అభిప్రాయం: మాయావతికి బౌద్ధం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనిల్ యాదవ్
- హోదా, బీబీసీ హిందీ కోసం
హిందుత్వవాదులు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని మాయావతి చాలా ఆగ్రహంతో ఉన్నారు. దళితులు, ముస్లింలు, ఆదివాసీల విషయంలో బీజేపీ తన తీరు మార్చుకోకుంటే లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధం పుచ్చుకుంటానని హెచ్చరిస్తున్నారు.
మాయావతికి ఎంత బాధ పడ్డారంటే, 2001-2010 మధ్య (ఆమె వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో) ఆమె నియోజకవర్గంలో బౌద్ధుల జనాభా భారీగా తగ్గిపోయినప్పుడు కూడా ఆమె అంత బాధ పడలేదు.
బౌద్ధసంఘాలు దానిపై ఆందోళన వ్యక్తం చేసినా ఆమె పట్టించుకోలేదు.
అదే సమయంలో ఆమె నరేంద్ర మోదీకి ప్రచారం చేయడానికి గుజరాత్‌కు వెళ్లారు. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల కోసం బ్రాహ్మణులతో పొత్తు కుదుర్చుకున్నాక ఆమె తన పార్టీని 'సర్వజన సమాజ్ పార్టీ' అని కూడా అన్నారు.
లక్నోలోని తన నివాసం ఎదుట గణేశుని ప్రతిమను ప్రతిష్టించుకున్నారు. కాన్షీరామ్ కాలంలో మనువాదులను తొక్కి పాడేసిన ఏనుగు, 'హాథీ నహీ గణేశ్ హై, బ్రహ్మ విష్ణు మహేశ్ హై' అన్న కొత్త నినాదంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
బౌద్ధం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
బాబా సాహెబ్ అంబేడ్కర్ నాగపూర్‌లో మతం మార్చుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాయావతి అక్టోబర్ 14, 2006 న దీక్షాభూమికి వెళ్లారు. అంతకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆమె ఆ రోజు బౌద్ధాన్ని స్వీకరించాల్సి ఉంది.
అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన స్వర్ణ జయంతి సందర్భంగా తాను, తన వారసరాలు మాయావతి బౌద్ధం స్వీకరిస్తామని కాన్షీరామ్ అంతకు ముందు చెప్పి ఉన్నారు.
ఆ సమావేశంలో మాయావతి బౌద్ధ గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు కానీ, ''నన్ను ప్రధానిగా చేస్తేనే బౌద్ధాన్ని స్వీకరిస్తాను'' అని మెలిక పెట్టారు.
పదకొండేళ్ల తర్వాత మాయావతికి బౌద్ధం, అంబేడ్కర్ గుర్తుకు వస్తున్నారు.
ఇప్పుడామె లక్షలాది మంది దళితులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరిస్తే మీరు హిందుత్వ రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
తన షరతులు కొన్ని నెరవేరిస్తే హిందువుగా ఉంటానని, లేదంటే లక్షలాది మంది దళితులతో కలిసి బౌద్ధం స్వీకరిస్తానని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం హిందుత్వవాదులు 'ఎక్కువ మంది పిల్లలను కనకుంటే ముందు ముందు మన జనాభా ముస్లింలకన్నా తగ్గిపోతుంది' అంటూ హిందువులను బెదిరిస్తున్నారు.
కొన్ని షరతులతో హిందూ మతంలోనే ఉంటాను అంటున్న మాయావతి బెదిరింపులూ అలానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చెప్పినట్లు వినకుంటే జైలుకే !
ప్రస్తుతం మాయావతి వెనుక ఉన్న దళిత ఓటు బ్యాంక్ తగ్గిపోవడమే కాదు, ఆమె ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ బీజేపీ చెప్పినట్లు వినకుంటే ఆమె మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు.
మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించి, విపక్షాలను దెబ్బ కొట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేసింది. దీంతో బీఎస్పీ తన వద్ద ఉన్న వందల కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వచ్చింది.
అవి విరాళాల రూపంలో వచ్చాయా లేక ఇతర చోట్ల నుంచి వచ్చాయా అన్న అంశం ప్రస్తుతం ఆదాయ శాఖ పరిధిలో ఉంది.
మరోవైపు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఇంకా మూసేయలేదు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చక్కెర మిల్లులను అతి తక్కువ ధరకు అమ్మేశారన్న కేసూ ప్రస్తుతం కోర్టులో ఉంది.
ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ నకిలీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడన్న కేసులు ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, STRDEL/AFP/Getty Images
ప్రస్తుతం మాయావతి తన రాజకీయ జీవితంలో అతి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే అంబేడ్కర్ తరహాలో తానూ పార్లమెంట్‌కు రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నారు.
దళిత మేధావి, ఉత్తరప్రదేశ్ మాజీ ఐపీఎస్ అదికారి ఎస్ ఆర్ దారాపురి, ''అంబేడ్కర్ హిందూ స్త్రీలకు అధికారాన్ని ఇచ్చే హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూ వైఖరికి నిరనసగా రాజీనామా చేశారు. కానీ మాయావతి పది నిమిషాలు కూడా తన మాటను నిలబెట్టుకోలేకపోయారు. రాజీనామా బెదిరింపు చేసిన వెంటనే ఆమె పార్లమెంట్ బయటకు వెళ్లిపోయారు'' అన్నారు.
అంబేడ్కర్ రాజకీయ కారణాలతో బౌద్ధం స్వీకరించలేదు. దాదాపు 20 ఏళ్ల పాటు హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించి, అది సాధ్యం కాక ఆయన బౌద్ధం స్వీకరించారు.
''మతం అన్నది వ్యక్తిగత అంశం. ఆమె ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు కానీ ఇలా బెదిరించాల్సిన అవసరం ఏముంది?'' అని దారాపురి ప్రశ్నించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








