పాకిస్తాన్: మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని తలలో మేకు కొట్టిన భూత వైద్యుడు

ఫొటో సోర్స్, Peshawar Police
ఒక గర్భిణి తలలో మేకు కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూత వైద్యుడి కోసం పాకిస్తాన్ పోలీసులు గాలిస్తున్నారు.
తలలో దిగిన రెండు అంగుళాల మేకును తీసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో ఆ మహిళ పెషావర్‌లోని ఒక ఆస్పత్రికి వెళ్లారు.
మొదట్లో స్వయంగా తానే తన తలలో మేకు కొట్టుకున్నానని ఆ మహిళ చెప్పింది.
కానీ ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఒక భూత వైద్యుడు తన తలలో మేకు కొట్టాడని చెప్పింది.
ఇలా చేస్తే తప్పకుండా మగ పిల్లాడు పుడతాడని భూత వైద్యుడు చెప్పాడని ఆమె వివరించింది.
ఆ మహిళకు సంబంధించిన ఎక్స్‌రే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
''ఆ మహిళ ఆస్పత్రికి వచ్చినప్పుడు స్పృహలోనే ఉంది. కాకపోతే విపరీతమైన నొప్పితో బాధపడుతోంది'' అని లేడీ రీడింగ్ హాస్పిటల్ వైద్యుడు హైదర్ ఖాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Lady Reading Hospital
'మళ్లీ ఆడపిల్ల పుడితే భర్త వదిలేస్తానని బెదిరించాడు'
పొరుగింటి వారి ద్వారా ఆ భూత వైద్యుడి గురించి ఆ మహిళకు తెలిసిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లు స్థానిక పత్రిక పేర్కొంది.
''ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తను మరోసారి గర్భం దాల్చింది. ఆమెకు ఇప్పుడు మూడో నెల.
మరోసారి అమ్మాయి పుడితే వదిలేస్తానని భర్త బెదిరించాడు.
ఈసారి కూడా అమ్మాయే పుడితే తన పరిస్థితి ఏంటని ఆమె భయపడింది.
ఈ క్రమంలో పొరుగింటి వారి ద్వారా భూత వైద్యుడి గురించి ఆమెకు తెలిసింది. దాంతో ఆమె అతని వద్దకు వెళ్లింది'' అని ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
''మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని మాయమాటలు చెప్పి, తలలో మేకు కొట్టి ఒక మహిళ ప్రాణాలతో చెలగాటం ఆడిన భూత వైద్యుడిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు'' పెషావర్ పోలీస్ చీఫ్ ట్వీట్ చేశారు.
అయితే, ఆ మహిళ గురించి తెలుసుకోవడానికి పోలీసులు మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎందుకంటే తలలోని మేకును తీయించుకున్న తర్వాత ఆమె ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని పలుమార్లు ప్రశ్నించారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పెషావర్ పోలీస్ చీఫ్ చెప్పారు.
అలాగే ఆ మహిళ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడి సిబ్బంది పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న విషయంపైనా దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు.
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా వాయువ్య గిరిజన ప్రాంతాల్లో భూత వైద్యులు ఎక్కువగా ఉంటారు.
ఇస్లాంలోని సూఫీ సిద్ధాంతాన్ని వీళ్లు ఆచరిస్తుంటారు. దీన్ని ఇస్లామిక్ మార్మికవాదం అని కూడా అప్పుడప్పుడు అభివర్ణిస్తుంటారు.
ఇస్లాంలోని చాలా శాఖలు వీళ్ల కార్యకలాపాలను నిషేధించాయి.
దక్షిణాసియాలోని కొన్ని పేద దేశాల్లో అమ్మాయి కంటే అబ్బాయే కావాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పు కనిపిస్తున్నప్పటికీ.. సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆడపిల్ల కంటే మగపిల్లాడే మంచిదని ఇప్పటికీ కొందరు భావిస్తారు.
జనంలో ఉన్న ఇలాంటి ఆలోచనలను కొందరు భూత వైద్యులు, మంత్రగాళ్లు అలుసుగా తీసుకుని వారిని దోచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
- అమరావతి: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?
- ‘5 రాష్ట్రాలలో గెలుపు మాదే’ అన్న మోదీ - ఓటమి భయంతోనే పోలింగ్‌కు ముందు ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్న కాంగ్రెస్
- సౌర తుపానులో చిక్కుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు
- పాకిస్తాన్లో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు, దైవదూషణ కేసులో కోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














