కర్ణాటకలో హిజాబ్‌పై ముదురుతున్న వివాదం, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేసిన ప్రభుత్వం

హిజాబ్ ధరించడం మా హక్కు అని కొందరు ముస్లి విద్యార్థినిలు వాదిస్తున్నారు

ఫొటో సోర్స్, UMESH MARPALLY/BBC

ఫొటో క్యాప్షన్, హిజాబ్ ధరించడం తమ హక్కు అని కొందరు ముస్లిం విద్యార్థినిలు వాదిస్తున్నారు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతోంది. మరోవైపు, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలిచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

మంగళవారం కర్ణాటక హైకోర్టులో ఈ అంశంపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

గత నెల కర్ణాటకలోని కొన్ని కాలేజీల్లో ముస్లిం బాలికలు క్లాసురూములో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే.

తరువాత, ఈ అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. హిజాబ్ ధరించకుండా తమను ఆపలేరంటూ పిటిషన్లలో పేర్కొన్నారు.

హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ కాషాయ కండువాలు ధరించి ర్యాలీ చేపట్టిన విద్యార్థులు

ఫొటో సోర్స్, UMESH MARPALLY

ఫొటో క్యాప్షన్, హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ కాషాయ కండువాలు ధరించి ర్యాలీ చేపట్టిన విద్యార్థులు

ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఏముంది?

యూనిఫాంకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో రెండు విధానాలను పేర్కొంది.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో యూనిఫాం ఎలా ఉండాలనేది కళాశాల అభివృద్ధి కమిటీలు నిర్ణయిస్తాయి. అసలు యూనిఫాం అవసరమా, కాదా అనేది ప్రైవేట్ సంస్థలు నిర్ణయించుకోవచ్చు.

"ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాం. మా నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో నివేదిస్తారు" అని కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రి బీసీ నగేష్ బీబీసీతో చెప్పారు.

"మొదటగా, విద్యార్థులకు యూనిఫాం నిర్ణయించే హక్కు ప్రతీ విద్యా సంస్థకు ఉంటుందని కర్ణాటక విద్యా చట్టంలోని రూల్ నంబర్ 11 స్పష్టం చేస్తోంది. రెండవది, యూనిఫాంతో పాటు ఏమి ధరించవచ్చు, ఏది ధరించ కూడదు అనే విషయాలకు సంబంధించి బాంబే హైకోర్టు, సుప్రీం కోర్టులు గతంలో అనేక తీర్పులిచ్చాయి" అని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా, కేరళ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎ మహ్మద్ ముస్తాక్ తీర్పును ఉదహరించారు.

"ఆశా రంజన్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం, ఇతరుల (2017 4 SCC397) కేసులో సుప్రీం కోర్టు ఇలా చెప్పింది. హక్కుల విషయంలో వివాదాలు వచ్చినప్పుడు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి" అని ఆ తీర్పులో చెప్పారు.

"విద్యార్థులు, సంస్థల మధ్య వివాదం వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమస్యలను పరిష్కరించాలి" అని జస్టిస్ ఎ మహ్మద్ ముస్తాక్ చెప్పారని నగేష్ తెలిపారు.

కాషాయ కండువాలతో కాలేజీకి వచ్చిన విద్యార్థులు

ఫొటో సోర్స్, UMESH MARPALLY/BBC

ఫొటో క్యాప్షన్, కాషాయ కండువాలతో కాలేజీకి వచ్చిన విద్యార్థులు

కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు

కొద్ది రోజుల క్రితం, ఉడిపి జిల్లాలో ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడాన్ని వ్యతిరేకిస్తూ, మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని కాలేజీలకు వచ్చారు.

అలాంటి సంఘటనే మళ్లీ శనివారం చోటుచేసుకుంది. ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లో ఉన్న భండార్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన విద్యార్థులు మొదట కాలేజీ గేటు బయట గుమికూడారు. తరువాత, కాషాయ కండువాలు ధరించి కాలేజీలోకి ప్రవేశించారు.

మరో ప్రయివేటు కళాశాల ఆర్‌ఎన్‌ శెట్టి కాలేజీలో నిర్వాహకులు విద్యార్థులను ఆపి బ్యాగులను తనిఖీ చేశారు. చాలామంది బ్యాగుల్లో కాషాయ కండువా కనిపించింది. వాటిని బయటకు తీయించారు.

హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టిన విద్యార్థులను కాలేజీ క్యాంపస్ విడిచి వెళ్లిపొమ్మని అధికారులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘ఈ ముసుగులు మాకు ఊపిరాడనివ్వవు..’

వివాదం ముందరడంతో కాలేజీలకు సెలవు

ఈ వివాదం నేపథ్యంలో కుందాపూర్ ప్రభుత్వ కళాశాల వంటి కొన్ని కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు.

కొన్ని ప్రయివేటు కాలేజీలు ముందే సెలవులు ప్రకటించాయి. కొన్ని సంస్థలు మంగళవారం వరకూ కాలేజీలను మూసి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపాయి.

"ఇది సున్నితమైన అంశం. దీని కారణంగా మా తాలూకాలో నాలుగైదు కాలేజీలు మూతబడ్డాయి. కాలేజీల్లో హిజాబ్ లేదా కాషాయ కండువాలను అనుమతించేది లేదని హోం మంత్రి (అరగా జ్ఞానేంద్ర), మాధ్యమిక విద్యా శాఖ మంత్రి (నగేష్ బీసీ) స్పష్టం చేశారు" అని కుందాపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే హలాడి శ్రీనివాస్ శెట్టి బీబీసీతో అన్నారు.

హిజాబ్ కేసుపై హైకోర్టులో విచారణ

మంగళవారం కర్ణాటక హైకోర్టులో హిజాబ్ కేసుపై విచారణ జరగనుంది.

హిజాబ్ ధరించడం తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఉడిపిలోని ప్రభుత్వ పీయూ మహిళా కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు పిటిషన్ దాఖలు చేశారు.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) మధ్య వివాదం

ఇదిలా ఉండగా, మరోవైపు ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి మధ్య హిజాబ్ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది.

హిజాబ్ ధరించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం విద్యార్థుల విద్యాహక్కును కాలరాస్తోందని సిద్ధరామయ్య అన్నారు.

"బేటీ బచావో, బేటీ పడావో నినాదాలకు బదులు బేటీ హటావో నినాదాన్ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేపట్టాలని" కుమారస్వామి అన్నారు.

గత కొన్నేళ్లలోనే ముస్లిం అమ్మాయిలు చదువుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ హిజాబ్ వివాదం తీసుకొచ్చి వారిని మళ్లీ చదువుకు దూరం చేస్తున్నారని ఆయన అన్నారు.

"ఇంతకుముందు ఎలా ఉందో అలాగే కొనసాగించడం మేలు. గతంలో హిజాబ్ ధరించడానికి అనుమతించిన కాలేజీలో ఆ పద్ధతే కొనసాగించాలి. అనుమతి లేని కాలేజీలలో అదే విధానాన్ని పాటించాలి" అని కుమారస్వామి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)