కుష్: సియెరా లియోన్‌ను ముంచెత్తుతున్న అక్రమ మాదకద్రవ్యం, గొంతు కోసుకుంటున్న బాధితులు, నిండిపోతున్న మానసిక ఆసుపత్రులు

సియెరా లియోన్‌లో కుష్ మత్తులో యువత

పశ్చిమ ఆఫ్రికా దేశం సియెరా లియోన్‌లో ఓ కొత్త మాదక ద్రవ్యం ప్రజల జీవితాలను నాశనం చేస్తోంది. కుష్ అనే ఆ అక్రమ మాదక ద్రవ్యానికి బానిసలవుతున్న యువత పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఈ మత్తులో జోగుతున్న యువత తమను తాము హింసించుకోవడమే కాకుండా ఇతరులకూ హాని తలపెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం నమోదయ్యాయి.

సియెరా లియోన్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ డ్రగ్‌కు బానిసవుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

రాజధాని ‘ఫ్రీ టౌన్’లోని సెంట్రల్ సైకియాట్రీ వార్డులో చేరుతున్న వారిలో 90 శాతం పురుషులు కుష్ కారణంగానే వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.

దావానలంలా వ్యాపిస్తున్న ‘కుష్‌’కు టీనేజర్లు తేలికైన లక్ష్యంగా మారుతున్నారని బీబీసీ ఆఫ్రికా ఐ రిపోర్టర్ టైసన్ కోంటె చెప్పారు.

ఈ డ్రగ్‌పై సియెరా లియోన్ పోలీసులు చేస్తున్న యుద్ధంలో వారు ఎంతవరకు విజయం సాధించగలరు? అసలు సియెరా లియోన్ ఈ సంక్షోభం నుంచి బయటపడగలదా అనేది ప్రశ్నగా మారింది.

సియెరా లియోన్‌లో కుష్ మత్తులో యువత

ఫొటో సోర్స్, Getty Images

‘ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నాను’

డ్రగ్ బానిసలుగా మారిన యువతను చీకటి ప్రపంచంలోకి నెట్టేస్తోంది కుష్.

దీనికై బానిసలువుతన్న చాలామంది మతి భ్రమించినట్లు ప్రవర్తిస్తూ తామను తామే గాయపర్చుకుంటున్నారు.

కుష్‌కు ఒక్కసారి బానిసలుగా మారితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని బాధితులు చెబుతున్నారు. "నేను చాలాసార్లు కుష్ తీసుకోవడం మానేయాలని, దాని నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించాను. కానీ నావల్ల కావట్లేదు. నేను దీనికి బానిసనైపోయాను'' అని సెక్స్ వర్కర్ ఐషా చెప్పారు. కుష్ బాధితులలో ఆమె కూడా ఒకరు.

కుష్ మత్తులో యువత తమను తాము గాయపర్చుకుంటున్నారు
ఫొటో క్యాప్షన్, కుష్ మత్తులో యువత తమను తాము గాయపర్చుకుంటున్నారు

గొంతు కోసుకుంటున్నారు.. మురుగుకాల్వల్లో పడి దొర్లుతున్నారు

కొందరు బాధితులు డ్రగ్ మత్తులో తమ గొంతు తామే కోసుకుని రక్తంతో ఉన్న వీడియోలు బీబీసీకి దొరికాయి.

మరికొందరు డ్రగ్ తీసుకున్న తర్వాత మురికి కాలువల్లో పడి దొర్లుతున్న దృశ్యాలున్నాయి. చాలా మంది యువకులు అకస్మాతుగా చనిపోతున్నారని బీబీసీ ఆఫ్రికా ఐ రిపోర్టర్ టైసన్ కోంటే చెప్పారు.. ఈ పరిణామాలన్నిటికీ కారణమైన ఈ మాదకద్రవ్యం చాలా చవకగా దొరుకుతుంది.

ఎండబెట్టిన మార్ష్‌మెలో ఆకులను పొడిగా చేసి దానికి కొన్ని రసాయనాలను కలిపి ‘కుష్’ అనే డ్రగ్‌గా అక్రమంగా విక్రయిస్తున్నాయి ముఠాలు. దీన్ని స్పైస్ అని కూడా పిలుస్తారు. దీనికి బానిసలుగా మారి బయటపడలేకపోతున్న బాధితులు తమ దీనావస్థను బీబీసీ రిపోర్టర్‌తో పంచుకున్నారు.

మురుగు కాలువలో

ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో..

కుష్ తీసుకున్నాక ఏం చేస్తున్నామో తెలుసుకోలేని స్థితికి చేరుకుంటారని, ఆ స్థితిలో ఇతరులను గాయపర్చడమో, తమను తాము గాయపర్చుకోవడమో చేస్తున్నామని కుష్ బాధితుడైన టిండెమ్ చెబుతున్నారు.

నిరుద్యోగం కారణంగా, జీవితంలో ఉండే ఒత్తిడి నుంచి బయట పడేందుకు కుష్‌కు బానిసలుగా మారుతున్నారని, తద్వారా నేరాలకు పాల్పడుతున్నారని టిండెమ్ వివరించారు.కుష్ నియంత్రణ కోసం పోలీసు విభాగంతో పాటు ‘లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్’ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

కుష్ వాడకం వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్యల పట్ల స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

బాధితులకు కౌన్సలింగ్ ఇస్తున్నారు. వాళ్లు కుష్ నుంచి బయటపడి తిరిగి తమ సాధారణ జీవితాలు గడిపేలా ప్రోత్సహిస్తున్నారు.

కానీ సియెరా లియోన్‌లోని తీవ్ర నిరుద్యోగ సమస్య, పేదరి కష్టాల నుంచి మానసిక స్వేచ్ఛ కోసం కుష్‌ వాడుతున్నామంటూ ఈ అక్రమ మాదకద్రవ్యానికి బానిసలుగా మారుతున్నారు యువత.

ఇది ఆ దేశానికి పొంచిఉన్న తీవ్ర ప్రమాదంగానే చూడాలని కుష్ నియంత్రణ కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం అధికారి బీబీసీకి తెలిపారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)