యూరప్‌లో పట్టుబడ్డ తొలి నార్కో జలాంతర్గామి: స్మగ్లర్లు సముద్రం అడుగున 27 రోజులు ఎలా గడిపారంటే..?

ఈ స్మగ్లింగ్‌ పై జర్నలిస్ట్ జేవియర్ రొమెరో "ఆపరేషన్ మారియా నెగ్రా" అనే పుస్తకాన్ని రాశారు.

ఫొటో సోర్స్, OSCAR VAZQUEZ

ఫొటో క్యాప్షన్, ఈ స్మగ్లింగ్‌‌పై జర్నలిస్ట్ జేవియర్ రొమెరో "ఆపరేషన్ మారియా నెగ్రా" అనే పుస్తకాన్ని రాశారు.
    • రచయిత, ఐరీన్ హెర్నాండెజ్ వెలాస్కో
    • హోదా, బీబీసీ న్యూస్

లావుగా, కాస్త పొట్టిగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కేవలం ఒకటిన్నర చదరపు మీటర్ల వెడల్పు ఉన్న ఒక డబ్బాలాంటి వాహనంలో సముద్రం అడుగున 27 రోజుల పాటు ప్రయాణించారు.

నీటి అడుగున ప్రయాణిస్తున్న ఆ చిన్న జలాంతర్గామిలో నడవడానికి కూడా సరిపడా స్థలం లేదు. బాత్‌రూమ్‌ నుంచి నీరు బయటకు పోయే ఏర్పాటు కూడా లేదు. ఇందుకోసం ఒక సంచిని వాడారు. క్యాన్డ్ ఫుడ్స్, పేస్ట్రీలు, ఎనర్జీ బార్‌లు, రెడ్ బుల్ డ్రింక్స్ తాగుతూ 27 రోజులపాటు కాలం గడిపారు ఆ ముగ్గురు.

ఈ ఇరుకు వాహనంలో ప్రయాణం కారణంగా వాళ్ల చర్మంపై చాలా చోట్ల దద్దుర్లు వచ్చాయి. నిత్యం ఉక్కపోతతో తడిచినట్లుగా ఉన్న దుస్తులను రోజుల తరబడి వాడటమే ఇందుకు కారణం. వీళ్లు బయటకు చూడటానికి చిన్నచిన్న కిటికీలు మాత్రమే ఉన్నాయి.

ఈ ముగ్గురూ 2019 అక్టోబరు-నవంబర్ నెలల్లో అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ నుండి యూరప్ వరకు దాదాపు 3,500 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించారు. ఇందుకోసం వారు ఫైబర్ గ్లాస్‌తో తయారు చేసిన జలాంతర్గామిని వాడటం, సక్సెస్‌ఫుల్‌గా తీరాన్ని చేరడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

వీరు వెళ్లాల్సిన రూట్‌ను ట్రాక్ చేయడానికి జలాంతర్గామిలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. డాష్‌ బోర్డులో కేవలం ఒక శాటిలైట్‌ ఫోన్, దిక్సూచి మాత్రమే ఉన్నాయి.

ఈ ప్రయాణంలో వారు తీవ్రమైన తుపానులు, భీకరమైన అలలు, జలాంతర్గామిని ధ్వంసం చేయగల అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఓ సందర్భంలో వారు ఓ ఓడను ఢీ కొట్టబోయారు కూడా. ఒక దశలో తాము చనిపోయినట్లేనని వారు భావించారు.

పట్టుబడ్డ డ్రగ్స్ జలాంతర్గామి ఇదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పట్టుబడ్డ డ్రగ్స్ జలాంతర్గామి ఇదే

సుదూరాలకు ప్రయాణం

ఈ ముగ్గురి లక్ష్యం 3,068 కిలోల కొకైన్‌ను యూరప్‌కు రవాణా చేయడం. వారు ఈ లక్ష్యాన్ని దాదాపు సాధించారు. డ్రగ్ స్మగ్లింగ్ నిరోధంపై పట్టు సాధించిన పోలీసులను, ఇంటెలిజెన్స్ బలగాల కన్నుగప్పగలిగారు. కానీ చివర్లో దొరికి పోయారు.

లాటిన్ అమెరికా నుండి ఐరోపాకు వచ్చిన మొదటి నార్కో-సబ్‌‌మరీన్‌ను స్వాధీనం చేసుకోవడానికి "బ్లాక్ టైడ్" అనే పోలీసు ఆపరేషన్‌ జరగడంతో వారి ప్లాన్‌లు పారలేదు. ముగ్గురూ పట్టుబడ్డారు. వీరిపై ఇప్పుడు స్పెయిన్‌లో న్యాయ విచారణ జరుగుతోంది. ముగ్గురూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.

ఈ కేసులో తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ముగ్గురికి 12 నుంచి 13 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

జర్నలిస్ట్ జేవియర్ రొమెరో దీని గురించి ''ఆపరేషన్ మారియా నెగ్రా'' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో, ఈ ముగ్గురు వ్యక్తుల ప్రయాణం గురించి వివరంగా చెప్పారు.

ఈ పుస్తకం రాసే క్రమంలో పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించారు జర్నలిస్ట్ జేవియర్ రొమెరో.

ఇందులో "చే" అనే పేరున్న ఈ జలాంతర్గామి చరిత్రను వివరంగా చెప్పారు.

ఆపరేషన్ మారియా నెగ్రా పుస్తకం

ఫొటో సోర్స్, EDITIONS B

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్ మారియా నెగ్రా పుస్తకం

నీటి అడుగున రవాణా

1990లలో కొలంబియాలో నార్కో-సబ్‌‌మరీన్‌ల వాడకం మొదలైంది. సోవియట్ యూనియన్‌ మాజీ సైనికులు, ఇంజినీర్లు నిర్మించేవారు. కొలంబియాలో పేరుమోసిన మాఫియా లీడర్ పాబ్లో ఎస్కోబార్ వీటిని తయారు చేయించేవారు. ఆయన నౌకాదళంలో రెండు జలాంతర్గాములు కూడా ఉండేవన్న విషయాన్ని ఎప్పుడూ దాచలేదు.

''మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఆపడానికి పని చేస్తున్న నిపుణులు అట్లాంటిక్ డ్రగ్ స్మగ్లర్లు నార్కో జలాంతర్గాములను వాడుతున్నారని చెబుతూనే ఉన్నా, 'చే' పట్టుబడే వరకు, అది కేవలం ఒక అనుమానం మాత్రమే'' అన్నారు రొమెరో.

ఈ జలాంతర్గామిని అమెజాన్ సమీపంలోని ఓ సీక్రెట్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు. దీనిని నడిపే బాధ్యతను మాజీ స్పానిష్ బాక్సింగ్ ఛాంపియన్ అగస్టిన్ అల్వారెజ్ కి అప్పగించారు. మిగిలిన సిబ్బందిలో ఇద్దరు ఈక్వెడార్ సోదరులు. వీరు వృత్తిరీత్యా నావికులు. వీరి పేర్లు బెనిటెజ్ మంజాబ, డెల్గాడో మంజాబ.

వీడియో క్యాప్షన్, పుష్ప సినిమా రియల్ స్టోరీ... ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందంటే

ఈ జలాంతర్గామిని నడపడానికి మంజాబ సోదరులిద్దరూ ముందుగానే చెరి 5 వేల డాలర్లు అందుకున్నారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయితే, ఇద్దరికీ చెరి 50 వేల డాలర్ల( రూ. 37 లక్షలు)కు పైగా వచ్చేవి.

అయితే, అగస్టిన్ అల్వారెజ్‌కు ఎంత అందుతుందన్నది తెలియరాలేదు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, అల్వారెజ్ దాదాపు 4 నుండి 5 మిలియన్ల డాలర్లు( సుమారు రూ. 37కోట్లు) పొందవలసి ఉంది.

స్పెయిన్ హోం శాఖ ఈ నార్కో-జలాంతర్గామి ద్వారా రవాణా చేసిన కొకైన్ ధర సుమారు 123 మిలియన్ యూరోలు(సుమారు రూ. 1000 కోట్లు)గా అంచనా వేసింది.

ముగ్గురు సిబ్బంది, 3,068 కిలోల కొకైన్‌ను 152 ప్యాకెట్లుగా విభజించి, అక్టోబర్ 29, 2019 రాత్రి కొలంబియా నుండి బయలుదేరారు.

సబ్‌‌మరీన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సబ్‌‌మరీన్‌

ప్రయాణం ప్రారంభం

జలాంతర్గామి తొలి 12 గంటలు అమెజాన్ నదిలో ఉండిపోయింది. అయితే, ఈ నార్కో-సబ్‌‌మరీన్‌కు ఒక ఓడ ముందుగా దారి చూపుతూ వెళ్లి ఉంటుందన్న వాదన కొట్టిపారేయలేనిది. ఎందుకంటే అమెజాన్ నదిలో అనేక అవాంతరాలను తప్పించుకుంటూ అట్లాంటిక్ వరకు జలాంతర్గామిని తీసుకెళ్లడం సాధ్యంకాదు.

''వాళ్లకు ఎలాంటి రక్షణ లేదు. ప్రకృతి కారణంగా ప్రమాదంలో చిక్కుకోవచ్చు. లేదంటే అధికారులకు దొరికిపోవచ్చు. అంతా వారి అదృష్టం మీద ఆధారపడి ఉంది'' అన్నారు రొమెరో.

నవంబర్ 7 నుంచి జలాంతర్గామి అనుకున్న ప్రదేశానికి చేరేనాటికి మూడు భారీ తుపానులను ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక దశలో జలాంతర్గామి దెబ్బతిన్నది. మునిగిపోయే ప్రమాదంలో చిక్కుకుంది. 8 రోజుల పాటు సాగిన ఈ తుపానులు జలాంతర్గామిలోని ఆ ముగ్గురికి పీడకల లాంటివి. 14వ తేదీనాటికి వాతావరణం ఉపశమనం కలిగించింది.

అయితే, అట్లాంటిక్‌లో డ్రగ్స్‌ను దాటించే సమయంలో ఇంతకు ముందులాగా కాకుండా, మాదక ద్రవ్యాలతో పాటు సబ్‌‌మరీన్‌లో బంధించి ఉంచలేదు.

''ఇంతకు ముందు నిర్దేశిత గమ్యస్థానానికి చేరుకునేదాకా తెరుచుకోకుండా జలాంతర్గాములను లాక్ చేసే వారు. దీనివల్ల వాళ్లు ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చేది. డ్రగ్స్ రవాణా చేసే వారిపై నమ్మకం లేక ఇలా చేసేవారు. దీనివల్ల వారు గమ్యస్థానం చేరడానికి ముందే డ్రగ్స్‌ను దొంగిలించ లేరు'' అని సిబ్బందిలో ఒకరు వెల్లడించారు.

సముద్రంలో ప్రయాణం ప్రారంభమైన 17 రోజుల తర్వాత, అట్లాంటిక్ మీదుగా 4,931 కి.మీ ప్రయాణం తర్వాత, "చే" జలాంతర్గామి ఎట్టకేలకు లక్ష్యాన్ని (అజోర్ ద్వీపం) చేరుకోగలిగింది.

ముగ్గురు సిబ్బంది అక్కడికి ఉత్తరంగా ఓ ప్రాంతానికి డ్రగ్స్‌ను చేర్చాల్సి ఉంది.

"చే" లిస్బన్ నుండి నేరుగా 270 మైళ్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి చేరుకోగలిగింది. కానీ, చివర్లో వారు సక్సెస్ కాలేకపోయారు. అదృష్టం ఏంటంటే, సిబ్బంది ముగ్గురూ క్షేమంగా ఉన్నారు. సరైన ఆహారం లేకపోవడం, చమట కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతింది.

జర్నలిస్ట్ రొమెరో

ఫొటో సోర్స్, JAIME OLMEDO

ఫొటో క్యాప్షన్, జర్నలిస్ట్ రొమెరో

అసలు సమస్యలు మొదలు

అయితే, ఈ డ్రగ్స్‌ను తీసుకెళ్లే రెండు బోట్లలో ఒకటి టెక్నికల్ సమస్యలతో ఈ ప్రాంతానికి చేరుకోలేదు. స్పానిష్ పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న సంస్థ "చే" సిబ్బందిని గలీసియాకు వెళ్లమని కోరింది. దీంతో పైలట్ అగస్టిన్ జలాంతర్గామిని గలీసియాకు మళ్లించారు.

''గలీసియాలో డ్రగ్స్ పంపిణీ వ్యాపారం విస్తృతంగా ఉంది. ఈ పని చేసేవారిని 'నార్కోలాంచెరోస్' అంటారు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల ప్రణాళికలు ఫెయిలవడంతో అగస్టిన్ ప్లాన్-బి అమలు మొదలు పెట్టారు. తన ఇద్దరు స్నేహితులను సంప్రదించారు.

అయితే, అప్పటికే సముద్రంలో అనేక టన్నుల కొకైన్‌తో కూడిన పడవ ఉన్నట్లు డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పర్యవేక్షించే మారిటైమ్ అనాలిసిస్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ అనుమానించింది.

''అధికారులు సముద్రం, వాయు మార్గాల ద్వారా కొకైన్ ఉన్న పడవ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ, వారు జలాంతర్గామిని గుర్తించలేకపోయారు. చేపలు పట్టే పడవలు, కార్గో షిప్‌లు, బోట్‌ల కోసం వెతుకుతున్న వారికి సెమీ సబ్‌మెర్సిబుల్ గురించి తెలియదు'' అని రొమెరో అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇది రాయి కాదు.. వజ్రం - దీని ధర రూ.37 కోట్లు

కొకైన్‌ను దించేందుకు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ, అగస్టీన్ కోస్టా డా మోర్టే అనే చిన్న బోటును దక్షిణాన గలీసియాకు పంపాడు. స్పానిష్ సివిల్ గార్డ్ ఈ విషయం తెలుసుకుంది. పోలీసులు వెంటాడుతున్నారన్న విషయం తెలియగానే, అగస్టీన్ సరుకు చేరవేతను నిలిపేసి తిరిగి జలాంతర్గామిని సముద్రం అడుగుకు తీసుకెళ్లారు.

వాతావరణం సరిగా లేకపోవడంతో పోలీసులు సబ్‌‌మరీన్‌ను గుర్తించ లేకపోయారు. ఆహారం, నీరు లేకపోవడంతో ఇబ్బంది పడిన 'చే' సిబ్బంది, గలీసియా తీరంలో ఉన్న రియాస్ బైక్సాస్‌ అనే ప్రాంతానికి సబ్‌‌మరీన్‌ను మళ్లించాలని నిర్ణయించుకున్నారు. పైలట్ అగస్టీన్‌కు ఆ ప్రాంతం బాగా తెలుసు.

''డ్రైవర్ అగస్టిన్ తన నైపుణ్యంతో నావిగేషన్‌కు కష్టతరమైన ప్రాంతానికి జలాంతర్గామిని తీసుకు రాగలిగాడు. సముద్రంలో 8 మీటర్ల లోతులో జలాంతర్గామిని ఆపాడు" అని రొమెరో వివరించారు.

కొలంబియాలో డ్రగ్స్ స్మగ్లింగ్‌ కు సబ్‌‌మరీన్‌ల వాడకం సర్వసాధారణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొలంబియాలో డ్రగ్స్ స్మగ్లింగ్‌ కు సబ్‌‌మరీన్‌ల వాడకం సర్వసాధారణం

ముంచేశారు...

పోలీసులకు దొరికిపోతామని భయపడిన స్మగ్లర్లు మరో ఐడియా అమలు చేశారు. జలాంతర్గామిని అక్కడే నీళ్లలో ముంచేసి, తాము తప్పించుకు పోవాలని నిర్ణయించారు. తర్వాత పోలీసులు నిఘా తగ్గిన తర్వాత డ్రగ్స్ తీసుకెళ్లవచ్చన్నది వారి ఆలోచన. నవంబర్ 24వ తేదీ ఉదయం జలాంతర్గామిలోకి నీళ్లు వదిలారు.

తర్వాత జలాంతర్గామి నుంచి బైటపడ్డారు. అయితే, వారు అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. బెనిటెజ్ మంజాబను పోలీసులు పట్టుకున్నారు. తర్వాత డెల్గాడో మంజాబ కూడా దొరికిపోయారు. పైలట్ అగస్టీన్‌ను 5 రోజుల తర్వాత పోలీసులు అతని ఇంట్లోనే అరెస్టు చేశారు.

స్పెయిన్ కోర్టులో కొనసాగుతున్న విచారణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్పెయిన్ కోర్టులో కొనసాగుతున్న విచారణ

శిక్ష కోసం ఎదురు చూస్తున్న నిందితులు

''అనేక అవాంతరాలు ఎదురైనా వారు సజీవంగా స్పెయిన్‌కు ఎలా చేరుకోగలిగారన్నది ఆశ్చర్యంగా ఉంది'' అని డ్రగ్స్‌తో కూడిన జలాంతర్గామిని పట్టుకున్న పోలీసు అధికారి సార్జెంట్ బసంతే అన్నారు.

''నేను కూడా జలాంతర్గామి లోపలికి వెళ్లాను. లోపల ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించింది. 27 రోజులు దానిలో ఉండడం సిబ్బందికి మానసిక హింసలా అనిపించి ఉంటుంది'' అన్నారు రొమెరో.

భద్రతా బలగాలు 152 కొకైన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి. అగస్టిన్, మంజాబ సోదరులను అరెస్టు చేశారు. వారు ఇప్పుడు శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి సహకరించిన మరో నలుగురు కూడా శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే, కొకైన్‌ ను స్మగ్లింగ్ చేయించిన వ్యక్తులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)