అమెరికా ఎన్నికలు: బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే చైనా సంగతేంటి?

ఫొటో సోర్స్, PAUL J. RICHARDS
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ కరస్పాండెంట్, వాషింగ్టన్
అక్టోబర్ 22న డోనల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగినప్పుడు చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించిన వ్యాఖ్యాత చైనా గురించి బైడెన్‌ను ఒక ప్రశ్న అడిగారు.
“కరోనావైరస్ విషయంలో పారదర్శకంగా లేనందుకు చైనాను ఎలా శిక్షించబోతున్నారు’’ అన్నది ఆ ప్రశ్న. "చైనాను శిక్షించడానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాను" అని బైడెన్ బదులిచ్చారు.
కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టి ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీటిని చైనా తిరస్కరిస్తోంది.
కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటికే 2,30,000మందికి పైగా మరణించారు. ఆర్ధికంగా కూడా అమెరికా బాగా నష్ట పోయింది.
అయితే డెలావేర్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎఫైర్స్ శాఖలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ముక్తాదర్‌ఖాన్ బైడెన్ ప్రకటనను తప్పుదొవ పట్టించేదిగా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Muqtedar Khan
"చైనా విషయంలో బైడెన్ చాలా ఉదాసీనంగా ఉన్నారన్నది విదేశాంగ వ్యవహారాల నిపుణుడిగా నా అభిప్రాయం’’ అని ఆయన అన్నారు. మొదట్లో ట్రంప్ కూడా చైనాకు అనుకూలంగానే ఉన్నారని, కరోనావైరస్ తర్వాత ఆయన ఏకపక్షంగా చైనాపై చర్యల గురించి మాట్లాడుతున్నారని ప్రొఫెసర్ ముక్తాదర్ ఖాన్ అన్నారు.
"చైనా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తోంది. బైడెన్ ప్రకటనను పరిశీలిస్తే చైనా ఒక క్రమశిక్షణ గల దేశమని, నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది’’ అన్నారు ముక్తాదర్‌ఖాన్.
బైడెన్ విదేశాంగ విధానం బలహీనంగా కనిపిస్తోందని, చైనాపై చర్యలకు ఆయన ఇష్టపడరని ప్రొఫెసర్ ఖాన్ అన్నారు. చాలా విషయాలలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కరోనా మహమ్మారి, టెక్నాలజీ, హాంకాంగ్ వ్యవహారాలు, వాణిజ్యం, దక్షిణ చైనా సముద్రం, వీగర్ ముస్లింలు, టిక్‌టాక్ ఇలా ఎన్నో అంశాలపై రెండుదేశాలు పరస్పరం ఆరపణలు చేసుకుంటున్నాయి.
ప్యూ(Pew) రీసెర్చ్ ప్రకారం అమెరికాలోని మూడింట రెండొంతులమంది చైనాపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. “అమెరికా విదేశాంగ విధానంలో ఇష్యూ నంబర్ వన్, ఇష్యూ నంబర్ టు, ఇష్యూ నంబర్ త్రీ...చైనానే’’ అని బోస్టన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆదిల్ నజమ్ అభిప్రాయపడ్డారు.

చైనాపై వ్యతిరేకత అమెరికాలో ఓట్లు రాలుస్తుందా?
దేశీయంగా అమెరికాకు అనేక సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనాపై దూకుడుతనం వల్ల ఓట్లు వస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అయితే 2017లో విడుదల చేసిన యు.ఎస్. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో చైనా పేరును 33 సార్లు ప్రస్తావించారు.
"చైనా, రష్యాలు అమెరికా పవర్‌ను, ప్రభావాన్ని, ప్రయోజనాలను సవాలు చేస్తాయి. అలాగే అమెరికా భద్రత, శ్రేయస్సును అంతం చేయడానికి ప్రయత్నిస్తాయి" అని ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్ పేర్కొంది.
అమెరికా విలువలు, ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రపంచాన్ని సృష్టించాలని చైనా, రష్యా కోరుకుంటున్నట్లు ఆ పత్రం పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు ఎదురుకాబోయే ప్రమాదాల గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివిధ రాష్ట్రాల గవర్నర్లకు ఇచ్చిన సందేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"చైనా మన బలహీనతలను విశ్లేషించింది. ఇది మన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. తద్వారా ఇది సమాఖ్య, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో మనల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది'' అని పాంపియో పేర్కొన్నారు.
చైనాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కూడగట్టడానికి ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. చైనా విషయంలో బైడెన్ చాలా సాఫ్ట్‌కార్నర్‌తో ఉన్నారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తూ వచ్చారు.
బైడెన్ అధ్యక్షుడైతే చైనా విషయంలో ఎలా వ్యవహరిస్తారు? ట్రంప్ మాదిరిగా ఆ దేశ వ్యాపారాలపై ఎక్కువ పన్నులు విధిస్తారా? ట్రేడింగ్, మానవహక్కులు, వాతావరణ మార్పులు, హాంకాంగ్, కరోనావైరస్‌వంటి అంశాలపై చైనాతో ఎలా ఉండబోతున్నారు?
జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో కలిసి మద్యం తాగుతున్న ఫొటోను ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. “ చైనా అభివృద్ధి చెందడం మన అభీష్టమా’’ అని ఫొటో కింద క్యాప్షన్ తగలించారు. జో బైడెన్ ఏప్రిల్‌లో విడుదల చేసిన విదేశాంగవిధానంపై విజన్ డాక్యుమెంట్‌లో చైనాపై అమెరికా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
"భవిష్యత్తులో చైనాతో లేదా మరే దేశంతోనైనా పోటీపడి మనం ముందుకు సాగాలంటే కొత్త వ్యూహాలకు పదును పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక శక్తిని ఏకం చేయాలి" అని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ వైఖరికి భిన్నంగా ఇది విస్తృతమైన విధాన ప్రకటన. ఇందులో పూర్తి వివరాలు లేవు. "ట్రంప్ ప్రభుత్వం చైనాను అమెరికా ప్రత్యర్థిగా అంగీకరించింది. కానీ బైడెన్ అందుకు అంగీకరించడం లేదు’’ అన్నారు ప్రొఫెసర్ ముక్తాదర్‌ఖాన్.
బైడెన్ కూడా చైనాను విమర్శిస్తారు. కానీ అమెరికా బలహీనతలను కూడా అంగీకరిస్తారనే అభిప్రాయం ఉంది. చైనాను కట్టడి చేయడంలో అమెరికా విధానం చాలా ఆలస్యం చేస్తోందనే అభిప్రాయం కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
దౌత్య సంబంధాలు
చైనా అమెరికాల మధ్య సంబంధాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికరమై విషయాలు తెలుస్తాయి. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనా పర్యటన తర్వాత రెండుదేశాల సంబంధాలపై అప్పటి వరకు ఉన్న ప్రతిష్టంభన తొలగిపోవడం మొదలు పెట్టింది.
చైనాను ప్రపంచంతో అనుసంధానించడం తన బాధ్యతగా అమెరికా భావించింది. కానీ చివరకు తన బలమైన ఆర్ధికవ్యవస్థ సాయంతో చైనా అమెరికాకు వ్యూహాత్మక పోటీదారుగా మారిందని నిపుణులు చెబుతారు.
"చైనాను మనం మేనేజ్ చేస్తున్న విధానంకంటే చైనా మనల్ని మేనేజ్ చేస్తున్న విధానం గొప్పగా ఉంది " అని “ది హండ్రెడ్ ఇయర్స్ మారథాన్” పుస్తక రచయిత మైఖేల్ పిల్స్‌బరీ అన్నారు.
ఈ పుస్తకంపై “ అమెరికా స్థానాన్ని ఆక్రమించడానికి చైనా రహస్య వ్యూహం’’ అని రాసి ఉంటుంది.

‘అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని చైనా కోరుకోదు’
గత కొంతకాలంగా చైనాతో ఉన్న విభేదాలను పక్కనబెట్టి పరస్పర సహకారం కోసం అమెరికా ప్రయత్నించిందని జేమ్స్ జే కెరాఫానో అన్నారు. ఆయన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేజ్ ఫౌండేషన్‌లో విదేశీ వ్యవహారాల నిపుణుడిగా పని చేస్తున్నారు.
కానీ అధ్యక్షుడు ట్రంప్ కాలంలో అమెరికా వ్యూహం తారుమారైంది. "ఇప్పుడు అమెరికా వ్యూహం సమస్యలను విస్మరించడం కాదు పరిష్కరించడం. మన ప్రయోజనాలను కాపాడటానికి నిబద్ధులమై ఉన్నామని నిరూపించాలి’’ అని కెరాఫానో అన్నారు.
"2021లో అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చినా, చైనాతో వ్యవహరించే విషయంలో అమెరికా వ్యూహంలో పెద్దగా మార్పు ఉండదు " అని కెరఫానో చెప్పారు.
అంటే ట్రంప్ దూకుడును కొనసాగిస్తారా ? బైడెన్ నాయకత్వం సాఫ్ట్ కార్నర్‌ను కొనసాగిస్తుందా?
"వాషింగ్టన్‌లో కొంతమందికి చైనా విషయంలో అపోహలున్నాయి. చైనా తాను ప్రపంచంలోని సూపర్ పవర్లలో ఒకటి కావాలని కోరుకుంటుంది. అంతే తప్ప అమెరికాను తోసేసి తాను ఆ స్థానాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదు" అని బక్నెల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ రిలేషన్స్ శాఖలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జికున్-జు అన్నారు.

ఫొటో సోర్స్, Emily Paine
భారత్, పాకిస్తాన్‌ల ఆప్షన్‌లు ఏంటి ?
సంప్రదాయకంగా అమెరికాకు పాకిస్తాన్ దగ్గర. కానీ ఇప్పుడు చైనాకు చేరువైంది. అయితే చైనాకు దగ్గరవడానికి పాకిస్తాన్ 70 సంవత్సరాలుగా అమెరికాతో కొనసాగిస్తున్న సంబంధాలను పక్కనబెట్టాల్సిన అవసరం లేదని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎస్.ఎమ్.ఎమ్.అలీ అన్నారు.
"అమెరికా కూడా పాకిస్తాన్‌ను అలా వదిలేయదు. అప్గానిస్తాన్‌లాగా ఆ దేశం కూడా అమెరికాకు ప్రతిష్టాత్మకంగా మారింది’’ అన్నారు అలీ.
భారత్ తాను అలీన విధానం అనుసరిస్తానని చెప్పుకుంటుంది. కానీ భారత్ రష్యా పక్కన ఉందని చాలామంది వాదిస్తారు. విదేశాంగ విధానంలో చైనా, అమెరికాలను బ్యాలన్స్ చేయడానికి భారత్ ప్రయత్నించింది. కానీ గల్వాన్ లోయ ఘటన తర్వాత అమెరికాకు దగ్గరవడానికి భారత్ ఏమాత్రం సంకోచించ లేదు.
చైనా తన ఉనికికి ముప్పుకాదని అమెరికా భావిస్తోందని కెరఫానో చెప్పారు. కానీ భారత్ మాత్రం తన అలీన విధానాన్ని పక్కనబెట్టిందని ఆయన అన్నారు. "భారత్ ఇప్పుడు చైనా వ్యతిరేక దేశాల జాబితాలోఉంది" అని కెరఫానో అభిప్రాయపడ్డారు.
అయితే ప్రొఫెసర్ జికున్-జు ఆ అభిప్రాయంతో విభేదించారు. "భారత విదేశాంగ విధానం మొదటి నుంచి స్వతంత్రంగా ఉంది. అలీన ఉద్యమంలో ఆ దేశం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే మార్గంలోనే నడుస్తుందని అనుకుంటున్నాను’’ అని జికున్-జు అభిప్రాయపడ్డారు.
అయితే, ఇక ముందు తీసుకునే దౌత్య నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








