కరోనావైరస్‌ బాధితులకు అత్యవసర సాయం అందించే ఎన్జీవోలను ఈ భారతీయ చట్టం ఎందుకు అడ్డుకుంటోంది

విదేశీ విరాళాలు-ఎన్జీవో

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, కోవిడ్ రెండో దశలో ఇండియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది

గత ఏడాది కరోనా మొదటి వేవ్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం' (ఎఫ్‌సీఆర్ఏ)లో సవరణలు తీసుకు వచ్చింది.

ఆ మేరకు భారత్‌లో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు దేశంలోని ఇతర స్వచ్ఛంద సంస్థలకు, గ్రూపులకు విదేశీ సహాయాన్ని పంపిణీ చేయలేవు.

అంతే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన నిధులన్నిటినీ రాజధాని దిల్లీలో ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.

"పారదర్శకతను పెంచేందుకు, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ సవరణలను అమలులోకి తీసుకువచ్చినట్లు" అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ చట్టం ప్రజల ప్రాణాలకు దుర్భరంగా మారిందని 'ది యాంట్' ఎన్జీవో సహ వ్యవస్థాపకులు జెన్నిఫర్ లైంగ్ అభిప్రాయపడ్డారు.

దిల్లీలో బ్యాంకు ఖాతా తెరవలేకపోయిన కారణంగా విదేశాల నుంచి వచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అవసరమైన వారికి పంపిణీ చేయలేకపోతున్నామని, ప్రభుత్వానికి కూడా అందించలేకపోతున్నామని ఆమె తెలిపారు.

కరోనా రెండో దశలో భారత్‌ తీవ్ర వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ కారణంగా రెండున్నర లక్షలకు పైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

కానీ వాస్తవంలో అంతకు 30 రెట్లు ఎక్కువమంది మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని అనేక ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.

విదేశీ విరాళాలు-ఎన్జీవో

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, అనేక ఆస్పత్రులలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది

ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలు:

  • ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ముందే ఎఫ్‌సీఆర్ఏ కింద తమ సంస్థలను నమోదు చేసుకోవాలి.
  • విదేశాల నుంచి వచ్చే నిధులను దిల్లీలో ప్రభుత్వం నిర్దేశించిన స్టేట్ బ్యాంక్ శాఖలలో జమ చేయాలి.
  • ఇకపై ఎన్జీఓలు విదేశీ విరాళాలను (డబ్బు, సామగ్రి) ఇతర స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయలేవు. సబ్‌కాంట్రాక్ట్ పద్ధతిని నిషేధించారు.

నిధుల పంపిణీ చుట్టూ ఉన్న క్లిష్టమైన నిబంధనల కారణంగా కోవిడ్ సహాయాన్ని అందించడంలో అనవసరమైన జాప్యం జరుగుతోందని ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్జీఓల సహాయాన్ని అంగీకరించడాన్ని ఈ చట్టం నేరం కింద జమ కడుతోందని ఆమ్నెస్టీ ఇండియా డైరెక్టర్ ఆకార్ పటేల్ అన్నారు.

"కోవిడ్‌పై పని చేస్తున్నా కూడా, ఈ చట్టాన్ని అతిక్రమించకుండా విదేశీ సహాయాన్ని అందుకోవడం చాలా కష్టమై పోయింది" అని ఆయన అన్నారు.

విదేశీ నిధుల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అనుమానాస్పదంగా ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో, 'ప్రధాన స్రవంతి స్వచ్ఛంద సంస్థల కారణంగా ఆర్థిక వృద్ధి నిలిచిపోతోంది' అని ఆయన ఆరోపించారు.

విదేశీ విరాళాలు-ఎన్జీవో

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈ చట్టం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారి నోళ్లు నొక్కేస్తోందని మానవ హక్కుల లాయరు ఝుమా సెన్ అన్నారు.

ఏదైనా ఎన్జీవో సభ్యుడు నిరసనల్లో పాల్గొంటే ఆ ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ను రద్దు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, బీజేపీ నేత నరేంద్ర తనేజా ఈ చట్టాన్ని బలంగా సమర్థిస్తున్నారు.

"ఈ చట్టం గురించి పార్లమెంటులో చర్చ జరిగింది. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఇతర దేశాలు మా చట్టాలను గౌరవిస్తాయని ఆశిస్తున్నాం. మాకు సార్వభౌమాధికారం ఉంది" అని ఆయన అన్నారు.

కోవిడ్ సంక్షోభం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చట్టం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఎన్జీవోలు నష్టపోతాయని,పెద్ద సంస్థల నుంచి నిధులు, మద్దతు లేకుండా ఈ చిన్న సంస్థలు నడవడం కష్టమనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ అజమాయిషీ పెరగడం వల్ల కలిగే జాప్యం చాలా నష్టాన్ని చేకూరుస్తుందని ఎన్జీవోలు హెచ్చరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)