అమెరికాను పాలించడం ఎవరివల్లా కాదా? ఈ దేశం ముక్కలైపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిక్ బ్రియాంట్
- హోదా, బీబీసీ కోసం
జో బైడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు.. ఆ వేదిక మీద ఆయన ఆ తర్వాత చదవబోయే టెలీప్రాంటర్‌ను టెక్నీషియన్లు పరీక్షిస్తూ.. ప్రసిద్ధ ప్రసంగాన్ని స్క్రోల్ చేశారు:
‘‘ఎనబై ఏడు సంవత్సరాల కిందట మన తండ్రులు ఈ ఖండం మీద సరికొత్త దేశాన్ని సృష్టించారు. స్వేచ్ఛలో పురుడుపోసుకున్న దేశమిది. మనుషులంతా పుట్టుకతో సమానులనే సిద్ధాంతానికి అంకితమైన దేశమిది. ఇప్పుడు మనం ఓ గొప్ప అంతర్యుద్ధాన్ని ఎదుర్కొటున్నాం. ఆ దేశం.. అసలు అలా పుట్టిన, అలా అంకితమైన ఏ దేశమైనా దీనిని తట్టుకుని నిలబడుతుందా అనే విషమ పరీక్షను ఎదుర్కొంటున్నాం.’’
అధ్యక్షుడి పోడియం ముందు నేను మొదట ఈ వాక్యాలు చూసినపుడు ఇదేదో జోక్‌లాగా ఉందే అనుకున్నాను. అయితే.. అబ్రహాం లింకన్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వర్తించవని చెప్పటం కష్టం. ఆ ఉదయం వాషింగ్టన్ ఓ సైనిక శిబిరం లాగా కనిపించింది.
సరిగ్గా లింకన్ ప్రమాణ స్వీకారం నాటి తరహాలోనే.. సైనికులు ఆ రాత్రి కూడా అమెరికా పార్లమెంటు భవనం కాంగ్రెస్ కారిడార్లలోనే పడుకున్నారు. విద్రోహుల నుంచి ఆ భవనాన్ని కాపాడటానికి.
ప్రమాణ స్వీకారానికి సరిగ్గా రెండు వారాల ముందు.. ఇదే వేదిక మీద అప్పటి లాగానే అమెరికన్లు – అమెరికన్లతో తలపడ్డారు.
కాబట్టి, అమెరికా 16వ అధ్యక్షుడు వేసిన ప్రశ్నకు.. 46వ అధ్యక్షుడు అధికారం చేపట్టేటపుడు కూడా ప్రసాంగికత ఉంది: ఈ దేశం దీర్ఘకాలం నిలబడుతుందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆ రోజు జో బైడెన్ ప్రసంగిస్తూ.. మామూలుగా అధ్యక్షుల ప్రమాణ స్వీకారంలో మాట్లాడినట్లు దేశ పునరుద్ధరణ గురించి కాకుండా జాతీయ పునరేకీకరణ గురించి మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యం విజయం సాధించింది’ అన్న ఆయన మాటలు తక్షణమే చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కాయి. అయితే.. ‘అమెరికాను మళ్లీ ఐక్యం చేయటం. మన ప్రజలను సమైక్యం చేయటం. మన దేశాన్ని సమైక్యం చేయటం’ అంటూ ఆయన చేసిన ప్రకటన ఆయన ప్రాధాన్యతలను ప్రకటించింది.
ఏడాది గడచిపోయింది. జాతీయ సమైక్యత పిలుపు ఇప్పుడు ఓ భ్రాంతిగా అనిపిస్తుంది. మళ్లీ సమైక్యం కావటం కాదుకదా.. అమెరికా ఇప్పుడు విచ్ఛిన్నమయ్యే మరింత ప్రమాదకర పరిస్థితిలో ఉంది. అసలు ఈ దేశాన్ని కలిపి ఉంచుతున్న అంశం ఏదైనా ఉందా అంటే.. అది పరస్పర ద్వేషమేనని అనిపిస్తోంది. అమెరికా తనతో తాను అంతులేని యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాది కాలంలో.. గర్భస్రావ హక్కుల వంటి దీర్ఘకాలంగా కొనసాగుతున్న విభిన్నమైన అంశాలపై ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. వ్యాక్సీన్ ఆదేశాల వంటి కొత్త అంశాలపై కూడా దేశంలో వాగ్యుద్ధం జరుగుతోంది. పాత పోరాటాలను కొత్తగా పోరాడే మార్గాలను కూడా ఈ దేశం కనుగొన్నది. దేశంలో కుడి – ఎడమ పక్షాల సాంస్కృతిక యుద్ధంలో.. కీలకమైన జాతి సిద్ధాంతం మీద తాజాగా సంఘర్షణ జరుగుతోంది. బానిసత్వం, నల్లజాతి వారిని వేరుగా ఉంచటం మీద శతాబ్దాలుగా సాగుతున్న చర్చకు సరికొత్త రూపమిది.

ఫొటో సోర్స్, Getty Images
విభజనలను తగ్గించగలిగే అవకాశమున్న పరిణామాల మీద.. ఉదాహరణకు జార్జ్ ఫ్లాయిడ్‌ను హత్య చేసిన పోలీసు అధికారి డెరెక్ చావిన్‌ను దోషిగా నిర్ధారించటం వంటి సందర్భాల మీద.. ఆ విభజనలను మరింత బలోపేతం చేసే సంఘటనలు పైచేయి సాధించాయి.
విస్కాన్సిన్‌లోని కెనోషాలో జాతి అల్లర్ల సమయంలో ఇద్దరు పురుషులను కాల్చి చంపిన కేసులో టీనేజర్ కైలీ రిటెన్‌హౌస్‌ను నిర్దోషిగా విడుదల చేయటం అందులో ఒకటి.
అతడిని దోషిగా నిర్ధరించాలని వాదించే వారు.. అతడు జాతిపరమైన నిరసనకు వెళుతూ మిలటరీ తరహా సెమీ-ఆటోమేటిక్ తుపాకీని వెంట తీసుకెళ్లిన నరహంతక జాత్యహంకారి అని మండిపడుతున్నారు. అతడి మద్దతుదారులు మాత్రం.. అతడు దేశభక్తుడైన అమెరికా హీరో అని అభివర్ణిస్తున్నారు. ఓ మితవాద వెబ్‌సైట్ అతడిని ‘సెయింట్ కైలీ’ అని కూడా కీర్తించింది.
ఈ టీనేజర్.. విభనకు తాజా తార్కాణమయ్యాడు. అతడి విచారణ చుట్టూ జరిగిన చర్చ.. ఆగ్రహపూరిత గందరగోళానికి, తుపాకీ నియంత్రణ, స్వీయ రక్షణ చట్టాలు, పోలీసుల తీరు, న్యాయ వ్యవస్థలో ద్వంద్వ ప్రమాణాలపై సంవాదాలకు దిగజారింది.
అమెరికా సమాజంలో ఇప్పుడు సాధారణంగా మారిపోయినట్లుగా.. సంక్లిష్టమైన, సున్నితమైన అంశాలతో కూడిన విధానపరమైన ప్రశ్నలు ఈ తుపానులో కొట్టుకుపోయాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా విభజన రిక్టర్ స్కేలు మీద.. ఈ రిటెన్ హౌస్ విచారణ కేవలం ఓ చిన్నపాటి భూకంపమే. జనవరి 6వ తేదీ ఘటన తర్వాతి ప్రకంపనలు మరింత తీవ్రంగా కొనసాగుతున్నాయి.
ఆ నాటి కాపిటల్ హిల్ దాడి.. ట్రంప్ తరహా వైఖరులను తిప్పికొట్టకపోగా సంప్రదాయ ఉద్యమాన్ని మరింత ఉగ్రంగా మలచింది.
ఆ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారనే ‘పెద్ద అబద్ధం’, జో బైడెన్ గెలిచినట్లు ప్రకటించన కొన్ని గంటలకు మొదలైన కుట్ర సిద్ధాంతం.. ప్రధాన స్రవంతి రిపబ్లికన్ ఆలోచనా విధానంగా మారిపోయింది.
ఇప్పుడు మనం చూస్తున్నది ఆధునిక అమెరికాలో మునుపెన్నడూ లేనిది - తన పార్టీ నుంచి ఇంకా విస్తృత మద్దతు పొందుతున్న ఒక మాజీ అధ్యక్షుడు.. విస్పష్టమైన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించటానికి తిరస్కరించటం. ప్రజాస్వామ్యం మీద కూడా ఇది కొనసాగుతోంది. ఇదంతా జనవరి 6వ తేదీ రాత్రితో ఆగిపోలేదు.
గడచిన సంవత్సరంలో రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న డజనుకు పైగా రాష్ట్రాల చట్టసభలు.. ఓట్ల మీద ఆంక్షలు విధిస్తూ చట్టాలు చేశాయి. ఎన్నికల నిర్వహణలో పక్షపాతపూరితంగా జోక్యం చేసుకోవటం సులభమయ్యేలా కూడా చట్టాలు చేశారు. ఇది.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌధాన్ని మళ్లీ హస్తగత చేసుకోవటానికి నెమ్మదిగా సాగుతున్న కుట్ర అని డెమొక్రాట్లు వాదిస్తున్నారు. ఇది మరో విభజన.
పౌర సమాజంలో విభేదాలను పరిష్కరించటానికి రూపొందించిన స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు అనే వ్యవస్థే.. ఇప్పుడు సమాజాన్ని చీల్చే వివాదానికి కేంద్రబిందువయ్యాయి.
ఆ వివాదానికి మూలం.. మరింత ప్రాధమికమైనది - నిఖార్సైన వాస్తవాలను కూడా అంగీకరించలేని వైఫల్యం - ఈ ఉదంతంలో బైడెన్ గెలిచాడనే పచ్చి నిజం. తప్పుడు సమాచారం, కుట్ర సిద్ధాంతాలతో రగిలే దేశంలో.. వాస్తవికతను గ్రహించే ఉమ్మడి తెలివిడి లేనపుడు.. సమైక్యత ఎలా సాధ్యమవుతుంది? సాధారణంగా.. పునఃకలయికకు నిజం అనేది ఒక అవసరం.
జనవరి 6వ తేదీ ఘటన.. మరింత భీకరమైన విస్ఫోటనానికి ముందుగా వచ్చే ప్రకంపన అని కొందరు భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇటీవల వరుసగా వచ్చిన కొన్ని పుస్తకాలు.. పౌర సంఘర్షణ, రాజకీయ అశాంతి భూతాన్ని మరింతగా పెంచటం మీద ఇంతగా ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారో ఇది విశదీకరిస్తోంది.
‘అంతర్యుద్ధాలు ఎలా మొదలవుతాయి: వాటిని ఆపటం ఎలా’ అనే పుస్తకంలో పొలిటకల్ సైన్స్ ప్రొఫెసర్ బార్బరా ఎఫ్ వాల్టర్ తన దేశాన్ని ‘అనోక్రసీ’ దేశంగా అభివర్ణించారు. అంటే ఆటోక్రసీ (ఏకవ్యక్తి స్వామ్యం), డెమొక్రసీ (ప్రజాస్వామ్యం) మిశ్రమం. దేశంలో ముఠా హింస మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
‘డివైడెడ్ వియ్ ఫాల్’ అనే పుస్తకంలో ఇరాక్ యుద్ధంలో మాజీ సైనికుడు డేవిడ్ ఫించ్.. అమెరికా సమాఖ్య నుంచి విడిపోవాలని కూడా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. 19వ శతాబ్దం మధ్యకాలపు అమెరికా అంతర్యుద్ధానికి ఇలాంటి వేర్పాటు నిర్ణయాలే కారణం.
అమెరికా పతనం మీద ఈ శతాబ్దం ఆరంభం నుంచీ రాసిన అనేక పుస్తకాల నుంచి ఓ కొత్త అధ్యయన ప్రక్రియ పుట్టుకొచ్చింది – అమెరికా విచ్ఛిన్నం అవకాశాలపై అధ్యయనం.
అమెరికా పూర్తిస్థాయి కార్చిచ్చు రగులుకునే అంచున ఉందని.. అంతర్యుద్ధం 2.0 రాబోతోందని, ఇరుపక్షాల వారూ సాయుధ పోరాటం చేస్తారని కొందరు అమెరికన్ స్కాలర్లు భావిస్తున్నారు.
సాయుధ ముఠాల కార్యకలాపాలు, రాజకీయ చర్చల్లో రెచ్చగొట్టే స్వరం పెరుగుతుండటం చూస్తే.. చార్లట్స్‌విల్‌లో శ్వేతజాతి ఆధిపత్య ప్రదర్శన, 1995 ఒక్లహామా సిటీ బాంబింగ్ వంటి రాజకీయ హింసాత్మక ఘటనలు చెదురుముదురుగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కూడా తీవ్ర ఆందోళనకరమైన విషయమే.
2020 చివర్లో జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గెటిస్‌బర్గ్‌లో ప్రసంగిస్తూ ప్రజా విభజన వల్ల హింసాత్మక పర్యవసానాలు తలెత్తే అవకాశాల గురించి ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. మనం మరోసారి విడిపోయి ఉన్నాం’’ అన్నారప్పుడు.
ఏకీభావం సాధించే నేతగా తనను తాను ప్రచారం చేసుకున్న అధ్యక్షుడు.. దేశం సంగతి తర్వాత కనీసం తన పార్టీని కూడా ఐక్యం చేయలేకపోయారు.
బైడెన్‌కు బాగా తెలిసినట్లుగా.. సమీప భవిష్యత్తులో మరిన్ని సంఘర్షణలు పొంచివున్నాయి. డాబ్స్ వర్సెస్ జాక్సన్ ఉమన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కేసులో సుప్రీంకోర్టు 2022లో తీర్పు ఇస్తుంది. గర్భస్రావానికి రాజ్యంగపరంగా ఉన్న హక్కును ఆ తీర్పు రద్దు చేయవచ్చు. అది.. అమెరికాలో మరింత విభజనకు దారితీస్తుంది.
మధ్యంతర కాంగ్రెస్ (పార్లమెంటు ఎన్నికలు).. ఘర్షణకు కారణమయ్యే మరో సందర్భం కాగలదు. ఉక్రెయిన్ విషయంలో రష్యాతో కానీ, తైవాన్ విషయంలో చైనాతో కానీ ఢీకొట్టేటపు కూడా.. దేశాన్ని సమైక్యం చేసేంత స్థాయిలో దేశభక్తి పెరుగుతుందని ఊహించటం కష్టం.
కరోనావైరస్ మహమ్మారి, జనవరి 6వ తేదీ చొరబాటు ల్లాగానే సైనిక ఘర్షణ కూడా.. దేశంలో చీలికలను మరింత చాటే అవకాశం ఎక్కువగా ఉంది.
ఏడాది కిందట ప్రమాణ స్వీకారం రోజున.. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ తన దేశానికి, ప్రపంచానికి భరోసా ఇచ్చినపుడు జో బైడెన్ స్వరంలో ఒక ఊరట వినిపించింది.
కానీ.. ఈ కొత్త రాజకీయ సంవత్సరంలో జనవరి 6వ తేదీ ఘటనను సంస్మరిస్తూ చేసిన ప్రసంగంలోనూ, జార్జియాలో ఓటు హక్కుల చట్టం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ చేసిన ప్రసంగంలోనూ.. ఆయన స్వరంలో నైరాశ్యం, విభజన గళం గుర్తుపట్టవచ్చు.
పునరైక్యం చేయాలనే తన ప్రాజెక్టు విఫలమైందని ఆయనకు అంతరాళాల్లో తెలిసి ఉండవచ్చుననటానికి ఇవి రెండూ సూచనలు కావచ్చు. చరిత్రకారులు ఒకనాటికి దీనిని వ్యక్తిగత వైఫల్యంగా చూడొచ్చు. కానీ చాలా మంది మరింత సానుభూతితో చూస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే.. ముక్కలైన దేశాన్ని, మరింత అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని ఏ అధ్యక్షుడైనా బాగు చేయగలిగారా?
అమెరికా 2026లో 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది. దేశంలో శాంతియుత సహజీవనం కొనసాగుతుందని, ప్రచ్ఛన్న అంతర్యుద్ధం ఎన్నడూ ప్రత్యక్షంగా బద్దలుకాదని ఆశిద్దాం. దేశం సుదీర్ఘ కాలం తట్టుకుంటుందా అంటే.. ఆ ప్రశ్నకు జవాబు ఇంకా తెలీదు.
నిక్ బ్రియాంట్.. ‘వెన్ అమెరికా స్టాప్డ్ బీయింగ్ గ్రేట్: ఎ హిస్టరీ ఆఫ్ ద ప్రెసెంట్’ పుస్తక రచయిత. ఆయన ఇప్పుడు సిడ్నీలో నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలి? - 8 ప్రశ్నలకు సమాధానాలు
- చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- రోజురోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు? మీరు తెలుసుకోవాల్సిన 7 కారణాలు..
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














