19ఏళ్ల అమ్మాయి ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చింది

ఫొటో సోర్స్, Reuters
19ఏళ్ల మహిళా పైలట్ ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. ఐదు నెలల్లో ఆమె ఈ యాత్రను పూర్తిచేశారు. దీంతో ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.
ప్రతికూల వాతావరణం వల్ల జరా రూథర్‌ఫర్డ్‌కు ఈ యాత్రను పూర్తి చేయడానికి రెండు నెలలు అదనంగా పట్టింది. ఎట్టకేలకు ఆమె యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని బెల్జియంలోని కోర్ట్రిజ్క్ వేవెల్గెమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు.
సూపర్‌ఫ్లైట్ విమానంలో ఆమె ఈ యాత్రను పూర్తిచేశారు. అలస్కాలోని నోమ్‌లో ఒక నెల, రష్యాలోని అయాన్‌లో 41 రోజులు ఆమె ఉండిపోవాల్సి వచ్చింది. కొలంబియాలోనూ ఆమె కొన్ని రోజులు అదనంగా గడపాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
స్వాగతం
బెల్జియం చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు, పాత్రికేయులు, శ్రేయోభిలాషులు స్వాగతం పలికారు.
ఆమె విమానం దిగిన వెంటనే, బ్రిటన్, బెల్జియం జెండాలను ఒంటిపై కప్పుకొని అభివాదం చేశారు.
‘‘ఇదొక అద్భుత ప్రయాణం. నిజానికి నన్ను నేను నమ్మలేకపోతున్నా’’అని ఆమె రిపోర్టర్లతో చెప్పారు.
51,000 కి.మీ. యాత్రను విజయవంతంగా పూర్తి చేయడంతో చాలా సంతోషంగా ఉందని విలేఖరుల సమావేశంలో ఆమె చెప్పారు.
‘‘సైబీరియాలో చాలా పెద్ద సవాల్ ఎదురైంది. అక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండేవి. మధ్యలో ఇంజిన్ ఆగిపోతే, బతికి బట్టకట్టడం చాలా కష్టం. నా యాత్ర అనుభవాలను అందరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను. జీవితంలో ఇలాంటి మరిన్ని విజయాలు సాధించేలా ప్రజలు నన్ను ప్రోత్సహించాలి’’అని ఆమె చెప్పారు.
‘‘మీకు ఇలాంటి అవకాశం దొరికితే, అసలు వదిలిపెట్టొద్దు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అల్ట్రాలైట్ విమానంలో తొలి మహిళగా
గత ఏడాది ఆగస్టు 18న జరా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఐదు ఖండాల్లో 60కిపైగా ప్రాంతాల్లో ఆమె కాలు మోపారు.
బ్రిటిష్-బెల్జియం మూలాలున్న జరా తల్లిదండ్రులిద్దరూ పైలట్లే. అమ్మాయిలను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) సబ్జెక్టులు తీసుకొనేలా ప్రోత్సహించాలని ఆమె అన్నారు.
ఈ యాత్ర విజయవంతం కావడంలో తన స్పాన్సర్లు తోడుగా నిలిచారని జరా చెప్పారు. బ్రిటన్‌లోని హ్యాంప్‌షైర్‌లోని తన స్కూల్, అల్ట్రాలైట్ విమానాన్ని తయారుచేసిన స్లొవేనియా సంస్థ షార్క్ కూడా తనకు ఎంతో సాయం అందించారని ఆమె వివరించారు.
ఆమెకు మొదటగా అభినందనలు తెలిపిన వారిలో ఆమె స్కూల్ బృందం కూడా ఉంది. జరా విజయం తమకు గర్వకారణమని ఆమె స్కూల్ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, FlyZolo
ఎన్నో విజయాలు
జరాకు ముందుగా, ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన మహిళ అనే రికార్డు అమెరికాకు చెందిన శైష్ట వాజ్ పేరుతో ఉండేది. 2017లో 30ఏళ్ల వయసులో వాజ్ ఈ రికార్డు సాధించారు.
పురుషుల విషయంలో 18ఏళ్ల ట్రావిస్ లడ్లో పేరుతో ఈ రికార్డు ఉంది.
ఈ రికార్డు విషయంలో పురుషులు, మహిళల మధ్య వయో భేదాన్ని 11 సంవత్సరాల నుంచి 11 నెలలకు తగ్గించాలని సంకల్పించినట్లు జరా తన వెబ్‌సైట్లో పేర్కొన్నారు.
అంతేకాదు ఈ యాత్రను పూర్తిచేసిన అతి పిన్న వయస్కురాలైన మహిళ కూడా ఇప్పుడు జరానే. మరోవైపు అల్ట్రాలైట్ విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి మహిళ కూడా ఆమెనే. విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన బెల్జియంవాసి కూడా ఆమె కావడం విశేషం.

ఫొటో సోర్స్, FlyZolo
మూడు నుంచి ఐదు నెలలకు
ఈ యాత్రను జరా మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల ఈ యాత్రను ఆమె మరో రెండు నెలలు పొడిగించాల్సి వచ్చింది. సైబీరియాలో ఉండేటప్పుడు ఆమె వీసా గడువు కూడా ముగిసిపోయింది.
అలస్కాలోని నోమ్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ 39 ఫ్లైట్లలో మూడు మాత్రమే సమయానికి అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో అక్కడ కూడా ఆమె వేచి ఉండాల్సి వచ్చింది.
కొత్త వీసా కోసం ఎయిర్‌మెయిల్ ద్వారా హ్యూస్టన్‌లోని రష్యా కాన్సులేట్‌కు ఆమె పాస్‌పోర్టును పంపారు. అయితే, ఆమె బేరింగ్ జల సంధి దాటేందుకు మూడు వారాల ముందే ఆ వీసాకు కూడా గడువు చెల్లిపోయింది.
‘‘ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 18 డిగ్రీల వరకు ఉన్నాయి. నా చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. నెల రోజుల నుంచీ నేను ఇక్కడే ఉన్నాను’’అని ఇన్‌స్టాలో ఆమె ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు.
‘‘నేను విమానాన్ని సిద్ధం చేస్తున్నాను. కానీ ఇక్కడ వాతావరణం అనుకూలించడం లేదు. నేను బయల్దేరడానికి సిద్ధమయ్యేటప్పుడు, ఒకసారి రష్యాలో ఇంకొకసారి నామ్‌లో వాతావరణం ప్రతికూలంగా మారుతోంది’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
చాలా అవాంతరాలు..
జరా సెర్బియాలో ఉన్నప్పుడు ఒకసారి ఉష్ణోగ్రతలు మైనస్ 35 డిగ్రీల వరకు వెళ్లాయి. గగన తలంలో ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 20 డిగ్రీలకు పడిపోయాయి.
వరుస అడ్డంకుల నడుమ ఆమె మేగడన్‌లో ఒక వారం, అయాన్‌లో మూడు వారాలు గడపాల్సి వచ్చింది.
మరోవైపు ప్రతికూల వాతావరణం నడుమ ఇండోనేసియాలోని ఒస్మాన్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోనూ రెండు రాత్రులు గడపాల్సి వచ్చింది.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సమయంలో కూడా తాను ఇంటికి దూరంగా గడపాల్సి ఉంటుందని చెబుతూ ఆమె ఇన్‌స్టాలో నవ్వుతున్న ఫోటో పోస్ట్ చేశారు.
మరోవైపు కాలిఫోర్నియా అడవుల్లో దట్టమైన పొగల మధ్యే ఆమె విమానాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది.
క్రిస్మస్ సమయంలో టైర్ పేలిపోవడంతో ఆమె సింగపూర్‌లో గడపాల్సి వచ్చింది. మెక్సికోలోని వెరాక్రూజ్‌లో ఓ హోటల్‌లో ఉండేటప్పుడు ఆమె భూకంపాన్ని కూడా చూశారు.
‘‘ఒక్కసారిగా భవనం మొత్తం వణికింది. అంత వేగంగా మెట్లు దిగుతానని నేను జీవితంలో ఎన్నడూ ఊహించలేదు’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, FlyZolo
గర్వకారణం..
జరా యాత్ర విషయంలో గర్వంగా ఉందని ఆమె స్కూల్ ప్రిన్సిపల్ జేన్ గేండీ వివరించారు.
‘‘విమానం నడపడం చాలా కష్టం. పైగా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసాలు, పాస్‌పోర్టుల పని కూడా ఉంటుంది’’అని ఆమె అన్నారు.
‘‘జరాను చూసి స్ఫూర్తి పొందిన 50 మంది విద్యార్థులు విమానం నడపడం నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా మందిలో ఆమె స్ఫూర్తి నింపాలని ఆశిస్తున్నాను’’అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, FLYZOLO
ఇవి కూడా చదవండి:
- గుడివాడ కాసినో... వీడియోల్లో ఏముంది
- రష్యా, యుక్రెయిన్: ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.. ఏదో జరగొచ్చని అనిపిస్తోంది’
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?
- ‘పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










