అమెరికా-కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయుల మృతి: గుజరాత్‌లోని ఈ గ్రామ ప్రజలు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛాడా, భార్గవ్ పరీఖ్
- హోదా, కలోల్, గుజరాత్
గాంధీనగర్ జిల్లా కలోల్ తహసీల్ పరిధిలోని దింగుచా గ్రామం ప్రధాన ద్వారాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్లిన వెంటనే, తాళంవేసిన ఒక ఇల్లు కనిపిస్తుంది.
ఇక్కడ వరుసగా కనిపిస్తున్న ఇళ్లలో ఆ ఇల్లు కూడా ఒకటి. అయితే, కొన్ని రోజులుగా ఇక్కడికి మీడియా ప్రతినిధులు చాలా మంది వస్తున్నారు. ఈ ఇంటిలో ఉండే నలుగురు కెనడా వెళ్లారు. అయితే, అక్కడ -35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద వారు గడ్డకట్టుకుపోయి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఇంటిలో ఉండే జగదీశ్ పటేల్, ఆయన కుటుంబంతో జగదీశ్ పటేల్పటేల్, వారి కుమార్తె, మూడేళ్ల కుమారుడు మరణించినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ గ్రామాన్ని బీబీసీ బృందం సందర్శించినప్పుడు, పటేల్ కుటుంబం గురించి గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేశారు. పటేల్ కుటుంబం నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు జర్నలిస్టులు ఈ గ్రామానికి వస్తున్నారు.
జగదీశ్ కుటుంబం గురించి ఆయన తండ్రి బల్దేవ్ భాయ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘పది రోజుల క్రితం మా అబ్బాయి జగదీశ్, కోడలు వైశాలి, వారి కుమార్తె విహంగ, కుమారుడు ధార్మిక్.. కెనడా వెళ్లారు. కెనడా వీసా దొరికిందని జగదీశ్ మాకు ఫోన్‌చేసి చెప్పాడు. కెనడా వెళ్లిన తర్వాత, మిగతా వివరాలు చెబుతానని జగదీశ్ అన్నాడు. కానీ, గత నాలుగు రోజులుగా మాకు వారి నుంచి ఫోన్ రాలేదు. మా బంధువుల సాయంతో జగదీశ్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
బల్దేవ్ ఒక రైతు. ఆయనకు 12 ఎకరాల భూమి ఉంది. పొలం పనుల్లో బల్దేవ్‌కు జగదీశ్ సాయం చేస్తుండేవారు. పిల్లల చదువుల కోసం జగదీశ్ కలోల్‌లో స్థిరపడ్డారు.
జగదీశ్ కుటుంబం కెనడా వీసాకు దరఖాస్తు చేసేముందు తనకు ఎలాంటి సమాచారమూ లేదని బల్దేవ్ వివరించారు.
పది రోజుల క్రితం పర్యటక వీసాపై జగదీశ్ కుటుంబం కెనడా వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, గత ఐదు రోజుల నుంచి వారు ఎక్కడ ఉన్నారో ఎలాంటి సమాచారమూ లేదు. ‘‘మేం వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాం. ఎంతకీ ఫలితం లేకపోవడంతో విదేశాంగ శాఖను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మేం విదేశాంగ శాఖకు మెయిల్ కూడా పంపించాం’’అని దింగుచా గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు వివరించారు.
‘‘వారు ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకుని ఉండొచ్చని అనిపించింది. దీంతో ఏదైనా సాయం అందుతుందేమోనని విదేశాంగ శాఖను సంప్రదించాం’’అని ఆయన చెప్పారు. దింగుచా గ్రామానికి 12 కి.మీ. దూరంలోని కలోల్ పట్టణంలో జగదీశ్‌కు సొంత ఇల్లు ఉందని వివరించారు.
‘‘పొలం పనుల్లో తండ్రికి జగదీశ్ సాయం చేస్తుండేవారు. పండగల సమయంలో బట్టలు కూడా అమ్మేవారు. ఆయన హోల్‌సేల్ వ్యాపారి కూడా.’’

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
విదేశాలపై మక్కువ..
అయితే, ఈ గ్రామంలోని వారంతా విదేశాలకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారని దింగుచా గ్రామానికి చెందిన కొందరు బీబీసీతో చెప్పారు. ‘‘ఉదాహరణకు విదేశాల్లో బంధువులు ఎవరూ లేకపోతే.. అబ్బాయి పెళ్లికి సరైన అమ్మాయి దొరకడం కూడా కష్టమే. విదేశాల్లో బంధువులుంటే దాన్ని హోదాగా పరిగణిస్తారు. ఈ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది’’అని వారు వివరించారు.
విదేశాలకు వెళ్లాలని గ్రామస్థులపై ఎందుకు ఒత్తిడి ఉంటుందో తెలుసుకునేందుకు మరికొంత మందితో బీబీసీ మాట్లాడింది. అయితే, ఇక్కడ దాదాపు అందరికీ అమెరికా, కెనడా వీసా చట్టాల గురించి తెలుసు. భిన్నమైన వీసాలతోపాటు ఏ వీసా వల్ల గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం వస్తుందో కూడా వీరికి తెలుసు.
‘‘ఎవరి దగ్గరైతే విదేశాలకు వెళ్లడానికి డబ్బులు ఉండవో, వారే ఇక్కడ ఉండిపోతారు. మిగతా వారంతా విదేశాలకు వెళ్లిపోతారు’’అని ఒక గ్రామస్థుడు బీబీసీతో చెప్పారు.
ఈ గ్రామంలో ఒక శ్మశానం కడుతున్న గుత్తేదారు కేఎల్ పటేల్.. బీబీసీతో మాట్లాడారు. ఎన్ఆర్‌ఐలు ఇచ్చే నిధులతోనే ఇక్కడ శ్మశానం నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు రూ.1.5 కోట్లతో ఇక్కడ ఒక దేవాలయం కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
అమెరికా ఎలా వెళ్తారు?
ఇక్కడున్న పిల్లలంతా విదేశాలకు వెళ్లాలనే కలలు కంటూ పెరుగుతారని దింగుచా పంచాయతీ ప్రతినిధి బీబీసీతో చెప్పారు. ‘‘ఇక్కడుండేవారు డబ్బులు పోగుచేసుకొని, వాటిని ఏజెంట్ల చేతికి ఇస్తారు. ఆ ఏజెంట్లే వీరిని అమెరికా తీసుకొని వెళ్తారు’’అని ఆయన వివరించారు.
‘‘ఎలాంటి పత్రాలూ లేకుండా ఇదివరకు కూడా చాలా మంది అమెరికా వెళ్లారు. ఇప్పుడు వారు చాలా బావున్నారు కూడా.’’

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
అమెరికా పౌరసత్వమున్న అమ్రత్ పటేల్ 1988లో అక్కడకు వెళ్లారు. రెండేళ్లలోనే అతడికి గ్రీన్ కార్డు వచ్చింది. ఆ తర్వాత కుటుంబాన్ని కూడా ఆయన అమెరికా తీసుకుని వెళ్లారు. ఇప్పుడు కుటుంబం మొత్తానికి అమెరికా పౌరసత్వముంది. ఆయన ఈ గ్రామానికి ఏటా వచ్చి ఒక ఐదు నెలలు ఇక్కడే ఉంటారు.
‘‘ఇక్కడి నుంచి అమెరికా వెళ్లేవారికి మొదట కొంత సాయం అవసరం. అక్కడకు వెళ్లాక, నా లాంటి చాలా మంది వారికి సాయం చేస్తారు’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Roxy Gagdekar, Pavan Jaiswa
‘‘మొదట అమెరికా వచ్చినప్పుడు వారు చిన్నచిన్న షాపుల్లో పనిచేస్తారు. అలా నెమ్మదిగా వారు పెద్ద ఉద్యోగాలలోకి వెళ్తారు. అక్కడకు వెళ్లేవారంతా సరైన పత్రాలు లేకుండా వెళ్తారని చెప్పడం సరికాదు. చాలా మంది అన్నీ సవ్యంగా ఉండేలా చూసుకున్నాకే వెళ్తారు’’అని ఆయన వివరించారు.
జగదీశ్ పటేల్ తల్లిదండ్రులు ఈ గ్రామాన్ని వదిలిపెట్టి, అహ్మదాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. వారితోపాటు ఈ గ్రామంలోని వారి బంధువులు భారత ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం విదేశాంగ శాఖ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తహసీల్దార్ జయేశ్ చౌధరి బీబీసీతో చెప్పారు. ‘‘అంతర్జాతీయ మీడియాలో కనిపించిన నాలుగు మృతదేహాలు.. కెనడా వెళ్లి కనిపించకుండా పోయిన వారితో సరిపోలుతున్నాయని మాత్రమే నేను చెప్పగలను’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 19ఏళ్ల అమ్మాయి ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చింది
- గుడివాడ కాసినో... వీడియోల్లో ఏముంది
- రష్యా, యుక్రెయిన్: ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.. ఏదో జరగొచ్చని అనిపిస్తోంది’
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?
- ‘పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











