బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే ఎందుకు తిరస్కరించారు? ‘నేను ఎవరికీ అమ్ముడు పోవడానికి పుట్టలేదు’ అని ఎందుకు అన్నారు?

అంబేడ్కర్
ఫొటో క్యాప్షన్, తన రెండో భార్య మాయి అంబేడ్కర్, సామాజిక కార్యకర్త రావు బహదూర్ సీకే బోలే (అంబేడ్కర్ ఒళ్లో కూర్చున్న వ్యక్తి)తో అంబేడ్కర్
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఇద్దరు గొప్ప వ్యక్తులైన మహాత్మా గాంధీ, భీమ్‌రావు అంబేడ్కర్‌లు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇద్దరి మధ్య చాలా సమావేశాలు జరిగినా, ఆ దిశగా మాత్రం ఎవరూ ప్రయత్నించ లేదు.

స్వతంత్రానికి రెండు దశాబ్దాల ముందు నుంచే అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి ఉద్యమం నుంచి తనను తాను వేరు పరుచుకోవడం ప్రారంభించారు. అంటరానివారి పట్ల గాంధీకి ఉన్న అభిమానం తన వాదనను తారుమారు చేసే వ్యూహంగా ఆయన భావించేవారు.

1931 ఆగస్టు 14 న అంబేడ్కర్‌ తనను కలిసినప్పుడు " మీరు పుట్టక ముందు నుంచే నేను అంటరాని వారి సమస్యల గురించి ఆలోచిస్తున్నాను. అయినా, మీరు నన్ను వారి పక్షపాతిగా గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది" అని గాంధీ అన్నారని అంబేడ్కర్‌ జీవిత చరిత్ర 'డాక్టర్ అంబేడ్కర్‌: లైఫ్ అండ్ మిషన్' లో రచయిత ధనుంజయ్‌ ఖీర్‌ వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?

"మీరు నిజంగా అస్పృశ్యుల పట్ల సానుభూతి ఉన్నవారైతే, ఖాదీ ధరించడం కాక, అస్పృశ్యుల పట్ల వివక్ష చూపకపోవడాన్ని కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రధాన అర్హతగా నిర్ణయించేవారు. తన ఇంటిలో కనీసం ఒక అంటరాని వ్యక్తికి పని ఇవ్వని వారికి, ఒక అంటరాని వ్యక్తి బాగోగులు చూడని వారికి, ఒక అంటరాని వ్యక్తితో కలిసి భోంచేయని వారికి కాంగ్రెస్‌లో స్థానం ఇవ్వాల్సింది కాదు. ఒక అస్పృశ్యుడి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించలేక పోయారు" అని అంబేడ్కర్‌ అన్నారు.

గాంధీ గురించి అభిప్రాయం చెప్పాల్సిందిగా బీబీసీ 1955 ఫిబ్రవరి 26న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ను కోరింది.

దానికి ఆయన "గాంధీ గురించి పశ్చిమ దేశాలు ఎందుకంత ఆసక్తి చూపుతున్నాయో నాకు అర్ధం కావడం లేదు. భారతదేశానికి సంబంధించినంత వరకు గాంధీ ఒక శకం కాదు... చరిత్రలో భాగం. ప్రజల మనసుల నుంచి గాంధీ క్రమంగా అంతర్ధానమవుతారు" అని అంబేడ్కర్‌ అన్నారు.

అంబేడ్కర్
ఫొటో క్యాప్షన్, ముంబయిలో తన కుటుంబంతో అంబేడ్కర్

పుట్టినప్పటి నుంచి వివక్ష

చిన్నప్పటి నుండి అంబేడ్కర్‌ తన కులం కారణంగా వివక్షకు గురయ్యారు. 1901 లో తన తండ్రిని కలవడానికి సతారా నుండి కోరెగావ్‌ వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్‌ నుండి తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లడానికి ఎద్దుల బండి వ్యక్తి నిరాకరించారు.

చివరకు రెట్టింపు డబ్బులు తీసుకుని, తాను నడుస్తూ, అంబేడ్కర్‌ సోదరులు ఇద్దరూ బండి నడుపుకుంటూ వెళ్లడానికి ఆ ఎద్దుల బండి యజమాని అంగీకరించారు.

1945లో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో లేబర్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న అంబేడ్కర్‌ అప్పటి ఒరిస్సాలోని జగన్నాథ ఆలయానికి వెళ్లగా, కులం కారణంగా ఆయన్ను లోపలికి రానివ్వలేదు.

అదే సంవత్సరం కలకత్తాలోని ఒక వ్యక్తి ఇంటికి అంబేడ్కర్‌ వెళ్లినప్పుడు మహర్‌ కులస్తుడికి భోజన వడ్డించడానికి ఆ వ్యక్తి పని మనుషులు నిరాకరించారు.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ మనుస్మృతిని తగలబెట్టడానికి ఇవే కారణాలు అయ్యుండొచ్చు.

అంబేడ్కర్
ఫొటో క్యాప్షన్, 1956లో నేపాల్‌లో నిర్వహించిన ‘వరల్డ్ ఫెలోషిప్స్ ఆఫ్ బుద్ధిస్ట్స్‌’ నాలుగో సదస్సులో ప్రసంగిస్తున్న డాక్టర్ అంబేడ్కర్

భారతదేశంలో అత్యంత విద్యావంతుడు

ఆ రోజుల్లో అంబేడ్కర్‌లా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి మరొకరు ఉండక పోవచ్చు.

అప్పటి బాంబేలోని ప్రసిద్ధ ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి ఆయన బీఏ పట్టా పొందారు. తరువాత కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ నుండి పీహెచ్‌డీ పొందారు.

మొదటి నుండి ఆయనకు కుక్కలను పెంచడం, తోటపని అంటే చాలా ఇష్టం.

అప్పటికే దేశంలోని అత్యుత్తమ పుస్తకాలన్నింటినీ ఆయన సేకరించారు. 'ఇన్‌సైడ్‌ ఏషియా' అనే పుస్తకంలో అంబేడ్కర్‌ గురించి రచయిత జాన్‌ గంథెర్ ఇలా రాశారు. " నేను 1938 లో రాజగృహలో అంబేడ్కర్‌ను కలిసినప్పుడు, ఆయన దగ్గర 8000 పుస్తకాలు ఉన్నాయి. ఆయన మరణించేనాటికి ఈ సంఖ్య 35000 కు పెరిగింది." అని పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ సహచరుడు శంకరానంద్ శాస్త్రి తన 'మై ఎక్స్‌పీరియెన్సెస్‌ అండ్‌ మెమరీస్‌ ఆఫ్‌ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌" పుస్తకంలో ఇలా రాశారు.

"నేను 1944 డిసెంబర్ 20 మధ్యాహ్నం అంబేడ్కర్‌ను ఆయన ఇంట్లో కలవడానికి వెళ్లాను. జామా మసీదు ప్రాంతానికి వెళ్లి మాట్లాడదామని ఆయన నాతో అన్నారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పాత పుస్తకాలకు కేంద్రంగా ఉండేది.

సాయంత్రం నేను భోజనానికి టైమయ్యిందని చెప్పే వరకు ఆయన అక్కడే ఉన్నారు. అంబేడ్కర్‌ అక్కడికి వచ్చారని తెలియడంతో చూసేందుకు చాలామంది గుమిగూడారు.

అంతమంది జనంలో కూడా ఆయన వివిధ విషయాలకు సంబంధించి రెండు డజన్ల పుస్తకాలను కొన్నారు. ఆయన తన పుస్తకాలను ఎవరికీ చదవడానికి ఇచ్చేవారు కాదు. కావాలంటే ఎవరైనా తన లైబ్రరీకి వచ్చి చదువుకోవచ్చని అనే వారు" అని గంథెర్‌ వెల్లడించారు.

అంబేడ్కర్

పుస్తకాల పిచ్చి

1947, ఏప్రిల్‌ 13నాటి 'జై భీమ్‌' సంచికలో అంబేడ్కర్‌ గురించి కర్తార్‌సింగ్‌ పొలోనియస్‌ కొన్ని విషయాలు రాశారు.

"మీరు ఇన్ని పుస్తకాలు ఎలా చదివారని ఆయన్ను అడిగాను. దానికి ఆయన నేను చదవడం మొదలు పెట్టానంటే పూర్తయ్యేదాకా చదువుకుంటూ వెళతాను. ఏది పని కొచ్చే విషయమో, ఏది కాదో గ్రహించి చదువుతానని, తెలిసిన విషయాలు ఉంటే దాట వేస్తానని ఆయన చెప్పారు" అని వెల్లడించారు.

మూడు పుస్తకాలు తన పై ఎక్కువ ప్రభావం చూపాయని అంబేడ్కర్‌ చెప్పేవారు. మొదటిది 'లైఫ్‌ ఆఫ్‌ టాల్‌స్టాయ్', రెండోది విక్టర్‌ హ్యూగో 'లే మిజ్రబేల్‌', మూడోది థామస్‌ హార్డీ రాసిన 'ఫార్ ఫ్రమ్ ది మాడింగ్‌ క్రౌడ్.'

అంబేడ్కర్‌ మరో అనుచరుడు నామ్‌దేవ్‌ నిమ్‌గాడే తన పుస్తకం 'ఇన్‌ ది టైగర్స్‌ షాడో: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ అంబేడ్కరైట్' లో ఇలా రాశారు.

"అంబేడ్కర్‌ రాత్రి పూట పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారు. నేనొకసారి అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లి, ఆయన కాళ్లకు నమస్కరించారు. అప్పుడు నన్ను తన పెంపుడు కుక్క అనుకుని 'టామీ, అలా చేయవద్దు' అన్నారు.

నాకు ఆశ్చర్యం వేసి నిలబడ్డాను. ఆయన కూడా నన్ను చూసి ఆశ్చర్య పోయారు. పుస్తకం పట్టుకుంటే ఆయన అందులో అంతగా లీనమవుతారు" నామ్‌దేవ్‌ వెల్లడించారు.

అంబేడ్కర్

టాయిలెట్‌లో చదవడం చాలా ఇష్టం

అంబేడ్కర్‌కు లైబ్రేరియన్‌గా పని చేసిన దేవి దయాళ్ తన 'డైలీ రొటీన్ ఆఫ్ డాక్టర్ అంబేడ్కర్‌' అనే వ్యాసంలో 'అంబేడ్కర్‌ పడక గదిని తన సమాధిగా భావించేవారు. మంచం మీద కూర్చుని వార్తా పత్రిక చదవడాన్ని ఇష్టపడేవారు.

అయితే ఒకటి రెండు పత్రికలు చూసి, మిగిలిన వార్తా పత్రికలను టాయిలెట్‌కు తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు పేపర్లు, పుస్తకాలు టాయిలెట్‌లోనే వదిలేసే వారు." అని వెల్లడించారు.

"అంబేడ్కర్‌ రాత్రంతా చదివి, తెల్లవారుజామున నిద్రపోతారు. కేవలం రెండు గంటలపాటు నిద్ర తర్వాత కొద్దిగా వ్యాయామం, ఆ తర్వాత స్నానం చేసి అల్పాహారం తీసుకునేవారు.

పేపర్లు చదివిన తర్వాత కారులో కోర్టుకు వెళ్లేవారు. అక్కడ పోస్టు ద్వారా తనకు వచ్చిన పుస్తకాలను తిరగేసే వారు. కోర్టు అయ్యాక, పుస్తకాల షాపులకు వెళ్లేవారు. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఆయన చేతిలో చిన్న పుస్తకాల కట్ట ఉండేది." అన్నారు దేవీ దయాళ్‌.

ఆయనో మంచి తోటమాలి అని బ్రిటీష్‌ వార్తా పత్రిక డైలీ మెయిల్‌ ప్రశంసించింది. కుక్కలను కూడా అంబేడ్కర్‌ ఇష్టంగా పెంచేవారు. ఒకసారి పెంపుడు కుక్క చనిపోయినప్పుడు ఆయన గట్టిగా ఏడ్చారట.

అంబేడ్కర్

వంటల్లోనూ ఆసక్తి

సెలవుల్లో బాబా సాహెబ్‌ స్వయంగా వంట చేసేవారు. తనతో విందుకు మిత్రులను ఆహ్వానించేవారు.

"1944 సెప్టెంబర్ 3న అంబేడ్కర్‌ స్వయంగా ఏడు రకాల వంటలు చేశారు. ఇందుకు ఆయనకు మూడు గంటల సమయం పట్టింది" అని దేవి దయాళ్ రాశారు.

ఈ విందుకు ఆయన దక్షిణ భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య అధిపతి మీనంబాళ్‌ శివరాజ్‌ను ఆహ్వానించారు. అంబేడ్కర్‌ స్వయంగా ఈ వంటలు చేశాని విని ఆమె ఆశ్చర్య పోయారు. ముల్లంగి, ఆవపిండి ఆకు కూరలు వండటం బాబా సాహెబ్‌కు చాలా ఇష్టం." అని వెల్లడించారు.

పార్టీలు, ఫంక్షన్లకు దూరం

1948లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేందుకు అంబేడ్కర్‌ను శ్రీలంక హైకమిషన్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో లార్డ్ మౌంట్ బాటన్, జవహర్‌ లాల్‌ నెహ్రూ కూడా పాల్గొన్నారు. కానీ అంబేడ్కర్‌ వెళ్లలేదు.

"మీరు ఈ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్లడం లేదని నేను బాబా సాహెబ్‌ను అడిగినప్పుడు, 'నా విలువైన సమయాన్ని వృథా చేయకూడదు అనుకుంటున్నాను, రెండోది మద్యం సేవించే అలాంటి పార్టీలకు వెళ్లడం నాకు ఇష్టం లేదు' అని అన్నారు. ఆయనకు మద్యం, పొగ తాగడంలాంటి అలవాట్లు లేవు." అని 'రెమినెసెన్సెస్‌ అండ్‌ రిమెంబరెన్స్‌ ఆఫ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌' అన్న పుస్తకంలో ఎన్‌.సి. రట్టు పేర్కొన్నారు.

"ఆయన చాలా సరళమైన ఆహారాన్ని తీసుకుంటారు. ధాన్యాలతో చేసిన చిన్న రొట్టెలు, కొద్దిగా అన్నం, పెరుగు, మూడు చేప ముక్కలు తీసుకుంటారు" రట్టు వెల్లడించారు.

అంబేడ్కర్

బిర్లా డబ్బు తిరస్కరణ

1950, మార్చి 31న ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త ఘనశ్యామ్‌ దాస్‌ బిర్లా సోదరుడు జుగల్‌ కిశోర్‌ బిర్లా అంబేడ్కర్‌ను కలవడానికి ఆయన ఇంటికి వచ్చారు. అంతకు కొద్ది రోజులు కిందటే పెరియార్‌ నిర్వహించిన ఓ సభలో భగవద్గీతపై అంబేడ్కర్‌ విమర్శలు చేశారు.

" హిందువుల గొప్ప మత గ్రంథమైన గీతను మీరు ఎందుకు విమర్శించారు? అలా విమర్శించే బదులు హిందూ మతాన్ని బలోపేతం చేయాలి. అంటరానితనాన్ని తొలగించే ఉద్యమం కోసం ఘనశ్యామ్ దాస్ పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు" అని జుగల్‌ కిశోర్‌ అన్నారు. అప్పుడు అంబేడ్కర్‌ 'నేను ఎవరికీ అమ్ముడు పోవడానికి పుట్టలేదు. భగవద్గీత సమాజాన్ని విభజించడం నేర్పించింది. అందుకే విమర్శించాను' అన్నారు" అని శంకరనంద్ శాస్త్రి తన 'మై ఎక్స్‌పీరియెన్సెస్‌ అండ్‌ మెమరీస్‌ ఆఫ్‌ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌" పుస్తకంలో రాశారు.

భారతీయ దుస్తులు

అంబేడ్కర్‌ తరచూ నీలిరంగు సూట్‌ ధరించినా, కొన్నిసార్లు ఆయన నల్ల బూట్లు, భారతీయ దుస్తులైన కుర్తా, పైజమా లాంటివి ధరించేవారు.

ముఖ్యంగా వైస్రాయ్‌ని కలవడానికి వెళ్లినప్పుడు ఆయన కచ్చితంగా భారతీయ దుస్తుల్లోనే వెళ్లేవారు. ఇంట్లో సాధారణ దుస్తులు ధరించేవారు. వేసవిలో లుంగీ కట్టుకునేవారు.

విదేశాలలో ఉన్నప్పుడు అల్పాహారంగా ఉడికించిన గుడ్లు, టీ తీసుకునేవారు. "అల్పాహారం తీసుకుంటున్నప్పుడు ఆయన న్యూస్‌ పేపర్లను పక్కన పెట్టుకునే వారు. చేతిలో ఒక ఎర్ర పెన్సిల్‌ ఉండేది. ప్రధాన వార్తలను పెన్సిల్‌తో గుర్తు పెట్టుకుంటూ వెళ్లేవారు" దేవీ దయాళ్‌ రాశారు.

అంబేడ్కర్

ఇంట్లోనే భోజనం ఇష్టం

బాబా సాహెబ్ ఎప్పుడూ సరదాకు బయటకు వెళ్లడం అలవాటు లేదు. "జింఖానా క్లబ్‌ సభ్యుడైనా ఆయన ఎప్పుడూ అక్కడికి వెళ్లేవారు కాదు. ఇంటికి రాగానే నేరుగా తన రీడింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లేవారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఉండేది కాదు. ఆయన ఒకసారి 'ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్' సినిమా చూడటానికి వెళ్ళారు. ఆ సినిమా చూస్తుండగా మనసులో ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే సినిమా మధ్యలోంచి ఇంటికి వచ్చి తన ఆలోచనలను పేపర్‌ మీద రాయడం ప్రారంభించారు." అని దేవీ దయాళ్‌ వెల్లడించారు.

బయటకు వెళ్లి భోజనం చేయడం అంబేడ్కర్‌కు నచ్చేది కాదు. "మీరు నాకు ఏదైనా పార్టీ ఇవ్వాలనుకుంటే నా ఇంటికే ఆ ఆహారం తీసుకురండి" అని ఆయన చెప్పేవారు.

బయటకు వెళ్లడం, రావడం అంతా టైమ్‌ వేస్ట్‌ అని ఆయన భావించేవారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: అంబేడ్కర్

జీవితపు చివరి దశలో బాబాసాహెబ్ వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించారు.

"ఒక రోజు నేను ఆయన తలుపులు మూసి ఉన్న గదిలోకి వెళ్లాను. అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూశాను. ప్రపంచంలోని అన్ని చింతలకు దూరంగా ఆయన కుర్చీలో కూర్చుని వయోలిన్ వాయిస్తున్నారు. ఇంట్లో పని చేసే వారికి ఈ విషయం చెప్పినప్పుడు అందరూ వెళ్లి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించారు" అని 'లాస్ట్‌ ఫ్యూ ఇయర్స్‌ ఆఫ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌' అన్న పుస్తకంలో ఎన్‌.సి. రట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)