మల్ఖాన్ సింగ్: చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు

తుపాకీ పట్టుకుని కూర్చున్న వారిలో మధ్య వ్యక్తి మల్ఖాన్ సింగ్

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR

ఫొటో క్యాప్షన్, తుపాకీ పట్టుకుని కూర్చున్న వారిలో మధ్య వ్యక్తి మల్ఖాన్ సింగ్

భారత ఫొటోగ్రాఫర్ ప్రశాంత్ పంజియార్ 1980వ దశకంలో మధ్య భారతంలో తిరుగుతూ ప్రసిద్ధ బందిపోట్ల జీవిత కథలను తన చిత్రాల్లో నిక్షిప్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో బందిపోట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.

"ఎత్తైన కొండలు, నదుల మధ్య దుండగులు, దోపిడీదారులు, హంతకులు, గ్యాంగ్‌స్టర్లు, బందిపోట్లతో సాధారణ మానవులకు అది నిషిద్ధ ప్రాంతం" అంటూ పులిట్జర్ బహుమతి పొందిన రచయిత పాల్ సలోపెక్ చంబల్ లోయను వర్ణించారు.

'బందిపోటు రాజు'గా పేరు పొందిన మల్ఖాన్ సింగ్, ఆయన అనుచరులు చంబల్ లోయ నుంచే తమ కార్యకలాపాలను నిర్వహించేవారు. మల్ఖాన్ సింగ్‌ను కలిసేందుకు పంజియార్, ఆయన పాత్రికేయ మిత్రులు ఇద్దరూ కొన్ని నెలల పాటు ప్రయత్నించారు.

చివరికి, 1982 మే నెలలో మల్ఖాన్‌ను కలుసుకోగలిగారు.

లొంగిపోవడానికి ముందు ఆయుధాన్ని దేవతా చిత్రపటం ముందు ఉంచి మొక్కుతున్న మల్ఖాన్ సింగ్ గ్యాంగ్ సభ్యుడు

ఫొటో సోర్స్, Prashant Panjiar

ఫొటో క్యాప్షన్, లొంగిపోవడానికి ముందు ఆయుధాన్ని దేవతా చిత్రపటం ముందు ఉంచి మొక్కుతున్న మల్ఖాన్ సింగ్ గ్యాంగ్ సభ్యుడు

చంబల్ లోయలోనే కాకుండా పొరుగు రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ నుంచి కూడా బందిపోట్లు తమ కార్యకలాపాలను నిర్వహించేవారు. బందిపోటు రాణిగా సుపరిచితమైన పూలన్ దేవి అక్కడి నుంచే తన ప్రత్యర్ధులను గడగడలాడించారు.

తనపై జరిగిన సామూహిక అత్యాచారానికి ప్రతీకారంగా 1981 ఫిబ్రవరి 14న 22 మంది అగ్రవర్ణ హిందువులను ఊచకోత కోయడంతో ఒక్కసారిగా పూలన్ దేవి వార్తల్లోకెక్కారు.

అయితే, చంబల్ లోయలో మల్ఖాన్ సింగ్‌దే రాజ్యం. ఇక్కడి బందిపోట్లు కాలి నడకన సంచరించేవారు. కొండ కనుమల్లో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసించేవారు.

తన గ్యాంగ్‌తో నడిచి వస్తున్న మల్ఖాన్ సింగ్

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR

ఫొటో క్యాప్షన్, తన గ్యాంగ్‌తో నడిచి వస్తున్న మల్ఖాన్ సింగ్

'బందిపోటు రాజు'

మల్ఖాన్ సింగ్ ప్రాబల్యం 13 ఏళ్ల పాటు కొనసాగింది. ఆయనకు దాదాపు 100మంది అనుచరులు ఉండేవారు. "బందిపోటు రాజు" అంటూ ప్రత్యర్థులు ఆయనకు కిరీటం పెట్టారు.

దోపిడీ, అపహరణ, హత్య ఆరోపణలతో 1982 నాటికి మల్ఖాన్ సింగ్ గ్యాంగ్‌పై 94 కేసులు నమోదు చేశారు పోలీసులు.

మల్ఖాన్ సింగ్‌ను పట్టుకున్న వారికి రూ. 70,000 బహుమతి ప్రకటించినట్లు రికార్డుల్లో ఉంది. ఆరోజుల్లో డెబ్భై వేలు అంటే చాలా పెద్ద మొత్తం కింద లెక్క.

లొంగుబాటుకు ముందు ప్రభుత్వ అధికారులతో మల్ఖాన్ సింగ్ చర్చలు

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR

ఫొటో క్యాప్షన్, లొంగుబాటుకు ముందు ప్రభుత్వ అధికారులతో మల్ఖాన్ సింగ్ చర్చలు

అదే సమయంలో, మల్ఖాన్ సింగ్ గ్యాంగ్‌తో మాట్లాడేందుకు ప్రభుత్వం మధ్యవర్తులను పంపించడం ప్రారంభించింది. 1982 వేసవిలో సింగ్ ముఠాకు, మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య లొంగుబాటు గురించి చర్చలు జరిగాయి.

పంజియార్, ఆయన సహోద్యోగులు కల్యాణ్ ముఖర్జీ, బ్రిజ్‌రాజ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. "వాళ్ల ముఠాతో కొన్ని రోజులు గడిపేందుకు నాకు అవకాశం దొరికింది. వాళ్ల దగ్గర బందీగా ఉన్నా ఫరవాలేదు, నన్ను ఫొటోలు తీసుకోనిస్తే చాలు అనుకున్నా" అన్నారు పంజియార్

పంజియార్ ఓ అమావాస్య నాడు తొలిసారిగా మల్ఖాన్ గ్యాంగ్‌ను కలిశారు. మల్ఖాన్ పొడుగ్గా, దృఢంగా, మెలి తిరిగిన గుబురు మీసాలతో ఉండేవారని, ఎక్కువ మాట్లాడేవారు కాదని, చేతిలో అమెరికా రైఫిల్ ఉండేదని పంజియార్ వివరించారు.

"చాలా తక్కువ మాట్లాడేవారు. కానీ, అహంభావి. అందరూ ఆయన్ను గౌరవించేవారు" అని వివరించారు.

అప్పట్లో మల్ఖాన్‌తో పాటు గ్యాంగ్‌లో సుమారు రెండు డజన్లమంది ఉండేవారు. రాత్రిళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మకాం మార్చేవారు. ఆరు బయట పడుకునేవారు.

వారిలో ఒకరి దగ్గర ఏకే-47 ఉండేదని, మిగిలినవారి దగ్గర కార్బైన్లు, రైఫిళ్లు ఉండేవని పంజియార్ గుర్తుచేసుకున్నారు.

"మల్ఖాన్ కథ కూడా చంబల్ సాంప్రదాయ కథే. నిమ్న కులానికి చెందిన యువకుడు. తనను హింసిస్తున్న అగ్రవర్ణ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, ఆత్మగౌరవం, స్వీయరక్షణ కోసం తుపాకీ పట్టుకున్నానని అతను చెప్పుకునేవాడు" అని పంజియార్ అన్నారు.

దాదాపు వారం రోజుల పాటు పంజియార్ మల్ఖాన్ ముఠాతో ఉండి, వారి జీవితాన్ని తన ఫొటోల్లో బంధించారు. వాటిల్లో కొన్ని అరుదైన చిత్రాలను పంజియార్ కొత్త పుస్తకం 'దట్ విచ్ ఈజ్ అన్‌సీన్'లో చూడవచ్చు.

30వేలమంది సమక్షంలో లొంగిపోయిన మల్ఖాన్ సింగ్

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR

ఫొటో క్యాప్షన్, 30వేలమంది సమక్షంలో లొంగిపోయిన మల్ఖాన్ సింగ్

మల్ఖాన్ సింగ్ లొంగుబాటు

ఆ ఏడాది జూన్‌లో వేలమంది చూస్తుండగా మల్ఖాన్ సింగ్ లొంగిపోయారు. లొంగుబాటుకు మల్ఖాన్ పెట్టిన షరతుల్లో తన ముఠా సభ్యులలో ఎవరికీ మరణ శిక్ష విధించకూడదన్నది ప్రధానమైంది.

"ప్రపంచాన్ని జయించిన ఒక వీరుడిలా ఆయన వచ్చారు. పొడుగ్గా, సన్నగా, పోలీసు దుస్తుల్లో ఉన్న బందిపోటు రాజు మల్ఖాన్ సింగ్, భింద్ పట్టణంలో 30,000 మంది చుట్టూ నిల్చుని ఆశ్చర్యంతో చూస్తుండగా ఆయుధాలను విడిచిపెట్టారు. ఆ దృశ్యం రోమన్ విజయోత్సవానికి ఏ మాత్రం తక్కువగా లేదు" అని ఇండియా టుడే కథనంలో రాశారు.

"మల్ఖాన్ సింగ్ హాస్య చతురత ప్రత్యేకంగా ఉంటుందని పంజియార్ చెప్పారు. ఏదైనా జోక్ చెబితే సీరియస్‌గా, నవ్వకుండా చెబుతారు.

లొంగుబాటు తరువాత విలేఖరులు ఎప్పుడూ అడిగే ప్రశ్నే హిందీలో అడిగారు.. 'ఆప్ కో కైసా లగ్ రహా హై?' (మీకెలా అనిపిస్తోంది?). పంజియార్ బృందాన్ని కలిసినప్పుడు జోక్‌గా మల్ఖాన్ అదే ప్రశ్న అడిగేవారు.

ఆ తరువాత, మల్ఖాన్, ఆయన ముఠా సభ్యులు చేసిన నేరాలు రుజువు కావడంతో వారిని బహిరంగ జైలు (ఓపెన్ జైలు)కు పంపించారు.

మల్ఖాన్ కొన్ని సంవత్సరాలు జైల్లో గడిపారు. ప్రస్తుతం 78 ఏళ్ల మల్ఖాన్ సింగ్ రాజకీయాల్లో చేరి, ఇటీవలి కాలంలో బీజేపీ తరపున ప్రచారం చేశారు.

"నేను బందిపోటును కాను. ఆత్మ గౌరవం, స్వీయరక్షణ కోసం తుపాకీ పట్టిన తిరుగుబాటుదారుడిని. నిజమైన బందిపోటు దొంగలు ఎవరో నాకు తెలుసు. వాళ్లని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు" అని మల్ఖాన్ 2019లో అన్నారు.

ప్రశాంత్ పంజియార్ ప్రముఖ భారతీయ ఫోటోగ్రాఫర్, రచయిత. ఇటీవలే 'దట్ విచ్ ఈజ్ అన్‌సీన్' (నవజీవన్ ట్రస్ట్) పుస్తకం రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)