కమలా హారిస్: అమెరికా ప్రెసిడెంట్ అధికారాలు పొందిన తొలి మహిళ

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాసేపు అధ్యక్ష అధికారాలు పొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

నిజానికి, అధ్యక్షుడు జో బైడెన్ రెగ్యులర్ హెల్త్ చెకప్‌కు వెళ్లిన సమయంలో ఆమె ఈ అధికారాలను అందుకున్నారు.

శుక్రవారం బైడెన్ తన రొటీన్ కొలొనోస్కోపీ(పేవుల పరీక్ష)లో భాగంగా అనస్తీషియాలో ఉన్న సమయంలో 57 ఏళ్ల హారిస్‌కు 85 నిమిషాలపాటు అధ్యక్షుడి అధికారాలను అప్పగించారు..

"స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.10కి బైడెన్ తన అధికారాలు అప్పగించడం గురించి సెనేట్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత 11.35కు తిరిగి తన అధికారాలను స్వీకరించారు" అని వైట్ హౌస్ చెప్పింది.

ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తన పదవీ బాధ్యతలు నిర్వహించగలరని బైడెన్ డాక్టర్లు చెప్పారు.

అధ్యక్షుడి 79వ పుట్టిన రోజు సాయంత్రం వాషింగ్టన్ బయట ఉన్న వాలర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో ఆయనకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు.

వీడియో క్యాప్షన్, కమలా హారిస్: అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు

బాధ్యతలు అందుకున్న కమలా హారిస్

ఆ సమయంలో కమలా హారిస్ వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయంలో అన్ని పనులూ చక్కబెట్టారని అధికారులు చెప్పారు.

కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎంపికైన మొదటి నల్ల, దక్షిణాసియా అమెరికా మహిళ. 250 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకూ ఏ మహిళా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించలేదు.

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ కింద అధ్యక్షుడి అధికారాల బదిలీ ప్రక్రియ ఉంది. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేని సమయంలో అది జరుగుతుంది.

"ఇలాంటి పరిస్థితుల్లో అధికారాలను తాత్కాలికంగా బదిలీ చేయడం అపూర్వమేమీ కాదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అది ప్రక్రియలో ఒక భాగం" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు.

"2002, 2007లో జార్జ్ డబ్ల్యు బుష్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ అవలంబించారు. అధ్యక్షుడు బైడెన్ వైట్ హౌస్ తిరిగి వచ్చినపుడు నవ్వుతున్నారు. నాకు ఇప్పుడు చాలా బాగుందని అన్నారు" అని తలిపారు.

"అధ్యక్షుడు బైడెన్ ఆరోగ్యంగా, బలంగా ఉన్నారు. 78 ఏళ్ల బైడెన్ అధ్యక్ష పదవీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు" అని ఆయన డాక్టర్ కెవిన్ ఓకానర్ అన్నారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, EPA

వైద్య పరీక్షలో ఏం గుర్తించారు

కొలొనోస్కోపీ సమయంలో బైడెన్ పేవుల్లో ఒక ప్రమాదం లేని గడ్డను గుర్తించామని, దానిని సులభంగా తొలగించామని డాక్టర్లు చెప్పారు.

అధ్యక్షుడి నడక ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త కష్టంగా ఉందని, వయసు పైబడడంతోపాటూ ఆయన వెన్ను కూడా దానికి కారణమని ఓకానర్ చెప్పారు.

బైడెన్ అమెరికా అధ్యక్షులు అందరిలోకీ పెద్ద వయసువారు. ఆయన ఇంతకు ముందు 2019 డిసెంబర్‌లో కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు.

ఇంత వయసైనా బైడెన్ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు. స్వయంగా బైడెన్ కూడా తన పోటీ గురించి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)