Amaravati: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం...
ఆంధ్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన భూములను ఏపీ ప్రభుత్వం తనఖా పెట్టింది. 407 ఎకరాల భూమిని 'ది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (హడ్కో) కి తనఖా రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులు ఫిబ్రవరి 5వ తేదీన ఈ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, దీనిపై అమరావతి రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు.
ప్రభుత్వం మాత్రం నిబంధనలు పాటించినట్టు చెబుతోంది. ఇంతకీ అమరావతిలో ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది.
అమరావతి పనుల్లో కొంత కదలిక
2015లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేకరించిన భూముల్లో 2015 ఆక్టోబర్ లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రైతుల నుంచి సమీకరించిన భూములతో పాటుగా ప్రభుత్వ భూములు కూడా కలిపి 50వేల ఎకరాల పైబడి విస్తీర్ణంలో నగరం నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని కార్యాలయాలను సిద్ధం చేశారు.
తాత్కాలిక అవసరాల కోసం నిర్మించిన సెక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలు 2017లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. తాత్కాలిక హైకోర్టు భవనం కూడా అందుబాటులోకి వచ్చింది.
2019 జనవరి నుంచి కార్యకలాపాలు సాగుతున్నాయి. అప్పటి ప్రభుత్వం తాత్కాలిక కార్యాలయాలుగా చెప్పిన భవనాల్లోనే నేటికీ ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతున్నాయి.
2019 డిసెంబర్ లో ప్రభుత్వం అమరావతి విషయంలో నిర్ణయం మార్చుకున్నట్టు ప్రకటించింది. 2020 జనవరిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మూడు రాజధానుల వైపు అడుగులు వేసింది. వాటిపై పలు అభ్యంతరాలు, అమరావతి ప్రాంతవాసుల ఆందోళనలకు తోడు కోర్టులో కేసులు ఉండడంతో రాజధానుల తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు.
అదే సమయంలో అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దాదాపు 90శాతం పూర్తయిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌తో పాటుగా వివిధ క్యాడర్ సిబ్బంది కోసం నిర్మించిన భవనాలు, ఐఏఎస్ అధికారుల వసతి గృహాలు అర్థాంతరంగా ఆగిపోయాయి.
ఇక ప్రధాన పాలనా కేంద్రం కోసం ప్రారంభించిన పనులు పునాదుల దశలోనే ఆగిపోయాయి.
గత డిసెంబర్‌లో ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేసి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత అమరావతి ప్రాంతంలో కొంత కదలిక కనిపించింది. చిన్నచిన్న పనులకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వుడ్‌వర్క్స్ కొద్దిమేరకు జరిగాయి. అదే సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా సర్వే జరిగింది. రాజధాని భూముల మీదుగా వెళుతున్నందున దాని సర్వే పూర్తి చేశారు. దాంతో అమరావతిలో కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడినట్టుగా కొందరు భావించారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కోసం..
ఏపీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం జగనన్న టౌన్ షిప్పుల నిర్మాణానికి పూనుకుంది. దానికి జనవరిలో శ్రీకారం చుట్టారు. అమరావతి పరిధిలో కూడా సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉన్న భూముల్లో టౌన్‌షిప్ నిర్మాణానికి పూనుకున్నారు.
అందుకు తగ్గట్టుగా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద 145 ఎకరాల్లో వెంచర్ వేశారు. బ్రోచర్లు వేసి బుకింగ్స్ కూడా ప్రారంభించారు. లే అవుట్ సిద్ధం చేసి రిజిస్ట్రేషన్లు చేసేందుకు భూమిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన టౌన్‌షిప్ నిర్మాణ భూములను గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం హడ్కోకి తనఖా పెట్టడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
2016లోనే రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసమంటూ ఆనాటి ప్రభుత్వం రుణం తీసుకుంది. హడ్కో నుంచి రూ.1275 కోట్లు రుణం మంజూరయ్యింది. 145.59 ఎకరాల భూమిని దాని కోసం తనఖా పెట్టింది.
అలా తనఖా పెట్టిన భూమిలో డెవలప్ చేసిన సుమారు 2లక్షల చదరపు గజాల భూమి ఉంది. మరో 102.09 ఎకరాల ఖాళీ భూమి కూడా ఉంది.
ఇప్పుడు ఆ భూమిని లేఅవుట్ చేసి ఫ్లాటులుగా ఎంఐజీ వారికి అమ్మేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. ఇప్పటికే శంకుస్థాపన కూడా చేశారు. ఆ భూములను హడ్కో కి తనఖా పెట్టడంతో వాటిని విడిపించాలని జగన్ ప్రభుత్వం ఆలోచించింది.
దానికి అనుగుణంగానే రాజధాని ప్రాంతంలోనే మరో చోట ఉన్న భూమిని తనఖా పెట్టేందుకు సిద్ధమయ్యింది.

ఈసారి స్టార్టప్ ఏరియా భూములు
హడ్కో నుంచి సీఆర్‌డీఏ మొత్తం రూ.1151 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తం తిరిగి చెల్లించకుండా జగనన్న టౌన్ షిప్ కోసం నవులూరు వద్ద భూమిని తనఖా విడిపించడం సాధ్యం కాదు.
ఇందుకోసం ప్రభుత్వం నవులూరు భూములకు బదులుగా స్టార్టప్ ఏరియాగా గతంలో ప్రకటించిన భూములను సిద్ధం చేసింది. అప్పట్లో 1700 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కన్సార్షియానికి అప్పగించిన భూములను హడ్కోకి తనాఖా పెట్టేందుకు సిద్ధమయ్యింది.
మొత్తం 407 ఎకరాలను తనఖా పెట్టడం ద్వారా గతంలో మంజూరైన రూ. 1275 కోట్ల వరకూ పూర్తి రుణం తీసుకోవడానికి సీఆర్‌డీఏ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది
అనంతవరం, ఉద్దండ రాయునిపాలెం, మందడం గ్రామాల పరిధిలో ఉన్న ఈ భూములను హడ్కోకి తనఖా పెట్టింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసింది.
అంటే 2016లో చేసుకున్న తనఖా ఒప్పందం నవులూరు నుంచి గతంలో ప్రకటించిన స్టార్టప్ భూములకు మార్చినట్టు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. అమరావతిలో కొత్తగా భూములు తనఖా పెట్టలేదని, గతంలో ఉన్న ఒప్పందమేనంటూ సీఆర్డీయే అధికారులు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
‘సీఆర్డీయే ప్రాంత అభివృద్ధికే..’
‘‘పేదలకు స్థలాలు ఇచ్చి ఉంటే అమరావతి ప్రాంతంలో జగనన్న కాలనీలు వచ్చేవి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు టౌన్‌షిప్ కూడా వస్తోంది. ఈ టౌన్‌షిప్ పూర్తిగా నిబంధనల ప్రకారం ఉంటుంది. కాబట్టి మధ్యతరగతికి రియల్ ఎస్టేట్ మోసాల నుంచి ఉపశమనంతో పాటుగా సకల సౌకర్యాలు ఉన్నచోట ప్లాటు వస్తుంది. అందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టుగా భూములను అందుబాటులో ఉంచడం కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు.
సీఆర్డీయే పరిధిలో అమరావతి ప్రాంత అభివృద్ధి జరుగుతుంటే కొందరు సహించలేకపోతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.
‘నిధులు తరలించడానికే..’
''రాజధానిగా ఈ ప్రాంతం పనికిరాదన్నారు. కానీ ఇక్కడ భూములను మాత్రం తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం రుణంగా తీసుకుంటున్న భూములను ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటికి కేటాయించాలి. భూములిచ్చిన రైతులకు ప్లాట్‌లు కేటాయించారు. వాటిని అభివృద్ధి చేయాలి. కనీసం వాటి జోలికి కూడా పోలేదు. రైతులకు ఇచ్చిన స్థలాలను వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం స్థలాలు అమ్ముతామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది'' అని అమరావతి జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష విమర్శించారు.
అమరావతి ప్రాంతంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

‘సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని అప్పుడే చెప్పాం..’
అమరావతి గురించి ఇంతకాలం ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదని హడ్కోతో చేసుకున్న తనఖా ఒప్పందం చాటుతోందని తెలుగుదేశం అంటోంది. అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అప్పట్లో ప్రశ్నించారని, కానీ ఇప్పుడు అమరావతి భూముల నుంచే నిధులు సేకరిస్తున్నారని విమర్శిస్తోంది.
''రాజధాని నిర్మాణానికి నిధులు లేవని ఇంతకాలం వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు టౌన్ షిప్పుల నిర్మాణానికి అమరావతి భూములనే తనఖా పెట్టారు. అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ మా నాయకుడు చెప్పిన మాటలు నిజమన్నట్టే కదా?'' అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు
అమరావతికి ఉన్న వనరులను వినియోగించి నగర నిర్మాణం వేగవంతం చేయాలి. లేదంటే ఈ ప్రభుత్వం అసమర్థతను అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

‘అమరావతి అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. అమరావతి కోసం నిధులు కేటాయించాలంటూ విజయవాడలో నిరసన చేపట్టారు.
''రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లవుతోంది. నిర్ధిష్టంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అమరావతి ప్రాజెక్టు మధ్యలో నిలిపివేయడం సమంజసం కాదు. ప్రతిపక్షంలో ఉండగా తాను మద్ధతిచ్చిన రాజధానిని సీఎం గుర్తు చేసుకోవాలి'' అని ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు అన్నారు.
అమరావతి ప్రాంత అభివృద్ధి కోరుతూ జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:
- మోదీ ఇంటర్వ్యూ: ‘అధికారంలో ఉన్నా లేకున్నా సంక్షేమమే మా విధానం.. 5 రాష్ట్రాలలో గెలుపు మాదే’
- పాకిస్తాన్లో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు, దైవదూషణ కేసులో కోర్టు తీర్పు
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
- ములాయం సింగ్, కాన్షీరాం ఏకమై కల్యాణ్ సింగ్‌ను చిత్తు చేశాక ఏం జరిగింది
- కుష్: యువతను సర్వ నాశనం చేస్తున్న కొత్త మాదక ద్రవ్యం, గొంతు కోసుకుంటున్న బాధితులు
- కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడిని కాపాడిన భారత సైన్యం
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















