కమలా హారిస్‌‌కు స్ఫూర్తిగా నిలిచిన తల్లి శ్యామల గోపాలన్

కమలా హారిస్‌తో తల్లి శ్యామలా గోపాలన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్‌తో తల్లి శ్యామలా గోపాలన్
    • రచయిత, గీతా పాండే, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు చేసిన ప్రసంగంలో తన ప్రయాణంలో సహకరించిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు నేనిక్కడ ఉండటానికి కారకులయిన అతి ముఖ్యమైన వ్యక్తి మా అమ్మ శ్యామల గోపాలన్ అని ఆమె ట్విటర్లో పోస్టు చేసిన వీడియోలో అన్నారు. ఈ వాక్యంతోనే ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.

"ఆమె 19 ఏళ్ల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఈ క్షణాన్ని ఆమె ఊహించి ఉండరు" అని కమలా అన్నారు.

"కానీ, అమెరికాలో ఇలాంటి క్షణమొకటి సాధ్యమవుతుందని మాత్రం ఆమె గాఢంగా నమ్మారు." అని చెప్పారు.

Kamala Harris takes oath as US vice president

ఫొటో సోర్స్, Getty Images

కమలా హారిస్ తొలి ఆసియన్ అమెరికన్, నల్ల జాతి మహిళగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారు.

కానీ, ఆమె తల్లి తన కలలను నెరవేర్చుకునేందుకు 1958లో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చి ఉండకపోతే ఈ రోజు కమలా హారిస్ కథ రాసే వాళ్లం కాదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

శ్యామల తండ్రి సివిల్ సర్వీస్ ఉద్యోగి కాగా ఆమె తల్లి గృహిణి. నలుగురు పిల్లల్లో శ్యామల పెద్దవారు. ఆమెకు బయోకెమిస్ట్రీ చదవాలని ఉండేది.

కానీ, దిల్లీలోని బ్రిటిష్ పాలకులు స్థాపించిన లేడీ ఇర్విన్ మహిళా కాలేజీలో ఈ కోర్సు లేదు. దాంతో ఆమె హోమ్ సైన్సు కోర్సుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కోర్సులో ఆమెకు పోషకాహారం, గృహాన్ని చక్కదిద్దుకునే నైపుణ్యాలను నేర్పించేవారు.

"ఆ కోర్సులో నేర్పే విషయాల గురించి నేను మా నాన్నగారు కలిసి శ్యామలను ఏడిపిస్తూ ఉండేవాళ్ళం" అని ఆమె సోదరుడు గోపాలన్ బాలచంద్రన్ బీబీసీతో చెప్పారు.

"నీకు అక్కడేమి చెబుతారు? టేబుల్ ఎలా సర్దాలి? స్పూను ఎక్కడ పెట్టాలి? అనే కదా అని అడుగుతూ ఉండేవాళ్ళం. ఆమెకు కోపం వస్తూ ఉండేది" అని చెబుతూ ఆయన నవ్వారు.

శ్యామలతో కలిసి చదువుకున్న ప్రొఫెసర్ ఆర్ రాజరామన్ మాత్రం చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఆమె అసాధారణంగా మాత్రం ఉండే వారని చెప్పారు. ఆయన ప్రస్తుతం దిల్లీలోని జవహర్లాల్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

వాళ్ళ తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండగా, అమ్మాయిలు అబ్బాయిలు క్లాసులో వేరు వేరుగా కూర్చునే వారని చెప్పారు.

"కానీ ఆమె మాత్రం అబ్బాయిలతో మాట్లాడటానికి సంకోచించే వారు కాదు. చాలా ఆత్మ విశ్వాసంతో కనిపించేవారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

తల్లి శ్యామలతో చిన్నారి కమలా హారిస్

ఫొటో సోర్స్, Kamala Harris

ఫొటో క్యాప్షన్, తల్లి శ్యామలతో చిన్నారి కమలా హారిస్

"ఆమె లేడీ ఇర్విన్ కాలేజీలో ఎందుకు చదవాలనుకున్నారో ఇప్పటికీ వింతగానే ఉందని, ఎందుకంటే ఆ కాలేజీకి అమ్మాయిలను మంచి భార్యలుగా తయారు చేసి, వివాహానికి సన్నద్ధం చేస్తుందనే పేరు ఉంది" అని ఆయన అన్నారు.

కానీ, శ్యామల లక్ష్యం వేరేగా ఉంది. ఆమె బెర్క్లీలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీకి దరఖాస్తు చేసి సీటు సంపాదించారు.

"ఆమె ఇదంతా సొంతంగా చేసుకున్నారు. ఇంట్లో ఎవరికీ ఆమె సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలియదు" అని ఆమె సోదరుడు చెప్పారు.

"ఆమె విదేశాలకు వెళ్ళడానికి మా నాన్నగారికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ, మాకు అమెరికాలో ఎవరూ తెలియదు. కానీ, ఆయన చదుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన వారు. అందుకే ఆమె వెళ్ళడానికి ఆయన అంగీకరించారు.

శ్యామలకు స్కాలర్‌షిప్ లభించింది. మొదటి సంవత్సరం మాత్రం ఆమె చదువు ఖర్చు భరించడానికి నాన్నగారు అంగీకరించారు" అని ఆయన చెప్పారు.

19 ఏళ్ల వయసులో గోపాలన్ దేశం వదిలి అంతకు ముందెన్నడూ తనకు తెలియని భూభాగం పై అడుగు పెట్టారు. అక్కడ ఆమెకు ఎవరూ తెలియదు. ఆమె న్యూట్రిషన్, ఎండోక్రైనాలజీలో పీహెచ్‌డీ చేయడానికి వెళ్లారు.

ఆమె జీవితం గురించి కమల తన పుస్తకం ''ది ట్రూత్స్ వియ్ హోల్డ్' అని 2019లో రాసిన ఆత్మ కథలో రాశారు.

కమల తల్లితండ్రులు శ్యామలా గోపాలన్, డోనల్డ్ హారిస్

ఫొటో సోర్స్, Biden for President

ఫొటో క్యాప్షన్, కమల తల్లితండ్రులు శ్యామలా గోపాలన్, డోనల్డ్ హారిస్

"ఆమెను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్‌లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినప్పుడు, వాళ్లు అడ్డు చెప్పలేదు’’ అని కమలా ఆ పుస్తకంలో రాశారు.

అమెరికాలో నివసించడానికి అదొక ఆసక్తికరమైన సమయం.

అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు బెర్క్లీ కేంద్రంగా ఉండేది. అమెరికాను, ప్రపంచాన్ని ఉత్తమమైన ప్రదేశంగా మార్చడానికి మిగిలిన విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో గోపాలన్ కూడా పాల్గొన్నారు.

కానీ, ఆ రోజుల్లో భారతదేశం నుంచి వచ్చిన ఒక విద్యార్థి పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొనడం సాధారణమైన విషయం మాత్రం కాదు.

ఆమెను 1961లో కాలేజి కెఫెలో కలిసిన మార్గోట్ డాషియల్ బీబీసీతో మాట్లాడారు.

"ఆమె కూడా వలస పాలనలో అణచివేతకు గురైన దేశం నుంచి వచ్చిన వారే కావడంతో ఆఫ్రికా అమెరికా విద్యార్థులు చేస్తున్న పోరాటాలతో ఆమె వ్యక్తిగతంగా తనని తానూ చూసుకుంటారని నాకెందుకో అనిపించేది."

"శ్వేత జాతీయులకు పోరాటాల గురించి, హక్కులను కాలరాయడం గురించి తెలియదు" అని ఆమె చెప్పటం నాకు లీలగా గుర్తుంది అని ఆమె అన్నారు. "దాని గురించి ఆమె ఎక్కువగా వివరించలేదు. ఆమె నల్ల జాతీయురాలిగా ఏమైనా వ్యక్తిగతంగా చవి చూశారేమో అని అనుకున్నాను" అని చెప్పారు.

ఆమె స్నేహితులు ఆమెను సూక్ష్మమైన శరీర సౌష్టవం కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తారు. "ఆమె చీర కట్టులో, ఎర్రని బొట్టుతో అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేవారు. ఆమె చాలా స్పష్టమైన, ఆలోచనలతో, దృఢమైన అభిప్రాయాలతో , మేధా పరిజ్ఞానంతో కనిపించే తెలివైన విద్యార్థి" అని వారంటారు.

"ఆమె తెలివైన పురుషులతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సులువుగా సంభాషణలు చేసేవారు" అని డాషియల్ గుర్తు చేసుకున్నారు.

"మా స్నేహితుల సమూహంలో చాలా కొంత మంది మహిళలకు మాత్రమే ఆ నేర్పు ఉండేది" అని ఆమె అన్నారు.

1962లో నల్ల జాతి విద్యార్థులు ఆఫ్రికా అమెరికా విద్యార్థులకు వారి చరిత్ర గురించి చెప్పేందుకు ఏర్పాటు చేసిన ఒక అధ్యయన గ్రూపులో శ్యామల ఒక్కరే ఆఫ్రికా అమెరికాకు చెందని వ్యక్తిగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.

"అందరూ నల్ల జాతీయులు ఉండే గ్రూపులో ఆమె ఉండటాన్ని ఎవరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు" అని 1962లో శ్యామలను కలిసిన ఆబ్రీ లబ్రీ చెప్పారు. అప్పుడు ఆయన బెర్క్లీలో న్యాయ శాస్త్రం చదువుతున్నారు. ఆ తర్వాత వారి స్నేహం జీవితాంతం కొనసాగింది.

"ఈ దేశంలో జరిగిన పౌర హక్కుల ఉద్యమంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాకందరికీ ఆసక్తిగా ఉండేది. మేము ఆ ఉద్యమాన్ని మూడవ ప్రపంచ దేశాల స్వేచ్చాయుత ఉద్యమాలలో భాగంగా పరిగణించాం. మేమంతా ఒకే రకమైన సోదర సోదరీ భావంతో అలాంటి ఉద్యమాలను మేధోపరంగా మద్దతు పలికే ప్రక్రియలో భాగంగా భావించాం.

"ఆమె పూర్వాపరాలు గురించి ఎవరూ ఎటువంటి వివాదాన్ని లేవదీయలేదు. కానీ, అదొక నల్ల జాతీయుల సమూహం అని చాలా మందికి అంతర్లీనంగా ఉండేది. అందులోకి ఒక యూరోప్ విద్యార్థిని అనుమతించి ఉండకూడదని భావిస్తూ ఉండేవారు. కానీ, దాని గురించి చర్చించడం లాంటివి జరిగినట్లు నాకు గుర్తు లేదు" అని ఆయన అన్నారు.

ఆమెకు ఉద్యమాలతో ఏర్పడిన పరిచయం, పౌర హక్కుల ఉద్యమంలో ఆమె పాలుపంచుకోవడం ఆమె జీవితాన్నే మార్చేసింది.

శ్యామల తల్లి మాత్రం ఆమె చదువు పూర్తి కాగానే భారతదేశం వచ్చి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని కోరుకున్నట్లు కమల రాశారు. కానీ, విధి రచించిన ప్రణాళిక మరోలా ఉంది.

కమలా హారిస్, ఆమె చెల్లెలు మయా లక్ష్మీ హారిస్

ఫొటో సోర్స్, The Washington Post via Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్, ఆమె చెల్లెలు మయా లక్ష్మీ హారిస్

1962లో శ్యామల డోనల్డ్ హారిస్ ని కలిశారు. ఆయన బెర్క్లీ ఎకనామిక్స్ చదవడానికి జమైకా నుంచి వచ్చారు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు,

వీరిద్దరూ నల్ల జాతి విద్యార్థుల సమావేశంలో కలిశారు. అప్పుడు శ్యామల తనంతట తానుగా డోనల్డ్ దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నారు.

"అక్కడ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలందరిలో ఆమె ప్రత్యేకంగా కనిపించారు" అని ఆయన ఇటీవల న్యూ యార్క్ టైమ్స్ తో మాట్లాడుతూ అన్నారు.

ఆమె తల్లితండ్రులు న్యాయం కోసం, పౌర హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమంలో పోరాడుతూ అమెరికన్ల తరహాలోనే ప్రేమలో పడ్డారని హారిస్ రాశారు.

వారిద్దరూ 1963లో వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 25 సంవత్సరాలు. ఇద్దరూ పి ఎచ్ డి పూర్తి చేశారు. అప్పుడే కమల కూడా పుట్టారు. రెండేళ్ల తర్వాత రెండవ బిడ్డ మాయ పుట్టింది.

కమలా హారిస్ పుస్తకం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఒక విదేశీయుడిని పెళ్లి చేసుకోవడం పట్ల గోపాలన్ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో సుముఖత ఎదురవ్వలేదు.

ఒక అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా 1000 సంవత్సరాల పాటు పాటించిన గోపాలన్ కుటుంబం వంశ పారంపర్యానికి ఆటంకం కలిగించాను అని శ్యామల 2003లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

"ఆమె వివాహం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పలేదు. కానీ, మా తల్లి తండ్రులకు పెద్దగా ఆ వివాహంతో సమస్యలు లేవు. వాళ్లకి అతనిని కలవలేదని బాధ ఒక్కటే ఉండేది" అని బాలచంద్రన్ అన్నారు.

"ఒక సారి కమల మాయ కలిసి వాళ్ళ తాతని వాళ్ళ నాన్నంటే ఇష్టం లేదా అని అడగడం కూడా నేను విన్నాను. మీ అమ్మ ఆయనను ఇష్టపడింది. అతనికి చెడు అలవాట్లు లేవు. ఇక ఇష్టపడకపోవడానికి ఏముందని ఆయన సమాధానమిచ్చారు" అని ఆయన చెప్పారు.

గోపాలన్ తల్లి తండ్రులు అల్లుడిని మొదటి సారి పెళ్ళైన మూడేళ్ళ తర్వాత 1966లో జాంబియాలో కలిశారు. అప్పుడు ఆయనక్కడ ఉద్యోగం చేస్తున్నారు.

కానీ, ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేదు. హారిస్ కి ఐదేళ్లు ఉండగా వారిద్దరూ విడిపోయారు. ఆమె, ఆమె చెల్లెలు అప్పుడప్పుడూ తండ్రిని కలుస్తూ ఉన్నప్పటికీ వారి పెంపకం మాత్రం శ్యామలే చూసుకున్నారు.

కమల హారిస్ గత సంవత్సరం అమెరికా ఉపాధ్యక్షురాలిగా నామినేషన్ ఆమోదిస్తూ, ఒక సింగిల్ పేరెంట్ గా ఆమె తల్లి జీవితం అంత సులభంగా గడవలేదని ఒక వైపు పిల్లలను చూసుకుంటూ మరో వైపు క్యాన్సర్ పరిశోధన కోసం పని చేస్తూ 24 గంటలూ శ్రమించారని అన్నారు.

శ్యామల పేగు కాన్సర్ తో 70 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 2009లో మరణించారు. రొమ్ము క్యాన్సర్‌లో హార్మోన్ల పాత్ర గురించి కనుగొన్న విషయాల ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా సుపరిచితురాలయ్యారు.

తల్లి శ్యామల, చెల్లి మాయాతో కమలా హారిస్

ఫొటో సోర్స్, Kamala Harris

ఫొటో క్యాప్షన్, తల్లి శ్యామల, చెల్లి మాయాతో కమలా హారిస్

ఆమె బెర్క్లీ జంతు శాస్త్ర విభాగంలో, క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధన శాలలో పరిశోధనలు చేస్తూ తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె ఫ్రాన్స్, ఇటలీ, కెనడాలో కూడా పని చేశారు ఆ తర్వాత తిరిగి కాలిఫోర్నియాలో లారెన్స్ బెర్కెలీ ల్యాబ్ కి వచ్చారు.

"ఆమె చాలా దీక్షతో పని చేసే శాస్త్రవేత్త. అన్ని రకాల శాస్త్రీయ చర్చలలో చాలా ఆసక్తిగా పాల్గొనే వారు" అని ఆమెకు సీనియర్‌గా ఉన్న సైంటిస్ట్ జో గ్రే చెప్పారు.

ఆమెకు జరుగుతున్న క్యాన్సర్ చికిత్స గురించి ఆమె చాలా బహిరంగంగా మాట్లాడేవారని ఆయన బీబీసీ తో చెప్పారు.

"ఇదింతే. నేను ఎంత కాలం పోరాడగలనో అంత కాలం పోరాడుతాను" అని ఆమె అన్నట్లు ఆయన చెప్పారు.

"ఆమెకు క్యాన్సర్ వ్యాధి ముదురుతున్న కొలదీ ఆమె తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ తన జీవితాన్ని చాలించాలని అనుకునే వారు. ఇక్కడ మా అమ్మ, మరో సోదరి సమక్షంలో గడపాలని అనుకునే వారు" అని బాలచంద్రన్ చెప్పారు. కానీ, ఆమె రాలేకపోయారు.

ఆమెకు పుట్టిన దేశం తిరిగి వెళ్లాలని ఉండేదని లాబ్రీ కూడా చెప్పారు.

"జీవితపు చివరి దశలో తమ సంస్కృతితో మమేకం కావాలనే ఒక ప్రియమైన భావన అని నేననుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

"నువ్వు భారతదేశం తిరిగి వెళ్లాలని అనుకోవడం చాలా ఆనందదాయకం అని నేను చెప్పాను. అప్పుడామె, నేను ఎక్కడికీ వెళ్ళటం లేదని అన్నారు. తర్వాత కొన్ని రోజులకే ఆమె మరణించారు" అని ఆబ్రీ గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)