జో బైడెన్: ‘లెట్స్ గో, బ్రాండన్...’ అమెరికా అధ్యక్షుడిపై క్రిస్టమస్ రోజున ఓ తండ్రి ప్రాక్టికల్ జోక్

బైడెన్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైడెన్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తొలి మహిళ జిల్ బైడెన్.. క్రిస్టమస్ పండుగ సందర్భంగా కొన్ని కుటుంబాలతో వీడియో కాల్ సంభాషణ నిర్వహించారు. ఈ సందర్భంగా బైడెన్‌తో ఒక తండ్రి ‘లెట్స్ గో, బ్రాండన్’ అంటూ ప్రాక్టికల్ జోక్ వేశారు.

కానీ, ఇందులో వ్యంగ్యాస్త్రం గురించి తెలిసినట్లు కనిపించని బైడెన్... దానికి అంగీకరించారు.

నిజానికి.. ‘లెట్స్ గో, బ్రాండన్’ అనే వ్యాఖ్య చాలా మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు.. బైడెన్‌ మీద సంధించిన అవమానకరమైన వ్యాఖ్య.

బైడెన్ దంపతులు వైట్ హౌస్ సంప్రదాయం ప్రకారం.. కొందరు పిల్లలతో వర్చువల్‌గా సంభాషిస్తున్నారు. శాంటా క్లాజ్ ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు.

ఓరెగాన్‌కు చెందిన ఓ కుటుంబంలోని గ్రిఫిన్ (11), హంటర్ (3), పైపర్ (4), పెనెలోప్ (2) అనే చిన్నారులతో పాటు వారి తండ్రి జారెడ్‌తో ముచ్చటిస్తున్నారు.

‘‘మీరు వీరి తండ్రి కదా’’ అని బైడెన్ అన్నారు.

‘‘హాయ్. యస్ సర్’’ అని జారెడ్ బదులిచ్చారు.

‘‘ఓకే, డాడ్, క్రిస్టమస్‌కు మీకు ఏం కావాలి?’’ అని బైడెన్ అడిగారు.

‘‘బహుశా ఓ ప్రశాంతమైన రాత్రి’’ అని ఆయన నవ్వుతూ బదులిచ్చారు.

లెట్స్ గో, బ్రాండన్.. ఎలా మొదలైంది?

అలబాబా రాష్ట్రంలోని టాలాడెగాలో అక్టోబర్ 2వ తేదీన టెలివిజన్‌లో ప్రసారం చేసిన నాస్కార్ స్టాక్ కార్ రేస్‌లో ఇది మొదలైంది. ఆ పోటీల విజేత బ్రాండన్ బ్రౌన్‌ను ఎన్‌బీసీ రిపోర్టర్ కెల్లీ స్టావాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే సమయంలో.. వారి వెనుక గుమిగూడిన ఒక గుంపు దేశాధ్యక్షుడిని ఉద్దేశించి తిడుతూ నినాదాలు చేస్తోంది.

అది టీవీలో ప్రసారమైన ఆడియోలో స్పష్టంగా వినిపించింది.

పొరపాటు గానో, లేక లైవ్‌లో తిట్ల నుంచి దృష్టి మళ్లించటానికో తెలీదు కానీ.. రిపోర్టర్ స్టావాస్ట్ బ్రాండన్ బ్రౌన్‌తో మాట్లాడుతూ.. ఆ గుంపు ‘‘లెట్స్ గో, బ్రాండన్’’ అని నినాదాలు చేస్తూ ఆయనను ఉత్సాహపరుస్తున్నారని చెప్పారు.

దీంతో ఒక మీమ్ పుట్టుకొచ్చింది.

‘‘మీకు తెలుసా డాడ్, మా దగ్గర ఒక హంటర్ కూడా ఉన్నారు. మాకు హంటర్ అనే పేరున్న ఒక కొడుకు ఉన్నాడు. హంటర్ అనే పేరున్న మనుమడు కూడా ఉన్నాడు’’ అని బైడెన్ చెప్పారు.

‘‘మీకు హంటర్ అనే పేరున్న మనుమడు ఉన్నాడని నాకు తెలీదు. దట్స్ కూల్’’ అని జారెడ్ స్పందించారు.

గ్రిఫిన్ వయసు ఎంత అని అధ్యక్షుడు అడిగారు.

‘‘నాకు 11 ఏళ్లు’’ అని గ్రిఫిన్ బదులిచ్చాడు. తనకు ఒక పియానో కావాలని అతడు అడిగాడు.

జారెడ్ జోక్యం చేసుకుని.. ‘‘ఒక పియానో కావాలంటే అతడు కొన్ని చెట్లు నరకాల్సి ఉంటుందని నేను చెప్పబోతున్నాను’’ అని చెప్పారు.

హంటర్ తనకు ఒక నింటెండో స్విచ్ కావాలని, పైపర్ తనకు ఒక బార్బీ కావాలని అడిగారు.

అధ్యక్షుడు నవ్వుతూ.. పిల్లలు తొమ్మిది గంటల కల్లా పడుకోవాలని, లేదంటే శాంటా రాకపోవచ్చునని చెప్పారు.

‘‘హావ్ ఎ మెర్రీ క్రిస్టమస్, హావ్ ఎ వండర్‌ఫుల్ క్రిస్టమస్’’ అని జిల్ బైడెన్ చెప్పారు.

‘‘ఐ హోప్ యు హావ్ ఎ వండర్‌ఫుల్ క్రిస్టమస్’’ అని జారెడ్‌తో బైడెన్ అన్నారు.

జారెడ్ బదులిస్తూ.. ‘‘యా, ఐ హోప్ యు గైస్ హావ్ ఎ వండర్‌ఫుల్ క్రిస్టమస్ యాజ్ వెల్. మెర్రీ క్రిస్టమస్ అండ్ లెట్స్ గో బ్రాండన్’’ అని వ్యాఖ్యానించారు.

‘‘లెట్స్ గో బ్రాండన్. ఐ అగ్రీ’’ అని అధ్యక్షుడు బదులిచ్చారు.

అంతా నిశబ్దం అలముకుంది.

మళ్లీ బైడెన్ మాట్లాడుతూ.. ‘‘హే.. సరే కానీ మీరు ఓరెగాన్‌లో ఉన్నారా? మీ ఇల్లు ఎక్కడ? కనెక్షన్ కట్ అయినట్లుంది’’ అన్నారు.

ఇటీవల నిర్వహించిన గాలప్ సర్వే ప్రకారం.. రిపబ్లికన్లుగా చెప్పుకుంటున్న ఓటర్లలో కేవలం 5 శాతం మంది మాత్రమే బైడెన్ పరిపాలనను ఆమోదిస్తున్నారు.

బైడెన్ పాలనకు మొత్తంగా ఉన్న ఆమోదం 43 శాతానికి తగ్గినట్లు ఆ చిన్న సర్వే చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)