Budget 2022: 1950లో బడ్జెట్ వివరాలు ఎక్కడ నుంచి లీక్ అయ్యాయి? ఆ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రకటన కోసం పార్లమెంట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమవుతాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక మంత్రిగా తన నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
రాజ్యాంగం ప్రకారం, వార్షిక యూనియన్ బడ్జెట్ అనేది ప్రభుత్వ ఆదాయ, వ్యయాల ఖాతా.
ఆర్థిక సంవత్సరంలో రాబోయే ధరల పెంపు, తగ్గింపు, పన్నులు, మినహాయింపులు, ఆర్థిక పథకాల గురించి ఇందులో తెలుస్తాయి. కాబట్టి ఆర్థిక వర్గాల నుంచి, సామాన్య ప్రజల వరకు యూనియన్ బడ్జెట్‌పై అనేక అంచనాలు పెట్టుకుంటారు.
బడ్జెట్ అంటే ఏంటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 బడ్జెట్‌ను భారత ప్రభుత్వపు అంచనా ఆదాయ, వ్యయాల ప్రకటనగా నిర్వచించింది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
బడ్జెట్ సమర్పణలో విశేషాలు:
- బడ్జెట్ పత్రాలను బ్రీఫ్ కేస్‌లో తీసుకెళ్లే సంప్రదాయాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. "బడ్జెట్" అనే పదం ఫ్రెంచ్ పదం "బౌగెట్" నుండి వచ్చింది, దీనికి ‘చిన్న బ్యాగ్’ అని అర్థం.
- మొదటి భారతీయ బడ్జెట్‌ను 1860 ఫిబ్రవరి 1వ తేదీన స్కాట్స్‌మన్ జేమ్స్ విల్సన్ సమర్పించారు. ఆయన ఇండియన్ వైస్రాయ్ మేనేజ్‌మెంట్ కమిటీలో ఫైనాన్సియల్ మెంబర్. 'ది ఎకనామిస్ట్', 'ది చార్టర్డ్ బ్యాంక్' వ్యవస్థాపకుడు కూడా ఆయనే. 1969లో ఇది స్టాండర్డ్ బ్యాంక్ లో విలీనమైంది.
- 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె.షణ్ముగం చెట్టియార్ స్వతంత్ర భారత తొలి బడ్జెట్‌ను సమర్పించారు. కోయంబత్తూరులో జన్మించిన ఆయన, నెహ్రూ క్యాబినెట్‌లో ఒక సంవత్సరం పాటు ఆర్థిక మంత్రిగా పని చేశారు.

ఫొటో సోర్స్, WIKIPEDIA
- మొరార్జీ దేశాయ్ భారత పార్లమెంట్‌లో అత్యధిక బడ్జెట్‌లు సమర్పించిన రికార్డును సాధించారు. ఆర్థిక మంత్రిగా ఆయన 10సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత పి.చిదంబరం తొమ్మిదిసార్లు బడ్జెట్‌లను సమర్పించారు.
- 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పని దినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు.
- 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు.
- స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఇందిరా గాంధీ. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖను కూడా తాత్కాలికంగా నిర్వహించారు. నిర్మలా సీతారామన్ జూలై 5, 2019న తన తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఫుల్ టైమ్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను సమర్పించిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కారు.
- గతంలో ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్ లో ఆర్ధిక మంత్రి బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చేవారు. కానీ, 2019లో నిర్మలా సీతారామన్ ఈ పద్ధతిని మార్చారు. జాతీయ చిహ్నంతో ఉన్న క్లాత్ బ్యాగులో బడ్జెట్ పత్రాలను తీసుకురావడం ప్రారంభించారు.
- 2021లో నిర్మలా సీతారామన్ భారతదేశపు మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. క్లాత్ బ్యాగ్ లో బడ్జెట్ పత్రాలకు బదులు, "మేడ్ ఇన్ ఇండియా" ఎలక్ట్రానిక్ టాబ్లెట్‌లో నిర్మలా సీతారామన్ తొలి డిజిటల్ బడ్జెట్‌ను చదివారు.

ఫొటో సోర్స్, Getty Images
- 1973-74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ రావ్ చవాన్ రూ.550 కోట్ల లోటుతో బడ్జెట్‌ను సమర్పించారు. ఇది భారత ప్రభుత్వానికి అతిపెద్ద లోటు బడ్జెట్. అప్పట్లో దీనిని "బ్లాక్ బడ్జెట్" అని విమర్శించారు. ఇది ఇండో-పాక్ యుద్ధం తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్.
- 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్‌లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- 1958లో అప్పటి ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి, అలా చేసిన మొదటి ప్రధాన మంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987-88లో ఆర్ధిక మంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు.
- బడ్జెట్ సమర్పణకు పది రోజుల ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో "హల్వా పండుగ" జరుపుకుంటారు. హల్వాను ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేసి పంపిణీ చేస్తారు. ఈ సంప్రదాయంతో బడ్జెట్ ప్రింటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రితోపాటు అనేకమంది ఆ శాఖ అధికారులు పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images
- హల్వా వేడుక పూర్తయిన తర్వాత, ప్రింటింగ్‌లో పాల్గొన్న సిబ్బందిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ భవనంలో ఉంచుతారు. ప్రింటింగ్ అయ్యే వరకు వీరు మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ సమర్పణ రోజున మాత్రమే ఈ భవనాల తలుపులు తెరుచుకుంటాయి.
- గతంలో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవనంలోని ప్రెస్‌లో ముద్రించేవారు. కానీ 1950లో కొన్ని బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రక్రియను మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చారు.
- 1980 నుండి, బడ్జెట్ పత్రాలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ: పాల సముద్రంలా కనువిందు చేస్తున్న పొగమంచు, ఇక్కడే ఎందుకిలా ఏర్పడుతోంది
- స్మార్ట్ఫోన్లను వాడకూడదని వీళ్లు ఎందుకు అనుకుంటున్నారు
- భూమికి 4000 కాంతి సంవత్సరాల దూరంలో అంతుచిక్కని వస్తువు, 18 నిమిషాలకు ఒకసారి రేడియో ఎనర్జీ విడుదల
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- రష్యా, యుక్రెయిన్: యుద్ధం వస్తే ఎవరి బలమెంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








