ఏనుగుకు కవల పిల్లలు.. 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

కవల ఏనుగు పిల్లలతో తల్లి ఏనుగు 'బోరా'

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కవల ఏనుగు పిల్లలతో తల్లి ఏనుగు ‘బోరా’

ఉత్తర కెన్యాలోని జాతీయ రిజర్వ్‌లో ఈ వారం ఒక అరుదైన సంఘటన జరిగింది. అక్కడ కవల ఏనుగు పిల్లలు జన్మించాయి.

వారాంతంలో సంబురు రిజర్వ్‌కు విహారయాత్రకు వచ్చిన పర్యటకులు తొలుత వీటిని గుర్తించారు. ఇందులో ఒక మగ ఏనుగు కాగా మరొకటి ఆడ ఏనుగు.

స్థానిక ఏనుగుల పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ 'సేవ్ ద ఎలిఫెంట్స్' ప్రకారం.. ఏనుగుల్లో కవలలు జన్మించడం ఇది రెండోసారి మాత్రమే.

మొత్తం ఏనుగుల జన్మ క్రమంలో కవలల జననం కేవలం ఒక శాతమేనని ఆ సంస్థ పేర్కొంది. చివరిసారిగా 2006లో కవలలు జన్మించాయని చెప్పింది.

''15 ఏళ్ల క్రితం జన్మించిన కవల ఏనుగులు ఎక్కువ కాలం బతకలేకపోయాయి. తాజాగా జన్మించిన కవలలకు ఇది క్లిష్ట సమయం'' అని చారిటీ వ్యవస్థాపకులు, డాక్టర్ లయిన్ డగ్లస్- హామిల్టన్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు.

సాధారణంగా తల్లి ఏనుగు వద్ద, కవలలకు సరిపడినంత పాలు ఉత్పత్తి కావని ఆయన తెలిపారు. అందుకే తాజా కవలల మనుగడ గురించి అందరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.

తల్లి బోరాతో కవల ఏనుగు పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తల్లి బోరాతో కవల ఏనుగు పిల్లలు

అన్ని క్షీరదాల కంటే ఆఫ్రికన్ ఏనుగులకు గర్భధారణ సమయం అధిక కాలం ఉంటుంది. దాదాపు 22 నెలల పాటు అవి కడుపులో పిల్లల్ని మోస్తాయి. ప్రతీ నాలుగేళ్లకొకసారి పిల్లలకు జన్మనిస్తాయి.

ఏనుగు దంతాల వ్యాపారంతో పాటు ఆవాసాలను కోల్పోవడంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ అంతరించిపోతున్న జీవజాతుల జాబితా 'రెడ్ లిస్ట్'లో ఏనుగులను చేర్చింది.

అయితే, ఇటీవలి కాలంలో కెన్యాలో ఏనుగుల జనాభా పెరిగినట్లు గతేడాది 'ద కంట్రీస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సెన్సస్' పేర్కొంది.

వీడియో క్యాప్షన్, నిద్రపోయేందుకు చోటు కోసం తంటాలు పడుతున్న బుజ్జి ఏనుగు!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)