ADR Report: అత్యధిక ఆస్తులున్న ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌కు రెండో స్థానం, నాలుగో స్థానంలో టీడీపీ

కేసీఆర్, చంద్రబాబు, జగన్

ఫొటో సోర్స్, Facebook

భారత్‌లోని ప్రాంతీయ పార్టీల్లో రూ. 301.47 కోట్ల ఆస్తులతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) రెండో స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పార్టీ అధికారంలో ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రూ.188.19 కోట్లతో ప్రాంతీయ పార్టీల్లో నాలుగో స్థానంలో ఉంది.

ఏపీలోని అధికార పార్టీ వైసీపీ రూ.143.60 కోట్లతో ఏడో ధనిక ప్రాంతీయ పార్టీగా ఉంది.

2019-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి రూ. రూ. 4847.78 కోట్ల ఆస్తి

జాతీయ పార్టీల విషయానికి వస్తే రూ. 4847.78 కోట్లతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొదటి స్థానంలో ఉంది.

ఏడు జాతీయ పార్టీలైన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), సీపీఐ, ఎన్సీపీ ఆడిట్ నివేదికలను ఏడీఆర్ విశ్లేషించింది.

ఏడు పార్టీలకు కలిపి మొత్తంగా 2019-20లో రూ.6,988.57 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ పేర్కొంది.

మోదీ, షా

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ ఆస్తుల్లో 69.37 శాతం అంటే రూ.4,847.78 కోట్లు ఒక్క బీజేపీ దగ్గరే ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.

మరోవైపు సుసంపన్న జాతీయ పార్టీల స్థానంలో బీఎస్పీ రెండో స్థానంలో ఉంది. పార్టీకి రూ.698.33 కోట్ల ఆస్తులు (9.99 శాతం) ఉన్నాయి.

మూడో స్థానంలో కాంగ్రెస్ (రూ.588.16 కోట్లు), నాలుగో స్థానంలో సీపీఎం (రూ.569.51 కోట్లు), ఐదో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.247.78 కోట్లు), ఆరో స్థానంలో సీపీఐ (రూ.29.78 కోట్లు), ఏడో స్థానంలో ఎన్సీపీ (రూ.8.20 కోట్లు) ఉన్నాయి.

అఖిలేశ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రాంతీయ పార్టీల్లో ఎస్పీది మొదటి స్థానం

మొత్తంగా 44 ప్రాంతీయ పార్టీల ఆడిట్ నివేదికలను ఏడీఆర్ విశ్లేషించింది. వీటిలో మొదటి పది పార్టీలకు మొత్తంగా రూ.2028.715 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంటే మొత్తం ఆస్తుల్లో(రూ.2,129.38 కోట్లు) ఇవి 95.27 శాతం.

అత్యధికంగా తమకు రూ.563.47 కోట్లు (26.46 శాతం) ఆస్తులున్నట్లు ఉత్తర్ ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తమ ఆడిట్ నివేదికలో వెల్లడించింది.

ఎస్పీ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, మూడో స్థానంలో రూ.267.61 కోట్లతో తమిళనాడులోని అన్నాడీఎంకే ఉన్నాయి.

నాలుగో స్థానంలో రూ.188.19 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ఉంది. ఐదో స్థానంలో రూ.185.90 కోట్లతో శివసేన, ఆరో స్థానంలో రూ.184.24 కోట్లతో డీఎంకే, ఏడో స్థానంలో రూ.143.60 కోట్లతో వైసీపీ, ఎనిమిదో స్థానంలో రూ.128.75 కోట్లతో బీజేడీ (ఒడిశా), తొమ్మిదో స్థానంలో రూ.45.09 కోట్లతో జేడీయూ (బిహార్), పదో స్థానంలో రూ.20.38 కోట్లతో ఆర్‌ఎల్‌డీ (బిహార్) ఉన్నాయి.

మిగతా 34 ప్రాంతీయ పార్టీలకు మొత్తంగా రూ.100.66 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో వరి పండగ దండగ ఎలా అయింది? - ఎడిటర్స్ కామెంట్

ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో

బీజేపీ ఆస్తుల్లో రూ. 716.67 కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. మరో రూ. 590 కోట్లను సంస్థ రుణాలుగా ఇచ్చింది.

బీజేపీ తర్వాత ఎక్కువ ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నది కాంగ్రెస్‌కే (రూ.217.72 కోట్లు). కాంగ్రెస్ కూడా దాదాపు రూ.60 కోట్లను రుణాలుగా ఇచ్చింది.

ప్రాంతీయ పార్టీల్లో రూ. 86.39 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లతో ఎస్పీ మొదటి స్థానంలో ఉంది. రూ. 21 కోట్లతో టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంది.

అప్పుల విషయంలో జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ (రూ. 49.55 కోట్లు), ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ (రూ. 30 కోట్లు) మొదటి స్థానాల్లో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తాం: సోము వీర్రాజు

మార్గదర్శకాలను పాటించడంలో విఫలం

ఆర్థిక వివరాల ఆడిట్ రిపోర్టులను సమర్పించడంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పూర్తిగా పాటించడంలో రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయని ఏడీఆర్ వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా రుణాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఏ బ్యాంకులలో డిపాజిట్లు ఉన్నాయి లాంటి వివరాలు నివేదికల్లో సమర్పించడంలేదని పేర్కొంది.

మరోవైపు రుణాలు ఎవరికి ఇస్తున్నారో కూడా కొన్ని పార్టీలు వెల్లడించడంలేదని ఏడీఆర్ పేర్కొంది.

పెట్టుబడుల విషయంలోనూ పారదర్శకత పాటించడంలేదని ఏడీఆర్ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)