చంబల్ లోయలో 400 మంది బందిపోట్లను సుబ్బారావు ఎలా లొంగదీశారు?

సేలం నంజుండయ్య సుబ్బారావు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సేలం నంజుండయ్య సుబ్బారావు
    • రచయిత, కుమార్ ప్రశాంత్
    • హోదా, బీబీసీ కోసం

సేలం నంజుండయ్య సుబ్బారావు లేదా సుబ్బారావుజీ మరణం ఒక వీర సైనికుడి మరణంలాంటిది. అనేకమందికి 'భాయిజీ'గా తెలిసిన 93 ఏళ్ల సుబ్బారావు అక్టోబర్ 27, బుధవారం తుది శ్వాస విడిచారు.

ఆయన అనారోగ్యంతోనో లేక నిరాశ నిస్పృహలతో, విచారమైన మనసుతోనో వెళ్లిపోలేదు. నచ్చిన పని చేసుకుంటూ, ఆడుతూ పాడుతూ అలిసిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

గుండెపోటు రావడంతో అక్టోబర్ 27 ఉదయం ఆరు గంటల సమయంలో సుబ్బారావు మరణించారు. గాంధీ కథను ఆలపించే మరో కథకుడు సెలవు తీసుకున్నాడు.

సుబ్బారావు ఒక స్వాతంత్ర్య సైనికుడు. కానీ, ఆయన పోరాటం 1947 ఆగస్టులో స్వతంత్రం సాధించడంతో ఆగిపోలేదు. జీవించి ఉన్నంతకాలం స్వాతంత్ర్యం అర్థాన్ని మార్చుకుంటూ, దాని పరిధిని పెంచుకుంటూ వచ్చారాయన.

ఒక సమయంలో బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది. మరొక సమయంలో బ్రిటిష్ మానసిక బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం జరిగింది.

న్యాయబద్ధమైన, మానవీయ సమాజ నిర్మాణానికి ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారు పోరాటం చేశారు. అందులోనూ సుబ్బారావు నడుం బిగించి పాల్గొన్నారు.

బందిపోట్లను లొంగదీయడంలో సుబ్బారావు కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బందిపోట్లను లొంగదీయడంలో సుబ్బారావు కీలక పాత్ర పోషించారు

13 ఏళ్ల వయసులో స్వతంత్ర పోరాటం..

గాంధీ 1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు సుబ్బారావు వయసు 13 సంవత్సరాలు. అప్పుడు మొదలైంది ఆయన పొరాటం. గాంధీ ఇచ్చిన ఆ పిలుపు ఎంతోమందిని ప్రభావితం చేసింది. అన్నీ మర్చిపోయి వారంతా స్వతంత్ర పోరాటంలో చేయి కలిపారు.

బెంగళూరులోని పాఠశాలలో చదువుకుంటున్న 13 ఏళ్ల సుబ్బారావు కూడా అదే బాట పట్టారు. తన పాఠశాల గోడలపైనే కాక, ఊళ్లో గోడలపై కూడా పెద్ద పెద్ద అక్షరాలతో 'క్విట్ ఇండియా' అని రాయడం మొదలుపెట్టారు.

దాంతో, 13 ఏళ్ల ఆ బాలుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

తరువాత, ఆయన వయసు చూసి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ, ఆయన మాత్రం వెనుకడుగు వేయలేదు.

అప్పట్లో స్వతంత్ర పోరాటం అంటే కాంగ్రెస్‌లో చేరడం. సుబ్బారావూ అదే చేశారు.

కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ సేవా దళ్‌లో చేరారు. అప్పటి సేవా దళ్ డైరెక్టర్ హార్దికర్ దృష్టి సుబ్బారావుపై పడింది. ఒక ఏడాది పాటు సేవా దళ్‌లో పని చేసేందుకు హార్దికర్, ఆయన్ను ఒప్పించారు.

సుబ్బారావు దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఆయన స్వరం. స్కూల్లో భజనలు, భక్తి గీతాలు పాడేవారు.

స్వతంత్ర పోరాటంలో చేరాక, సామాజిక మార్పుకు దోహదపడే గేయాలు ఆలపించడం ప్రారంభించారు. ఆయన గొంతెత్తి పాడగానే, యువకుల్లో అది ప్రతిధ్వనించేది.

ఈ క్రమంలో సుబారావుకు మరో విషయం స్ఫురణకు వచ్చింది. దేశంలోని యువతకు చేరువ కావాలంటే వివిధ భాషలు నేర్చుకోవడం ముఖ్యమని భావించారు.

తరువాత, ఆయన కాంగ్రెస్ సేవా దళ్ విడిచిపెట్టి, ఖలీస్ సర్వోదయ కార్యకర్తగా మారారు.

స్వాతంత్ర్యం తర్వాత..గాంధీ దర్శన్ రైలు

1969 గాంధీ శతజయంతి సంవత్సరం. గాంధీ ఆలోచనలను, గాంధీ చరిత్రను దేశంలోని మూల మూలలకు తీసుకెళ్లాలనేది సుబ్బారావు ఆలోచన. ఎలా? అని ప్రశ్న వేసేవారికి సుబ్బారావు దగ్గర జవాబు సిద్ధంగా ఉంది.

"చిన్న, పెద్ద లైన్లలో ప్రభుత్వం రెండు రైళ్లను నాకు ఇప్పిస్తే, గాంధీ దర్శన్ రైలును ప్రారంభించాలనుకుంటున్నాను" అన్నది ఆయన జవాబు.

చాలామందిని ఆశ్చర్యపరచిన వింత ఆలోచన ఇది.

సుబ్బారావు నేతృత్వంలో అలాంటి రెండు రైళ్లు భారతదేశం అంతటా ఆ ఏడాది పొడవునా ప్రయాణించాయి. ఎక్కడ వీలైతే అక్కడ చిన్న చిన్న స్టేషన్లలో కూడా ఆగుతూ ముందుకు సాగాయి.

బడి పిల్లలు, కాలేజీ విద్యార్థులు, మహిళలు, పురుషులు అందరూ ఈ రైలు బోగీల్లో తిరుగుతూ గాంధీ గురించి తెలుసుకున్నారు.

ఇదో గొప్ప ప్రచారం. దీని నుంచి మరో లాభం కూడా చేకూరింది. దేశవ్యాప్తంగా యువకులను నేరుగా కలిసే అవకాశం లభించింది.

గాంధీ కలలను సాకారం చేస్తూ సృజనాత్మకత గల యువకులందరినీ ఒక చోట చేర్చేందుకు పునాది పడింది.

మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, యువతలో సృజనాత్మక స్ఫూర్తిని రగిలించడానికి సుబ్బారావుకు మరో ఆలోచన వచ్చింది.

దాంతో, పెద్ద సంఖ్యలో దీర్ఘకాలం పాటు కొనసాగే శ్రమ శిబిరాలు ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువకులను ఆహ్వానిస్తూ యూత్ క్యాంపులు నిర్వహించడమే ఆయన జీవిత ధ్యేయంగా మారింది.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మహాత్మా గాంధీ

చంబల్ లోయలో బందిపోట్ల బీభత్సం

చంబల్ లోయ బందిపోట్లకు నిలయం. బందిపోటు ముఠాలు అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగించేవి. కోట్లాది రూపాయలు వెచ్చించి, భారీ పోలీసు బలగాలను మోహరించినా ప్రభుత్వం వారిని అదుపు చేయలేకపోయింది.

అప్పట్లో బందిపోట్లకు, పోలీసులకు మధ్య సఖ్యత ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల ఇరువర్గాలకూ లాభదాయకంగా ఉండేది. మధ్యలో ప్రజలు నలిగిపోయేవారు.

అదే సమయంలో వినోబా భావే తన భూదాన్ యాత్రలో భాగంగా చంబల్ లోయకు చేరుకున్నారు. ఆయన బోధనలతో బందిపోట్లలో పశ్చాత్తాపం మొదలైంది.

ఒక బందిపోటు ముఠా వినోబా ముందు తమ తుపాకులను ఉంచి.. "మేము చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం. మీరు సహాయం చేస్తే సాధారణ పౌరులుగా మారేందుకు ప్రయత్నిస్తాం" అన్నారు.

ఆ దొంగలపై అంత ప్రభావం చూపించారాయన.

తరువాత, వినోబా అడుగు జాడల్లోనే జయప్రకాశ్ నారాయణ్ నడిచారు. ఆయన బోధనలతో 400 మందికి పైగా బందిపోటు దొంగలు ఆయుధాలను విడిచిపెట్టి, తమ నేరపూరిత జీవితాలకు స్వస్తి పలికారు.

అప్పట్లో వీరిలో కొందరిపై ప్రభుత్వం లక్షలాది రూపాయల నజారానా ప్రకటించింది కూడా. అంత భయంకరమైన బందిపోట్లలో కూడా మార్పు తీసుకొచ్చారు వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్.

వీరి ఆచరణలు సామాజిక శాస్త్రాల్లో ఓ కొత్త అధ్యయనానికి దారి తీసాయి. బందిపోట్లను ప్రేమతో మార్చవచ్చని జయప్రకాశ్ నారాయణ్ అంటారు.

వారి మాటల్లోనే చెప్పాలంటే.. "వీరు బందిపోట్లు కారు. సామాజిక అన్యాయాలపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధపడ్డవారు, కానీ దారి తప్పారు. వీరిపై దొంగలు అనే ముద్ర వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. దగ్గరకు తీసుకుని కౌగలించుకుంటే, వారిని జనసామాన్యంలోకి తీసుకురావచ్చు. సాధారణ పౌరులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు."

ఆచార్య వినోబా భావే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆచార్య వినోబా భావే

వినోబా, జేపీ అడుగు జాడల్లో....

చంబల్‌ లోయ సుబ్బారావుకు కర్మభూమి అని చెప్పవచ్చు. జయప్రకాశ్ ప్రారంభించిన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సుబ్బారావు ఆ ప్రాంతంలోని కొండల్లో, కోనల్లో తిరుగుతూ బందిపోట్లతో సుదీర్ఘ సంభాషణలు చేసేవారు.

వారిలో వివేకాన్ని మేల్కొల్పడం కోసం ప్రమాదాల అంచున కూడా నడిచారు. జౌరాలో ఆయన అంతకు ముందు నిర్వహించిన కార్యకలాపాలు ఆయన ప్రచారానికి విశ్వసనీయతను, స్థిరత్వాన్ని తెచ్చిపెట్టాయి.

ఆయన ప్రారంభించిన జౌరా ఆశ్రమం బందిపోటు దొంగల లొంగుబాటుకు కేంద్రంగా మారింది. 1972 ఏప్రిల్ 14న జౌరాలోని గాంధీ సేవా ఆశ్రమంలో జయప్రకాష్ నారాయణ్ సమక్షంలో 400 మందికి పైగా బందిపోట్లు లొంగిపోయేలా చేశారు సుబ్బారావు.

ఈ ప్రచారం స్ఫూర్తితో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో గాంధీ విగ్రహం ముందు వంద మందికి పైగా బందిపోట్లు లొంగిపోయారు.

వారంతా లొంగిపోయిన తరువాత కథ చాలా గందరగోళంగా మారింది. వారిని బహిరంగ జైలులో ఉంచాలన్న జయప్రకాశ్ ఆలోచన నమ్మశక్యం కానంత వింతగా తోచింది.

"గోడలు లేకపోతే అది జైలు ఎలా అవుతుంది? ఇప్పటివరకూ పాటిస్తున్న నియమాలన్నిటినీ ఈ పద్ధతి తారుమారు చేస్తోంది" అంటూ ప్రభుత్వం విమర్శించింది.

కానీ, బహిరంగ జైళ్లను నిర్మించారు. వాటిని అమలు చేశారు కూడా.

తరువాత వారికి పునరావాసం కల్పించడం, వారంతా కారడవుల్లోంచి బయటికొచ్చి సాధారణ జీవితం ప్రారంభించడం ఎంత క్లిష్టమైనదో, అంత సున్నితమైనది కూడా.

అయితే, ఈ ప్రయోగం వలన తమ అధికారం, ప్రభావం దెబ్బతింటున్నాయని ప్రభుత్వం భావించింది.

కానీ జయప్రకాశ్ నారాయణ్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే బందిపోటు దొంగలుగానీ, ప్రభుత్వంగానీ వారి మాటకు అడ్డుచెప్పలేకపోయేవారు.

ఈ ప్రయోగంలో సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. ఈ ప్రచారం విజయం సాధించడంలో సుబ్బారావు కార్యాచరణకు సంబంధించిన పెద్ద హస్తమే ఉంది.

నమ్మిన గాంధేయ సిద్ధాంతాలను కడదాకా ఆచరించారు సుబ్బారావు

ఫొటో సోర్స్, PETER L GOULD/IMAGES PRESS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నమ్మిన గాంధేయ సిద్ధాంతాలను కడదాకా ఆచరించారు సుబ్బారావు

మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం

సమాజంలో సామరస్యం సాధించేందుకు సుబ్బారావు ఎంతో కృషి చేశారు. మతపరమైన ఘర్షణలను చల్లార్చేందుకు ముందుండేవారు.

దేశవ్యాప్తంగా యువకులందరినీ కూడదీసి మతపరమైన ఘర్షణలను చల్లార్చడం, సామరస్యం నెలకొల్పడం ఆయనకు ప్రధానమైన పనిగా ఉండేది.

అదే సమయంలో యువత ఆలోచనా విధానాన్ని మార్చడం కూడా ధ్యేయంగా పెట్టుకునేవారు. పాటలు పాడుతూ, సుదీర్ఘంగా సంభాషిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేసేవారు.

తన శాంతి పరిరక్షక దళాల సభ్యులతో కలిసి మత ఘర్షణలను చల్లార్చడమే కాకుండా, అక్కడి వాతావరణాన్ని తేలికపరచడంతో పాటు, ప్రభుత్వ ప్రయత్నాలు బలోపేతం కావడానికి సహాయం అందించేవారు సుబ్బారావు.

"మతవాదంతో విషపూరితమైన గాలిని పౌరుల చొరవతో శుద్ధి చేయవచ్చు. దీన్ని నిరూపించడమే మా పని. ప్రజల్లో ఈ విశ్వాసం తీసుకురాగలిగితే, మిగిలిన పని వారే స్వయంగా పూర్తి చేస్తారు" అని సుబ్బారావు బోధపరిచేవారు.

ఆయన ఎన్నో పనులు చేసినా తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయారు. హాఫ్ ప్యాంటు, చొక్కా వేసుకుని నవ్వుతూ కనిపించే సుబ్బారావు కాంగ్రెస్ సేవా దళ్ నుంచి సర్వోదయ వరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బాగా చలి వేస్తే పొడుగు చేతుల చొక్కా వేసుకునేవారుగానీ హాఫ్ ప్యాంటు, ఫుల్ ప్యాంటుగా ఎప్పుడూ మారలేదు.

ఆర్ఎస్ఎస్ కూడా తమ వస్త్రధారణ మార్చుకుందిగానీ సుబ్బారావు మార్చుకోలేదు. ఆయన దుస్తులు ఆయన విశ్వాసాన్ని చుట్టుకుని ఉండేవి.

శిబిరంలో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, ఆయన మాత్రం పాత టైపు రైటర్ ముందు పెట్టుకుని ఉత్తరాలు టైపు చేస్తూ ఉండేవారు.

దేశంలోని మారుమూల ప్రాంతంలో యువకుడికి ఉత్తరం రాసినా, దేశ ప్రధానికి లేఖ రాసిన ఆయన రాత పద్ధతి ఒకలాగే ఉండేది.

తన నమ్మకాల్లో స్థిరంగా, ప్రవర్తనలో వినయంగా, సున్నితంగా ఉండే సుబ్బారావు గాంధీ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థి. మనసా వాచా ఆయన విధానాలను అమలు చేసిన గాంధేయవాది.

ఈరోజు ఆయన మనతో లేకపోవచ్చు. కానీ, ఆయన నమ్మకాలతో నిర్మించిన పాఠశాల తెరిచే ఉంది. మరెందరో సుబ్బారావులను పిలుస్తూ ఉంది..

యువతీయువకులారా రారండి..

యువతీయువకులారా పాటలు పాడండి

అడుగు ముందుకు వేయండి..

యువతీయువకులారా రారండి..

(రచయిత గాంధీ పీస్ ఫౌండేషన్ చైర్మన్.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)