వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిరాకరించిన ఆసుపత్రి

ఫొటో సోర్స్, CBS
కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదనే కారణంతో ఒక రోగికి అమెరికాలోని ఒక ఆసుపత్రి గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స చేసేందుకు నిరాకరించింది.
31 ఏళ్ల డీజే ఫెర్గూసన్‌కు గుండె మార్పిడి చికిత్స అత్యవసరం. కానీ గుండె మార్పిడి చేసే వ్యక్తుల జాబితాలో నుంచి ఫెర్గూసన్ పేరును బోస్టన్‌లోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ ఆసుపత్రి వైద్యులు తొలగించారని ఆయన తండ్రి డేవిడ్ చెప్పారు.
''కోవిడ్ వ్యాక్సీన్, నా కొడుకు ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. అతను టీకాను నమ్మడు'' అని ఫెర్గూసన్ తండ్రి డేవిడ్ తెలిపారు.
ఆసుపత్రి విధానాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు.
''ఇప్పటికే అవయవాల కొరత ఉంది. అందుకే ఎవరైనా రోగికి అవయవ మార్పిడి చేస్తే, వారు వీలైనంత ఎక్కువకాలం జీవించేలా మేం చేయాల్సిందంతా చేస్తాం. ఈ విషయంలో రాజీపడం'' అని బీబీసీతో బ్రిగమ్ అండ్ ఉమెన్స్ ఆసుపత్రి చెప్పింది.
''రోగికి చేసిన అవయవ మార్పిడి చికిత్స విజయవంతం కావడానికి, అవయవాన్ని స్వీకరించిన రోగి అత్యధిక కాలం జీవించి ఉండేందుకు సదరు రోగి... మెరుగైన జీవన శైలిని పాటించడంతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని ఆసుపత్రి వర్గాలు బలంగా నమ్ముతాయి. ఎందుకంటే రోగిలో సాధారణంగానే రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా అణిచివేతకు గురై ఉంటుంది'' అని ఆసుపత్రి అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఫెర్గూసన్‌ను అవయవ మార్పిడికి అనర్హుడిగా ప్రకటించడానికి టీకా అంశంతో పాటు వేరే కారణాలు కూడా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. కానీ రోగి ప్రైవసీ దృష్ట్యా ఆ కారణాలు చెప్పేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి.
''ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న లక్షకు పైగా రోగులకు, మరో ఐదేళ్ల వరకు అవయవమార్పిడి చేసే వీల్లేదు. ఈ మేరకు అవయవాల కొరత ఉందని'' ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గతేడాది నవంబర్ 26నుంచి ఫెర్గూసన్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన వంశపారంపర్యంగా వచ్చే గుండె సమస్యతో బాధపడుతున్నారు. 'గో ఫండ్ మీ' సంస్థ ప్రకారం, ఈ వ్యాధి కారణంగా రక్తం, నీటితో ఆయన ఊపిరితిత్తులు నిండిపోతాయి.
''కార్డియాక్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతానేమో అని ఫెర్గూసన్ ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెప్పింది. అయితే ఈ స్థితి చాలా అరుదుగా సంభవిస్తుందని, తాత్కాలికంగానే దీని ప్రభావం ఉంటుందని కూడా సీడీసీ నొక్కి చెప్పింది. అతని గుండె బలహీనంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే కార్డియాక్ ఇన్‌ఫ్లమేషన్ ప్రాణాంతకంగా మారుతుందని ఫెర్గూసన్ భయపడుతున్నారు''అని 'గో ఫండ్ మీ' ఆర్గనైజర్ ఒకరు చెప్పారు.
అవయవ మార్పిడి అవసరమున్న రోగులు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని సీడీసీ చెబుతోంది.
''ఏదైనా అవయవ మార్పిడి తర్వాత రోగిలో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా క్షీణిస్తుంది. సాధారణ జలుబు కూడా ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది'' అని సీబీఎస్ న్యూస్‌తో ఎన్‌వైయూ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, మెడికల్ ఎథిక్స్ హెడ్ డాక్టర్ ఆర్థర కాప్లన్ చెప్పారు.
''అసలే, అవయవాల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిపాటి జీవించే అవకాశం ఉన్నవారికి వాటిని అమర్చలేం. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకొని ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని పక్కనబెట్టి ఇలాంటి వారి కోసం అవయవాలను ఉపయోగించలేం'' అని కాప్లన్ వివరించారు.
ఫెర్గూసన్‌కు ఇద్దరు పిల్లలు. త్వరలోనే వారింట్లో మూడో బిడ్డ కూడా జన్మించనున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.
వేరే ఆసుపత్రికి తరలించాలంటే, ఆయన చాలా బలహీనంగా ఉన్నారని.. సమయం మించిపోతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
''మా అబ్బాయి, చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు. అతను కొన్ని నమ్మకాలను, సూత్రాలను విశ్వసిస్తాడు. తాను నమ్మిన సూత్రాలకు, నమ్మకాలకు అతను కట్టుబడి ఉంటాడు. ఈ లక్షణాలే అతన్ని, నేను మరింత గౌరవించేలా చేస్తాయి'' అని డేవిడ్ ఫెర్గూసన్ వ్యాఖ్యానించారు.
''అది, అతని శరీరం. అతని ఇష్టం'' అని పేర్కొన్నారు.
వ్యాక్సీన్ తీసుకోని అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి అభ్యంతరాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే ఇలాంటి మరో కేసు నమోదైంది.
ఈనెల ప్రారంభంలో మిన్నెసోటాకు చెందిన ఒక మహిళ, స్థానిక ఆసుపత్రిపై కేసు వేశారు. వెంటిలేటర్ నుంచి ఆమె భర్తను తొలగించడానికి వైద్యులు ప్రయత్నించారు. ఆయన టీకా తీసుకోలేదు. గత రెండు నెలలుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు.
అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా ఉందని కాన్పు చేయలేదు.. ఆసుపత్రి గేటు వద్ద చెంచు మహిళ ప్రసవం
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
- పుతిన్ క్రిమియాను రష్యాలో ఎలా విలీనం చేశారు
- పద్మ అవార్డులు: మొగిలయ్య, గరికపాటిలకు పద్మశ్రీ.. ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణలకు పద్మ భూషణ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














