దక్షిణాఫ్రికా నుండి నెదర్లాండ్స్‌కు 11 గంటల పాటు విమాన చక్రాల్లో దాక్కుని ప్రయాణించిన ఓ వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

విమాన చక్రాలు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికా నుండి నెదర్లాండ్స్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిపోల్ విమానాశ్రయంలో దిగిన విమానచక్రాల్లో దాక్కుని ప్రయాణించిన వ్యక్తిని ప్రాణాలతో గుర్తించినట్లు డచ్ పోలీసులు తెలిపారు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి విమాన ప్రయాణానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. అయితే ఈ కార్గో విమానం కెన్యాలోని నైరోబీలో ఒకసారి ఆగిందని సమాచారం.

ఎత్తైన ప్రదేశాలలో అతిభయకరమైన చలితో పాటు తక్కువ ఆక్సిజన్ ఉండటం కారణంగా సుదీర్ఘంగా విమాన చక్రాల్లో దాక్కుని ప్రయాణం చేయడం అసాధారణమైన సంఘటన.

ఆ వ్యక్తి వయసు, ఏ దేశస్థుడో ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

'విమానం ముందు చక్రాల విభాగంలో ఆ వ్యక్తి సజీవంగా కనిపించాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నపుడే ఆసుపత్రికి తరలించబడ్డాడు' అని రాయల్ డచ్ మిలిటరీ పోలీస్ ప్రతినిధి జోవన్నా హెల్మండ్స్ ఎఎఫ్‌పి వార్తా సంస్థకు తెలిపారు.

'అతను ఇంకా బ్రతికి ఉండటం చాలా గొప్ప విషయం ' అని ఆమె చెప్పింది.

సంఘటన స్థలంలో ఆ మనిషి శరీర ఉష్టోగ్రత పెరిగిందని, అంబులెన్స్ వచ్చే సమయానికి అతను ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగాడు అని డచ్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌ఓఎస్ పేర్కోంది.

కార్గోలక్స్ ఇటాలియా నడుపుతున్న విమానచక్రాల్లో దాక్కుని ఓవ్యక్తి ప్రయాణించాడని సరుకు రవాణా సంస్థ కార్గోలక్స్ ప్రతినిధి రాయిటర్స్‌కి పంపిన ఇమెయిల్‌లో ధృవీకరించారు.

ఫ్లైట్ డేటా ప్రకారం, ఆదివారం జోహన్నెస్‌బర్గ్ నుండి స్కిపోల్ వెళ్లే ఏకైక కార్గోలక్స్ సరుకు రవాణా విమానం కూడా నైరోబీలో ఆగింది. ఆ వ్యక్తి దక్షిణాఫ్రికాలో లేదా కెన్యాలో ఎక్కడ విమానం ఎక్కాడో తెలియరాలేదు.

ల్యాండింగ్ గేర్ ప్రాంతం ఎలా ఉంటుందో చూపిస్తున్న బీబీసీ ప్రతినిధి రాబ్ వాకర్ (పాత చిత్రం)
ఫొటో క్యాప్షన్, ల్యాండింగ్ గేర్ ప్రాంతం ఎలా ఉంటుందో చూపిస్తున్న బీబీసీ ప్రతినిధి రాబ్ వాకర్ (పాత చిత్రం)

ఎందుకంత ప్రమాదకరం?

విమానం భూమి మీద ఉన్నంతసేపు చక్రాలు బయట ఉంటాయి. గాలిలోకి ఎగిరిన తర్వాత చక్రాలు విమానం లోపలికి వెళ్లిపోతాయి. చక్రాలు లోపల ఉండే ప్రాంతాన్ని 'ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్' అంటారు.

చక్రాల పక్కనుంచి లోపలికి వెళ్లి ఆ ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో దాక్కుంటే ఎవరికీ తెలియకుండా ప్రయాణించొచ్చని ఆయన భావించి ఉంటారు. అయితే, ఆ ప్రాంతంలో దాక్కోవడం అత్యంత ప్రమాదకరమని, విమానం టేకాఫ్ అయిన తర్వాత చక్రాలు లోపలికి వెళ్లగానే వాటి మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంటుందని విమానయాన రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్టు డేవిడ్ లర్న్‌మౌంట్ అంటున్నారు.

ఒకవేళ చక్రాల మధ్య నలిగిపోకుండా జాగ్రత్తపడినా, ఎండలు బాగా ఉండే రోజుల్లో విమానం బ్రేకులు బాగా వేడెక్కుతాయి. ఆ వేడిని తట్టుకోవడం సాధారణ విషయం కాదు.

ఈ రెండింటి నుంచి తప్పించుకున్నా, విమానం గాలిలో బాగా ఎత్తుకు ఎగిరిన తర్వాత హైపోథెర్మియా‌కు గురవుతారు, ఆక్సిజన్ సరిపోదు. గాలి పీడనం తగ్గిపోతుంది.

విమానం క్యాబిన్‌లో పీడనాన్ని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఆక్సిజన్ సరైన మోతాదులో అందేందుకు కృత్రిమ ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో పరిస్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఆక్సిజన్ కొరత వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

అందుకే అలా ప్రయాణించేవారిలో దాదాపు ఎవరూ ప్రాణాలతో బయటపడరు. ఒకవేళ ఆ సమస్యలను తట్టుకోగలిగినా, విమానం ల్యాండ్ అయ్యేవరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

విమానాశ్రయం సమీపించగానే, చక్రాలు బయటకు వచ్చేందుకు కిందివైపున ఉండే ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ ద్వారాలు తెరుచుకునే సమయంలో కిందపడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, లోపల ఉన్నవారికి "విమానాశ్రయం ఇంకా ఎంత దూరంలో ఉంది? చక్రాలు బయటకు ఎప్పుడు వెళ్తాయి?" అనేది తెలుసుకోవడం కష్టం.

"అందుకే, అలా రహస్యంగా ప్రయాణించేందుకు ప్రయత్నించేవారిలో చాలామంది ఎప్పుడో మధ్యలోనే చనిపోతారు లేదా స్పృహ కోల్పోతారు. విమానాశ్రయం సమీపిస్తున్నప్పుడు కింది ద్వారాలు తెరుచుకోగానే కిందపడిపోతారు" అని లర్న్‌మౌంట్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)