఒడ్డున విడిది చేసింది. ఒకరి సైన్యాలు మరొకరి సైన్యాలు ఎదురుగా ఉండటంతో సుల్తానుల సైన్యాలు ఇంగలిగ రేవును దాటకుండా, యుక్తి పన్ని నది దిగువకు వెళ్లాయి. రామరాయల సైన్యం కూడా దిగువకు నడిచింది. మూడు రోజుల తరవాత సుల్తానుల సైన్యాలు రాయల సైన్యాలు కన్నుకప్పి వేగంగా వెనుకకు వచ్చి ఇంగలిగ రేవు దాటి విజయనగరంలోకి ప్రవేశించాయి. ఈ విషయం తెలుసుకున్న రామరాయల సైన్యాలు, సుల్తానుల సైన్యాలకు ఎదురుపడి తీవ్రంగా నష్టపోయాయి.

ఈ రెండు సైన్యాలు హక్కేరి, ఇర్కాల్ వద్దకు చేరుకున్నాయి. ఇరుపక్షాలు తమ సైన్యాన్ని మూడేసి భాగాలుగా విభజించి, సమర్థులైన సైనికాధికారుల సారథ్యంలో తలపడ్డాయి. మూడు రోజుల పాటు భీకరపోరాటం జరిగింది. దీనిలో ఇరపక్షాలు నష్టపోయాయి.

ఈలోపల లోపాయికారిగా బీజపూర్ సుల్తాన్, రామరాయలు ఒప్పందానికి వచ్చారు. రామరాయలు తన సైన్యంతో విజృంభించాడు. కానీ మహ్మదీయ సైన్యాలు మాట తప్పటంతో, ఆదిల్‌షా సైన్యాలు ఆకస్మికంగా రామరాయలపై దాడి చేశాయి. ఈలోపల రామరాయల సైన్యంలోని మహ్మదీయులు కూడా రామరాయలను వదిలివేసి సుల్తాన్ సైన్యంలో చేరిపోయారు. సుల్తాన్ సైన్యం విజృంభించి వెంటబడటంతో విజయనగర సైన్యాలు కకావికలమయ్యాయి.

ఈ పోరాటంలో 80 ఏళ్ల వయసున్న రామరాయలు చనిపోగా, అతని సోదరుడు వెంకటాద్రి కన్నుపోయి యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. ఈ యుద్ధం గురించి ఎన్నో సందేహాలున్నట్లే, రామరాయలు చనిపోవటం గురించి కూడా వాదోపవాదాలున్నాయి.

కొందరి అభిప్రాయం ప్రకారం.. రామరాయల్ని వెనుకనుంచి అతని కొలువులో ఉన్న ముస్లిం సర్దార్ బల్లెంతో పొడిచి చంపాడు. అయితే రామరాయలు ఏనుగు దిగి, గుర్రం ఎక్కబోతుండగా, నిజాం సైనికులకు చిక్కటంతో హుస్సేన్ నిజాంషా రామరాయల తలను నరికి బల్లెంపై ఎత్తి చూపగా విజయనగర సైన్యం చెల్లాచెదురైందని మరొక అభిప్రాయం. దిల్లీ చరిత్రకారుడైన నిజాముద్దీన్ అహ్మద్ ప్రకారం హుస్సేన్ నిజాంషా సైనికులు కాల్చిన ఫిరంగి గుండు తగిలి రామరాయల తల పగిలిపోగా, అది చూసి విజయనగర సైన్యం పారిపోగా సుల్తాన్ సైన్యం వారిని చుట్టుముట్టి చంపాయి.

విజయనగరం ఈ యుద్ధంలో ఓడిపోవటం, రామరాయలు చనిపోవటం వల్ల మహ్మదీయులు హింసిస్తారేమోనన్న భయంతో తిరుమలరాయలు యుద్ధ భూమి నుంచి పారిపోయి, విజయనగరం చేరి, సదాశివ రాయలను, స్త్రీలను, పిల్లలను, సంపదను తీసుకొని పెనుగొండకు పారిపోయాడు.

ఈ యుద్ధంలో విజయం పొందిన సుల్తానులు 10 రోజులు యుద్ధరంగంలో ఉండి, విజయనగరంపై దండెత్తి, దాదాపు ఆరు నెలలు విజయనగరంలో మకాం వేసి, అనేక వేల మంది సాధారణ ప్రజలను చంపి, ఇళ్లను ధ్వంసం చేసి, తగులబెట్టి, ఆ వైభవ నగరాన్ని మహాస్మశానంగా మార్చారు. అటువంటి విషాద సంఘటన ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదన్న రాబర్ట్ సీవెల్ వ్యాఖ్యానం సరైనదనిపిస్తుంది.

ఈ యుద్ధ ప్రభావం, ఫలితం గురించి వాదోపవాదాలున్నాయి. భారతదేశ భవిష్యత్తును గాఢంగా ప్రభావితం చేసిందన్న బలమైన అభిప్రాయం ఉంది. ఈ యుద్ధం దక్షిణ భారతంలో హిందూ సామ్రాజ్యానికి చరమగీతం పాడిందని ప్రముఖ చరిత్రకారుడు ఈశ్వరీప్రసాద్ అన్నారు. ప్రత్యక్ష ఫలితమేమిటంటే ఈ యుద్ధంతో తుళువ వంశ ప్రాబల్యం విజయనగరంలో తుడిచిపెట్టుకుపోయి, విజయనగరం పూర్వ ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని కోల్పోవడం.

ఈ యుద్ధంలో విజయం సాధించిన గోల్కొండ, బీజపూర్ సుల్తానులు తమ ప్రాబల్యాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపచేసుకునే అవకాశం వచ్చినా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీనికి కారణం వారిమధ్య బలంగా నాటుకుపోయిన అసూయాద్వేషాలు. వాటి ఫలితంగా వారు కోలుకోలేని దెబ్బతిని, మొగల్ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో విస్తరణ చెందేందుకు పరోక్షంగా సహాయపడ్డారు.

ఈ యుద్ధంలో విజయనగర ఓటమి, వైఫల్యం ప్రత్యక్షంగా పోర్చుగీసులకు ఎంతో నష్టం కలిగించాయి. విజయనగర పతనంతో, పోర్చుగీస్‌ల వర్తక వ్యాపారం దెబ్బతిని, రాజకీయంగా నష్టపోయి, కొద్దికాలంలో వారు మూటాముల్లె సర్దుకొని వెళ్లిపోవలసి వచ్చింది.

కానీ ఈ యుద్ధం విజయనగర రాజ్యానికి సంబంధించినంత వరకు పూర్తి పతనానికి దారితీయలేదు. విజయనగర పట్టణం బాగా దెబ్బతినింది. యుద్ధానంతరం విజయనగర రాజ్యం మరో వంద సంవత్సరాలు దక్షిణ దేశంలో తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. కాని పాత వైభవంతో మాత్రం కాదన్నది గుర్తుంచుకోవాలి.

సూక్ష్మంగా పరిశీలిస్తే, ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్య పునాదులను తీవ్రంగా కదిలించిందని చెప్పక తప్పదు. ఈ యుద్ధ ఫలితం, ప్రభావం గురించి చీమకుర్తి శేషగిరిరావు ఇలా రాశారు:

''తల్లికోట లేక రాక్షసి తంగడి యుద్ధం తెలుగుదేశపు చరిత్రలోనే కాదు, యావద్భారత ఉపఖండ చరిత్రలోనే ఒక కొత్త మలుపుకు దారితీసిన సంఘటన... ఆ యుద్ధం భారత రాజకీయ వ్యవస్థలో క్రమక్రమంగా ఒక శూన్యత ఏర్పడటానికి దారితీసింది. ఆ యుద్ధంలో తాత్కాలికంగా దక్షిణాపథపు ముస్లిం రాజ్యాలు విజయాన్ని పొందినప్పటికి వారి ఐకమత్యం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అవశిష్ట విజయనగర సామ్రాజ్యాన్ని పంచుకోవడంలో వారి మధ్య అంతులేని కలహాలు చెలరేగాయి. కడకు సుల్తానుల బెడదవల్లనూ, సామంతుల అంతఃకలహాల వల్లను చినికి జీర్ణమై అవశిష్ట విజయనగర సామ్రాజ్యం అంతరించిందనుట యదార్థమే అయినా ఇటువంటి దీర్ఘ పోరాటం వలన దక్కన్ ముస్లిం రాజ్యాలు సైతం తమ పటిమను కోల్పోయాయి. ఆ అదనును చక్కగా ఉపయోగించుకొని మొగల్ సార్వభౌముడైన ఔరంగజేబు ఆ రాజ్యాలు అన్నిటిని 1681 నాటికి వశపరచుకోవటంతో మన దక్షిణాపథంలో మొగల్ సామ్రాజ్యం వ్యాపించి తెలుగుదేశం అందులో అంర్భాగమైంది... ఇటుల రక్కసి తంగడి యుద్ధంతో మొదలైన సంఘటనల పరంపర 18వ శతాబ్ద ప్రథమ పాదము ముగిసేసరికి కడకు భారత రాజకీయ వ్యవస్థలో సర్వ శూన్యతను తెచ్చి పెట్టింది.''

(ఆధారం: తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన 'ఆంధ్రప్రదేశ్ చరిత్ర' పుస్తకం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)