Price Rise: రోజురోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు? మీరు తెలుసుకోవాల్సిన 7 కారణాలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెథ్ టిమ్మిన్స్ , డానియెల్ థామస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
నిత్యావసర సరుకుల నుంచి ఎయిర్ కండీషనింగ్ వరకు అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రోజురోజుకీ ప్రజల జీవన వ్యయం పెరుగుతోంది. ఇది ఏ ఒక్క దేశానికో చెందిన పరిణామం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
అంతర్జాతీయ ద్రవ్యోల్బణం: ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు 2008 నుంచి పరిశీలించి చూస్తే అత్యధిక స్థాయిలో ఉంది. దీనికి కారణాలేంటి?
1. ఇంధన, పెట్రోల్ ఖర్చులు, ధరల పెరుగుదల:
మహమ్మారి ప్రారంభ దశలో ఆయిల్ ధరలు బాగా తగ్గాయి. కానీ, నెమ్మదిగా వాటికి డిమాండ్ పెరగడంతో, గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా అమాంతంగా ధరలు పెరిగిపోయాయి.
అమెరికాలో ప్రస్తుతం ఒక గ్యాలన్ గ్యాస్ సగటున 3.31 డాలర్లు (సుమారు రూ.246) ఖరీదు చేస్తోంది. ఒక సంవత్సరం క్రితం దీని ఖరీదు 2.39 డాలర్లు ( (సుమారు రూ. 177) ఉండేది. యూకే, యూరోపియన్ యూనియన్ లో కూడా ఇదే పరిస్థితి.
గ్యాస్ ఖరీదు కూడా పెరగడంతో పశ్చిమ దేశాల్లో సెంట్రల్ హీటింగ్ కోసం అయ్యే కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగాయి.
ఆసియా నుంచి ఇంధనానికి డిమాండ్ ఏర్పడటంతో వీటి ఖరీదు మరింత పెరిగింది. ఉన్న గ్యాస్ నిల్వలు కూడా బాగా తగ్గాయి.

ఫొటో సోర్స్, Getty Images
2. వస్తువుల కొరత
మహమ్మారి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.
లాక్ డౌన్ లో ఇళ్లకు పరిమితమైన వినియోగదారులు సెలవుల్లో రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గడంతో ఇంటికి కావల్సిన సరుకులు, గృహోపకరణాల కోసం చాలా ఖర్చు పెట్టారు.
కోవిడ్ నిబంధనల కారణంగా ఆసియాలో చాలా చోట్ల ఉత్పత్తిదారులు తమ సంస్థలను మూసేసే పరిస్థితి ఏర్పడింది.
దీంతో, పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ప్లాస్టిక్, కాంక్రీట్, స్టీల్ లాంటి సరుకుల కొరత ఏర్పడటంతో ధరలు కూడా పెరిగాయి.
యూకేలో 2021 లో కలప ధర సాధారణ ధర కంటే 80% పెరిగింది. అమెరికాలో సాధారణ ధర కంటే రెండింతలు పెరిగింది.
నైకీ, కాస్ట్ కో లాంటి రిటైల్ సంస్థలు కూడా సరఫరా వ్యవస్థ ధరలు పెరగడంతో, సరుకుల ధరలను రెట్టింపు చేశాయి.
కార్లు, కంప్యూటర్ లు, ఇతర గృహ వినియోగ సామగ్రిలో వాడే మైక్రో చిప్స్ కొరత కూడా ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
3. రవాణా చార్జీలు
ప్రపంచ వ్యాప్తంగా సరుకులను రవాణా చేసే అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు కూడా మహమ్మారి సమయం తర్వాత ఏర్పడ్డ డిమాండ్ తో ఉక్కిరి బిక్కిరయ్యాయి.
దీంతో, సరుకులను స్టోర్ లకు చేర్చేందుకు రిటైల్ వ్యాపారులు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో, వాటి భారం చివరకు వినియోగదారుల పై పడింది.
ఆసియా నుంచి యూరోప్ కు 40 అడుగుల సింగిల్ కంటైనర్ ను పంపేందుకు ఒక సంవత్సరం ముందు 1500 డాలర్లు (సుమారు రూ. 1, 11, 682) అయ్యే ఖర్చు ప్రస్తుతం 17000 డాలర్లకు (సుమారు రూ. 12,65,735) పెరిగింది. ఇది 10 రెట్లు ఎక్కువ పెరిగినట్లు అర్ధం.
దీంతో పాటు, విమాన రవాణా చార్జీలు కూడా బాగా పెరిగాయి. యూరోప్ లో లారీ డ్రైవర్ల కొరత కూడా ఏర్పడింది.
అమెరికాలో రేవులు కిక్కిరిసిపోవడంతో, డిసెంబర్ లో రవాణా అంతరాయాలు కొంత వరకు సడలిస్తున్నట్లు కనిపించింది.
అయితే, ఒమిక్రాన్, భవిష్యత్తులో రానున్న కోవిడ్ వేరియంట్లు ఈ పరిస్థితిని వెనక్కి తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
4. వేతనాల పెంపు
మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదా ఉద్యోగాలు మారడం లాంటివి జరిగాయి.
అమెరికాలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 40 లక్షల మంది ఉద్యోగాలను వదిలి పెట్టినట్లు లేబర్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
ఇది రికార్డు స్థాయిలో జరిగింది.
దీంతో, చాలా సంస్థలు డ్రైవర్లు, ఫుడ్ ప్రాసెసర్లు, రెస్టారెంట్లలో వెయిటర్ ల లాంటి వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
50 ప్రధాన యూఎస్ రిటైలర్ల తో నిర్వహించిన సర్వే లో ఖాళీ అయిన ఉద్యోగాలను పూరించేందుకు 94% మంది ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
దీంతో సంస్థలు ఉద్యోగులను నియమించుకునేందుకు, ఉన్న వారు కొనసాగేందుకు జీతాలను ఎక్కువగా ఇవ్వడం కానీ, లేదా బోనస్ ఇస్తామని చెప్పడం కానీ చేస్తున్నారు. మెక్ డొనాల్డ్ , అమెజాన్ లాంటి సంస్థలు 200 - 1000 డాలర్ల (సుమారు రూ. 14,800 - రూ. 74,475) వరకు నియామక బోనస్ లను ప్రకటించాయి.
ఈ ఖర్చంతా తిరిగి వినియోగదారుల పైనే పడుతోంది. వేతనాల పెరుగుదలే కొంత వరకు వస్తువుల ధరలను పెంచడానికి కారణమని నెక్స్ట్ అనే అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
5. వాతావరణ ప్రభావం
ప్రపంచంలో చాలా చోట్ల నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణానికి దారి తీశాయి.
ఐడా లాంటి హారికేన్లు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా దాటిన నికోలస్ అమెరికా ఇంధన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బ తీసి అంతర్జాతీయ ఇంధన సరఫరాల పై ప్రభావం చూపించింది.
శీతాకాలంలో సంభవించిన పెను తుపాను తర్వాత టెక్సస్ లో అనేక ప్రధాన ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో మైక్రో చిప్స్ కోసం ఏర్పడిన డిమాండ్ కోసం ఎదురైన సమస్యలు మరింత పెరిగాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే బ్రెజిల్ లో కూడా కాఫీ ధర పెరిగింది. ఒక శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడటంతో కాఫీ పంటల దిగుబడి బాగా తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
6. వాణిజ్య అంతరాయాలు
అత్యంత ఖరీదైన దిగుమతులు కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి.
బ్రెగ్జిట్ తర్వాత అమలులోకి వచ్చిన కొత్త వాణిజ్య నిబంధనలు యూరోపియన్ యూనియన్ నుంచి యూకేకు అయ్యే దిగుమతులను 2021 మొదట్లో పావు వంతుకు తగ్గించాయి.
ఈ ఏడాది యూకే నుంచి యూరోప్ కు వెళ్లే యాత్రీకులకు తిరిగి రోమింగ్ చార్జీల భారం పడుతోంది.
చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలు అధిక ధరల రూపంలో వినియోగదారుల పైనే పడుతున్నాయి.
2019లో అమెరికా చైనా టెలికాం సంస్థ హువాయ్ పై విధించిన ఆంక్షలు అమెరికాలో సరఫరాదారుల పైనా అంతర్జాతీయ వినియోగదారుల పైనా ప్రభావం చూపిస్తున్నాయి.
7. ముగిసిన సాయం
కరోనావైరస్ ప్రబలిన సమయంలో వివిధ వ్యాపారాలకు ప్రభుత్వాలు అందించిన సహాయాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు క్రమంగా నిలిపేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి సమయంలో ప్రజల ఖర్చు, అప్పులు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో, పన్నులు కూడా పెరిగాయి. ఇవన్నీ కలిపి జీవన వ్యయం పై నియంత్రణ పెట్టుకోవలసిన అవసరం ఏర్పడింది. జీతాలు మాత్రం ఎప్పటిలానే ఉన్నాయి.
చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులను సంరక్షించేందుకు విధానాలున్నాయి. తక్కువ జీతాలు వచ్చే వారి కోసం కొన్ని సంక్షేమ పధకాలున్నాయి.
ఇలాంటి పథకాలను అందించడం కూడా ముగుస్తూ ఉండటంతో, ఇవి కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని కొంత మంది ఆర్ధిక వేత్తలు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'అమర జవాను జ్యోతి'ని శాశ్వతంగా ఆర్పివేస్తున్నారా? అసలేం జరుగుతోంది?
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- ఏనుగుకు కవల పిల్లలు.. 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- క్లాస్రూంలోనూ హిజాబ్ ధరిస్తామని ఈ అమ్మాయిలు ఎందుకు పట్టుబడుతున్నారు, ప్రిన్సిపల్ ఎందుకు వద్దంటున్నారు
- అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదమా
- భారతదేశంలో డైనోసార్లను మింగేసే పాములు, ఒంటికొమ్ము రాకాసి బల్లులు ఏమయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











