జయప్రకాశ్ నారాయణ్ భార్య పద్మావతి మహాత్మా గాంధీలా బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?

ఫొటో సోర్స్, NEHRU LIBRARY
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) 1920 అక్టోబర్ 14న బ్రజ్ కిషోర్ ప్రసాద్ కుమార్తె ప్రభావతిని వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు. అప్పట్లో ఆమె పురుషుల మాదిరి కుర్తా, పైజామా ధరించేవారు.
జేపీ అప్పుడు పట్నాలోని సైన్స్ కాలేజీలో చదువుకుంటున్నారు. ఆయన అక్కడ విద్యార్థి నాయకుడిగా వెలుగొందుతున్న రోజులవి.
అప్పటికే ప్రభావతి, మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. ఒక విధంగా ఆమె గాంధీని ఆరాధించేవారు. జీవితాంతం ఆమె గాంధీకి విధేయురాలిగానే ఉన్నారు. చాలా కాలం సబర్మతి ఆశ్రమంలో గడిపారు.
జయప్రకాశ్ నారాయణ్‌పై ఇటీవల వచ్చిన పుస్తకం 'ది డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్'లో రచయిత సుజాతా ప్రసాద్ ఈ విషయాలను రాశారు. ఈ పుస్తకాన్ని ఆమె తన తండ్రి బిమల్ ప్రసాద్‌తో కలిసి రచించారు.
"చేప నీటిని ఎంత సహజంగా స్వీకరిస్తుందో, ప్రభావతి అంతే సహజంగా ఆశ్రమధర్మాన్ని స్వీకరించారు. ఆమె గాంధీ పట్ల చాలా ఆకర్షితులయ్యారు. గాంధీ, కస్తూర్బా ఇద్దరూ ఆమెను ఎంతో గౌరవించేవారు. 1940లలో కస్తూర్బా ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్బంధంలో ఉన్నప్పుడు, ఆమె ఆరోగ్యం క్షీణించిన చివరి ఘడియల్లో తన మనుమరాలైన కదుంను, ప్రభావతిని తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఆ సమయంలో ప్రభావతి భగల్‌పూర్ జైలులో ఉన్నారు. కానీ కస్తూర్బా వద్దకు వెళ్లేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అనుమతించింది.

ఫొటో సోర్స్, Nehru Library
గాంధీ ప్రభావతికి తండ్రిలాంటివారు
"మొదట్లో జేపీ, ప్రభావతిల మధ్య అభిప్రాయబేధాలు ఉండేవి. జేపీ నాస్తికత్వం, మార్క్సిస్ట్ సోషలిజం ప్రభావతికి నచ్చేవి కావు. కానీ, క్రమంగా ఆమె జేపీని ప్రభావితం చేశారు. జేపీ కూడా గాంధీకి అభిమానిగా మారారు" అంటూ సుజాతా ప్రసాద్ వివరించారు.
"గాంధీ ఆమెకు తండ్రిలాంటివారు. ఆయన ఆమెకు గురువు, స్నేహితుడు కూడా. వారిద్దరూ రాసుకున్న ఉత్తరాలు చదివితే వారి మధ్య ఎంత సానిహిత్య సంబంధం ఉందో తెలుస్తుంది. ఆశ్రమం పనుల్లో ఆమె నిమగ్నమయ్యేవారు. టాయిలెట్ కడగడం లాంటి పనులు కూడా సంతోషంగా చేసేవారు. ఆశ్రమంలో ఉంటూ ప్రభావతి సంస్కృతం, గుజరాతీ నేర్చుకునేవారు. జేపీ సలహాతో ఇంగ్లిష్ కూడా నేర్చుకోవడం ప్రారంభించారు. రాట్నం తిప్పడం, వంట వండడం, గిన్నెలు తోమడం లాంటి పనులు నేర్చుకునేందుకు కూడా అక్కడే ప్రోత్సాహం లభించేది."

ఫొటో సోర్స్, Nehru Library
ప్రభావతి ఒంటరితనం
గాంధీ చెప్పారని ప్రభావతి డైరీ రాయడం ప్రారంభించారు. తెల్లవారు జామున 4.00 గంటలకే నిద్ర లేచేవారు. గాంధీతో కలిసి వాకింగ్‌కు వెళ్లేవారు. ఆయన పాదాలకు నేతితో మర్దనా చేసేవారు. ఆశ్రమంలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ ప్రభావతి ఒక సంఘటన వివరించారు.
"ఒకరోజు అంట్ల గిన్నెలు కుప్పలుగా పడున్నాయి. గాంధీ స్వయంగా వాటిని తోమడం ప్రారంభించారు. నేను పరిగెత్తుకుని వెళ్లి ఆయనను ఆ పని నుంచి తప్పించాలనుకున్నాను. కానీ, ఆయన నన్ను దెబ్బలాడారు. నీకే పని అప్పజెప్పారో ఆ పని చేయి అంటూ మందలించారు. ఆరోజు గీత చదవడం నా బాధ్యత."
ఆశ్రమంలో ఉన్న కాలంలో గాంధీ, ప్రభావతిల మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. జేపీ దూరంగా ఉండడం, ఆయన ఎప్పటికోగానీ ఉత్తరాలు రాయకపోవడం ఆమెను ఒంటరిని చేసింది. ఆ స్థితి నుంచి గాంధీ ఆమెను బయటకు తీసుకువచ్చి ఒక రకంగా తండ్రి పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Penguin
ప్రభావతి బ్రహ్మచర్యం
ప్రభావతిపై గాంధీ ప్రభావం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. 1929లో బెంగాల్, బర్మా పర్యటనలకు బయలుదేరుతూ ఆమె దిగులు వ్యక్తం చేశారు. ఆ సందర్బంగా గాంధీ ఆమెకు కలకత్తా (ఇప్పటి కోల్‌కతా) నుంచి ఒక ఉత్తరం రాశారు.
"నువ్వు ఇలా దిగులు చెందడం, భయపడడం నన్ను బాధించింది. ఇలాంటివన్నీ నువ్వు వదిలించుకోవాలి. ఎక్కడ ఉన్నా, నీ అంతట నువ్వు సొంతంగా జీవించగలిగినప్పుడే నేను నీకు ఏదైనా నిర్దిష్టమైన పనిని అప్పగించగలను" అంటూ మందలించారు.
జయప్రకాశ్ నారాయణ్‌తో అనుబంధం పెంచుకోవడానికి, ఆయన రాజకీయ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని గాంధీ ఆమెకు సూచించారు.
ఆశ్రమంలో ఉన్నప్పుడే ప్రభావతి బ్రహ్మచర్య వ్రతం చేపట్టారు. అయితే, ఆమె నిర్ణయం జేపీకి నచ్చలేదు.
"గాంధీ ఆశ్రమంలో బ్రహ్మచర్యానికి చాలా విలువ ఇచ్చేవారు. జేపీని సంప్రదించకుండానే ప్రభావతి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక గాంధీ హస్తం ఉందనడంలో వాస్తవం లేదు. ఈ విషయం తెలియగానే గాంధీ కలత చెందారు. ముందుగా జయప్రకాశ్ నారాయణతో దీని గురించి చర్చించాలని ప్రభావతికి సూచించారు. కానీ ప్రభావతి తన నిర్ణయంపై పట్టు వీడలేదు" అంటూ సుజాతా ప్రసాద్ రాశారు.
"దేశం కోసం తన జీవితాన్ని అర్పిస్తున్నట్లు భావించారామె. జేపీకీ అదే లక్ష్యం కాబట్టి తన నిర్ణయాన్ని వ్యతిరేకించరని ఆమె బలంగా విశ్వసించారు. ఈ విషయమై ఆమె జేపీకి ఒక లేఖ రాశారు. కానీ, ఆమె అంచనాలకు వ్యతిరేకంగా, జేపీ ఆమె నిర్ణయాన్ని స్వాగతించలేదు. ఇలాంటివి కలిసి చర్చించుకోవాలని, లేఖల్లో రాసేవి కావని ఆయన జవాబిచ్చారు."
ప్రభావతి తన నిర్ణయంపై గట్టిగా నిలబడడం, పునరాలోచించుకోవడానికి అంగీకరించపోవడం జేపీకి నచ్చలేదు.
ఆమె నిర్ణయానికి గాంధీ ఎంతగానో చలించిపోయి జయప్రకాశ్ నారాయణ్‌ని మరో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.
అప్పటికి జేపీ ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అమెరికాలో చదువుకుంటున్నారు. ప్రభావతి ఏకపక్ష నిర్ణయం జేపీ జీవితానికి భారంగా మారగలిగేదే.
అయినప్పటికీ, గాంధీ రెండో పెళ్లి ప్రస్తావన తేవడం తప్పుగా భావించారు జేపీ.

ఫొటో సోర్స్, NEHRU LIBRARY
ప్రభావతి, కమలా నెహ్రూల మధ్య స్నేహం
ఒక కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా నెహ్రూను కలిశారు జేపీ. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
అప్పటికి బనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకునిగా ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు జేపీ. కానీ, నెహ్రూ అడ్డుకుని, ఆయన్ను అలహాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్మిక పరిశోధన విభాగానికి అధిపతిగా నియమించారు. నెలకు 150 రూపాయల జీతం.
ప్రభావతితో కలిసి జేపీ అలహాబాద్ చేరుకున్నారు. స్వరాజ్ భవన్‌లోని తన గదిని జయప్రకాశ్ దంపతులకు ఇవ్వాలని నెహ్రూ తన తండ్రి మోతీలాల్ నెహ్రూకు లేఖ రాశారు.
నెహ్రూ ప్రభావతిని తన సోదరిలా భావించారు. జేపీని తన తమ్ముడిలా ప్రేమించారు.
"ఆ సమయంలోనే ప్రభావతికి, నెహ్రూ భార్య కమలా నెహ్రూతో స్నేహం కుదిరింది. ఆ స్నేహం జీవితాంతం కొనసాగింది. వారిద్దరూ వేరు వేరు ప్రాంతాలకు తరలివెళ్లినా, ఉత్తరాలు రాసుకునేవారు. కమలా నెహ్రూ కలకత్తా నుంచి ప్రభావతికి ఉత్తరం రాస్తూ, తన కుమార్తె ఇందిర చదువుకోవడానికి శాంతినికేతన్ వెళుతున్నదని, పట్నా ఖాదీ భండార్ నుంచి చౌకగా ఖాదీ చీరలు కొని ఇందిరకు అందించమని ప్రభావతిని కోరారు” అంటూ సుజాతా ప్రసాద్ రాశారు.

ఫొటో సోర్స్, NEHRU LIBRARY
స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ..
విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కమల, ప్రభావతి ఇద్దరూ ముందు నిల్చుని పోరాడారు.
బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అలహాబాద్‌లోని సివిల్ లైన్స్, కత్రా ప్రాంతాలలో ఉప్పు, ఖాదీలను విక్రయించే మహిళా బృందానికి వీరిద్దరూ నాయకత్వం వహించారు.
అలహాబాద్ మండుటెండల్లో ఉద్యమాలంటూ మహిళలు బయటకు వెళ్లకూడదని మోతీలాల్ నెహ్రూ ఆజ్ఞాపించారు. కానీ, వారి మాటను పెడచెవిన పెట్టి కమల, ప్రభావతి స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారు.
ఫలితంగా, 1932 ఫిబ్రవరి 3న కమలా నెహ్రూ, ప్రభావతి, స్వరూపరాణి బక్షి, నెహ్రూ సోదరీమణులు విజయలక్ష్మి, కృష్ణలను అరెస్ట్ చేశారు. వారిని మొదటి కొన్ని రోజులు అలహాబాద్‌లోని నైనీ జైలులో ఉంచారు. ఆ తర్వాత లక్నోలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
జేపీతో ఎక్కువ సమయం గడపాలని గాంధీ సలహా ఇచ్చారు
1930లలో జేపీ, ప్రభావతి స్వరాజ్ భవన్‌లో కొంతకాలం నివసించారు. తరువాత, జేపీ స్నేహితుడు గంగాశరణ్ సిన్హా వారి కోసం పట్నాలోని కదంకువాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు.
అయితే, అప్పటికి వారిద్దరికీ ఆదాయం వచ్చే మార్గం లేదు. చిన్న చిన్న మొత్తాలలో గాంధీ ఆర్థిక సహాయం అందిస్తుండేవారు.
"జేపీతో తన సహజీవనం గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రభావతి గాంధీకి లేఖలు రాసేవారు. గాంధీ వెంటనే జవాబిస్తూ ఆమె సందేహాలను నివృత్తి చేసేవారు. జేపీతో ఎక్కువ సమయం గడపమని సూచించేవారు. 1940ల నాటికి జేపీ, ప్రభావతిల మధ్య బంధం మరింత బలపడింది. ప్రభావతి బ్రహ్మచర్య వ్రతాన్ని జేపీ అమితంగా గౌరవించేవారు. తన కోరికలను తీర్చమని ఆమెను ఎపుడూ బలవంతపెట్టలేదు. ప్రభావతి కూడా క్లిష్టమైన తన నిర్ణయం నుంచి వెనుకడుగు వేయలేదు" అని సుజాతా ప్రసాద్ తన పుస్తకంలో వివరించారు.

ఫొటో సోర్స్, PATVARDHAN.COM
విజయ పట్వర్ధన్‌తో జేపీ పరిచయం
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయి జేపీ హజారీబాగ్ జైలులో ఉన్నారు. దీపావళి రోజు రాత్రి తన సహచరుల సహాయంతో 17 అడుగుల ఎత్తైన గోడ దూకి జైలు నుంచి తప్పించుకోగలిగారు. ధోతీలన్నీ తాడులా కట్టి, అది పట్టుకుని గోడ దూకారు.
తరువాత వేషం మార్చుకుని మొదట దిల్లీ, అనంతరం బొంబాయి (నేటి ముంబై) చేరుకున్నారు. అక్కడ అచ్యుత్ పట్వర్ధన్‌ను కలిశారు. ఆ సమయంలో అనేక రహస్య సమావేశాల్లో పాల్గొంటూ మార్క్సిస్ట్ సాహిత్యాన్ని పంచేవారు.
జేపీని అరెస్టు చేసిన వారికి బ్రిటిష్ ప్రభుత్వం తొలుత రూ.5,000 రివార్డు, తరువాత రూ.10,000 రివార్డు ప్రకటించింది.
బొంబాయిలో ఉన్న సమయంలోనే అచ్యుత్ పట్వర్ధన్ సోదరి విజయ పట్వర్ధన్ జేపీని కలిశారు.
"విజయ లండన్‌లో చదివారు. బొంబాయిలో తన సోదరుడితో సహా జేపీ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఆమె వారిని కలిశారు. జేపీ చేస్తున్న ఉద్యమం పట్ల ఆమె ఆకర్షితులయ్యారు" అని సుజాతా ప్రసాద్ వివరించారు.
నేపాల్ అడవుల్లో జేపీతో కలిసి..
1992లో విజయ పట్వర్ధన్ సోషలిస్టు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకు జయప్రకాశ్ నారాయణ్ అంటే పిచ్చి. అప్పటికే జయప్రకాశ్ అండర్ గ్రౌండ్‌కి వెళ్లి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ గెరిల్లా కేడర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నేను వారితో కలిసి ఉండాలనుకున్నాను. అందుకు నా సోదరుడు అచ్యుత్ ఒప్పుకోలేదు. కానీ, నేను ఆయన మాట వినలేదు. 1943 మార్చి 15న జేపీ దగ్గరకు వెళ్లిపోయాను. ఆయనతో పాటు చాలా చోట్లకు తిరిగాను. తరువాత నేపాల్ అడవుల్లో ఆయనతో పాటు రహస్య జీవనం కొనసాగించాను" అని తెలిపారు.
"ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికల ప్రకారం ఇద్దరూ ఒకే గుడిసెలో నివసించేవారు. విజయ తన పేరు మార్చుకున్నారు. జయప్రకాశ్ నారాయణ్‌కు ఒక సెక్రటరీలా అన్ని పనులూ చేసిపెట్టేవారు. జేపీ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు విజయ మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లి, జేపీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసేవారు. వారి రహస్య స్థావరం గురించి పోలీసులకు తెలిసిపోవడంతో వారి స్నేహానికి తెరపడింది.
జేపీ, విజయల మధ్య సంబంధం గురించి సుజాత తన పుస్తకంలో ఎక్కువగా వివరించలేదు.
దీనికి కారణమేమిటని ఆమెను అడుగగా, "ఈ పుస్తకం జేపీ 77 ఏళ్ల జీవితానికి సంబంధించినది. విజయతో ఆయన సంబంధం రెండు నెలల కంటే ఎక్కువ కొనసాగలేదు" అని ఆమె అన్నారు.
"మా నాన్న బిమల్ ప్రసాద్ ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం.. ఆయనకు జేపీతో, ప్రభావతితో ఉన్న సన్నిహిత సంబంధం. ఇందులో జేపీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మా నాన్న అంగీకరించలేదు. అలా చేస్తే జేపీ పట్ల తనకున్న విధేయత తగ్గుతుందని ఆయన విశ్వసించారు."
"ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నేను విజయ మనుమరాలిని (మేనకోడలి కూతురు) కలిశాను. ఆమె ద్వారా జేపీ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు తెలిశాయి. కానీ, అవన్నీ రాస్తే భారతదేశంలో, బిహార్‌లో జేపీ భక్తులు బాధపడతారేమోనని నా భయం. అందుకే, వీటికి ఆధారాలు దస్తావేజుల్లో ఉన్నాయేమో వెతికాను. ఆ సమయంలో నేను భారత ప్రభుత్వంలో పనిచేస్తుండడంతో, హోం మంత్రిత్వ శాఖ పాత ఫైల్స్‌కు యాక్సెస్ దొరికింది. అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు పరిశీలించాను" అని సుజాత వివరించారు.
1943, సెప్టెంబరు 19న జేపీ అఫ్గాన్ తిరుగుబాటుదారులను కలవడానికి ఫ్రాంటియర్ మెయిల్‌లో దిల్లీ నుంచి రావల్పిండికి వెళుతున్నప్పుడు, లాహోర్ పోలీస్ చీఫ్ విలియం రాబిన్సన్ అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌లో ఆయన్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ను లాహోర్ కోటకు తీసుకెళ్లారు. జేపీ అరెస్ట్ వార్తను దాచడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ, ఆ వార్త దేశమంతటా గుప్పుమంది."
"తమ ఆచూకీ పోలీసులకు తెలిసిందన్న వార్త రాగానే జేపీ, విజయను కలకత్తా పంపించేశారు. అక్కడి నుంచి ఆమె పుణెలోని తన ఇంటికి చేరుకున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రకటించారు. జేపీ ప్రేమను మర్చిపోవడానికి ఆమెకు కరంట్ షాకులిచ్చి చికిత్స చేయించారు. మెల్లమెల్లగా ఆమె వాటినుంచి బయటపడ్దారు. కానీ, జీవితాంతం ఒంటరిగానే గడిపారు. ఆ తరువాతెప్పుడూ ఆమె, జేపీని ప్రత్యేకంగా కలవలేదు."

ఫొటో సోర్స్, NEHRU LIBRARY
జేపీ, ప్రభావతి మధ్య అనుబంధం
1948 నాటికి జేపీ, ప్రభావతి జీవితాల్లో కొంచం స్తబ్దత ఏర్పడింది. 1949లో డాల్తోగంజ్‌లో జేపీ చేయి ఎముక విరిగినప్పుడు, ప్రభావతి ఆయనకు సపర్యలు చేశారు. 1952లో పూణెలో సుదీర్ఘ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ప్రభావతి ఆయన వెంటే ఉన్నారు. పట్నాలోని తమ ఇంటికి జేపీ సన్నిహితులు, సహచరులు వస్తూ పోతూ ఉండేవారు. వారందరికీ ప్రభావతి ఆతిధ్యం అందించేవారు.
జేపీకి సన్నిహితురాలైన కమలాదేవి చటోపాధ్యాయ రాసిన 'ఇన్నర్ రేసెస్ ఔటర్ స్పేసెస్' పుస్తకంలో జేపీ జీవితంలో ప్రభావతి పాత్ర గురించి వివరంగా రాశారు.
"ప్రభావతికి, జేపీకి మధ్య గాఢమైన అనుబంధం ఉండేది. ఆయన గురించి ఆమె గర్వపడేవారు. ఆమె కళ్లల్లో జేపీ పట్ల గౌరవం, శ్రద్ధ కనిపించేవి. ఓ పక్క రాట్నం పట్టుకుని నూలు వడుకుతున్నా, మరో పక్క ఆమె దృష్టి జేపీపైన ఉండేది. ఆయన బలహీనతలు కూడా ఆమెకు తెలుసు. కానీ, చిరునవ్వుతో ఆమె వాటన్నింటినీ పక్కనపెట్టేవారు."
ప్రభావతి మరణంతో జేపీ మానసికంగా కృంగిపోయారు
1973లో ప్రభావతి గర్భాశయంలో క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. దాంతో, జేపీ వ్యక్తిగత జీవితంలో పిడుగు పడినట్లయింది. చికిత్స కోసం ఆమెను బొంబాయిలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసినాగానీ ఆమెకు జ్వరం తగ్గలేదు.
మార్చి నాటికి క్యాన్సర్ ఆమె శరీరాన్ని పూర్తిగా కబళించింది. కానీ, ఆమె చివరి వరకూ ఆ వ్యాధితో ధైర్యంగా పోరాడారు.
1973 ఏప్రిల్ 15న ప్రభావతి తుది శ్వాస విడిచారు.
ఆమె మరణానంతరం, జేపీ ఇందిరా గాంధీకి రాసిన లేఖలో ప్రభావతితో తన అనుబంధం గురించి ప్రస్తావించారు.
"ప్రభావతి నా జీవితంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆమె నా జీవితంలో విడదీయరాని భాగం. ఆమె లేకుండా ఈ ప్రపంచంలో నేను జీవించలేను" అని రాశారు.
ప్రభావతి మరణంతో ఇందిరా గాంధీ, జేపీల మధ్య ఒక రకమైన ప్రతిరోధం ఏర్పడింది. రోజుల గడుస్తున్న కొద్దీ అది బలంగా పెరిగి, వారిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు.
ఇవి కూడా చదవండి:
- RRB NTPC: విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టేంత వరకూ ఎందుకెళ్లారు? ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఎలాన్ మస్క్: చంద్రున్ని ఢీకొట్టననున్న 'స్పేస్ ఎక్స్' రాకెట్
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
- అమెరికా-కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయుల మృతి: గుజరాత్‌లోని ఈ గ్రామ ప్రజలు ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు?
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మెరుగవుతుందా? తెలంగాణలో ఏం జరిగింది?
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














