నియాండర్తల్స్: ఆధునిక మానవుల చేతిలో ఈ మానవజాతి అంతమైపోయారన్నది నిజం కాదా.. కొత్త పరిశోధన ఏం చెబుతోంది

ఆసియా, ఆ తరువాత ఐరోపా ప్రాంతాల్లో నివసించిన జాతిని నియాండర్తల్స్ అంటారు. 40,000 సంవత్సరాల క్రితం ఈ జాతి అంతరించిపోయింది
ఫొటో క్యాప్షన్, ఆసియా, ఆ తరువాత ఐరోపా ప్రాంతాల్లో నివసించిన జాతిని నియాండర్తల్స్ అంటారు. 40,000 సంవత్సరాల క్రితం ఈ జాతి అంతరించిపోయింది
    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్

ఆఫ్రికా నుంచి వచ్చిన ఆధునిక మానవులు, ఐరోపాలో ఉన్న నియాండర్తల్స్ జాతిని తుడిచిపెట్టేశారని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ, ఇటీవల బయటపడిన కొన్ని అవశేషాలు ఈ సిద్ధాంతాన్ని సవాలు చేస్తున్నాయి.

6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనందరం పరిణామం చెందాం. వీరినే ఆధునిక మానవులు లేదా హోమో సేపియన్స్ అంటారు.

రెండో బృందం ఆసియా, ఆ తరువాత ఐరోపా ప్రాంతాల్లో హోమో నియాండర్తలెన్సిస్ అనే జాతిగా పరిణామం చెందింది. వారినే నియాండర్తల్స్ అంటున్నాం.

ఇటీవల, దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ గుహలో ఒక చిన్న పిల్ల దంతం, కొన్ని రాతి పనిముట్లు దొరికాయి. ఇవి హోమో సేపియన్స్‌వేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వీటిని బట్టి 54,000 సంవత్సరాల క్రితం పశ్చిమ ఐరోపాలో హోమో సేపియన్స్‌ ఉన్నారని తెలుస్తోంది. అంటే, గతంలో మనకు తెలిసినదాని కన్నా కొన్ని వేల సంవత్సరాలకు ముందే హోమో సేపియన్లు ఐరోపా ప్రాంతాల్లో నివసించారన్నమాట.

దీనిని బట్టి, నియాండర్తల్, హోమో సేపియన్ జాతులు చాలా కాలం సహజీవనం చేసి ఉండవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది.

ఈ పరిశోధన ఫలితాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.

గ్రోట్ మాండ్రిన్ గుహలో 54,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుల అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, ROB HOPE FILMS

ఫొటో క్యాప్షన్, గ్రోట్ మాండ్రిన్ గుహలో 54,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుల అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు

'ఇది అక్షరాలా మన చరిత్ర పుస్తకాలన్నింటినీ తిరగరాస్తుంది'

రోన్ వ్యాలీలోని గ్రోట్ మాండ్రిన్ గుహలో ఈ అవశేషాలను కనుగొన్నారు. టౌలౌస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లుడోవిక్ స్లిమాక్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన జరిపింది.

ఆధునిక మానవులు మనకు తెలిసినదాని కన్నా చాలా కాలం క్రితమే ఇక్కడ నివసించారన్నది గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించిందని ప్రొఫెసర్ స్లిమాక్ అన్నారు.

"మనం ఊహించిన దానికన్నా 12,000 సంవత్సరాలకు ముందే హోమో సేపియన్స్ ఇక్కడకు వచ్చారని, ఆ తరువాత వీరి స్థానంలో నియాండర్తల్స్ వచ్చారని తాజా అధ్యయనం నిరూపిస్తోంది. ఇది అక్షరాలా మన చరిత్ర పుస్తకాలన్నింటినీ తిరగరాస్తుంది" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, 12 ఏళ్లలో 8 సార్లు గర్భస్రావం.. ఎలా తట్టుకున్నానంటే..

4,00,000 సంవత్సరాల క్రితం నియాండర్తల్ జాతి యూరోప్‌లోకి ప్రవేశించింది. 40,000 సంవత్సరాల క్రితం ఆ జాతి అంతరించిపోయిందన్నది ప్రస్తుత సిద్ధాంతం.

ఆఫ్రికా నుంచి హోమో సేపియన్స్ యూరప్‌లోకి ప్రవేశించిన తరువాత ఈ రెండు జాతుల మధ్య జరిగిన పోరులో నియాండర్తల్ జాతి అంతరించిపోయింది.

కానీ, ఆధునిక మానవులు (హోమో సేపియన్స్) అంతకు ముందే యూరోప్‌కు చేరుకున్నారని, నియాండర్తల్స్ అంతరించిపోక ముందు, ఈ రెండు జాతులూ 10,000 సంవత్సరాలకు పైగా యూరోప్‌లో కలిసి జీవించి ఉంటాయని తాజా అధ్యయనం నిరూపిస్తోంది.

ఒక చిన్నపిల్ల దంతం, కొన్ని రాతి పనిముట్లు కనుగొన్నారు

ఫొటో సోర్స్, LUDOVIC SLIMAK

ఫొటో క్యాప్షన్, ఒక చిన్నపిల్ల దంతం, కొన్ని రాతి పనిముట్లు కనుగొన్నారు

'రావడం, వెళ్లడం, తిరిగి రావడం.. '

హోమో సేపియన్లు నియాండర్తల్ జాతిని అంతమొందించారనే ప్రస్తుత సిద్ధాంతానికి ఈ పరిశోధనా ఫలితాలు సవాలు విసురుతున్నాయని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రొఫెసర్ క్రిస్ స్ట్రింగర్ అన్నారు.

"ఒక్క రాత్రిలో ఆధునిక మానవులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదు. కొన్నిసార్లు నియాండర్తల్స్ బలంగా ఉంటే, మరి కొన్నిసార్లు హోమో సేపియన్లకు బలం ప్రదర్శించారు. వారి మధ్య యుద్ధం సమతుల్యంగా సాగింది" అని ఆయన వివరించారు.

తాజా అధ్యయనానికి ఆధారమైన అవశేషాలను భూమి లోపల పలు పొరల్లో కనుగొన్నారు. లోతులకు తవ్వుతున్నకొద్దీ కాలంలో వెనక్కి వెళ్లి చూడగలిగారు. అట్టడుగు పొరల్లో సుమారు 20,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన నియాండర్తల్స్ అవశేషాలు బయటపడ్డాయి.

అలాగే, ఒక పొరలో 54,000 ఏళ్ల నాటి చిన్న పిల్ల దంతం, కొన్ని రాతి పనిముట్లు కనిపించాయి. అవి నియాండర్తల్స్‌కు చెందినవి కావు. ఈ అవశేషాలు పురావస్తు శాస్త్రవేత్తలకు గొప్ప ఆశ్చర్యం కలిగించాయి.

దొరికిన ఆధారాల బట్టి, ఈ జాతి (హోమో సేపియన్స్) ఈ ప్రాంతంలో సుమారు 2,000 సంవత్సరాలు మనుగడ సాగించి ఉండవచ్చని, వారి తరువాత కొంతకాలం పాటు ఇక్కడ ఎవరూ నివసించలేదని పరిశోధకులు భావిస్తున్నారు.

మరి కొంతకాలం తరువాత నియాండర్తల్స్‌ ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. అప్పటి నుంచి 44,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు తిరిగి వచ్చేవరకు నియాండర్తల్స్‌ ఇక్కడ మనుగడ సాగించి ఉండవచ్చని ఈ అవశేషాలు సూచిస్తున్నాయి.

"రావడం, వెళ్లడం, తిరిగి రావడం.. ఇలా సాగింది. ఆధునిక మానవులు యూరోప్ వచ్చి కొంతకాలం నివసించారు. తరువాత, కొంత ఖాళీ ఏర్పడింది. బహుశా, వాతావరణ మార్పులు వారిని అంత చేసి ఉండవచ్చు. ఆ తరువాత నియాండర్తల్స్‌ తిరిగి ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు" అని ప్రొఫెసర్ స్ట్రింగర్ అన్నారు.

నియాండర్తల్ మానవుడి రూపం

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్, నియాండర్తల్ మానవుడి రూపం

ఆ కాలానికే ఆధునిక మానవులకు విల్లు, బాణం తెలుసా?

ఈ పరిశోధనలో మరొక కీలకమైన అంశం, ఇక్కడ దొరికిన రాతి పనుముట్లు. చిన్న పిల్ల దంతం దొరికిన పొరలోనే ఇవీ దొరికాయి. ఇలాంటి పనిముట్లే రోనీ వ్యాలీలోకి వేరే సైట్లలో, లెబనాన్‌లో కూడా దొరికాయి.

అయితే, వీటిని ఏ జాతి మానవులు తయారుచేశారన్నది శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. ఈ పనిముట్లలో చిన్నగా ఉన్నవి బాణాల తలలు కావొచ్చని కొందరు పరిశోధకులు ఊహిస్తున్నారు.

అదే నిజమైతే, ఇదొక కొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది. ఆ కాలంలోనే ఆధునిక మానవులు విల్లు, బాణం వంటి ఆధునాతన ఆయుధాలను ఉపయోగించారంటే, బహుశా వాటి సహాయంతోనే ప్రారంభంలో అంటే 54,000 ఏళ్ల క్రితం నియాండర్తల్స్‌ను జయించి ఉండవచ్చు.

అయితే అది తాత్కాలిక విజయంగా భావించాలి. ఎందుకంటే, నియాండర్తల్స్ మళ్లీ ఆ ప్రాంతానికి తిరిగి వచ్చారు.

ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే, ఆధునిక మానవులు, నియాండర్తల్స్‌ను ఒకేసారిగా తుడిచిపెట్టలేదు.

మరి, చివరకు ఆధునిక మానవులు విజయం సాధించడానికి కారణాలేంటి? వారికి సానుకూలించిన అంశాలేంటి?

పురాతన మానవులలోని చిన్నారి దంతం

ఫొటో సోర్స్, LUDOVIC SLIMAK

ఫొటో క్యాప్షన్, పురాతన మానవులలోని చిన్నారి దంతం

'ఆధునిక మానవులు తెలివైనవారు'

ఆధునిక మానవులకు కళలు, భాషలలో ఉన్న సామర్థ్యం, బహుశా మెరుగైన ఆలోచనలు.. ఇలా అనేక కారణాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, ఆధునిక మానవులు మరింత వ్యవస్థీకృతంగా ఉండడమే వారికి ప్రయోజనం చేకూర్చి ఉండవచ్చని ప్రొఫెసర్ స్ట్రింగర్ విశ్వసిస్తున్నారు.

"మనం అంటే ఆధునిక మానవుల జాతి నెట్‌వర్క్ మెరుగ్గా ఉండేది. మన సాంఘిక సమూహాలు పెద్దవి. మనం సంపాదించిన జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, దాని మీద పునాదులు కట్టుకుంటూ వచ్చాం" అని ఆయన వివరించారు.

ఆధునిక మానవుల్లో నియాండర్తల్స్ డీఎన్ఏ కొంచం కలిసిందని 2010లో కనుగొన్నారు. అంటే, ఈ రెండు జాతుల మధ్య సంతానోత్పత్తి జరిగింది.

వీడియో క్యాప్షన్, ఉదయపు నడక ఆరోగ్యానికి ఎందుకు మంచిది

హోమో సేపియన్లు, నియాండర్తల్స్ కొంతకాలం కలిసి జీవించారని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ రెండు పరిశోధనలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నాయని ప్రొఫెసర్ స్ట్రింగర్ అభిప్రాయపడ్డారు.

"ఈ రెండు జాతుల మధ్య సంపర్కం శాంతియుతంగా జరిగిందో లేదో మనకు తెలీదు. ఒక జాతి స్త్రీని, మరొక జాతి బలవంతంగా లాక్కొని ఉండవచ్చు. లేదా అనాథలుగా మిగిలిపోయిన నియాండర్తల్ పిల్లలను దత్తత తీసుకుని ఉండవచ్చు.

పైవన్నీ కావొచ్చు. వాస్తవంలో ఏం జరిగిందో మనకు తెలీదు. అయితే, మరింత డేటా, మరిన్ని డీఎన్ఏ నమూనాలు, మరిన్ని ఆవిష్కరణలతో మనం వాస్తవాలకు దగ్గర కావొచ్చు. నియాండర్తల్ జాతి ఎలా అంతమైందో కనిపెట్టవచ్చు" అని ఆయన అన్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)