ఆంధ్రప్రదేశ్: రెడ్డి, కమ్మ, క్షత్రియ కులస్థుల కోసం మూడు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు - Newsreel

ఫొటో సోర్స్, APCMO/FB
రెడ్డి, కమ్మ, క్షత్రియ కులస్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మూడు కులాల్లో పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు సంస్థాగతమైన ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. సామాజిక సమతుల్యత సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం ఇప్పటికే అగ్ర కులాలైన బ్రాహ్మణ, వైశ్య, కాపు కులాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరో మూడు కులాల కోసం వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం మూడు వేరు వేరు జీఓలు జారీ చేసింది.
ఆర్ధికంగా వెనకబడిన రెడ్డి కులస్థులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోఎంఎస్ నెంబర్ 6ను విడుదల చేసింది. అలాగే, కమ్మ, క్షత్రియ కులాల్లోని పేదవారికి సహాయం అందించేందుకు కూడా కమిషన్లను ఏర్పాటు చేసింది.
ఈ కార్పొరేషన్లకు కేటాయించే నిధుల ద్వారా ఆయా కులస్థులకు ఆర్ధికంగా సాయం అందించేందుకు వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ మూడు కులాల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ(బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్) ఆధ్వర్యంలో పని చేస్తాయని ఆ జీవోల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, క్షత్రియ, కమ్మ కులస్థులకు ఓసీలుగా గుర్తింపు ఉందని, వీరిలో ఎక్కువమంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, చాలా కొద్దిమంది దగ్గరే భారీ ఎత్తున భూములు, సాగునీటి సదుపాయాలు ఉన్నాయని, మిగిలిన వారు చాలా చిన్న రైతులని, ఆర్ధికంగా వెనకబడిన వారని ప్రభుత్వం వెల్లడించింది.
వర్షాధారిత వ్యవసాయం కావడం, సరైన సాగునీటి వసతులు లేకపోవడంతోపాటు దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల ఈ రైతులు ఎక్కువమంది పేదరికంలో జారుకుంటున్నారని పేర్కొంది.
ఈ కులాలకు చెందిన వారు చాలామంది చదువుల కోసం భూములను కూడా అమ్ముకోవడమో లేదంటే తనఖా పెట్టుకోవడమే చేస్తున్నారని తెలిపింది.
అగ్ర కులాలలో ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయని, వీటిని రూపుమాపేందుకు వారికి ఆర్ధికంగా సాయం అవసరమని భావిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత 2001 ఏపీ సొసైటీస్ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
త్వరలోనే ఈ కార్పొరేషన్ల విధివిధానాలు, కమిటీ ఏర్పాటు వ్యవహరాలను ప్రభుత్వం ఖరారు చేస్తుందని, దీనికి సంబంధించి ఏపీ బీసీ వెల్ఫేర్ డైరక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది.
రఘురామకృష్ణ రాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, RAGHU RAMA KRISHNA RAJU/FACEBOOK
రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు గాయాలైనట్లు ఆర్మీ హాస్పిటల్ ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోందని సుప్రీం కోర్టు తెలిపింది.
పిటిషనర్‌కు గతంలో బైపాస్ సర్జరీ అయింది కాబట్టి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఈ ఉదయం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి.
రఘురామ కృష్ణ రాజు కాలికి గాయాలయ్యాయని, ఫ్రాక్చర్ కూడా ఉందని ఆర్మీ ఆసుపత్రి కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ చెప్పారు.
తన క్లయింటు అయిన ఎంపీని హింసించారని.. పోలీసులు కొట్టారనడానికి ఈ నివేదికే ఆధారమని రఘురామ రాజు తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు.
ఆయన ఎంపీయా కాదా అన్నది కోర్టు చూడబోదని.. చట్టం ముందు అందరూ సమానులేనని న్యాయస్థానం పేర్కొంది.
''ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజల గతేమిటి.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలి'' అని కోర్టును కోరారు.
స్వయంగా చేసుకున్న గాయాలు కావొచ్చు: ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే
రఘురామ కృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, బి.ఆదినారాయణ రావులు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.
ఆర్మీ ఆసుపత్రి చెబుతున్న గాయాలు ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్వయంగా చేసుకున్నవి కావొచ్చని దుష్యంత్ దవే అన్నారు.
ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇచ్చిన తరువాత కూడా మీరీ మాట చెబుతున్నారా.. ఆయనే గాయాలు చేసుకున్నారంటున్నారా అని కోర్టు ప్రశ్నించగా ఏమో తనకు తెలియదని దవే అన్నారు.
తాము ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రులకు అందుకే పంపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
తాను ఆసుపత్రికి పంపించడానికి సంబంధించిన కోర్టు ఆదేశాలను ప్రశ్నించడం లేదని.. బెయిలు విషయంలో ప్రశ్నిస్తున్నాని అడ్వకేట్ దవే అన్నారు.
అందుకు స్పందించిన న్యాయమూర్తులు, మీ వాదనలు వినకుండా ఆదేశాలు ఇచ్చామనుకుంటున్నారా.. మొదట ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనివ్వండి.. బెయిలు ఎందుకు ఇవ్వాలో ఆయన చెప్పిన తరువాత మీ వాదనలు వింటాం అని న్యాయమూర్తులు అన్నారు.
అనంతరం విచారణకు మధ్యాహ్నం 2.30కి వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ మృతి
సుప్రసిద్ధ పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్‌తో మరణించారు.
'చిప్కో' ఉద్యమంతో ప్రసిద్ధికెక్కిన పర్యావరణవేత్త సుందర్‌లాల్ బహుగుణ కోవిడ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
94 ఏళ్ల బహుగుణ కోవిడ్ చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుగుణ మరణం పట్ల సంతాపం తెలియజేశారు.
"శ్రీ సుందర్‌లాల్ బహుగుణ మరణం దేశానికి పూడ్చలేని లోటు. ప్రకృతితో కలిసి జీవించాలని మన పూర్వీకుల చెప్పిన మాటను సాక్షాత్కారం చేసిన వ్యక్తి" అని ట్విట్టర్‌లో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- కరోనావైరస్: గంగా నదిలో కుప్పలు తెప్పలుగా కొట్టుకొస్తున్న కోవిడ్ మృతదేహాలు
- కరోనావైరస్: గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








