సీఏఐటీ: ‘బాయ్‌కాట్ చైనా’.. 500 పైగా వస్తువులను బహిష్కరించిన అఖిల భారత వర్తకుల సమాఖ్య.. రూ. లక్ష కోట్ల దిగుమతుల తగ్గింపు లక్ష్యం - ప్రెస్ రివ్యూ

భారత్ చైనా జాతీయ పతాకాలు

ఫొటో సోర్స్, Getty Images

చైనాతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న 500కు పైగా వస్తూత్పత్తులను అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) బహిష్కరించిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఆట వస్తువులు, ఫర్నీషింగ్‌ ఫ్యాబ్రిక్స్‌, టెక్స్‌టైల్స్‌, బిల్డర్‌ హార్డ్‌వేర్‌, పాదరక్షలు, దుస్తులు, వంట సామాగ్రి తదితర ఉత్పత్తులు బహిష్కరించిన వస్తువుల జాబితాలో ఉన్నాయి.

‘వచ్చే ఏడాది ఆఖరుకల్లా చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వస్తువులను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర తగ్గించుకోవడమే మా లక్ష్యం’ అని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ ఓ ప్రముఖ జాతీయ వాణిజ్య దినపత్రికతో అన్నారు. చైనా నుంచి వచ్చే వాటిలో 3 వేల వస్తువుల దిగుమతులను ఆపవచ్చని, భారతీయ వస్తువులు వీటికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేసి చైనా కంపెనీకి బదులు భారత కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఖండేల్వాల్‌ చెప్పారు. పేటీఎం, బిగ్‌బాస్కెట్‌ తదితర భారతీయ స్టార్టప్‌ల్లో చైనా పెట్టుబడులపై ఓ కన్నేయాలని కూడా కోరామన్నారు. హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఇటీవల పెట్టిన పెట్టుబడులనూ అడ్డుకోవాలన్నారు.

దేశవ్యాప్తంగా 40 వేల వర్తక సంఘాలు, 7 కోట్ల వర్తకులకు సీఏఐటీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. భారతీయ వాణిజ్య లోటులో 40 శాతానికిపైగా చైనాతోనే ఉన్నది. గతేడాది చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 50 బిలియన్‌ డాలర్లు పెరిగితే.. ఆ దేశానికి భారతీయ ఎగుమతులు మాత్రం 2.5 బిలియన్‌ డాలర్లే పెరిగాయి.

వ్యతిరేకిస్తున్న మారుతి, బజాజ్‌: చైనా ఉత్పత్తుల బహిష్కరణను భారతీయ ఆటో రంగ దిగ్గజాలు మారుతి సుజుకీ, బజాజ్‌ వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వాహన ఉత్పత్తికి చైనా విడిభాగాలు చాలా అవసరమని ఈ సంస్థలు వాదిస్తున్నాయి. చైనా నుంచి సదరు ఉత్పత్తుల రాక నిలిచిపోతే.. ఆ ప్రభావం వాహన వినియోగదారులపై పడుతుందని అంటున్నాయి. వాహన తయారీదారుల కంటే ఆటో విడిభాగాల అమ్మకందారులే ఎక్కువగా ప్రభావితులవుతారని మారుతి సుజుకీ ఓ జాతీయ వార్తా చానెల్‌తో వ్యాఖ్యానించింది.

హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

హెల్త్‌ బులెటిన్లలో గారడీ లెక్కలు: తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

‘‘తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కేసుల వాస్తవ లెక్కలు మరుగుపర్చి తక్కువ పరీక్షలు చేస్తోందంటూ యూరప్‌ దేశాలు చెబుతున్నాయ’’ని ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం బుధవారం తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. వివిధ కేంద్రాల్లోని అధికారులు కరోనా పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారని, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉన్నట్లు మీడియాలో కథనాలు చూశామని హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది.

‘‘గాంధీ ఆసుపత్రినే కరోనా ఆసుపత్రిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? నిమ్స్‌లో కూడా కరోనాకు చికిత్స అందిస్తున్నప్పుడు గాంధీకే ఎక్కువ మంది రోగులను ఎందుకు మళ్లిస్తున్నారు? నిమ్స్‌కు రోగులు ఎందుకు వెళ్లడం లేదు? దీని వెనుక మతలబేంటని’’ హైకోర్టు ప్రశ్నించింది.

కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందించడం లేదంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. తెలంగాణలో పరిస్థితి దారుణాతి దారుణంగా మారుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని తెలిపింది.

కరోనాకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద తగినంతమంది పోలీసు సిబ్బందిని నియమించకపోవడంతో రోగుల బంధువులు వైద్యులపై దాడులకు దిగుతున్నారని, గాంధీలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగడానికి ఇదే ప్రధానకారణమని అభిప్రాయపడింది.

కొవిడ్‌-19కు చికిత్స చేయడానికి వినియోగించే పీపీఈ కిట్లు, గ్లౌజులు, ఎన్‌-95 మాస్కులు, ఇతర పరికరాల నిల్వలు ఏమేరకు ఉన్నాయో చెప్పాలని గాంధీ, నిమ్స్‌, ఫీవర్‌, కింగ్‌ కోఠి ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. వాటిలో ఎన్నింటిని చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అందించారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. గురువారం జరిగే విచారణకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావులు హాజరై పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ మండలి భవనం

ఫొటో సోర్స్, aplegislature

మండలిలో మంటలు: వైకాపా, తెదేపా సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం

మంత్రులు, అధికార వైకాపా సభ్యులు ఓవైపు.. విపక్ష తెదేపా ఎమ్మెల్సీలు మరోవైపు మోహరించిన వేళ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బుధవారం యుద్ధవాతావరణం నెలకొందని.. మాటలు, వాగ్వాదాలు దాటి బాహాబాహీకి దిగే పరిస్థితి తలెత్తిందని 'ఈనాడు' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించిన అంశాలపై రూల్‌ 90 కింద ఇచ్చిన తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్ష తెదేపా కోరింది. నిబంధనల ప్రకారం లేని నోటీసును ఛైర్మన్‌ ఎలా పరిగణనలోకి తీసుకుంటారని వైకాపా ప్రశ్నించింది. దీంతో ఇరుపక్షాల మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీలు పదే పదే వెల్‌లోకి దూసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది.

మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, తెదేపా సభ్యుడు బీద రవిచంద్రయాదవ్‌ మధ్య ఉద్రిక్తత తలెత్తింది. మంత్రిని బీద రవిచంద్ర కాలితో తన్నారని వైకాపా సభ్యులు, మంత్రులు ఆరోపించారు. ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ వైపు వెలంపల్లి దూసుకొస్తుంటే నిలువరించామని తెదేపా సభ్యులు పేర్కొంటున్నారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని తెదేపా సభ్యులు ఆరోపించారు.

రూల్‌ 90 కింద తామిచ్చిన నోటీసుపై ఓటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. మంత్రులు, వైకాపా సభ్యులు కూడా వెల్‌లోకి చొచ్చుకొచ్చారు.

సభలో ఉద్రిక్తతను నారా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నారంటూ మంత్రులు కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు.. డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యానికి ఫిర్యాదు చేశారు. చిత్రాలు తీయొద్దని డిప్యూటీ ఛైర్మన్‌ ఆదేశించారు.

ఉద్రిక్తత నెలకొనటంతో రాత్రి 7.57 గంటలకు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి మండలి డిప్యూటీ ఛైర్మన్‌ సభాధ్యక్ష స్థానం నుంచి లేచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత వెలంపల్లి శ్రీనివాసరావు లోకేశ్‌ వైపు వెళ్తుండగా.. బీద రవిచంద్ర నిలువరించారు. వెలంపల్లి, రవిచంద్ర బాహాబాహీకి దిగబోగా తెదేపా సభ్యులు, మంత్రులు వారిని విడదీశారు. నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా సభ లోపలే దాదాపు పది నిమిషాల పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగాయి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలని తెదేపా సభ్యులు చూస్తున్నారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)