డగ్లస్ ఎమ్‌హాఫ్: కమల హారిస్‌తో తొలి డేట్ కోసం తటపటాయిస్తూ పెద్ద సందేశం పంపించా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హోలీ హోండెరిచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలిసిన మరుక్షణమే అందరిలోనూ ఆనందం మూడు రెట్లు అయ్యింది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేబట్టబోతున్న తొలి మహిళ, తొలి నల్లజాతీయురాలు, తొలి భారతీయ అమెరికన్.. మూడూ ఆమే.
అయితే, తెరవెనుక మరో వ్యక్తి కూడా చరిత్ర సృష్టించబోతున్నారు. ఆయనే కమల భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్. ఆయన దేశంలోనే తొలి ‘‘సెకండ్ జెంటిల్‌మన్’’ కాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుపొందిన తొలి మహిళకు భర్తగా రికార్డు సృష్టించారు.
56ఏళ్ల డగ్లస్ తన భార్య విజయాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కమల ప్రచారాన్ని ముందుకు నడిపించిన ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన్ను అందరూ ‘‘కేహెచ్-ఈవ్’’గా పిలుస్తుంటారు. అంటే కమలకు నిబద్ధులైన మద్దతుదారులని అర్థం. ఆయన సోషల్ మీడియా పేజీలు.. కమల ఫ్యాన్ పేజీలను తలపిస్తుంటాయి.
గత ఆగస్టులో తన న్యాయవాద కెరియర్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు డగ్లస్ ప్రకటించారు. కమలకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కమల పోటీని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన అలా విరామం తీసుకోవడంతో.. కొంతమంది ఆయన్ను చూసి నీళ్లలో నుంచి బయటకు వచ్చిన చేప అని అన్నారు. అలా కానేకాదు. ఆయన హాయిగా ఈదుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈతను ఆస్వాదిస్తున్నారు’’అంటూ డగ్లస్ మిత్రుడు ఆరన్ జాకొబీ వ్యాఖ్యానించారు.
2013లో లాస్ ఏంజెలిస్‌లో డగ్లస్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాయర్‌గా పనిచేసేవారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేస్తున్న కమలా హారిస్‌తో ఆయన అప్పుడే తొలిసారి డేట్‌కు వెళ్లారు.
ఈ డేట్ కోసం కమలకు కొంచెం తటపటాయిస్తూ ఓ సుదీర్ఘ వాయిస్ మెయిల్ పెట్టానని డగ్లస్ వివరించారు.
ఆ రోజే వారిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే, కొన్ని నెలల వరకు తను ఏఏ రోజు ఖాళీగా ఉండబోతున్నారో డేట్లు అన్నీ కమలకు మెయిల్ పెట్టేశారు. ఈ విషయాలను తన ఆత్మకథ 'ద ట్రూథ్స్ వి హోల్డ్'లో ఆయన రాసుకొచ్చారు. ‘‘నేను దోబూచులాడే వయసులో లేను. అందుకే ఏదీ దాచిపెట్టాలని అనుకోలేదు. నాకు నువ్వు బాగా నచ్చావ్. మనిద్దరం కలిసి జీవితంలో ముందుకు వెళ్లగలమని అనుకుంటున్నాను’’ అని ఆయన ఆమెతో చెప్పారు.
ఇది జరిగిన ఏడాదిలోపే శాంటా బార్బరా కోర్ట్ హౌస్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒకవైపు భారతీయ సంప్రదాయాలు, మరోవైపు యూదుల కట్టుబాట్లు... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ వీరి పెళ్లి జరిగింది. డగ్లస్ పంపిన తొలి వాయిస్ మెయిల్‌ను కమల సేవ్ చేసుకున్నారు. తమ ప్రతి వార్షికోత్సవంలోనూ దీన్ని కమల ప్లే చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రెట్టీబర్డ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, కో-ఫౌండర్ కెర్‌స్టిన్ ఎమ్‌హాఫ్‌తో ఇదివరకే డగ్లస్‌కు వివాహమైంది. వీరికి కోల్, ఎల్లా పిల్లలు. ఈ ఇద్దరికీ పిన తల్లిగా కమల వారి ఇంట్లో అడుగుపెట్టారు.
కోల్, ఎల్లాలను కలిసిన తర్వాత మరొక విషయం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నానని కమల తెలిపారు. ఈ విషయంపై 26ఏళ్ల కోల్ కూడా ఇటీవల గ్లామర్ మ్యాగజైన్‌తో మాట్లాడారు. తొలిచూపులోనే కమల అందరికీ నచ్చారని చెప్పుకొచ్చారు.
మరోవైపు తన మొదటి భార్య, తనకు మంచి స్నేహితురాలని డగ్లస్ చెబుతుంటారు. ‘‘నాకు ఆమె ఇప్పటికీ ఆప్తురాలే’’ అని గత ఏప్రిల్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కమలకు, ఆమెకు కూడా మంచి సంబంధాలున్నాయని వివరించారు.
కమల అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో.. ఆమెకు మద్దతుగా నిలవాలంటూ కెర్‌స్టిన్ కూడా ప్రచారం నిర్వహించారు. వరుస ట్వీట్లు కూడా చేశారు.
ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా వేదికల్లో కమల, డగ్లస్ చాలా సన్నిహితంగా కనిపిస్తుంటారు.
‘‘మీరు చూస్తున్నదంతా నిజమే. వారేమీ నటించడం లేదు. వారిద్దరూ ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. వారిద్దరూ చాలా ప్రేమించుకుంటున్నారు’’ అని డగ్లస్‌కు మిత్రుడైన అలెక్స్ వీంగార్టెన్ వివరించారు.

ఫొటో సోర్స్, Justin Sullivan
2016లో కమల సెనేట్‌కు పోటీచేసినప్పుడు తొలిసారిగా ఆమె కోసం డగ్లస్ ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ప్రచారం.. ఉపాధ్యక్ష పదవికి ప్రచారం చేపట్టేంత స్థాయిలో తనను తీర్చిదిద్దలేదని ఆయన వివరించారు.
2019 జనవరిలో కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో 20,000 మంది ప్రజల నడుమ తొలిసారిగా కమల తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ‘‘నేను కూడా అప్పుడు అక్కడే ఉన్నాను. 5,000 మంది మాత్రమే వస్తారని అనుకున్నాను. ఆ జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని ఆయన వివరించారు.
ఆ తర్వాత కొన్ని నెలలపాటు వారంలో ఐదు రోజులు తను పనిచేసే సంస్థ కోసం పనిచేసేవారు. వారాంతంలో మాత్రం కమలతో కలిసి ప్రచారానికి వెళ్లేవారు.
ప్రచారంలో డగ్లస్ తనదైన శైలిలో వ్యవహరించేవారు. క్షేత్రస్థాయిలో తను చూసిన, తను ఎదుర్కొన్న అనుభవాలను ఆయన ప్రస్తావించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
గత జూన్‌లో కమల చేతుల్లో నుంచి మైక్‌ను ఒక నిరసనకారుడు లాక్కొన్నప్పుడు.. ఆమెకు వెంటనే డగ్లస్ సాయంచేశారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఆయనపై పడింది.
మొదటి వరుసలో కూర్చున్న డగ్లస్ వెంటనే ముందుకువచ్చి మైక్ లాక్కొని తన భార్యకు ఇచ్చారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
చాలామంది డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులతో డగ్లస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవమూ లేకపోయినప్పటికీ.. ఆయన ఎలాంటి బెరుకూలేకుండా నడుచుకుంటుంటారు.
‘‘ఆయన్ను చూస్తుంటే కొత్తగా పనిచేస్తున్నట్లు అనిపించదు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. చాలా సాయం చేస్తుంటారు’’ అని తన స్నేహితుడైన ఆరన్ వివరించారు.
ఇంటర్వ్యూల్లో ఎలాంటి చింతా లేకుండా హాయిగా వెనక్కి కూర్చుని డగ్లస్ కనిపిస్తుంటారు. ఆయన్ను ఆయన ‘‘డూడ్’’గా పిలుచుకుంటుంటారు. ‘‘అప్పటివరకు నేనొక డూడ్‌లా ఉండేవాణ్ని. ఆ తర్వాతే నేను కమలను కలిశాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆయన ఒక మంచి డూడ్. ఆయన చాలా సహజంగా అనిపిస్తుంటారు. ఆయన ప్రజల మనిషి’’ అని అలెక్స్ చెప్పారు.
న్యాయవాదిగా డగ్లస్ అనుభవం.. బైడెన్, కమలకు చాలా ఉపయోగపడిందని అలెక్స్ వివరించారు.
డగ్లస్, కమల ఇద్దరూ న్యాయవిద్య చదువుకున్నారు. కమల అటార్నీగా పనిచేస్తే.. కార్పొరేట్ లాయర్‌గా డగ్లస్ స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలతో డగ్లస్ కలిసి పనిచేశారు. ఫార్మా సంస్థ మెర్క్ కోసం కూడా డగ్లస్ పనిచేశారు. మెర్క్ ఉత్పత్తులు ఎముకల వ్యాధులకు కారణమవుతున్నాయంటూ వచ్చిన కేసులను ఆయనే వాదించారు.
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పోటీచేసిన మహిళా అభ్యర్థుల భర్తల్లో డగ్లస్ నాలుగోవారు. గెరాల్డైన్ ఫెరారో, సారా పాలిన్, హిల్లరీ క్లింటన్‌ల భర్తలు ఆయన కంటే ముందు వరుసలో ఉన్నారు.
అయితే, వీరిలో శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్న వారిలో డగ్లస్ తొలి వ్యక్తి. ఆయన పదవికి ఇంకా అధికారికంగా పేరు కూడా పెట్టలేదు.
‘‘ఆ పేరేంటో నాకు ఎవరూ చెప్పలేదు. నాకు కూడా తెలియదు’’ అని అక్టోబరులో మేరీ క్లైర్‌తో ఆయన చెప్పారు.
‘‘ఈ పదవిని ఇప్పటివరకు మహిళలే చేపట్టారు’’ అని వర్జీనియా యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ ప్రెసిడెన్సియల్ స్టడీస్ బార్బరా పెర్రీ చెప్పారు.
ఇది ఒక అలాంకార పదవైనప్పటికీ.. ఇదివరకటి ప్రథమ, ద్వితీయ మహిళలు తమ భర్తల అజెండాలకు సరిపడే, మద్దతు ఇచ్చే కార్యక్రమాలను చేపట్టారు.
విద్యా విధానానికి జార్జ్ బుష్ మద్దతు పలికితే.. బాలల అక్షరాస్యత కోసం లారా బుష్ కృషిచేశారు. ఆరోగ్య సంరక్షణ కోసం బరాక్ ఒబామా పాటుపడితే, ఆరోగ్యకరమైన భోజనం, వ్యాయామం కోసం మిషెల్ ఒబామా కృషిచేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన
- ఎన్నికల్లో ఓట్లు చీల్చటానికి.. కీలక గుర్తులను పోలిన గుర్తులతో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెడుతున్నారా?
- దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- విశాఖ తీరానికి కొట్టుకువచ్చిన ఈ ఓడ తిరిగి సముద్రంలోకి వెళ్తుందా? ఇక్కడే రెస్టారెంట్‌గా మారుతుందా?
- ‘జ్వరమొస్తే అందరూ కరోనా అని భయపడుతున్నారు... మేం కిడ్నీ జబ్బేమో అని భయపడతాం’
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఈ ఫలితాలను ట్రంప్ అంగీకరించకపోతే ఏమవుతుంది?
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








