కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ రంగంలో సమస్యలకు పరిష్కారం చూపగలవా

పురుగుల మందులు జల్లడం, ఏరియా సర్వే చేయడం లాంటి పనులన్నీ డ్రోన్లు చేయగలవు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పురుగుల మందులు జల్లడం, ఏరియా సర్వే చేయడం లాంటి పనులన్నీ డ్రోన్లు చేయగలవు
    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

ఒక పంట వేసి, దాని కోత కోసేవరకూ రైతులకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకసారి పురుగు పట్టి పంట నష్టపోతే, మరోసారి అకాల వర్షాలు పంటను మింగేస్తాయి.

టెక్నాలజీ అభివృద్ధి చెంది “ప్రెసెషన్ ఫార్మింగ్” (వ్యవసాయంలో అనవసర వ్యయప్రయాసలు తగ్గించడం) మొదలైనా, చాలా మంది భారతీయ రైతులకు ఆ టెక్నాలజీ అందుబాటులో లేదు.

ఈ ఏడాది బడ్జెట్‌లో “కిసాన్ డ్రోన్స్” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం హర్షించదగ్గ విషయం.

దేశీ, విదేశీ టెక్నాలజీ కంపెనీలు అగ్రి డ్రోన్స్ మీద కొంతకాలంగా పనిచేస్తున్నాయి. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ మొదలైన సంస్థలు అనేక పరిశోధనలు చేపడుతున్నాయి.

బడ్జెట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం వీటికి ఆమోదాన్ని ఇచ్చిన నేపథ్యంలో, డ్రోన్స్ వ్యవసాయంలో ఎలా సహాయపడగలవో చూద్దాం.

వీడియో క్యాప్షన్, అవకాడో: ఇవి పండ్లు కాదు.. పచ్చ బంగారం..

డ్రోన్లు అంటే ఏంటి? ఎప్పట్నుంచి ఉన్నాయి?

ఏదన్నా ఎయిర్‍క్రాఫ్ట్‌లో మానవ పైలెట్, సిబ్బంది, ప్రయాణికులు లేకపోతే దాన్ని unmanned aerial vehicle (UAV) అని అంటారు. దీనికే సామాన్యుల భాషలో “డ్రోన్” అని పేరు.

ఆకాశంలో ఎగిరే ఈ డ్రోన్లను నియంత్రించడానికి ఒక గ్రౌండ్ కంట్రోలర్, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంటాయి. ఈ రిమోట్ కంట్రోల్‍ మనుషుల చేతిలో ఉండవచ్చు. వాటికి remotely-piloted aircraft అని పేరు. లేదా, పూర్తిగా ఆటోపైలెట్ మోడ్‍లో అయినా నడిపించవచ్చు.

బరువుని బట్టి డ్రోన్స్ ఐదు కేటగిరీలలో ఉండవచ్చు.. నానో (250 గ్రాముల కన్నా తక్కువ) మైక్రో (2 కేజీల లోపు), స్మాల్ (25 కేజీల లోపు) లార్జ్ (150 కేజీల లోపు).

వీటిల్లో 2000 అడుగుల (600 మీ.) ఎత్తు ఎగరగలిగి, 2 కి.మీ రేంజ్ తిరగలిగితే వాటినుంచి అంతరిక్షంలోకి వెళ్ళగలిగే డ్రోన్స్ వరకూ అనేక రకాలు ఉంటాయి.

వీటిని రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఎక్కువగా యుద్ధ సమయాల్లో వాడుతూ వచ్చారు.

కానీ, ఇటీవలి కాలంలో స్మార్ట్ టెక్నాలజీ, మెరుగైన ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అందుబాటులోకి రావడంతో.. 2013లో అమెజాన్ డ్రోన్ల సహాయంతో డెలివరీలు చేయబోతున్నట్టు ప్రకటించింది.

అప్పటినుంచి వినియోగదారుల కోసం వాటిని తయారు చేయడం పెరిగిపోయింది. భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, ఇ-కామర్స్, మీడియా, ఎనర్జీ సెక్టార్లలో డ్రోన్లను విరివిగా వాడుతున్నారు.

ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా డ్రోన్ల వైపు చూస్తోంది. అయితే, డ్రోన్ల వాడకానికి ప్రత్యేకమైన రెగ్యులేషన్స్ కావాలి.

భారత ప్రభుత్వం, 2021 డిసెంబర్‌లో వ్యవసాయ రంగంలో డ్రోన్లు వాడటానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల చేసింది.

వ్యవసాయ రంగం

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఎలా పనిచేస్తాయి?

సాధారణంగా డ్రోన్లలో నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్, సెన్సార్లు, హై క్వాలిటీ కామెరాలు, ప్రోగ్రాం చేసిన కంట్రోలర్లు, ఇతరత్రా టూల్స్ ఉంటాయి. వీటన్నింటి సహాయంతో డ్రోన్ గాలిలో ఎగురుతూ రకరకాల డేటాను కలెక్ట్ చేసి పంపుతుంది. అగ్రికల్చర్ డ్రోన్స్‌లో కొన్ని ముఖ్యమైన దశలు ఉంటాయి. అవి..

ఏరియాను అనలైజ్ చేయడం: డ్రోన్ ఏ పంటపొలాన్ని పరిశీలించాలో ముందుగా చెప్పాలి. దీని కోసం బౌండరీలు సరిచూసుకుని, ఏరియాని పరిశీలించి, ఆ జీపీఎస్ డేటాను నావిగేషన్ సిస్టంలో సేవ్ చేయాలి.

అటానమస్ డ్రోన్లను వాడడం: ఇవి అటానమస్ (అంటే, వాటంతట అవే పనిచేయగలవు) కాబట్టి ముందే ఎంటర్ చేసిన సెట్టింగ్స్ బట్టి (ఏ సమయంలో వెళ్ళాలి, ఎంత సేపు చేయాలి, ఏ పారామీటర్ల గురించి డేటా కలెక్ట్ చేయాలి వగైరా), అది డేటాను సేకరిస్తుంది.

డేటా అప్‍లోడ్: కెమెరాలు, సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని అప్‍లోడ్ చేస్తుంది. అక్కడ అనేక రకాల సాఫ్ట్‌‌వేర్‌లు వాడుతూ ఈ డేటాని పరీశిలించి, తీసుకోదగ్గ చర్యలు ఉంటే చెప్తారు.

ఉదా: వచ్చిన డేటా బట్టి పొలంలోని కొన్ని చెట్లకు అప్పుడప్పుడే పురుగు మొదలవుతుందని తెలిస్తే, అది ఇతర చెట్లకు వ్యాపించకుండా వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఇది అత్యంత కీలకమైన అంశం. డేటా సేకరించినంత మాత్రాన సరిపోదు. ఆ డేటా వల్ల తీసుకోదగ్గ చర్యల గురించి తెలిస్తేనే ఈ డ్రోన్ సిస్టం వల్ల లాభం ఉంటుంది.

రైతులకి అర్థమయ్యే రీతిలో ఔట్‍పుట్ చూపడం: 3D mapping, Photogrammetry లాంటి టెక్నాలజీలు వాడి సేకరించిన డేటాను రైతులకి చూపిస్తే, వాళ్లకు సరళంగా అర్థమైతే అప్పుడు వెంటనే చర్యలు తీసుకోగలుగుతారు.

డ్రోన్స్

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వేటి కోసం వాడవచ్చు?

పంటను నాటడానికి: కొన్ని భారతీయ స్టార్టప్ కంపెనీలు రకరకాల మొక్కలను నాటడానికి కావలసిన పరిజ్ఞానాన్ని డ్రోన్స్‌లో పెడుతున్నాయి. దీని వల్ల సమర్థవంతంగా, తక్కువ సమయంలో నాట్లు ముగించవచ్చు.

పంటలకు ఎరువులు, పురుగుల మందులు వేయడానికి: మనుషుల అవసరం లేకుండా హాని కలిగించే రసాయనాలను వేయవచ్చు. RGB సెన్సార్స్, మల్టీ స్పెక్ట్రమ్ సెన్సార్స్ వల్ల డ్రోన్స్ పురుగు పట్టిన మొక్కలు/చెట్లను కచ్చితంగా గుర్తించి, వాటిపైనే మందు చల్లగలవు.

పంటకు పురుగు పట్టిందా, పూత రాలిపోతుందా లాంటి విషయాలని మానిటర్ చేయడానికి: కలుపు మొక్కలు, పురుగులు, కీటకాలు ఏ భాగంలో ఉన్నాయో డ్రోన్స్ ద్వారా మానిటర్ చేయవచ్చు. దీని ద్వారా ఎంత పురుగుల మందు పడుతుందో కచ్చితంగా లెక్కవేసుకోవచ్చు. దీనివల్ల రైతులకు అనవసరపు ఖర్చులు తగ్గుతాయి.

నేలలో ఉన్న క్షేత్ర సామర్థ్యాన్ని అంచనా వేయడం: ఇది పంట వేసే ముందు చేసే పరిశీలన. డ్రోన్స్ ద్వారా నేలలో క్షేత్ర సామర్థ్యం (అంటే, పంట ఎంత బాగా పండగలదు), ఏ భాగాల్లో అయినా చచ్చు నేల ఉందా వగైరా విషయాలు సేకరిస్తుంది. దీని వల్ల రైతులు ఏ పంటలు వేయాలి, ఏ వరుసలో వేయాలి అన్నవి డేటా సహాయంతో నిర్ణయించుకోగలరు.

పంట నాశనమైతే వివరాలు తెలియజేయడానికి: అకాల వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, పురుగుల వల్ల పంటలు నాశమయ్యాయని మనం వింటూనే ఉంటాం. అయితే, పంటలో ఎంత శాతం నాశనం అయింది, మిగిలిన పంటలో ఎంత వరకు పనికొస్తుందిలాంటి విషయాలు సేకరించడానికి డ్రోన్స్ బాగా పనికొస్తాయి. ఈ డేటాను డాక్యుమెంట్ చేసి ప్రభుత్వాధికారులకు ఇస్తే నష్టపరిహారం లెక్కలు సులువుగా తేలుతాయి.

పాడిపశువులను కనిపెట్టుకుని ఉండడానికి: పాడిపశువులను లెక్కపెట్టడానికి, మేతకు వెళ్ళినప్పుడు తప్పిపోకుండా ఉండడానికి మనుషులు వాటిని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా డ్రోన్స్ వాటి సంఖ్యను, కదలికలను కనిపెట్టుకుని ఉండగలవు. థర్మల్ సెన్సార్ టెక్నాలజీ వల్ల ఆరోగ్యం బాలేని, గాయాల పాలైన పశువుల గురించి చెప్పగలవు. తప్పిపోయినవాటిని మనుషులకన్నా వేగంగా వెతికి, ఎక్కడున్నదీ వివరాలు తెలపగలవు.

డ్రోన్స్

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయంలో డ్రోన్స్ వాడడం వల్ల ఉపయోగాలేమిటి?

పంట ఎక్కువగా పండుతుంది: డ్రోన్స్ ద్వారా నీరు పట్టడం, పంటను మానిటర్ చేయడం సులభం. భూమి ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకునే వీలుంది కనుక తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించే అవకాశాలు ఉంటాయి.

సమర్థవంతమైన టెక్నిక్‌లు: పంట ఎలా ఉంది, పురుగులు పట్టాయా లాంటి విషయాల గురించి డ్రోన్స్ ఎప్పటికప్పుడు సమాచారం అందించగలవు. కఠినతరమైన వాతావరణంలోనూ, పనివాళ్లు రాని పరిస్థితుల్లోనూ డ్రోన్స్ వాడి ఆ పనులు చకచకా చేసుకోవచ్చు.

రైతులు సురక్షితం: పురుగుల మందు కొట్టేటప్పుడు అందులోని రసాయనాలు రైతులకు హాని కలిగించవచ్చు. డ్రోన్స్ ఆ పనిజేయడం వల్ల రైతులకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

తక్కువ వేస్టేజి: ఎరువులు, రసాయనాలు ఎంత జల్లాలి, ఎప్పుడు జల్లాలి లాంటివన్నీ డ్రోన్స్‌లో కంట్రోల్ చేసుకోవచ్చు. మనుషులకన్నా మెషీన్ ఎక్కువ సమర్ధవంతంగా ఈ పనిజేస్తుంది కాబట్టి వేస్టేజి తక్కువ ఉంటుంది.

కచ్చితమైన సమాచారం: డ్రోన్ ద్వారా పంటపొలం కొలతలు, పంట వేసిన తీరు, soil mapping లాంటి విషయాల గురించి సర్వే చేయిస్తే, 99 శాతం సరైన ఫలితాలు పొందవచ్చు. దీని వల్ల సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఇన్స్యూరెన్స్ క్లెమ్స్: పంట పాడైపోయినా, మరెలాంటి ఇబ్బందులు కలిగినా డ్రోన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇన్స్యూరెన్స్ వారికి చూపిస్తే, డేటా నమ్మదగినది కాబట్టి ప్రాసస్ త్వరగా ముగుస్తుంది, డబ్బులు త్వరగా వస్తాయి.

వ్యవసాయ రంగం

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయంలో డ్రోన్స్ వల్ల నష్టాలు, సవాళ్లు

వ్యవసాయ రంగంలో మనుషుల పని తగ్గించి, యంత్రాల పని పెంచడంలో డ్రోన్స్ ముఖ్యపాత్ర వహిస్తాయి. రైతులు, కూలీలు చేసే పనులు చాలావరకు డ్రోన్స్ చేస్తాయి కాబట్టి ఆ పనులు చేసేవారు జీవనోపాధి కోల్పోయే అవకాశాలున్నాయి.

డ్రోన్ ఒక మెషీన్. దాని వాడకం ఎక్కువయ్యే కొద్దీ కాలుష్యం కూడా పెరుగుతుంది.

డ్రోన్లను కొనడం ఖర్చుతో కూడుకున్న విషయం. చిన్న, సన్నకారు రైతులు ఆ ఖర్చును భరించలేకపోవచ్చు. అందుకని డ్రోన్లను అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించకపోతే సమస్యలు అలానే మిగిలిపోతాయి.

అలాగే, భారతదేశంలో వేసే పంటలు, నేలలోని రకాలు, వాతావరణంలో మార్పులు ప్రతీ ప్రాంతానికి మారుతుంటాయి. ఇంతటి వైవిధ్య భరితమైన డేటాను డ్రోన్లు కలెక్ట్ చేసి రైతులకు సరైన వివరాలు ఇవ్వగలగాలి.

కేవలం డ్రోన్లను గాలిలో తిప్పి ఊరుకుంటే సరిపోదు. తీసుకోదగ్గ చర్యలు ఎప్పటికప్పుడు రైతులకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. వారి రాబడి పెంచగలగాలి. లేకపోతే ఇది కూడా ఒక వేలంవెర్రి టెక్నాలజీగానే మిగిలిపోతుంది.

వీడియో క్యాప్షన్, ముత్యాలను ఎలా పండిస్తారో తెలుసా.. ఈ యువ రైతు స్టోరీ చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)