జమ్మూకశ్మీర్: హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌లో వ్యాపారుల మృతిపై న్యాయ విచారణ - Newsreel

ఫొటో సోర్స్, EPA
శ్రీనగర్‌లో జరిగిన హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ అధికారులు న్యాయ విచారణకు ఆదేశించారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు, వారి సహచరులైన మరో ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించారని భద్రతాదళాలు తెలిపాయి.
అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తాయి. మృతి చెందిన నలుగురిలో ముగ్గురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఇది ఎన్‌కౌంటర్ కాదని, అమాయకులను భద్రతాదళాలు దారుణంగా హత్య చేశాయని ఆరోపించారు. ఈ ఆందోళనలపై స్పందించిన జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం న్యాయ విచారణకు ఆదేశించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌పై ఏడీఎం స్థాయి అధికారితో న్యాయ విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుంది. జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రజల భద్రతకు కట్టుబడి ఉంది. వారికి న్యాయం జరిగేలా చూస్తుంది" అని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Majid Jahangir/BBC
అసలేం జరిగింది?
సోమవారం సాయంత్రం 6 గంటలకు, శ్రీనగర్‌లోని హైదర్‌పోరాలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, ఇందులో పోలీసులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారని పోలీసులు ట్వీట్‌లో తెలిపారు.
కాసేపటి తరవాత ఒక తీవ్రవాదిని చంపినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరికాసేపటికి మరో ముగ్గురిని కాల్చి చంపినట్లు తెలిపారు.
నిన్న అర్ధరాత్రి పోలీసులు చేసిన ట్వీట్‌లో "తీవ్రవాదుల చేతిలో గాయపడిన ఇంటి యజమాని మరణించారు. తీవ్రవాదులు ఇంటి పైఅంతస్తులో దాక్కున్నారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ వ్యక్తి తీవ్రవాదులకు సహచరుడు" అని పేర్కొన్నారు.
కుటుంబం ఏం చెప్పింది?
చనిపోయిన వారిలో ఇద్దరు వ్యాపారులు ఉన్నారని, వారు అమాయకులని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ కోసమంటూ వచ్చి, తమ వారిని బలవంతంగా తీసుకెళ్లారని, ఆ తర్వాత కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు.
"సాయంత్రం అయిదు గంటలకు రెండు వాహనాలలో, పోలీసులు, ఆర్మీ సిబ్బంది సివిల్ డ్రెస్సులో వచ్చారు. మా అందరి మొబైల్ ఫోన్లు లాక్కొని యాభై మీటర్ల దూరంలో ఉన్న మోటార్ సైకిల్ షోరూమ్‌లో పెట్టారు. అల్తాఫ్, ముదాసిర్ అనే ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లారు. ఇరవై నిమిషాల తర్వాత మాకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి రాలేదు" ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
తన భర్త తీవ్రవాదులకు సహాయం చేసేవాడని నిరూపించాలని ముదాసిర్ గుల్ భార్య హుమైరా గుల్ బుధవారం శ్రీనగర్‌లో డిమాండ్ చేశారు. తన భర్త దంత వైద్యుడని, ఆయన పూర్తి పేరు డాక్టర్ ముదాసిర్ గుల్ అని వెల్లడించారు.

'తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశారు'
సోమవారం నాటి ఘటనలో డాక్టర్ ముదాసిర్ గుల్ దగ్గర హెల్పర్‌గా పనిచేసిన 24 ఏళ్ల అమీర్ మాగ్రే కూడా చనిపోయాడు.
''ఈ ఏడాది మే నుంచి నా కొడుకు ముదాసిర్ గుల్‌తో కలిసి పని చేస్తున్నాడు'' అని అమీర్ తండ్రి అబ్దుల్ లతీఫ్ మాగ్రే బీబీసీకి తెలిపారు.
''నా కొడుకు తీవ్రవాది అని, అతని శవాన్ని కూడా ఇవ్వబోమని పోలీసులు చెబుతున్నారు'' అని అన్నారు లతీఫ్.
2005 సంవత్సరంలో తీవ్రవాదులు తమ కుటుంబంపై దాడి చేశారని, తాను స్వయంగా ఓ తీవ్రవాదిని రాళ్లు రువ్వి చంపానని మాగ్రే వెల్లడించారు. తన కొడుకు తీవ్రవాది అని తేలితే, తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కూడా చంపేయాలని మాగ్రే చెప్పారు.

పోలీసులు ఏం చెప్పారు?
హైదర్‌పోరాలో చనిపోయిన నలుగురిని శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని హింద్వారాలో ఖననం చేశారు. మృతదేహాలను తమకు అప్పగించాలని మృతుల కుటుంబీకులు డిమాండ్ చేశారు. కానీ హతమైన ఏ తీవ్రవాది మృతదేహాన్ని కూడా గత రెండు, మూడేళ్లుగా పోలీసులు బంధువులకు అప్పగించడం లేదు.
"తీవ్రవాది దాక్కున్న స్థలం గురించి మాకు తెలియదు. ఇంటి యజమాని అల్తాఫ్, అద్దెకు ఉంటున్న ముదాసిర్ ఇళ్లకు వాళ్లు వచ్చారు. ఇంట్లో దాక్కున్నారు. తలుపు తీయమని చెప్పినా తీయలేదు. తర్వాత తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులతోపాటు అల్తాఫ్, ముదాసిర్‌లు చనిపోయారు'' అని జమ్మూ కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ మంగళవారం శ్రీనగర్‌లో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
అల్తాఫ్, ముదాసిర్‌లు ఇద్దరూ తీవ్రవాదులకు సహాయం చేశారని పేర్కొన్నారు. ముదాసిర్ వ్యాపారం ముసుగులో తీవ్రవాదుల మాడ్యూల్ నడుపుతున్నాడని పోలీసులు ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నేతల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా సంఘాల నేతల ఇళ్లలో గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది.
విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలోని అడ్వొకేట్ అందులూరి అన్నపూర్ణ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగాయి.
మరోవైపు హైదరాబాద్ నాగోల్‌లో ప్రజా సంఘాల నేతలు రవి శర్మ, భవానీ ఇళ్లపైనా సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లా టంగటూరు మండలం అలకూరపాడులోని విరసం నాయకుడు కల్యాణ్‌రావు ఇంట్లోనూ ఉదయం 4.30 నుంచి 11 గంటల వరకు సోదాలు కొనసాగాయి.

మావోయిస్టు సానుభూతిపరులు అన్న నెపంతో ఇదివరకు కూడా వీరి ఇళ్లపై ఎన్ఐఏ పలుమార్లు సోదాలు నిర్వహించింది. ఇలా అక్రమంగా సోదాలు చేయడం ఆపాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు కొరియర్ పంగి నాగన్న కేసు విషయంలోనూ విశాఖతో పాటు తూర్పుగోదావరి, హైదరాబాద్‌లలో ప్రజాసంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
ఇవి కూడా చదవండి:
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








