Karnataka Hijab: ‘తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మతపరమైన వస్త్రధారణ వద్దు’, విచారణ ఫిబ్రవరి 14కి వాయిదా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు గురువారం వాదనలు విన్న తరువాత విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది.
చీఫ్ జస్టిస్ రితు రాజ్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్నది.
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరిస్తామని పట్టుపట్టొద్దని కోర్టు సూచించింది.
విద్యాసంస్థలు తిరిగి తెరిచేలా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంతకుముందు బుధవారం నాడు విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ అంశాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు రిఫర్ చేసింది. హిజాబ్ ధరించడం రాజ్యంగం తమకు కల్పించిన హక్కంటూ ఉడిపిలోని ఓ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్ధినులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం నాడు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విద్యార్ధినుల తరఫున ప్రముఖ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదిస్తున్నారు.
స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు
కర్ణాటకలో హిజాబ్ వివాదం విద్యాసంస్థలలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.
ఈ వివాదానికి సంబంధించిన కేసును కర్ణాటక హైకోర్టు ఓ వైపు విచారిస్తుండగానే మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైకోర్టులో విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.
ఈ హిజాబ్ వివాదం నేపథ్యంలో చెలరేగిన హింస కోస్తా జిల్లాల నుంచి ఉత్తర కర్ణాటకకూ పాకింది.
ఈ రోజు విచారణ సందర్భగా న్యాయమూర్తి ''అందరూ శాంతియుతంగా ఉండాలి'' అని కోరారు.

ఫొటో సోర్స్, Umesh Marpally
బాగల్‌కోట్, శివమొగ్గలలో రాళ్ల దాడులు
విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై వివాదం కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఒకవైపు స్కూళ్లు కాలేజీల్లో హిజాబ్ ధరించవచ్చా లేదా అనే అంశంపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ ప్రారంభించగా.. మరోవైపు రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు, వారి సంరక్షకుల మధ్య రాళ్ల దాడి జరిగింది.
బాగల్‌కోట్ జిల్లాలోని శివమొగ్గ, బన్నహట్టిల్లో ఒక ప్రైవేటు కాలేజీలో రాళ్ల దాడుల ఘటనలు జరిగాయని, పోలీసులు వెంటనే విద్యార్థులను చెదరగొట్టారని వార్తలు వచ్చాయి.
ఉడిపిలోని ఒక ప్రైవేటు కాలేజీలో హిజాబ్ ధరించిన ఒక వర్గం విద్యార్థులకు, కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, నినాదాలు జరగటంతో.. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఆ కాలేజీని మూసివేశారు.
శివమొగ్గ, బన్నహట్టిల్లో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య నినాదాలు, వాగ్వాదం ముదిరి రాళ్లదాడికి దారితీసింది. కాలేజీ వెలుపల ఉంచిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు రాయి విసరటం ఒక వీడియోలో కనిపించింది.
‘‘బన్నహట్టిలో పరిస్థితి అదుపులో ఉంది’’ అని బాగల్‌కోట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేశ్ బి జగలాసర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Umesh Marpally
ఉడిపిలోని ఎంజీఎం కాలేజీలో.. మంగళవారం ఉదయం ముందుగా హిజాబ్ ధరించిన కొందరు విద్యార్థినులు కాలేజీ ఆవరణలోకి వచ్చారు. అయితే.. కొద్దిసేపటికి కాషాయ తలపాగాలు, పైకండువాలు ధరించిన విద్యార్థులు కాలేజీ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతుండటంతో.. ఆ తర్వాత హిజాబ్ ధరించిన విద్యార్థినులను కాలేజీ లోపలికి అనుమతించలేదు.
‘‘ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని హిజాబ్‌తో కాలేజీకి అనుమతించారు. ఇప్పుడు అకస్మాత్తుగా మమ్మల్ని కాలేజీలో లేడీస్ రూంకి వెళ్లటానికి కూడా అనుమతించబోమని మాకు చెప్పారు’’ అని హిజాబ్ ధరించిన ఒక విద్యార్థిని తెలిపారు.
కాషాయ కండువా ధరించిన మరో విద్యార్థిని ఒక కన్నడ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ‘‘మేం ఏకరూపత మాత్రమే కోరుతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ మేం కాషాయ కండువాలు ధరించలేదు’’ అని చెప్పారు.
విద్యార్థులు పోటీపడి నినాదాలు చేస్తుండటంతో.. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకూ కాలేజీని మూసివేస్తున్నట్లు కాలేజి ప్రిన్సిపల్ డి.దేవదాస్ భట్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Umesh Marpally
‘‘ఇవన్నీ చిన్నపాటి సంఘటనలు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది’’ అని ఏడీజీపీ ప్రతాప్ రెడ్డి బీబీసీ హిందీతో చెప్పారు.
ఇదిలావుంటే.. ‘శాంతిభద్రతల’ రీత్యా హిజాబ్ ధరించటాన్ని నిషేధిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద కర్ణాటక హైకోర్టులో జస్టిస్ కృష్ణ దీక్షిత్ విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:
- రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?
- ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













