మోదీ ప్రభుత్వ చర్యలతో ఎన్‌జీఓలు ఇరకాటంలో పడ్డాయా, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలను కూడా ఎందుకు వదల్లేదు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANTONIO MASIELLO/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

విదేశీ నిధులను స్వీకరించకుండా పెద్ద సంఖ్యలో ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జీఓ)ల లైసెన్సులను రద్దు చేస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇలా లైసెన్సులు రద్దయిన వాటిలో వెనుకబడిన, అణచివేతకు గురవుతున్నవారి హక్కుల కోసం పని చేస్తున్న సంస్థలతోపాటు, అధికార పార్టీతో అనుబంధం ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి.

హోం శాఖ తీసుకున్న నిర్ణయం అనేక ఎన్జీవోల భవిష్యత్తును సందిగ్ధంలో పడేసింది.

పేదలు, అణగారిన వర్గాల కోసం పని చేసే 179 సంస్థల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, మరో 5,789 సంస్థల లైసెన్సులను రెన్యూవల్ చేయడానికి కేంద్రం నిరాకరించింది. అయితే, ఎన్జీవో రంగంపై ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉంది.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభావితమైన సంస్థల్లో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, ఆక్స్‌ఫామ్ ఇండియా, జామియా మిలియా ఇస్లామియా వంటి సంస్థలు ఉన్నాయి.

అలాగే, గుంటూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న సేవాభారతి, త్రిపురలో క్రైస్తవ మత మార్పిడికి వ్యతిరేకంగా పని చేస్తున్న శాంతికాళీ మిషన్ లాంటి సంస్థలు కూడా లైసెన్సులు రద్దయిన/రెన్యువల్ కాని వాటి జాబితాలో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, తల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన కొడుకు, కూతురు

''సంఘ్ పరివార్‌తో సంబంధం ఉన్న సేవా భారతి, క్రైస్తవ మత మార్పిడిని వ్యతిరేకించి క్రైస్తవుల చేతిలో హత్యకు గురైన శాంతికాళి మహారాజ్‌ సంస్థ లైసెన్సును కూడా రద్దు చేశారు. నిబంధనలను పాటించకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తారు. ఈ చర్యల్లో ఏ మతం పట్లా వివక్ష చూపలేదు'' అని విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ బీబీసీతో అన్నారు.

అయితే, ప్రభుత్వ చర్యలపై కొన్ని ఎన్జీవోలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

''ఎన్జీవోలపై 2014 నుంచి మోదీ ప్రభుత్వం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ ల ఒత్తిడి ఉంది. వాళ్లకు ఎన్జీవోలంటే ఇష్టం ఉండదు. భారతదేశంలో చట్టబద్ధమైన పాలన ఉందని నమ్మలేం. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ముసుగులో నిరంకుశ ప్రభుత్వం ఉంది'' అని కాలమిస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకర్ పటేల్ బీబీసీతో అన్నారు.

లైసెన్సులు రద్దయిన ఎన్జీవోలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లైసెన్సులు రద్దయిన ఎన్జీవోలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒకటి

దుర్వినియోగానికి నిధులు

1976 నాటి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ స్థానంలో 2010 సంవత్సరంలో కొత్త చట్టం తీసుకువచ్చారు. 2020లో దానికి సవరణలు చేశారు.

ఈ చట్టం ప్రకారం, ఎన్జీవోలు విదేశాల నుండి నిధులు సేకరించవచ్చు. కానీ, నిధులను మత సామరస్యానికి భంగం కలిగించడానికి, హింసకు, ప్రజాప్రయోజనాలకు హాని కలిగించడానికి ఉపయోగించరాదు.

అలాగే, భారతదేశ సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసేందుకు వినియోగించకుండా చూసుకోవాలి. ఒక పని కోసం తీసుకున్న నిధులను వేరే పనుల కోసం బదిలీ చేయకూడదు.

''ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ)లోని 12,13 సెక్షన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. విద్యా, ఆరోగ్య రంగాల కోసం నిధులు వస్తే వాటిని ఇతర రంగాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధం. కానీ చాలా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి నిధులను మత మార్పిడికి ఉపయోగిస్తాయి. మేం 7,500 పేజీలతో హోం మంత్రిత్వ శాఖకు 350 ఫిర్యాదులను దాఖలు చేసాము'' అని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (ఎల్‌ఆర్‌ఓ) వ్యవస్థాపక కన్వీనర్ వినయ్ జోషి బీబీసీతో అన్నారు.

లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ కూడా 300 మంది సభ్యులతో కూడిన ప్రభుత్వేతర సంస్థ. ఇది ప్రాథమికంగా ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘనల కేసులను పరిశోధిస్తుంది.

విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు వస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నట్లు కేంద్రం భావిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు వస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నట్లు కేంద్రం భావిస్తోంది

తమ ఎన్జీవో విదేశాల నుంచి నిధులు సేకరించదని వినయ్ జోషీ తెలిపారు. ''ఎఫ్‌సీఆర్ఏ దుర్వినియోగంపై ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా చాలా సీరియస్‌గా ఉన్నారు'' అని ఆయన వెల్లడించారు.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంకు ఖాతాలపై నిషేధించారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కేంద్రంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత గత వారం ప్రభుత్వేతర సంస్థల లైసెన్సుల రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అయితే, తమ బ్యాంకు ఖాతాలపై ప్రభుత్వం నిషేధం విధించలేదని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. లైసెన్స్ రెన్యూవల్ జరగనందున తామే బ్యాంకు ఖాతాలను ఉపయోగించరాదని స్వచ్ఛందంగా నిర్ణయించామని ఆ సంస్థ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు

అయితే, హోం మంత్రిత్వ శాఖ హఠాత్తుగా ఈ చర్యకు ఎందుకు దిగిందన్న దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

గుజరాత్‌లోని వడోదర కేంద్రంగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన సభ్యులు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చిన రెండు వారాల తర్వాత ఆ సంస్థపై చర్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వడోదరలో బాలికల హాస్టళ్లలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సభ్యులు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఖండించింది. ప్రస్తుతం వ్యవహారంపై పోలీసు విచారణ జరుగుతోంది.

లైసెన్సుల రద్దు వల్ల తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆగిపోతాయని ఆక్స్‌ఫామ్ అంటోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లైసెన్సుల రద్దు వల్ల తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆగిపోతాయని ఆక్స్‌ఫామ్ అంటోంది

ఆక్స్‌ఫామ్ విజ్ఞప్తి

ఆక్స్‌ఫామ్ ఇండియాతో సహా అనేక ఇతర సంస్థల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల కిందట ప్రకటించింది. ఆక్స్‌ఫామ్ భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో పనిచేస్తున్న సంస్థ.

"సామాన్యుల కోసం దశాబ్దాలుగా ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రభుత్వం, కమ్యూనిటీ, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో కలిసి పనిచేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ఆక్స్‌ఫామ్ ఇండియా ఆరోగ్య శాఖలు, జిల్లా అధికారులతో కలిసి పని చేశాయి. కోవిడ్-19 కారణంగా చదువులకు దూరమైన అనేకమంది విద్యార్ధుల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నాం'' అని ఆక్స్‌ఫామ్ సీఈఓ అమితాబ్ బెహర్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిన యువకుడు

'' ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మేం కృషి చేశాం. ఎఫ్‌సీఆర్ఏ చట్టం ద్వారా మా సంస్థ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణను నిరాకరిస్తూ హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఈ పనులన్నీ దెబ్బతింటాయి'' అని ఆయన అన్నారు.

అయితే, బెహర్ వాదనను విశ్వహిందూ పరిషత్ నాయకుడు సురేంద్ర జైన్ కొట్టిపారేశారు. ''మీరు నిజంగా సేవలే చేసినట్లయితే, మిమ్మల్ని భారతదేశంలో ఎవరూ అడ్డుకోరు'' అని అన్నారు.

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు

రామజన్మభూమి ట్రస్ట్‌ను ఉదాహరణగా చూపిన సురేంద్ర జైన్ "ప్రపంచంలోని ప్రతి హిందువు సహకారం అందించాలని కోరుకుంటున్నారు. కానీ, మేం రామమందిరం నిర్మిస్తున్నామని చెబుతామా, లేక ఆక్సీజన్ ప్లాంట్‌లు నిర్మిస్తున్నామని చెబుతామా? ఏ పేరుతో మేం నిధులు సేకరిస్తాం? ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను నెరవేర్చలేనందునే రామ జన్మభూమి ట్రస్ట్ విదేశాల నుండి నిధుల కోసం ప్రయత్నించ లేదు'' అని అన్నారు.

''గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎన్జీవోలు సహాయకార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా మోదీ జీ ముకుళిత హస్తాలతో కోరారు. ఇప్పుడు కోవిడ్ ముగిసిపోయిందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకర్ పటేల్ అన్నారు.

అయితే, ఆక్స్‌ఫామ్ సంస్థ వాదనలను ఎల్‌ఆర్ఓ సంస్థకు చెందిన వినయ్ జోషీ ఖండించారు. '' అస్సాంలో తేయాకు తోటలలో పని చేసే కార్మికుల స్థితిగతులపై ఆక్స్‌ఫామ్ ప్రచారం నిర్వహిస్తోంది. కానీ అందులో అంతా సినిమా స్టార్లే ఉన్నారు'' అని జోషీ ఆరోపించారు.

''ఆక్స్‌ఫామ్ సహా పలు ఎన్జీవోలపై తీసుకున్న చర్యల వెనక రాజకీయ కారణాలున్నాయని భావించాల్సి వస్తోంది. భారతదేశంలో అసమానతలను వ్యతిరేకించే వారంటే ప్రభుత్వానికి ఇష్టం ఉండదు'' అని న్యాయశాస్త్ర ప్రొఫెసర్, యాక్షన్ ఎయిడ్ సంస్థ మాజీ డైరెక్టర్ బాబు మాథ్యూ అన్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటే కోర్టుకు వెళ్లడమొక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)