ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటు సుపరిపాలనకు దారితీస్తుందా లేక సీఎంలను మరింత శక్తిమంతులను చేస్తుందా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చిత్ర పటం మరొకసారి మారిపోతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని మంగళవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించింది.
26 జిల్లాల భౌగోళిక వివరాలను వెల్లడిస్తూ, వాటి మీద ప్రజల అభిప్రాయాలు తెలపాలని బుధవారంనాడు ప్రభుత్వ ఉత్వర్వు జారీ అయింది.
ప్రజలు నెల రోజుల్లో తమ అభిప్రాయాలు తెలియచేశాక నవ్యాంధ్రప్రదేశ్ కొత్త మ్యాపు విడుదల అవుతుంది. ప్రజాభిప్రాయాలు, రాజకీయ ఒత్తిళ్లు, నిరసనలు, అభ్యర్థనలను బట్టి ఈ సంఖ్య మారవచ్చు.
తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పనిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016 అక్టోబర్ మొదలుపెట్టింది. 2014 ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మొదట 14 కొత్త జిల్లాలను మాత్రమే సృష్టించాలనుకున్నారు. తర్వాత, క్యాబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు ఈ సంఖ్యను 17 జిల్లాలకు పెంచాలనుకున్నారు.
తర్వాత కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో 21జిల్లాలను సృష్టించి, మొత్తం 31 జిల్లాల రాష్ట్రంగా మార్చారు. అయితే అంతటితో ఈ అధ్యాయం ముగియలేదు. 2019లో నారాయణ్‌పేట్, ములుగు అనే రెండు జిల్లాలను సృష్టించారు. దీనితో తెలంగాణ 33 జిల్లాల రాష్ట్రమయింది.

ఫొటో సోర్స్, TRS/FB
చిన్న జిల్లాలు ఏర్పడితే, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని, జిల్లా కార్యాలయాలు ప్రజల సమీపానికి వస్తాయనేది చిన్న జిల్లాల ఏర్పాటును సమర్థించుకుంటూ ప్రచారమవుతున్న సిద్ధాంతం.
దీని వల్ల పాలనాపరమయిన ప్రయోజనాలు చాలా ఉన్నాయని అంగీకరిస్తూనే ఈ ఆశయం నెరవేరే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు తీసుకువచ్చిన పరిపాలనలో గుణాత్మక మార్పేమి లేకపోవడాన్ని చాలామంది ఉదహరిస్తున్నారు.
ఇప్పుడున్న జిల్లాల సరిహద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూలమయిన కొత్త సరిహద్దులను సృష్టించడం వల్ల పాలన మెరుగుపడుతుందని, ఆయా ప్రాంతాల అభివృద్ది సుగమం అవుతుందని బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.
ఇది కేవలం భ్రమ అని, రాజకీయలబ్ది కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొన్ని జిల్లాల ఏర్పాటును చూస్తే అర్థమవుతుందని చాలా మేధావులు, రాజకీయ నాయకులు చెప్పారు.

ఫొటో సోర్స్, YSRCP/FB
ప్రజల ముంగిట పాలన
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని పాలనా వికేంద్రీకరణగా, ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లడంగా, పాలనా సంస్కరణగా ప్రభుత్వాలు పిలుస్తున్నాయి.
ప్రజల ముంగిటికి పాలన అనేమాట 1986లో మొదట వినిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈ నినాదంతోనే ఒక శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు.
తాహశీల్దార్ పదవికి ఉన్న హోదాను, హంగును తీసేశారు.‘పవర్ ఫుల్’ తాహశీల్దార్‌ని మండల రెవిన్యూ అధికారిగా మార్చి జనం మధ్యకు తీసుకువచ్చారు. అయితే, తర్వాత సంస్కరణలు ఆగిపోయాయి. జిల్లాను సంస్కరించే పని ఎవరూ చేయలేదు.
ఇప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరిపేసి చిన్న జిల్లాలను సృష్టించి కలెక్టర్ పదవిని కూడా జనం మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది.
ఇది సుపరిపాలనకు దారితీస్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీనం చేసి ముఖ్యమంత్రులను ఇంకా శక్తివంతులను చేస్తుందా అనేది ప్రశ్న.
కలెక్టర్, ఎస్పీల గ్లామర్ తగ్గుతుంది
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలను సృష్టించడంతో జిల్లా కలెక్టర్ అధికార విస్తృతి, దర్పం తగ్గిపోతాయి. కలెక్టర్లు ఇపుడు డివిజన్ హెడ్ క్వార్టర్ కంటే చిన్న ఊర్లలో కూర్చోవలసి వస్తుంది. ఇదే పరిస్థితి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి కూడా ఎదురవుతుంది.
ఉదాహరణకు కడప జిల్లాను విడదీసి రాయచోటి జిల్లాను సృష్టించారు. ఇది డివిజినల్ హెడ్ క్వార్టర్ కూడా కాదు. ఇప్పుడు ఈ ఊరిలో కలెక్టర్ ఆఫీస్ వస్తుంది. ఎప్పుడో గాని కన్పించని కలెక్టర్‌ని, జిల్లా ఎస్‌పీని ఈ ఊరి ప్రజలు రోజూ చూస్తారు. వారితో పాటు జాయింట్ కలెక్టర్, ఎందరో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆ చిన్న ఊర్లో రోజూ తారసపడతారు.
ఇలా కొత్త జిల్లాలు ఒక వినూత్న పాలనానుభవాన్ని తీసుకువస్తున్నాయి.
“సాధారణంగా ప్రజల్లో ‘అబ్బో కలెక్టర్ ఆఫీస్ చాలా దూరం, కలెక్టర్‌ని కలుసుకోవడం చాలా కష్టం,’ అనే భయభావం ఉంటుంది. దీని వల్లే సాధారణ ప్రజలకు ఈ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ఒక మధ్యవర్తి జోక్యంగాని, రాజకీయ నాయకుడి సాయంగాని అవసరమయింది, ఊరికి దూరం, ఉన్నతాధికారి అంటే ఉన్న భయభావం చిన్న జిల్లాల ఏర్పాటుతో పోయే అవకాశం ఉంది”
“అంటే చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పైరవీకారుల అవసరం తగ్గే వీలుంది. అదే సమయంలో చిన్న జిల్లాల అధికారులకు పెద్ద జిల్లాల నాటి హుంగు ఆర్భాటాలు తగ్గిపోతాయి. ఇది ఆశించదగ్గ పరిణామం” అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు.
ఇలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన మరొక విశ్రాంత ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు.
“1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 9 జిల్లాలుండేవి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1970 ఫిబ్రవరి 1న గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఆపైన 1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా జనాభా పెరుగూతూ వచ్చింది.
తెలంగాణ నుంచి కొన్ని మండలాలు కలవడంతో తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం పెరిగింది. ఈ కారణాలతో కొత్తగా చిన్న జిల్లాలను సృష్టించడం ఒక ఆహ్వానించదగ్గ సంస్కరణ. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కొంత మేలు జరుగుతుంది"
"ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్టణం నుంచి తూర్పుగోదావరి జిల్లా జంగారెడి గూడెందాకా 500 కి.మీ పరిధి గిరిజన ప్రాంతం ఒకే ఎంపీ కింద ఉండేది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు రెండు జిల్లాలుగా మార్చారు. జిల్లాల పరిమాణం బాగా కుంచించుకుపోతుంది. ఇదొక మంచి ప్రయోగం” అని ప్రొఫెసర్ చలం అన్నారు.
చిన్న జిల్లాల పెద్ద ఆశయం నెరువేరుతుందా?
ఆశయపరంగా చిన్న జిల్లాలను సృష్టించడం చాలా మంచి నిర్ణయం అనే విషయంలో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిలో ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఈ ఆశయం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో నెరవేరుతుందా అనే దాని మీద అందరిలో అనుమానాలున్నాయి. ప్రజలకు పరిపాలన చేరువ కావడం అంటే ఏమిటి?
జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని 250 కి.మీ దూరం నుంచి 100 కి.మీ దూరానికి మార్చినందున పరిపాలన దగ్గరవుతుందా? పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి? చిన్న జిల్లా ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ అవుతుందా?
ఈ ప్రశ్నలకు ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన తెలంగాణలో సమాధానం దొరకడం లేదు. రేపు ఆంధ్రలో కూడా ఇదే పరిస్థతి వస్తుంది. జిల్లాలొస్తాయి గాని, ఆశయాలు నెరవేరుతాయన్న గ్యారంటీ లేదు.
1986లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ప్రజల వద్దకు పాలన’అని నినాదమీయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఇంటర్నెట్ లేదు. మీ-సేవా కేంద్రాలు, ఇ-సేవా కేంద్రాలు లేవు.
ఏదయినా సర్టిఫికేట్, రిజస్ట్రేషన్, దరఖాస్తు అవసరమయితే, ఎపుడొస్తుందో తెలియని ఆర్టీసీ ఎర్రబస్సును నమ్ముకుని తాలూకా కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది.
ఆర్టీసి బస్సు అంటే ‘రాదు, తెలియదు, చెప్పలేము’ అని నవ్వులాటగా ఉండే రోజులవి. అపుడు జిల్లా కార్యాలయానికి రావాలంటే చాలా కష్టమయ్యేది.
ఇపుడా పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు రానవసరమేలేకుండా ఆన్‌లైన్ సేవలు వచ్చాయి. చాలా చోట్ల ప్రజలను కార్యాలయాల్లోకి రానీయడం లేదు.
మీ-సేవా కేంద్రాలు వచ్చాయి. ఇ-సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, కొన్ని రకాలసేవలను ప్రజలు స్మార్ట్ ఫోన్ ఉపయోగించి పొందుతున్నారు.
వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ పాఠశాలలు, ఆన్‌లైన్ వైద్యం, జూమ్ మీటింగులు అందుబాటులోకి వచ్చాయి. అధార్ కార్యాలయానికి వెళ్లకుండా ఆధార్ కార్డు వస్తున్నది. ఇలాగే ఇన్‌కంటాక్స్ ఆఫీస్ ముఖం చూడకుండా పాన్ కార్డు వస్తూ ఉంది. ఇలాంటపుడు ప్రజలు ఇంకా ప్రభుత్వకార్యాలయాలకు రావడం ఎందుకు? కొత్త జిల్లాలు ఎందుకు?
కాకపోతే, ఎప్పుడో ప్రారంభమయిన ఉపప్రాంతీయ జిల్లా డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి. భావోద్వేగం సృష్టిస్తున్నాయి. అందువల్ల కొత్త జిల్లా ఏర్పాటు కూడా , కొత్త రాష్ట్రం ఏర్పాటులాగా రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడయితే, కొత్త జిల్లా ఏర్పాటు కేంద్రంలో ‘రియల్ ఎస్టేట్ బూమ్ ’ తీసుకువస్తుంది.
తెలంగాణలో కొత్త జిల్లాల వల్ల అతి పెద్ద ప్రయోజనం ఇదే. అందుకే ‘తెలంగాణలో ఒక ఎకరా భూమి అమ్మేసి, ఆంధ్రలో రెండు మూడు ఎకరాలు కొంటున్నారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగా ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన కూడా జగన్ కొత్త జిల్లాల ఉబలాటానికి కారణమై ఉండవచ్చు.
ప్రజల భావోద్వేగాలను వాడుకునేందుకు తప్ప కొత్త జిల్లాలు అదనపు ప్రయోజనం తీసుకువచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు.
‘కొత్త జిల్లాల సృష్టి అవసరమే. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న ఉన్నతాశయం నెరవేర్చే వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా?” అని ఆయన ప్రశ్నించారు.
“ఆంధ్రప్రదేశ్‌లో ముందుచూపు లేకుండా ప్రారంభించిన అనేక పథకాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపాయి. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బిసి)లను తెరిచారు. మూసేశారు.
ఇపుడు ఉద్యోగస్థులకు జీతాలు కూడా చెల్లించే స్థితి లేదు. వాళ్ళకి పిఆర్‌సి అమలుచేయకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దానికి కావలసిన భవనాలు, ఇతర వసతులు సమకూర్చుకునేందుకు వ్యయం తడిసి మోపెడవుతుంది. ఈ నిధులెక్కడి నుంచి తెస్తారు?"
"మొదట ప్రభుత్వం అనవసర వ్యయం తగ్గించి, రాబడి పెంచుకుని, కొత్త జిల్లాల గురించి ఆలోచించాల్సి ఉంది. అయితే, జగన్ ప్రభుత్వానికి ప్రజాసౌలభ్యం కంటే రాజకీయ సౌలభ్యం ముఖ్యం.
ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటించి, అసలు సమస్య నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలందుకే తప్ప, పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడం కాదు” అని కాలువ శ్రీనివాస్ అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధత లేదు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పాలన వికేంద్రీకరణ కోసం అని, పరిపాలనను ప్రజలకు చేరువచేయడం అనే ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలా చోట్లా అది ఆశయాన్ని దెబ్బతీసింది. ఇలాంటపుడు కొత్త జిల్లాలు కొత్త సమస్య తీసుకువస్తాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ అన్నారు. ఆలోచించదగ్గ రెండు అంశాలను ఆయన పేర్కొన్నారు.
1) కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల కొన్ని గిరిజన గ్రామాలకు జిల్లా హెడ్ క్వార్టర్లు దూరమవుతున్నాయి. ఉదాహరణకు, విశాఖపట్నం జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు నుండి అరకు కొత్త జిల్లా కేంద్రానికి రావాలంటే అక్కడి గ్రామస్థులు 5 నుండి 7 గంటలు ప్రయాణించవలసి ఉంది. దూరాలను తగ్గించకపోగా దాన్ని పెంచే విధంగా ఉండే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉపయోగం ఉండదు.
2) కొత్త జిల్లాల కారణంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో హెడ్ క్వార్టర్‌లో జన సాంద్రత పెరగడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున రావడం వలన అక్కడ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు భంగం కలుగుతుంది. అది కాకుండా భూ బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించే ప్రమాదం ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఈ విషయం మీద ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, గిరిజన గ్రామాలకు రాజ్యాంగం నుంచి సంక్రమించిన అధికారాలివ్వకుండా కొత్త జిల్లాలను సృష్టించి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 1986లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఆనుకుని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న 800కు పైగా గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్రం ఆ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది.
"మండలాల వారీగా ఆ గ్రామాల లిస్టులను పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత, ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి 500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తెలుగు రాష్ట్రాలు రెండు ఆ విషయంలో కేంద్రానికి ఇంతవరకు జవాబు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూవస్తున్నాయి.
దీని వలన గిరిజనులకు అపారమైన నష్టం కలిగింది.ఈ గ్రామాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఉండవలసింది” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 50 శాతం గిరిజన జనాభా ఉన్న మండలాలను షెడ్యూల్ 5లో చేర్చాలి.
“ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సరవకోట, పాతపట్నం, మెళియపుట్టి మండలాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని గిరిజన జిల్లాలో చేర్చాలి లేదా జిల్లాగా ఏర్పాటు చేయాలి.
ఇలాగే, 73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అధికారాలను పంచాయతీలకు బదలాయించాలి. ఇదింతవరకు జరగలేదు. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగి తీరాలి. అపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ఆశయం నెరవేరుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఏమి జరిగింది?
కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాని వాటి ఆశయం తెలంగాణలో నెరవేరిందెక్కడ అని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఈ కొత్త జిల్లాల వెనక ఉద్దేశం రాజకీయమైందే తప్ప 'మెరుగైన పాలన' అందించడం కాదేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
"పెద్ద జిల్లాలలో పెద్ద పెద్ద నాయకులు తయారు కాకుండా చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లుంది. ఇక ముందు పూర్వంలాగా బలమయిన జిల్లా నేతలెవరూ తయారు కాదు. సుపరిపాలన అందించే ఉద్దేశం ఇందులో కనిపించదు. జిల్లా కలెక్టర్లుగా నియమించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారులు దొరకక ఎవరంటే వారికి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చినందున కలెక్టర్లు పాదాభివందనం చేసే స్థాయికి వ్యవస్థ పడిపోయింది.
కొత్త జిల్లాల ఏర్పాటు జిల్లాల పాలనను గాడి తప్పించింది. ఆర్థిక భారం పెంచింది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు 10 జిల్లాలపుడు ఎలా పరిష్కారమయ్యాయో, 33 జిల్లాల తర్వాత ఇపుడేమాత్రం పరిష్కారమవుతున్నాయో లెక్కలు తీస్తే తెలుస్తుంది" అని డాక్టర్ పుల్లారావు అన్నారు.
ఇండియన్ రెవిన్యూ సర్వీస్ మాజీ అధికారి, సామాజిక ఉద్యమకారుడు వీఎస్ ప్రసాదశాస్త్రి కొత్త జిల్లాల మీద వ్యాఖ్యానిస్తూ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజలనుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారం ఒక శాతం కూడా పెరగలేదని అన్నారు. పది జిల్లాలపుడు ఉన్న పరిస్థితే ఇపుడు ఉందని ఆయన చెప్పారు. దీనికికారణం ఏమిటి? నిజమయిన పరిపాలన వికేంద్రీకరణ ధ్యేయంగా కాకుండా రాజకీయ రహస్య అజండాతో జిల్లాల ఏర్పాటు జరుగుతూ ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.
"33 జిల్లాలు ఏర్పడ్డాక పరిపాలన క్వాలిటీ పెరిగింది శూన్యం. రాజకీయనాయకులకు, అధికారులకు ప్రయోజనాలున్నాయి తప్ప కొత్త జిల్లాల్లో ప్రజలకు ఏమీ లేదు. రెవిన్యూ జిల్లాలను బట్టి లోక్‌సభ నియోజకవర్గొలొస్తాయని, జిల్లాలను బట్టి నిధులొస్తాయని, కిందిస్థాయిలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చనే ఎజండాతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు.
మరొకవైపు 76 వేల జీవోలను తెలంగాణ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఆంధ్రలో జగన్ పర్మిషన్ లేకుండా వెబ్‌సైట్‌లో ఒక్క జీవో పెట్టడం లేదు, ఆర్‌టీఐ చట్టాన్ని రెండు రాష్ట్రాలు గౌరవించడం లేదు. ఇలా ప్రజ్వాస్వామ్యాన్ని, పాలనా పారదర్శకతను నిర్వర్యం చేస్తూ పాలన వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నామనడం వింత" అని శాస్త్రి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు విఫలమయిందని అన్నారు. కొత్త జిల్లాల వల్ల సమస్యలు వచ్చాయే తప్ప ప్రయోజనం లేదని చెబుతూ 371(డి) విషయం తేలకుండా జిల్లాలను హడావిడిగా సృష్టించడం వల్ల ఉద్యోగులకు సమస్యలొచ్చాయి. రిక్రూట్‌మెంట్ జరగడంలేదు" అని పొన్నాల అన్నారు.
జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాలు వద్దు
జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం అధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, రాయలసీమలో కనీసం 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.
రాయలసీమలో నీటిపారుదల లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడంతో లక్షల సంఖ్యలో ప్రజలు శాశ్వతంగా వలసపోయారని అంటూ జనాభా ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటుచేస్తే న్యాయం జరగదని అన్నారు. ఎవరిని సంప్రదించకుండా ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుచేయడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అనేది చిరకాల వాంఛ అని,అయితే, జనాభా ప్రాతిపదిక రాయలసీమకు వర్తింపచేయరాదని ఆయన అన్నారు.
కొత్త జిల్లాలతో పరిపాలన మెరుగుపడుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వల్ల పాలన మెరుగుపడటం జరగదని ఇది రాష్ట్రానికి పాలనపరంగా నష్టం కలిగిస్తుందని డాక్టర్ పుల్లారావు అభిప్రాయపడ్డారు.
మా జిల్లా, మా ప్రాంతం అని భావోద్వేగం కలిగించి లబ్దిపొందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలను ఏర్పాటు చేశారని కాల్వశ్రీనివాసులు విమర్శించారు. తెలుగు రాష్ట్రాలలో అవినీతి చాలా ఎక్కువ. అవినీతి తగ్గించేందుకు జిల్లాల ఏర్పాటు ఏ మాత్రం పనికిరాదని బీబీసీతో మాట్లాడిన చాలామంది అభిప్రాయపడ్డారు.
ఎక్కువ జిల్లాల ఏర్పాటుకు, మెరుగైన, అవినీతి రహిత పరిపాలనకు సంబంధం లేదని దశరథరామిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్విటీకి చెందిన రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఇ వెంకటేశు కూడా సుపరిపాలనకు కొత్త జిల్లాలు బాటవేయవని, ఇది ప్రజాస్వామిక విధానాలను పటిష్ట పరిచే చర్య కాదని అన్నారు.
"నంద్యాల జిల్లా ఏర్పాటుతో కర్నూలు జిల్లా బాగా వెనకబడిన ప్రాంతమయింది. ఆదోని ప్రాంతానికి కర్నూలు జిల్లా కేంద్రం చాలా దూరం. జిల్లా కేంద్రానికి దూరం తగ్గించాలన్న ఆశయం ఇక్కడ నెరవేరలేదు. అంటే, జిల్లాలను ప్రజల సౌలభ్యం కోసం కంటే, రాజకీయ సౌలభ్యం కోసం చేశారని అనుకోవాలి' అని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో ముఖ్యమంత్రులు అధికారాన్నంతా గుప్పిట్లో పెట్టుకున్న సర్వ శక్తివంతులు. ఇలాంటి రాష్ట్రాలలో జిల్లాలను ఎక్కువ చేసి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా? ఇలాంటి రాష్ట్రాలలో జిల్లాలెన్నున్నా ఇంతకంటే పరిపాలనలో మార్పు సాధ్యమా?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




















